యదార్థ సంఘటనలే... సినిమా కథలు

కథ... సినిమాకు ప్రాణం. అది ఉంటే మిగతావన్ని సమకూరతాయని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు తరచూ చెబుతుంటారు. కథే నిర్మాతలను, హీరోలను, హీరోయిన్లను వెదుకుతుందంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కథను ఇన్ని రోజులు ఎక్కువగా కల్పితంగా అల్లేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. వాస్తవ సంఘటనల చుట్టూ ఉండే భావావేశాలతో కథలు రాస్తున్నారు. ప్రేక్షకులూ వీటి పట్ల మక్కువ చూపడంతో... నిజ జీవిత గాధలనే కాస్త నాటకీయంగా మలిచి వెండితెరకు పరిచయం చేస్తున్నారు రచయితలు, దర్శకులు. తెలుగు చిత్రసీమలో రాబోయే కొన్ని సినిమాలు... ఇలాంటివే ఉన్నాయి.రవితేజ కథానాయకుడిగా, గోపీచంద్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘క్రాక్‌’. ‘ఒంగోలులో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్‌ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ అంటూ సినిమా ట్రైలర్‌ ద్వారానే ఈ కథ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని చెప్పకనే చెప్పారు దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నిజమైన సంఘటనలను ఒక పోలీసు అధికారి ఎలా ఎదుర్కొంటాడన్నదే ఈ చిత్ర కథాంశం.
‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాలో ఒక కేసును ఛేదించే ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మగా కనువిందు చేయనున్నారు కథానాయకుడు నాగార్జున. దీన్ని సోలోమన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘హైదరాబాద్‌ నడిబొడ్డున ఎన్‌కౌంటర్, ఆరుగురు మృతి’ అంటూ విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచింది. ‘చాలా రోజుల తరువాత ఒక నిజ జీవిత కథలో భాగం అవడం ఆనందంగా ఉంద’ని అంటున్నారు నాగార్జున.తమిళనాడులో కొందరు అణగారిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కి, భారీ విజయం సొంతం చేసుకున్న చిత్రం ‘అసురన్‌’. దీని తెలుగు రీమేక్‌ ‘నారప్ప’లో వెంకటేష్‌ కథానాయకుడిగా మెరవనున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. ఒక భూస్వామి పేదల భూములు ఆక్రమించాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఎలా పోరాడారన్నదే కథాంశం.


పొలిటికల్‌ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రానా కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలైట్‌ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్‌గా, సాయి పల్లవి పల్లెటూరి నేపథ్యమున్న అమ్మాయిగా కనిపించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారు.


బాలీవుడ్‌లోనూ ఈ మధ్య కాలంలో ఇలా వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన కథలు మంచి హిట్‌ను అందుకున్నాయి. ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘ఆర్టికల్‌ 15’, అజయ్‌దేవ్‌గణ్‌ కథానాయకుడుగా చేసిన ‘రైడ్‌’, విక్కీ కౌశల్‌ నటించిన ‘ఉరి-ది సర్జికల్‌స్ట్రైక్‌’ ఈ కోవకే చెందుతాయి. తమిళం, మలయాళంలోనూ ఇలాంటి కథలకు మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఈ ఒరవడి సాగుతోంది.హద్దు మీరకుండా...

కల్పిత కథలు సగటు మనిషి జీవితానికి దూరంగా ఉంటాయి. ఇందులో సత్యదూరమైన విషయాలను నాటకీయంగా మలుస్తుంటారు. పాత్రలు అంతే కృతకంగా కన్పిస్తాయి. వాస్తవ కథలు అలా కాదు. ఇందులో చాలా మందికి సుపరిచితమైన పాత్రలు, సంఘటనలు ఉంటాయి. ప్రేక్షకులకు త్వరగా దగ్గరవుతాయి. అందుకే దర్శక, నిర్మాతలు వీటిని చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. వాస్తవాలని చెప్పి, హద్దుమీరి హింసా, శృంగారం జొప్పిస్తే అంతేవేగంగా ప్రేక్షకులు తిప్పికొడతారని చెబుతున్నారు.


మరో కథ దొరికినట్లేనా?

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌కు మరో కథ దొరికినట్లేనా? అన్ని అనుకున్నట్లు జరిగితే అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. ఇప్పటికే వెంకీ చేతిలో మూడు ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న ‘నారప్ప’ కాగా.. మిగతా రెండు దర్శకులు తరుణ్‌ భాస్కర్, అనిల్‌ రావిపూడిల చిత్రాలు. ఇప్పటికే వీటికి సంబంధించిన కథలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడీ జాబితాలో ‘దశ్యం-2’ చేరే అవకాశం కనిపిస్తోంది. మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ మలయాళంలో ఘన విజయాన్ని అందుకొంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రాన్ని తర్వాత తెలుగులో అదే పేరుతో వెంకటేష్‌ - మీనాలతో పునర్నిర్మించగా ఇక్కడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన అప్పట్లో రెండు చిత్రసీమల్లోనూ కనిపించింది. ఇటీవల మలయాళంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. ఇందులోనూ మోహన్‌లాలే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ సీక్వెల్‌ విజయవంతమైతే తెలుగులోనూ ‘దృశ్యం 2’ రీమేక్‌కి సన్నాహాలు మొదలయ్యే అవకాశముంటుంది. ఒకవేళ ఇదే జరిగితే వెంకటేష్‌కు మరో చక్కటి కథ దొరికినట్లే. ఇది కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్నది మలయాళ ‘దృశ్యం-2’ ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.