విలక్షణ హీరో అమీర్‌ ఖాన్‌

విలక్షణతలో సొంత శైలి, ఇటు వినోదం.. అటు సందేశం... వివిధ భావోద్వేగాల్ని ముఖంలో పలికించగలిగే నేర్పు... కథానాయకుడిగా అమీర్‌... జనహృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఖాన్‌ వెరసి అమీర్‌ ఖాన్‌. ఆయన చిత్రాల్లో చాలామటుకు రొటీన్‌కి భిన్నంగా ఉంటూనే కమర్షియల్‌ హంగుల్ని అడ్డుకుంటూ సెంట్‌ పర్సెంట్‌ పైసా వసూల్‌గా విఖ్యాతి గాంచాయి. అమీర్‌ ఖాన్‌ పేరు చెప్పగానే రెండక్షరాల యువ ప్రేమని గుండెతెరపై ఆవిష్కరించిన దిల్, కనురెప్పల వాకిట్లో కలల కల్లాపి జల్లే కలర్‌ ఫుల్‌ ‘రంగీలా’, యువతకి స్ఫూర్తి మంత్రం అనదగ్గ ‘లగాన్‌’, ప్రేమికుల గుండెచప్పుడు ‘ఇష్క్‌’, అచ్చమైన, స్వచ్ఛమైన దేశభక్తికి వెండితెరరూపం అనదగ్గ ‘మంగళ్‌ పాండే’, మోస్ట్‌ పాపులర్‌ సినిమా ‘పీకే’, బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘రాజా హిందుస్తానీ’... ఇలా అనేకానేక సినిమాలు రీళ్లు రీళ్లుగా మనోయవనికపై కదలాడుతాయి. ‘ఫనా’, ‘దంగల’్... ఇలా ఇంకెన్నో సినిమాలు క్యూ కడతాయి. బాలీవుడ్‌లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ హీరో పుట్టిన రోజు మార్చి 14. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమీర్‌ ఖాన్‌ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు సితార.నెట్‌ కోసం.

వ్యక్తిగతం

అమీర్‌ ఖాన్‌ బొంబాయిలో సినిమా నిర్మాత తాహిర్‌ హుస్సేన్, ఆయన భార్య జీనత్‌ హుస్సేన్‌లకు 1965 మార్చి 14న జన్మించాడు. అమీర్‌ ఖాన్‌ అసలు పేరు మహమ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ ఖాన్‌. అమీర్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులలో చాలా మంది హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నారు. నిర్మాత, దర్శకుడు నాజిర్‌ హుస్సేన్‌ అమీర్‌ ఖాన్‌కు బంధువు. నటుడు ఫైజల్‌ ఖాన్‌ అమీర్‌ ఖాన్‌ సోదరుడు. అమీర్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా అమీర్‌ ఖాన్‌తో చుట్టరికం ఉంది.

బాలనటుడిగా ఓ పాటలో ప్రవేశం

బాలనటుడిగా, అమీర్‌ ఖాన్‌ రెండు చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఎనిమిది సంవత్సరాల వయసులో, నజీర్‌ హుస్సేన్‌ దర్శకత్వం వహించిన ‘యాదోన్‌ కి బారాత్‌’ సినిమాలో ఓ పాటలో కనిపించాడు. ‘యాదోన్‌ కి బారాత్‌’ సినిమాని బాలీవుడ్‌ మొట్టమొదటి మసాలా సినిమాగా చెబుతారు. ఆ తరువాతి సంవత్సరం, తన తండ్రి నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘మద్‌ హూష్‌’ చిత్రంలో మహేంద్ర సంధు చిన్నతనం పాత్రను పోషించారు అమీర్‌ ఖాన్‌. అమీర్‌ ఖాన్‌ విద్యాభ్యాసం బాంద్రా, మహిమ్‌ ప్రదేశాలలో జరిగింది. ఈయన రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ ఛాంపియన్, తనకు చదువులో కంటే క్రీడలలో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కూడా పేర్కొన్నాడు. ముంబైలోని నార్సీ మోంజీ కళాశాలలో ట్వల్త్‌ గ్రేడ్‌ చదివాడు. తన తండ్రి నిర్మించిన సినిమాలు విఫలమయినందువలన తన బాల్యం ఎంతో కష్టాలమయంగా సాగిందని ఓ సందర్భంలో అమీర్‌ ఖాన్‌ అన్నాడు. అప్పులవాళ్ళు వాళ్ల అప్పు చెల్లిస్తారా లేదా అని రోజుకు 30 కాల్స్‌ తమకు వచ్చేవని చెప్పాడు. ఫీజు చెల్లించనందుకు ఎప్పుడూ పాఠశాల నుండి బహిష్కరిస్తారోనన్న భయంతో ఉండేవాడు అమీర్‌ ఖాన్‌.

