‘వసంత కోకిల’ సినిమాను ఇలా ముగిస్తే?
తీసిన ప్రతి భాషలోనూ ప్రేక్షకుల అభిమానాన్ని అమితంగా పొంది, వారి మనసుల్లో నిలిచిపోయిన చిత్రం ‘వసంత కోకిల’ (1982). దీని దర్శకుడూ, కథకుడూ బాలు మహేంద్ర. నటి శ్రీదేవి నటజీవితంలో మైలురాయిగా నిలిచిందీ చిత్రం. అందుకే ఆమె ఆకస్మికంగా కన్నుమూసినపుడు ‘తరలిపోయిన వసంత కోకిల’ అంటూ పత్రికలు శీర్షికలు పెట్టాయి. ఆ సినిమా గురించి సుప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ విశ్లేషణ ఇది!

శ్రీదేవి మరణం మీద, అది హత్యా, ఆత్మహత్యా, సహజ మరణమా - అనే చర్చలు సాగుతూ వుంటే, ఆమె సినిమా ఒక్కటి కూడా చూడని నాకు, ఆమె సినిమా ఏదైనా చూడాలనిపించి, కొందర్ని అడిగితే, ‘‘వసంత కోకిల’’ అనీ, ‘‘పదహారేళ్ల వయసు’’ అనీ, ఇంకా ఏవో చెప్పారు. ‘‘పదహారేళ్ల’’ సినిమా చక్కగా లేకపోయినా, అందులో కథ చాలా మంచిది. ఈ కథ, ఎవ్వరికైనా, ‘అత్యాశ’ని పోగొట్టే వివేకం ఇస్తుంది. సినిమాల్లో ఇటువంటి కథలు చాలా అరుదు.

నిన్న మొన్న చూసిన ‘‘వసంత కోకిల’’ అయితే, చాలా నచ్చినదీ, చాలా నచ్చనిదీ, అయింది నాకు! ఈ కథలో, కథానాయకుడైన శ్రీనివాస్‌ పాత్ర, మంచిది. కథానాయిక అయిన విజయ, ఈ కథని బట్టి ‘కీలుబొమ్మ’ రకం మాత్రమే! కానీ, ఆ పాత్ర నటనే ప్రత్యేకం!

కథలో హీరో, అవివాహితుడు. తాగుడూ, తిరుగుడూ లేని ఉత్తముడు. తన చెత్త స్నేహితుడితో కలిసి, ఒక వ్యభిచార గృహానికి బైల్దేరాడు! అక్కడ చూశాడు, ఆరేళ్ల పిల్ల మతితో ఉన్న దాదాపు ఇరవై ఏళ్ల హీరోయిన్‌ని. ఆ పేషెంటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఎవడో ఒక మోసగాడు, ‘‘మీ అమ్మని చూపిస్తాను, రా’’ అని మతి లేని ఆమెని మోసంగా తెచ్చి ఒక వ్యభిచార గృహానికి అమ్మేశాడని కథనం!

వ్యభిచార గృహంలో, ఆ ‘మతి లేని’ పిల్ల దగ్గరికి చేరబోయిన మన ఉత్తముడు, ఆమె చేత, ఒక గట్టి లెంపకాయ తిన్నాడు! అయినా సహించి, ఆమె అమాయకత్వానికి లొంగి, ఆమెతో శాంతంగా సంభాషణ జరిపాడు. ఆమె ‘మతి లేని మనిషి’ అని క్రమంగా గ్రహించాడు. ఆమెకి జరిగిన మోసం విని, చాలా జాలిపడ్డాడు. ఆమె అసలు పేరు ‘లక్ష్మి’ అయితే, ఈ కంపెనీ వాళ్లు పెట్టిన పేరు, విజయ. మన ఉత్తముడు, ఆమెని ఆ ఇంటి నుంచి రక్షించాలనుకున్నాడు. ఆ కంపెనీని నడిపే రౌడీకి కొంత డబ్బు చెల్లించి, విజయని తన వెంట బైటికి తీసుకు వచ్చేస్తాడు. ఆమె ఊరు వివరాలేవీ ఆమె స్పష్టంగా చెప్పలేకపోయింది.

