తారా సుమాలు... తెర సౌరభాలు

‘‘లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం...’’

-అని మహిళల శక్తి సామర్థ్యలను 1962లోనే వివరించారు ఓ సినీ కవి.

మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఎప్పుడూ ముందుంటుంది చిత్ర పరిశ్రమ. పూర్తి స్థాయి కథతోనో, సాహిత్యంతోనో అవకాశం ఉన్నప్పుడల్లా ఆడవాళ్ల గొప్పతనాన్ని చెప్తుంటారు రచయితలు.


- (నేడు మహిళా దినోత్సవం సందర్భంగా..)

* విశ్వాసం నింపిన ‘అశ్వని‘

పట్టుదలతో శ్రమిస్తే మనిషి సాధించలేనిది లేదని తన పరుగుతో ప్రపంచానికి చాటిచెప్పిన అశ్వని నాచప్ప జీవితాన్ని వెండితెరపై ‘అశ్వని’గా ఆవిష్కరించారు దర్శకుడు మౌలి. ఎన్ని సవాళ్లు ఎదురైనా పోరాడి గెలవాలనే ఆత్మవిశ్వాసాన్ని పెంచిందీ చిత్రం. అశ్వని జీవితగాథలో ఆమే నటించడం విశేషం. ఇందుకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కించుకుంది.


* సావిత్రి కీర్తి ‘మహానటి’

అలనాటి నటి సావిత్రి కీర్తిని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపిన చిత్రం ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషించి సావిత్రమ్మను మరిపించింది. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి జీవితం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎలా సాగింది? క్లిష్ట పరిస్థితుల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలు ఎలా మార్చాయి? ఈ ప్రశ్నలు ప్రేక్షకులందరినీ ఆలోచింపజేశాయి. ధనం ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్లు ఎలా ఉంటారు, అది లేకపోతే ఏం చేస్తారో.. మహానటి తెలియజేసింది.* వీరనారుల పోరాటాలు..

వీరనారి రుద్రమదేవి పోరాటాలు సినిమా రూపంలో తెలుగు వారికి అందించారు దర్శకుడు గుణశేఖర్‌. అనుష్క ప్రధాన పాత్రధారి. విజయ శాంతి నటించిన ‘ప్రతిఘటన’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రాలు అన్యాయాన్ని ఎదురించాలనే పోరాటతత్వాన్ని రగిలిచాయి.


* బాలీవుడ్‌లో..

హిందీ చిత్రసీమ ఈ విషయంలో ముందంజలో ఉంటుంది. ప్రముఖుల జీవితాలను మాత్రమే కాదు బాధిత మహిళల గాథల్ని తెరపై చూపించి సమాజాన్ని మేల్కొపుతుంది. దీపికా పదుకొణె ప్రధాన పోషించిన ‘ఛపాక్‌’ ఈ కోవలోకే వస్తుంది. ఓ యాసిడ్‌ బాధితురాలి కథ ఇది. ‘మేరీకోమ్‌’, ‘పంగా’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ తదితర చిత్రాలు సైతం మహిళా శక్తిని చాటి చెప్పాయి.


* సెలవు కోసం

గొప్ప గొప్ప మహిళల్ని పరిచయం చేయడం మాత్రమే కాదు ప్రతి మహిళా గొప్పేనని, ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి చాకిరి చేసే మహిళకు సెలవు ఇవ్వాలనే సదుద్దేశంతో ఓ చిత్రమే తెరకెక్కింది. అదే ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. దాసరి నారాయణరావు స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం ‘అవును! కష్టపడే ఆడవాళ్లకి వారాంతంలో ఓ సెలవు ఇవ్వాలి కదా’ అని మగవారందితో అనిపించింది. మగజాతిని కదిలించింది.* సాహిత్యంతో..

రెండు మూడు గంటల కథతోనే కాదు మూడు నాలుగు నిమిషాల పాటల్లోనూ మాతృమూర్తి, సోదరి.. కొడుకు, సోదరుడిపై చూపించే ప్రేమను తెలియజేశారు. ఓ మాతృమూర్తికి అంటు వ్యాధి.. కన్న కొడుకుని కూడా సాకలేని పరిస్థితి. ఆ మాతృమూర్తి బాధ వర్ణనాతీతం. కానీ, దాన్ని ‘అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా’ (సింహరాశి) గీతంతో అమ్మ పడే కష్టాన్ని కలంతో చెప్పే ప్రయత్నం చేశారు ఓ రచయిత. ‘ఎవరు రాయగలరు? అమ్మ అనే మాట కన్న కమ్మని కావ్యం’ అని ప్రశ్నించారో కవి. ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో’ అంటూ హృదయాల్ని ద్రవింపజేశారో మహనీయుడు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.