‘అలనీల గగనాల’... విజయనిర్మల
‘రంగుల రాట్నం’.. నిర్మాత, దర్శకుడు బి.ఎన్‌.రెడ్డికి అది దాదాపుగా ముగింపు దశ కాగా, కథానాయిక విజయనిర్మలకు ఆరంభ దశ. తర్వాతి చిత్రంతోనే బి.ఎన్‌.రెడ్డి శాశ్వతంగా తప్పుకోవడం, తదనంతర కాలంలో విజయనిర్మల నటన నుంచి నిర్మాణ, దర్శకత్వాల వైపు ఎదిగి రికార్డులు సృష్టించడం యాదృచ్ఛికం.‘రంగుల రాట్నం’లో విజయనిర్మలకి చెప్పుకోదగ్గ వేషమే లభించింది. మనిషి అందంగానూ కనిపించింది. ‘కనరాని దేవుడే కనిపించినాడే..’, ‘కోయిల కోయని పిలిచినది..’, ‘మనసు మనసు కలిసే వేళా..’ లాంటి పాటల్లో బాగా చేసిందని ప్రేక్షకులు మెచ్చుకున్నారు! ఆ తరువాత విజయనిర్మలకి పాత్రలైతే వచ్చాయి గానీ, అవన్నీ అమాయకత్వం, సాత్వికత ఉట్టిపడుతూ అందంగా కనిపించే పాత్రలు. ఎక్కుగా చెల్లెలు, కూతురు పాత్రలు! బహుశా తొలి చిత్రంలో ‘మాస్‌ అపీల్‌’కు భిన్నంగా కుటుంబ ప్రేక్షకుల మెప్పు పొందడం అందుకు కారణమేమో!


* అందిపుచ్చుకుని..
తన మీద పడ్డ ముద్రను సానుకూలంగానే తీసుకుని అంది వచ్చిన అవకాశాల్ని విజయనిర్మల సద్వినియోగం చేసుకున్నారు. ‘పిన్ని’ లాంటి చిత్రాల్లో నటిస్తూ నిలదొక్కుకున్నారు. అప్పుడు వచ్చింది బాపు-రమణల ‘సాక్షి’. ఆ చిత్రానికి వాణిజ్యపరమైన విజయం లభించకపోయినా విజయనిర్మలకి మంచి పేరు వచ్చింది. ఆ చిత్రంలో ‘అమ్మకడుపు చల్లగా..’ పాట మైలు రాయిగా నిలిచిపోయింది.
 పెద్ద హీరోయిన్‌ అనిపించుకోవాలంటే అగ్రశ్రేణి హీరోల సరసన నటించాల్సిన రోజులవి. విజయనిర్మలకు పెద్ద హీరోలతో చిత్రాలు వచ్చాయి గానీ అవ చెట్టపట్టాలు వేసుకుని యుగళ గీతాలు పాడే పాత్రలు కావు. ‘భామా విజయం’లో ఎన్టీఆర్‌ పక్కన దేవకన్యగా చిన్న పాత్రలో నటించినా మరీ లేతగా కనిపించిందని జనం చెప్పుకున్నారు. ‘పూల రంగడు’, ‘మంచి కుటుంబం’, ‘బంగారు గాజులు’, ‘ఆత్మీయులు’లాంటి చిత్రాల్లో ఏయన్నార్‌తో నటించినా వాటిలో ఒకటి కూతురు కాగా.. మిగిలిన మూడూ చెల్లెలి పాత్రలు. అవి మూస పోసినట్లు కాకుండా వైవిధ్యంతో ఉండటం విశేషం.


* యువతరానికి జంటగా..
శోభన్‌ బాబు, కృష్ణ, చంద్ర మోహన్‌లాంటి కొత్త తరం హీరోలకు జోడీగా గ్లామరస్‌గా కనిపిస్తూ, పాటల్లో నటిస్తూ, కథనంలో కీలకమైన పాత్రలు కావడం విజయనిర్మలకు కలిసొచ్చింది. ముఖ్యంగా ‘చిగురులు వేసిన కలలన్నీ..’, ‘నీవురావు నిదురరాదు..’ (పూల రంగడు) ‘నీలో ఏముందో ఏమో..’, ‘ఎవరూ లేని చోట’ (మంచి కుటుంబం), ‘చిలిపి నవ్వుల నిను చూడగానే..’ (ఆత్మీయులు) లాంటి పాటల్లో గ్లామర్‌, ‘అన్నయ్య సన్నిధీ...’, ‘చెల్లాయీ పెళ్ళికూతురాయెనే’ (బంగారు గాజులు) పాటల్లో అనురాగం విజయనిర్మలకు అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. ఆ పరంపరలో బాపు-రమణల ‘బంగారు పిచిక’ వచ్చింది. చిత్రం విజయం సాధించకపోయినా అవకాశం వస్తే విజయనిర్మల ప్రధాన నాయిక పాత్రలో ఒదిగి పోగలదని యువతరం నమ్మింది. ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కాబోలు బాపు-రమణలు మరో సాహసం చేశారు. ఏయన్నార్‌ పక్కన కూతురుగా, చెల్లెలిగా చేసిన విజయనిర్మలను ‘బుద్ధిమంతుడు’లో ఆయనకు జోడీగా ఎంపిక చేశారు. ‘తోటలోకి రాకురా..’, ‘హవ్వారే హైలెస్సో..’, ‘గుట్టమీద గువ్వా..’ లాంటి పాటల్లో విజయనిర్మలను అభిమాన ప్రేక్షకులు కోరుకునే విధంగా చూపించారు.


* మరో మలుపు..
కృష్ణతో జోడీగా విజయ నిర్మల నటించిన చిత్రాలు, ఆయనతో కుదిరిన జీవిత భాగస్వామ్యం ఆమెపై ఉన్న మునుపటి ముద్రను తొలగించాయి. ‘విచిత్ర కుటుంబం’లో ‘కాచుకో చూసుకో..’ ‘టక్కరి దొంగ చక్కని చుక్క’లో ‘నీ నడలు చూస్తే..’, ‘ఓ కలలు గనే కమ్మని చిన్నారీ..’లాంటి పాటలు మెప్పించాయి. తర్వాతి కాలంలో వారిద్దరి జీవిత భాగస్వామ్యం చిత్ర నిర్మాణం వైపు దారి తీయడం అదో మలుపు! తొలిప్రయత్నం ‘అగ్ని పరీక్ష’ విఫలమైనా ఆ జంట సాహసంతో అడుగు ముందుకేసి ‘మోసగాళ్లకు మోసగాడు’తో విజయానికి పునాదులు వేయడం అదో మెరుపు! మొదట జేమ్స్‌ బాండ్‌ తరహా చిత్రం ద్వారా దర్శకత్వం వైపు మొగ్గు చూపిన విజయనిర్మల ఆరుద్ర సలహా మేరకు ‘మీనా’లాంటి కుటుంబ చిత్రంతో శ్రీకారం చుట్టి దర్శకురాలిగా రికార్డు సృష్టించడం ఆ తర్వాతి చరిత్ర!
- ఓలేటి శ్రీనివాసభాను


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.