శ్రీనివాస్‌, ఊటీలో టీచరు ఉద్యోగం చేస్తున్నవాడు. అతనికి మతి లేని విజయ మీద జాలి మాత్రమే గాక, కొంత ‘ఆసక్తి’ కూడా కలిగింది. ఆమెని, తన వెంట ఊటీకి, తన క్వార్టర్‌కి తీసుకుపోయాడు. పక్కింటి ముసలమ్మకి అంతా చెప్పాడు.

మతిలేని విజయ, ఆరేళ్ల పిల్ల మతితోనే ‘‘శ్రీనూ, శ్రీనూ’’ అంటూ అతని వెంట తిరుగుతూ వుంటుంది. శ్రీను ఆమె కోసం బట్టలు కొన్నాడు. ఆమెకి వండిపెడుతూ, ఆమెని బైట చెట్ల కింద తిప్పుతూ, ఆమెని ఆడిస్తూ, ఆమెకి కథలు చెపుతూ, ఆమెని నిద్ర పుచ్చడానికి పాటలు పాడుతూ, కేవలం ఆరేళ్ల పిల్లతో ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తాడు. ఆమెని తాకడానికి ఎన్నడూ ప్రయత్నించడు. విజయ, అల్లరి చిల్లరి పనులు చేస్తూ వుంటే, చిన్న పిల్లని మందలించినట్టే మందలిస్తూ వుంటాడు.

ఆ ఇద్దరి మధ్యా జరిగే మాటలే, ఆ సంఘటనలే, ఈ సినిమాకి మంచి ‘కీర్తి’! ఈ ఘట్టాల కోసం నేను దీన్ని రెండు సార్లు చూశాను.

అతను పనిచేసే స్కూలు యజమాని రెండో భార్య, ఈ శ్రీనివాస్‌ని ఆకర్షించడానికి తన నిక్కర్ల ద్వారా తన తొడలు చూపిస్తూ, తన షోకులు చూపిస్తూ, తెగ ప్రయత్నిస్తూ వుంటుంది. కానీ, ఇతను మర్యాదగా, శాంతంగా, దూరంగా అవుతూ వుంటాడు. ఏ ఆడ మనిషి వేపూ కన్నెత్తి చూడడు. ఈ సినిమాలో నాకు ఎంతగానో నచ్చిన విషయం, శ్రీనివాస్‌ ప్రవర్తన. ఇరవై యేళ్ల విజయని, ఆరేళ్ల పిల్లగా చూడడం, ముచ్చటైన ఘట్టాలు!

రెండు మూడు నెలల తర్వాత కావచ్చు, మతిపోయిన వాళ్ళకి మతి సరిచేసే మందు ఇచ్చే ఆయుర్వేద రకం వంటి వైద్యుడు దొరికాడు. శ్రీనివాస్‌, మతి పోయిన విజయని ఆ వైద్యుడి దగ్గిరికి తీసుకువెళ్ళాడు, చాలా ఆశగా.

వైద్యుడి ఇంటిలోనే ఆమెతో మందు మింగించి, ఆమెని పడుకోబెట్టాడు. ఆమె, సాయంత్రానికి లేస్తుందన్నారు. శ్రీనివాస్‌ స్కూలుకి వెళ్లిపోయాడు. కథలో వంకర ఇక్కడి నుంచీ!
విజయ తల్లిదండ్రులు, తమ కూతుర్ని ఒక కుర్రవాడెవడో ఎత్తుకుపోయాడనీ; ఆమె, అతని దగ్గిర ఊటీలో వుందనీ; ఏవో వార్తల ద్వారా గ్రహించారు. ఊటీకి వచ్చి, పోలీసులతో సహా, వైద్యుడి ఇంటికి ఆ రోజునే వచ్చిపడ్డారు!

సాయంత్రం అయ్యేటప్పటికి మతిపోయిన విజయ లేచి, తల్లిదండ్రుల్ని పోల్చింది. వైద్యం, పూర్తిగా నెరవేరినట్టు సినిమా కథలో లెక్క! విజయ తల్లిదండ్రులు, తమ పిల్ల తమకు దొరికింది కాబట్టి, శ్రీనివాస్‌ మీద పెట్టిన కేసుని వదులుకొని, పోలీసుల్ని పంపించేశారు. కూతుర్ని తీసుకుని కారెక్కేశారు!

అప్పటికి వచ్చాడు శ్రీనివాస్‌. వైద్యుడి ఇంటికి! వైద్యుడి భార్య, అతనికి చెప్పింది, ‘‘ఆమెకి అంతా బాగైంది. తల్లిదండ్రులు ఆమెని మద్రాసు ట్రెయిన్‌కి తీసుకుపోవాలని వెళ్ళిపోతున్నారు’’ అని!