‘పారనోయియా’ చిత్రీకరణలో భాగస్వామ్యం

పదహారు సంవత్సరాల వయసులో, తన పాఠశాల స్నేహితుడు ఆదిత్య భట్టాచార్య దర్శకత్వం వహించిన 40 నిమిషాల సినిమా ‘పారనోయియా’కు సంబంధించిన ప్రయోగాత్మకమైన చిత్రీకరణ ప్రక్రియలో భాగం పంచుకొన్నాడు అమీర్‌ ఖాన్‌. ఈ సినిమాని చిత్రనిర్మాత శ్రీరామ్‌ లాగూ నిర్మించారు. ఇదిలా ఉంటే, అమీర్‌ ఖాన్‌ తల్లిదండ్రులకు అమీర్‌ ఖాన్‌ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నిలకడగా ఉండే ఇంజనీర్‌ లేదా వైద్య వృత్తిలో అమీర్‌ స్థిరపడాలని కోరుకునేవారు. ఈ కారణం వలన తల్లిదండ్రులకు తెలియకుండా అతి రహస్యంగా ‘పారనోయియా’ సినిమా షూటింగ్‌ జరిగింది. ఒకపక్క ఆదిత్యా భట్టాచార్యకు సహాయకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో నీనా గుప్తా, విక్టర్‌ బెనర్జీలతో కలిసి ప్రధాన పాత్రలో నటించాడు అమీర్‌ ఖాన్‌. ఈ సినిమాకు పనిచేసిన అనుభవం వలన సినిమా పరిశ్రమలో కెరీర్‌ని మొదలుపెట్టాలన్న ఆసక్తి కలిగిందని అమీర్‌ ఖాన్‌ అన్నారు.

రంగస్థలంపై తెరవెనుక బాధ్యతలు

‘అవంతర్‌’ అనే రంగస్థల బృందంలో చేరారు అమీర్‌ ఖాన్‌. ఒక సంవత్సరం పాటు తెరవెనుక కార్యకలాపాలు చూసుకునేవాడు అమీర్‌ ఖాన్‌. ‘కేసర్‌ బినా’ అనే గుజరాతీ నాటకంలోని ఓ చిన్న పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం కూడా చేశాడు అమీర్‌ ఖాన్‌. ఇంకా హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో కూడా నాటకాలలో నటించాడు అమీర్‌ ఖాన్‌. హై స్కూల్‌ అయిపోయిన తరువాత, నజీర్‌ హుస్సేన్‌కు సహాయ దర్శకుడిగా వర్క్‌ చేయాలని నిర్ణయించుకొన్నాడు అమీర్‌ ఖాన్‌. అలా ‘మంజిల్‌ మంజిల్‌’, ‘జబర్దస్త్‌’ సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్‌ చేశాడు.

హోలీలో ప్రతికూల పాత్రలో ...

నజీర్‌ హుస్సేన్‌కు సహాయం చేయడంతో పాటు, పూణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా విద్యార్థులు దర్శకత్వం వహించిన డాక్యూమెంటరీలలో కూడా నటించాడు అమీర్‌ ఖాన్‌. ఆ చిత్రాల్లో అమీర్‌ ఖాన్‌ని దర్శకుడు కేతన్‌ మెహతా చూసి ‘హోలీ’ అనే తక్కువ బడ్జెట్‌ సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇందులోని అమీర్‌ ఖాన్‌ ప్రతికూల ఛాయలున్న ఓ కళాశాల విద్యార్థిగా నటించారు.

ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంలో విఫలమయినప్పటికీ, మోన్సూర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం అమీర్‌ ఖాన్‌కు వచ్చింది. ఇందులోని అమీర్‌ ఖాన్‌ పోషించిన పాత్ర పేరు రాజ్‌. ఈ సినిమా భారీ విజయం అందుకొని, అమీర్‌ ఖాన్, జూహీ చావ్లాలకు స్టార్డం తెచ్చిపెట్టింది. ఏడు విభాగాల్లో ఫిలింఫేర్‌ పురస్కారాలు అందుకొన్న ఈ సినిమా ఓ కల్ట్‌ స్టేటస్‌ గుర్తింపుని సంపాదించుకొంది. బాలీవుడ్‌ ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాగా ఇది నిలిచిందని సినిమా విశ్లేషకులు అంటారు. హిందీ సినిమా చరిత్రలో కూడా ఇది ఒక మైల్‌ స్టోన్‌గా నిలిచింది.

1989లో కైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాఖ్‌’ సినిమా విడుదల అయింది. ఆదిత్యా భట్టాచార్య దర్శకత్వం వహించి నిర్మాణంలో కూడా భాగస్వాములైన ఈ సినిమా చిత్రకరణ వాస్తవానికి ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ సినిమా నిర్మాణం కంటే ముందే జరిగింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయవంతమవనప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఆ తరువాత అదేసంవత్సరంలో, ‘లవ్‌ లవ్‌ లవ్‌’ అనే రొమాంటిక్‌ కామెడీ సినిమాలో మళ్లీ జూహీ చావ్లాతో కలిసి నటించాడు అమీర్‌ ఖాన్‌.


‘దిల్‌’ సినిమాతో భారీ విజయం

1990లలో అమీర్‌ ఖాన్‌ నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. అవి ‘అవ్వల్‌ నెంబర్‌’, ‘తుం మేరె హో’, ‘దీవానా ముజ్‌ సా నహి’, ‘జవానీ జిందాబాద్‌’, ‘దిల్‌’ సినిమాలు. వీటిలో ఇంద్ర కుమార్‌ దర్శకత్వంలో మాధురి దీక్షిత్‌ హీరోయిన్‌ గా తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా ‘దిల్‌’ సినిమా మాత్రమే పెద్దగా విజయం సాధించగలిగింది. టీనేజ్‌ ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించే కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి యూత్‌ని బాగా ఆకర్షించింది. అప్పట్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని అమీర్‌ ఖాన్‌ ‘దిల్‌ హై కే మాన్‌ తా నహి’ సినిమాతో విజయం కొనసాగించాడు అమీర్‌. పూజా భట్‌ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ 1934 నాటి అమెరికా సినిమా ‘ఇట్‌ హ్యాపెండ్‌ వన్‌ నైట్‌’కు రీమేక్‌.


‘జో జీతా వోహి సికందర్‌’, ‘హమ్‌ హై రాహి ప్యార్‌ కే’, ‘రంగీలా’ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలలో చాలా వరకు విమర్శనాత్మకంగా, కమర్షియల్‌గా విజయం సాధించినవే. అలాగే సల్మాన్‌ ఖాన్‌తో కలిసి అమీర్‌ ఖాన్‌తో నటించిన ‘అందాజ్‌ అప్నా అప్నా’ సినిమా కూడా విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్‌ అయినప్పుడు, ఈ సినిమాకి వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి. అయితే, రిలీజ్‌ అయిన కొన్నాళ్ళకి ఈ సినిమా కల్ట్‌ స్టేటస్‌ సంపాదించుకోగలిగింది. అమీర్‌ ఖాన్‌ నటించిన ‘ఇసి కా నామ్‌ జిందగీ’, ‘దౌలత్‌ కి జంగ్‌’ చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. 1993లో, యాష్‌ చోప్రా దర్శకత్వం వహించిన ‘పరంపర’ సినిమాలో నటించాడు అమీర్‌ ఖాన్‌. సునీల్‌ దత్, వినోద్‌ ఖన్నా, రవీనా టాండన్, సైఫ్‌ అలీ ఖాన్‌ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అప్పట్లో అమీర్‌ ఖాన్‌ ‘టైం మెషిన్‌’ అనే సినిమాలో నటించాల్సి ఉంది. శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని కారణాల వలన విడుదల కాలేదు.

