చివరి నిమిషంలో..బొమ్మ పడలేదు
సినిమాకు ఒకప్పుడు బాలరిష్టాలు ఎక్కువగా ఉండేవంటుంటారు. ఇప్పుడు అన్నీ సిద్ధమై.. తెరపై బొమ్మపడే సమయంలో సమస్యలన్నీ క్యూ కడుతున్నాయి. ఏకంగా చివరి క్షణంలో సినిమా వాయిదా పడేలా, అభిమానులు నిరాశ చెందేలా మారుతున్నాయి. గతంలో రజనీకాంత్‌, కమల్‌, అజిత్‌, విజయ్‌ వంటి అగ్ర హీరోలకు మాత్రమే ఇలాంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు అందరి సినిమాలకు సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఆర్థిక పరమైన సమస్యలే ఎక్కువగా ఉండటం విశేషం. పూర్వ సినిమా బకాయిలు, ఫైనాన్షియర్‌ నుంచి సమస్యలు.. ఇలా అనేక పరిస్థితులు దర్శక, నిర్మాతలకు తలపోటుగా మారుతున్నాయి. ఇప్పుడు ఏకకాలంలో నాలుగైదు సినిమాలు ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ఆ సినిమాలపై ‘న్యూస్‌టుడే’ కథనం..


ధర్వ పోలీసు అధికారిగా నటించిన చిత్రం ‘100’. శ్యామ్‌ ఆంటన్‌ దర్శకత్వంలోని ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌. ఈ సినిమా ఈ నెల మూడో తేదీన తెరపైకి రావాల్సింది. అయితే ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగస్వామి అయిన బాలా ఈ చిత్రంపై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘100’ సినిమా నిర్మాత తన వద్ద డబ్బు తీసుకున్నారని, ఆ రుణం చెల్లించిన తర్వాతే చిత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సినిమా ఆగిపోయింది. బాలాజీతో నిర్మాణ వర్గాలు చర్చలకు దిగి సమస్యను పరిష్కరించినట్లు ప్రకటించాయి. అయినప్పటికీ ఈ సినిమా విడుదల కాలేదు. శుక్రవారం తప్పకుండా వస్తుందని ప్రకటించడంతో బుకింగ్స్‌, రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా జరిగింది. తీరా ఈ సినిమా టికెట్‌ తీసుకున్న వారికి థియేటర్ల నుంచి సినిమా విడుదల వాయిదా పడినట్లు మెసేజ్‌ వచ్చింది. మీ టికెట్‌ డబ్బు ఒకట్రెండు రోజుల్లో మీ అకౌంట్‌లోకి చేరుతుందని అందులో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఫైనాన్స్‌ సమస్యలు ఇంకా తొలగలేదని సమాచారం. దీంతో సినిమా ఎప్పుడు విడుదలవుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలు అధర్వ వంటి హీరోలకు పెద్ద అడ్డంకే అని చెప్పొచ్ఛు ఆయన అభిమానులు సంబరాలకు సిద్ధం అయిన సమయంలో తెరపై బొమ్మ పడకపోయేసరికి ఆవేదన చెందుతున్నారు. శనివారానికి ఈ చిత్రం వాయిదా పడింది. అలాగే సినిమాకు ‘క్యూబ్‌’ నుంచి కూడా సమస్యలొచ్చాయని, ప్రసుత్తం అవి తొలగిపోయాయని సమాచారం.

శుక్రవారం తెరపైకి రావాల్సిన మూడు ముఖ్యమైన చిత్రాల్లో జీవా నటించిన ‘కీ’ సినిమా ఒకటి. నిక్కీగల్రాణి కథానాయికగా నటించారు. తెల్లవారుజామునే ప్రత్యేక ప్రదర్శనతో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. అయితే ఫైనాన్షియర్లు అడ్డుకోవడంతో ఎక్కడా సినిమా ప్రదర్శన కాలేదు. వెంటనే నిర్మాత, నటుడు జీవా స్పందించి ఆ సమస్యను పరిష్కరించారు. దీంతో చిత్రం 10.30 గంటలకు అన్ని థియేటర్లలో విడుదలైంది. ఇలా చివరి నిమిషంలో ఎదురైన సమస్యతో చిత్ర బృందం ఆందోళనకు గురైంది.నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు కూడా
మధు నిర్మాణంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘అయోగ్య’ విడుదలకు పలు సమస్యలు అడ్డంకిగా మారాయి. రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, రూ.40 కోట్లకన్నా అధికంగా బిజినెస్‌ జరిగిందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిర్మాత మధు గత సినిమాల ఆర్థిక లావాదేవీల విషయాలు ఇప్పుడు సమస్యగా పరిణమించాయి. దాదాపు రూ.5 కోట్ల వరకు కొందరు ఫైనాన్షియర్లకు, పంపిణీదారులకు మధు ఇవ్వాల్సి ఉందని, అందువల్ల వారు సినిమాను అడ్డుకున్నారని సమాచారం. విశాల్‌ కెరీర్‌ను దెబ్బతీయడానికి ఆయన ప్రత్యర్థి వర్గాలు ఈ పనికి ఒడికట్టాయన్న ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. శుక్రవారం సాయత్రం వరకు కూడా ఈ సినిమా విడుదలకు సంబంధించి చర్చలు జరిగాయి. శనివారం చిత్రం తెరపైకి వచ్చే అవకాశముందని సమాచారం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.