ఆమె వెళ్లిపోతోందని విని, ఆ కారు వెంట పరిగెత్తాడు. పడుతూ, లేస్తూ, బురద కొట్టుకుపోతూ, రైల్వేస్టేషన్‌కి చేరి, రైలు పెట్టెలో కూర్చున్న విజయని చూస్తూ, ‘‘విజయా, విజయా’’ అని అరిచాడు. ఆమెకి, తన స్వంత మతే వచ్చి, శ్రీనివాస్‌తో గడిచినదంతా మర్చిపోయింది! వైద్యం, ఇలా పని చేసింది!
రైలు కదిలిపోయింది! శ్రీనివాస్‌ దుఃఖంలో మునిగాడు. అంటే, ముగింపుని దుఃఖాంతంగా (ట్రాజడీ) చెయ్యాలని, డైరెక్టర్‌ (బాలు మహేంద్ర) ముచ్చట పడ్డాడు!
వైద్యుడు చెప్పిన మాటలు విజయ వినలేదనీ, ఆమెకి శ్రీనివాస్‌ సంగతి తెలీదనీ, కధ నడిచింది గానీ... మతి సరిగా బాగైన పిల్లకి, తన యాక్సిడెంట్‌ గురించి తెలిసిన, తనకెవరో వైద్యం చేయించారని చెప్పే వైద్యుడి మాటలు వినపడవా? అర్ధం కావా? ఆ పిల్ల, తనని బాగు చేయించిన వ్యక్తిని చూడాలనుకోలేదంటే, ఆమె కూడా నీచురాలే అవుతుంది. అలాంటి వాళ్ళతో సంబంధం పోవడం, శ్రీనివాస్‌కి ‘దుఃఖాంతం’ అవదు. బ్రహ్మాండమైన ‘సుఖాంతం’!

ట్రాజడీ అవ్వాలంటే...?
అసలు ఈ కథ చివరికి దుఃఖాంతంగా (ట్రాజడీ) జరగాలంటే, ఆ ముగింపు ఇంకో రకంగా జరగాలి.

ఎలాగంటే: వైద్యుడి దగ్గిరికి వచ్చిన విజయ, శ్రీనివాస్‌ కొన్న చీరనే కట్టుకుని వుండాలి. దీని అవసరం తర్వాత తెలుస్తుంది. విజయ కోసం వచ్చిన తల్లిదండ్రుల వెంట, ‘శ్రీరామ్‌’ అనే యువకుడు కూడా వుంటాడు (వుండాలి).

విజయ, వైద్యం ముగిసి, తల్లిదండ్రుల్నీ, శ్రీరామ్‌నీ కూడా సంతోషంగా పోలుస్తుంది. విజయ, తన ఇష్టంతో ఎంచుకున్న యువకుడు, ఆ శ్రీరామ్‌. వాళ్ళిద్దరికీ పెళ్లి నిర్ణయం జరగబోతూ వుండగా, ఆమెకి యాక్సిడెంట్‌ జరగడమూ, మతిపోవడమూ, అన్నీ జరిగాయి- అన్నమాట!

శ్రీరామ్‌, విజయ కోసమే ఆమె తల్లిదండ్రుల వెంట ఊటీ వచ్చాడు.

విజయకి వైద్యం ముగిసిన ఆ సాయంత్రం శ్రీనివాస్‌ పరుగు పరుగున వచ్చి, అక్కడ మంచి మతితో నిలబడివున్న విజయని చూస్తూ, ఆనందంతో ‘‘విజయా, విజయా!’’ అంటూ ఆమె చేతులు పట్టుకోబోయాడు.

ఆమె, అతన్ని మర్చిపోయింది! ‘‘యూ ఫూల్‌!’’ అంటూ అతన్ని ఛెళ్లున చెంప మీద కొట్టింది. ‘‘ఎవరు నువ్వు? పరాయి ఆడదాన్ని ఇంత నిర్లక్ష్యంగా తాకుతావా?’’ అంది కోపంగా. శ్రీనివాస్‌, నిర్ఘాంతపోయాడు. ‘‘విజయా! నేడు ‘శ్రీను’ని! నువ్వు నన్ను ‘శ్రీనూ, శ్రీనూ’ అనవూ?నీ ఒంటి మీద చీర ఎక్కడిది? నేను కొన్నది కాదూ? నన్ను మర్చిపోయావా, నా విజయా?’’ అన్నాడు ఆందోళనగా.

