విరామంలోనూ విశ్రమించడం లేదు

లైట్స్‌... కెమెరా... యాక్షన్‌...
- ఈ మాటల మధ్య నిత్యం సందడిగా గడుపుతుంటారు సినీ తారలు. కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా చిత్రీకరణలు ఆగిపోయాయి. దాంతో తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి. విరామం దొరికింది కదా అని కుటుంబ సభ్యులతో గడిపేవాళ్లు కొంతమందైతే... ఇష్టమైన వ్యాపకాలతో గడుపుతున్నవాళ్లు మరికొందరు. అనుకోకుండా దొరికిన విరామమైనా పక్కాగా ప్లాన్‌ చేసుకునే పనిలో ఉన్నారంతా. అయితే కొందరు మాత్రం విరామంలోనూ విశ్రమించడం లేదు. సినిమాకి సంబంధించిన పనులపైనే దృష్టిపెట్టి, బిజీగా గడుపుతున్నారు. వాళ్లు ఎవరో, ఏం చేస్తున్నారో ఓసారి చూద్దామా!


లుక్కు కోసం కసరత్తులు

ఈనెల 13నే అల్లు అర్జున్‌ కొత్త చిత్రం కోసం కెమెరా ముందుకెళ్లాల్సింది. కరోనావల్ల చిత్రీకరణ వాయిదా పడింది. దర్శకుడు సుకుమార్‌ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు అల్లు అర్జున్‌. అయితే అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్నీ ఆయన సినిమా కోసమే వినియోగిస్తున్నారు. అటవీ నేపథ్యంలో సాగే ఆ సినిమాలో అల్లు అర్జున్‌ భిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నారట. అందుకోసం ఇప్పటికే గడ్డం పెంచేశాశారు. తన లుక్‌ తెరపై మరింత పక్కాగా ఉండాలనేది అల్లు అర్జున్‌ ఆలోచన. అందుకోసం రోజూ లుక్‌ టెస్టుల్లో పాల్గొంటూ సరిచూసుకుంటున్నారు. అలాగే చిత్తూరు యాసలోపట్టు పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఒక బృందం ఆయనకి యాస విషయంలో మెలకువలు నేర్పింది. వేగంగా సినిమాని పూర్తి చేయాలనే ఆలోచనలో సుకుమార్‌ ఉన్నారట. అందుకే ముందే తన బృందాన్ని పక్కాగా సన్నద్ధం చేస్తున్నారట.


జిమ్‌లో ఫైటర్‌

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ముంబయిలో ఒక దఫా చిత్రీకరణని పూర్తి చేశారు. ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇది బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి విజయ్‌ దేవరకొండ ఇందులో మరింత ఫిట్‌గా కనిపించబోతున్నారు. అందుకోసం సిక్స్‌ప్యాక్‌ దేహాన్ని కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ విరామంలోనూ ఈ చిత్రం కోసం ఆయన జిమ్‌లో మరిన్ని కసరత్తులు చేస్తున్నారు. ఆయనకి రౌడీ పేరుతో ఓ బ్రాండ్‌ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాల్ని కూడా పర్యవేక్షిస్తున్నారట.

నితిన్‌ చర్చలు

వచ్చే నెలలోనే పెళ్లి పీటలెక్కనున్నారు నితిన్‌. కరోనా ప్రభావంవల్ల పెళ్లి వేడుకల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదట. పెళ్లి పనులు మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి... ఈ విరామంలో ఆయన తన సినిమా కథలతోనే బిజీగా గడుపుతున్నారని నితిన్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘రంగ్‌దే’లో నటిస్తున్న నితిన్, ఆ తర్వాత సినిమాల కోసం ఇప్పటికే కథలు పక్కా చేసుకున్నారు. ఆ కథలకి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నారు.


ఇంట్లో నా పని

కరోనా ప్రభావంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సినిమా వాళ్లకి అలా చేయడం కుదరని పని. కానీ వరుణ్‌తేజ్‌ ‘నేను ఇంటి నుంచి చేస్తున్న పని ఇది’ అంటూ ఓ ఫొటోని ట్విటర్‌లో పెట్టారు. అందులో ఆయన బాక్సింగ్‌ సాధన చేస్తూ కనిపిస్తున్నారు. వరుణ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. విశాఖలో ఒక షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రం కోసం వరుణ్‌ ఇప్పటికే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈ విరామంలోనూ శిక్షణని కొనసాగిస్తున్నారని ఆయన ట్విటర్‌లో ఉంచిన ఫొటోనిబట్టి అర్థమవుతోంది.


కథలు పంపుతారా

చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది రష్మిక. అనుకోకుండా వచ్చిన ఈ విరామంతో ఆమె మళ్లీ సినిమా కథలపైనే దృష్టిపెట్టింది. మంచి కథలు ఏమైనా ఉంటే... నా మెయిల్‌కి పంపించండి. నేను, మా బృందం వాటిని చదివి, బాగుంటే టచ్‌లోకి వస్తానని చెబుతోంది. ఆమె త్వరలోనే అల్లు అర్జున్‌ చిత్రం కోసం రంగంలోకి దిగబోతోంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.