విజయ నవ్వింది. ‘‘నా చీర నువ్వు కొన్నదా? భలే వాగుతున్నావే! నేను, నీ విజయనా? ‘శ్రీరామ్‌’ విజయని నేను! పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఈ పంతులుగారితోనే వైద్యం చేయించుకో!’’ అంటూ మళ్ళీ నవ్వింది.

అక్కడే నిలబడి ఉన్న వైద్యుడు, విజయతో, ‘‘అమ్మా! నిన్ను నా దగ్గరికి తీసుకువచ్చింది ఈ అబ్బాయేనమ్మా! అతను నీ గురించి ఆలోచించకపోతే, నువ్వు జీవితాంతం ఆరేళ్ల పిల్లగానే వుండిపోదువమ్మా! నిన్ను వ్యభిచార గృహంలో వదలలేక, నీ బాధ్యత ఇతనే తన మీద వేసుకున్నాడు’’ అంటూ చెప్పాడు.

విజయ ఆశ్చర్యపోతూ చూసింది, శ్రీనివాస్‌ని.

శ్రీనివాస్‌ తన ఆశతో తను, ‘‘విజయా! నీకు మతి లేని రోజుల్లో నిన్ను నేనే చూశాను. నీ కోసం, నేను రోజూ పాడే పాట మళ్లీ వింటావా?’’ అంటూ, ‘కధగా, కల్పనగా, దొరికెను నాకొక దొరసానీ!’’ అంటూ ప్రారంభించాడు.

విజయ ఆ పాట వింటూ విచిత్రపోతూ నిలబడిపోయింది.

శ్రీరామ్‌ అప్పటికే, కారెక్కి డ్రైవర్‌ సీట్లో కూర్చున్నాడు. విజయ వేపు చూస్తూ, ‘‘తొందరగా రా! ట్రయిన్‌ మిస్సవుతాం’’ అన్నాడు. విజయ, చప్పున కదిలి అటు నడిచి అతని పక్కన కూర్చుంది.

విజయ తల్లి, వైద్యుడితో, ‘‘మా అమ్మాయి పెళ్ళి వచ్చే నెలలోనే జరుగుతుంది. అసలు ఎప్పుడో జరగాలి, అది తప్పింది. మీ భార్యా భర్తలిద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలయ్యా!’’ అంది.

వెంటనే కారు ఎక్కి, అప్పుడే గుర్తొచ్చినట్టు, శ్రీనివాస్‌ వేపు చెయ్యి జాపుతూ, ‘‘నీకు కూడా శుభలేఖ పంపిస్తాం. మా అమ్మాయి పెళ్లికి నువ్వు కూడా తప్పకుండా రావాలి బాబూ!’’ అంది.

విజయ కూడా నవ్వుతూ, శ్రీనివాస్‌ వేపు చెయ్యిజాపుతూ, ‘‘మీరు తప్పకుండా రావాలి, నా పెళ్లికి’’ అంది.

కారు, రయ్యిన కదిలిపోయింది.

శ్రీనివాస్‌, కొయ్యబారి నిలబడిపోయి, కాస్సేపటికి కన్నీళ్లతో నడుస్తూ, ఒక చెట్టు మొదట కూలబడిపోయాడు. తన పాటని మొదటి సారి పాడినప్పడు జరిగిన ఘట్టం అతని కళ్లముందు కదలాడింది. ఆ పాట వింటూ ఆమె, ఆరేళ్ల పిల్లలా, అతని కాళ్లమీద తల పెట్టుకుని నిద్రపోవడం, అతను ఆమె తలని తలగడ మీదకి మార్చి, ఆమెకి దుప్పటి కప్పడం, అన్నీ కళ్ల ముందు కదిలాయి. కానీ, ఆమె మనసు వేరే మనిషి మీద వుందని ఇప్పడు తెలిసిన తర్వాత, ఇది అతనికి నిజమైన దుఃఖాంతం! దీన్ని మార్చడానికి మార్గం లేదు!

దుఃఖాంతం కావాలంటే, ఆమె మనసు ఇంకెవరి మీదో వుందనే రకంగా జరగాలి! అంతేకానీ, ఆమెకి నిజం తెలిసే అవకాశమే లేనట్టుగా కథ జరిగిపోతే, దానికి విలువ ఉండదు.

అసలు శ్రీనివాస్‌కీ, ఆరేళ్ల వయసు విజయకీ మధ్య జరిగిన చక్కని సంఘటనలెన్నో జరిగిన తర్వాత, ఆ కథ, ‘దుఃఖాంతం’గా మారడం, న్యాయం కాదు. సస్పెన్సుల కోసం, న్యాయాన్ని చంపకూడదు. సస్పెన్సునులతో కలిసే న్యాయం నడవాలి! - ఈ ముగింపు ఇంకా అప్పుడే కాదు. ఇంకా కొంత జరగాలి!

ఆ కథ ఇంకా ఇలాగే జరిగి వుంటే?:
అసలైతే, విజయ పేరు ‘లక్ష్మే’ కాబట్టి, శ్రీరామ్‌, ఆమెని ‘లక్ష్మీ’ అనే పిలుస్తాడు. ఊటీ నించి వచ్చిన తర్వాత, లక్ష్మీ - శ్రీరామ్‌లు, ఒక పార్కులో తిరుగుతున్నారు. శ్రీరామ్‌, ఎందుకో రుసరుసలుగా వున్నాడు.

‘‘లక్ష్మీ! నువ్వు అతని దగ్గర ఎన్ని రోజులు వున్నావు?’’ అన్నాడు.

‘‘నాకేం తెలుసు? అస్తమానూ అడుగుతావు. అవన్నీ నేను లెక్కపెట్టానా? నువ్వే లెక్కపెట్టవచ్చు. యాక్సిడెంటు ఏ తారీకున జరిగింది? ఆ తారీకులన్నీ స్పష్టంగా మాయం అవడం, ఏ రోజు జరిగింది? మీరందరూ ఊటీకి వచ్చింది, ఏ రోజు, ఆ తారీకులన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. మీరందరూ లెక్కలుపెట్టారుగా? చివరికి, ఎన్ని రోజులని తేలింది? మూడు నెలల మూడు రోజులు ఉన్నాను. నేను అతని ఇంట్లో. అది నీకు తెలిసిందేగా?’’ అంది లక్ష్మి విమర్శగా.

‘‘అంటే, తొంభై మూడు రోజులు వున్నావు అతని దగ్గిర. అతను నిన్ను ఏమీ...’’

‘‘చూడు! నువ్వు ఇదే మాట పదిసార్లు అడిగావు. నేను వంద సార్లు చెప్పాను. ఆ రోజుల్లో ఏం జరిగిందో నాకు తెలీదని చెప్పాను. తెలియక పోయినా, నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, అతను అటువంటి నీచుడు కాడు. నా‘మతి’ బాగయితే, నన్నే పెళ్ళి చేసుకోవాలనుకున్నాడేమో! అందుకే ‘దొరికెను నా కొక దొరసానీ’ అని పాడాడు. కానీ, అతను నన్ను ఏ రకంగానూ తాకి వుండడు!’’

‌‘‌‘అబ్బా! అంత ఉత్త‌ము‌డైతే, అసలు వ్యభి‌చా‌రుల కంపె‌నీకి ఎలా వెళ్ళాడు? అలాంటి వాడా ‌‘ఉత్త‌ముడు?’‌ ఏదీ తెలీ‌దం‌టావు; మళ్ళీ అతన్ని ఉత్త‌ము‌డం‌టా‌వెం‌దుకు? అతను నిన్ను ఎప్పుడూ.‌.‌.‌’‌’‌

‌‘‌‘షటప్‌! ఇక చెప్ప‌లేను.‌ నీతో నా బతుకు ఇలాగే అవు‌తుంది.‌ నాకూ నీకు సరి‌ప‌డదు.‌ నా నిర్ణయం పూర్తిగా మారింది!’‌’‌ అనేసి, లక్ష్మీ వెనక్కి తిరిగి చక‌చకా ఇంటి వేపు నడి‌చింది.

రైలు రయ్యిన సాగి‌పో‌తోంది.‌ లక్ష్మీ, కిటీకీ దగ్గరే వుంది.‌

ఊటీలో, నీల‌గిరి చెట్లలో లక్ష్మి చక‌చకా నడు‌స్తోంది.‌ మధ్య మధ్య పరు‌గె‌డు‌తోంది.‌ ఆగి నడు‌స్తోంది.‌ ‌‘‌‘శ్రీనూ! శ్రీనూ’‌’‌ అని గట్టిగా పిలు‌స్తోంది.‌ ఆమెకి శ్రీను ఇల్లు తెలీదు.‌ గుర్తు రాదు.‌ ఆమె ఒంటి మీద వున్నది అతను కొన్న చీరే.‌ శ్రీని‌వాస్‌ తన క్వార్ట‌ర్‌లో, టే‌బుల్‌ ముందు కూర్చుని రాసు‌కుం‌టు‌న్నాడు.‌ అంతా నిశ్చబ్దం! ‌‘‌‘శ్రీనూ! శ్రీనూ!’‌’‌ అని సన్నని కంఠంతో పిలు‌పులు!
ఉలి‌క్కి‌పడి లేచాడు.‌ మళ్లీ కూర్చు‌న్నాడు.‌ కూర్చో‌గానే అవే పిలు‌పులు! హడా‌వి‌డిగా వీధి తలుపు తీసి బైటికి పరి‌గె‌త్తాడు.‌

‌‘‌‘శ్రీనూ, శ్రీనూ’‌’‌ అనే పిలు‌పు‌లతో ఆమె దూరంగా కన‌ప‌డింది.‌ అటు పరి‌గెత్తి, తనని తను ఆపు‌కుని, దూరం‌గానే నిల‌బ‌డ్డాడు.‌

లక్ష్మే, అతని మీదకు వాలి‌పో‌యింది.‌

శ్రీని‌వాస్‌ పడు‌కునే గదిలో! అతను, గతంలో లాగే, మంచం మీద కూర్చుని పాడు‌తు‌న్నాడు.‌ ‌‘‌‘కధగా, కల్ప‌నగా, దొరి‌కెను నాకొక దొర‌సానీ!’‌’‌

ఆమె కూడా అందు‌కుంది.‌ ‌‘‌‘కధగా, కల్ప‌నగా దొరి‌కెను నా కొక దొర‌వారూ!’‌’‌ అంటూ లేచి అతని తొడ మీద తల పెట్టి పడు‌కుంది.‌ అంతా, పాత దృశ్యమే మళ్లీ జరి‌గింది!

‌‘‌‘వసంత కోకిల’‌’‌ కథ ఇలా ముగి‌సి‌పోతే, ఎంతో బాగుం‌డేది! వాళ్ళి‌ద్దరూ విడి‌పో‌వడం నాకు భరిం‌చ‌లే‌న‌ట్టుగా అయింది.‌

వాళ్లు విడి‌పోయే ‌‘ట్రాజడీ’‌ని చెప్పా‌లంటే, మొదట అలాగే చెయ్య‌వచ్చు.‌ ఆమె నిజంగా ఎవ‌రినో ప్రేమించి వుండ‌వచ్చు కదా? ఆ కార‌ణంగా ఆమె, ‌‘‌‘నా పెళ్లికి రండి!’‌’‌ అని శ్రీని‌వా‌స్‌కి చెప్పేసి వెళ్ళి‌పో‌వడం సహ‌జమే.‌ అది, శ్రీని‌వా‌స్‌కి ట్రాజ‌డీయే.‌

కానీ, ‌‘శ్రీరామ్‌’‌కి ఏమ‌ని‌పి‌స్తుంది? తనకి భార్య కాబోయే లక్ష్మి, ఇంకో యువ‌కుడి ఇంట్లో కొన్ని రోజుల పాటు వుందంటే, పైగా మతి లేని స్థితిలో వుండే మనిషి, ఆ మొగ‌వాడు ఉత్త‌ము‌డుగా ప్రవ‌ర్తి‌స్తాడా? −‌ ఈ ప్రశ్న అతన్ని తినేస్తూ వుంటుంది.‌ కాబట్టి, లక్ష్మి నిర్ణయం మారి‌పో‌తుంది.‌ ఆమె మనసు, శ్రీని‌వాస్‌ మీదకి తిరి‌గింది.‌

వాళ్లి‌ద్దరూ విడి‌పో‌యా‌రనే బాధతో వున్న ప్రేక్ష‌కు‌లకు, వాళ్లు అను‌కో‌కుండా కల‌వడం సంతోషం కలి‌గి‌స్తుంది కదా? మొదట, తవాళ్లు విడి‌పో‌వడం సహ‌జమే.‌ తర్వాత, కల‌వ‌డమూ సహ‌జమే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.