ఏడాదికి ఒకట్రెండు సినిమాల్లోనే...

అమీర్‌ ఖాన్‌ సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలలో నటించడం కొనసాగించాడు. ఒక ప్రసిద్ధి చెందిన హిందీ నటుడు అప్పట్లోనే ఇలా చేయడమంటే మామూలు విషయం కాదు. 1996లో విడుదలైన ఏకైక అమీర్‌ ఖాన్‌ సినిమా ‘ధర్మేశ్‌ దర్శన్‌ దర్శకత్వం వహించిన బ్లాక్‌ బస్టర్‌ కమర్షియల్‌ ‘రాజా హిందుస్తానీ’. ఇందులో కరిష్మా కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. ఆ తరువాత అమీర్‌ ఖాన్‌ నటించిన కొన్ని సినిమాలు పాక్షికంగా విజయవంతమయ్యాయి. 1997లో, ‘ఇష్క్‌’ సినిమాలో అజయ్‌ దేవగన్, కాజోల్, జూహీ చావ్లాలతో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తరువాతి సంవత్సరం, మధ్యస్తంగా విజయవంతమైన ‘గులాం’ సినిమాలో నటించాడు అమీర్‌ ఖాన్‌. ఈ సినిమా కోసం నేపథ్య గానం కూడా చేశారు అమీర్‌.

1999లో విడుదలైన మొదటి అమీర్‌ సినిమా ‘సర్ఫరోష్‌’. ఇది ఒక మోస్తరుగా విజయం సాధించింది. అయితే, ఇందులోని అమీర్‌ ఖాన్‌ నటనకు మాత్రం మంచి మార్కులు లభించాయి. 2000వ సంవత్సô ంలో తన నిజ జీవిత సోదరుడైన ఫైసల్‌ ఖాన్‌తో ‘మేళ’ సినిమాలో నటించారు అమీర్‌ ఖాన్‌. ఇది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టి అమీర్‌ ఖాన్‌ అభిమానుల్ని నిరాశపరిచింది.


నిర్మాతగా అమీర్‌ ఖాన్‌

2001లో ‘లగాన్‌’ సినిమాలో నటించి, నిర్మించాడు అమీర్‌ ఖాన్‌. ఇది విమర్శనాత్మకంగానే కాకుండా కమర్షియల్‌గా కూడా విజయవంతమైంది. అలాగే ఈ సినిమా 74వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో నామినేషన్‌ పొందింది కూడా. ఇంకా ఎన్నో ఇతర అంతర్జాతీయ సినిమా ఉత్సవాలలో ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఇంకా ఎన్నో భారతీయ పురస్కారాలను కూడా అందుకొంది ఈ సినిమా. అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దిల్‌ చాహతా హై’ సినిమా కూడా సక్సెస్‌ అయింది. అమీర్‌ ఖాన్‌ తన భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చిన తరువాత బాలీవుడ్‌ సినిమా పరిశ్రమ నుంచి నాలుగు సంవత్సరాలు విరామం తీసుకున్నారు.కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘మంగళ్‌ పాండే: ద రైజింగ్‌’

2005లో ‘మంగళ్‌ పాండే: ద రైజింగ్‌’ సినిమాతో తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు అమీర్‌. ఈ సినిమాని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 2006లో విడుదలైన మొదటి అమీర్‌ ఖాన్‌ సినిమా రాకేష్‌ ఓంప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్‌ దే బసంతి’. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. 2006లోనే కాజోల్, అమీర్‌ ఖాన్‌ నటించిన ‘ఫనా’ సినిమా విడుదల అయింది. ఇందులో కాశ్మీరీ తిరుగుబాటు ఉగ్రవాదిగా నటించాడు అమీర్‌. 2006లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారత సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘ఫనా’. 2007లో ‘తారే జమీన్‌ పర్‌’ సినిమాలో నటించడమే కాకుండా ఆ సినిమా దర్శక, నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు అమీర్‌ ఖాన్‌. అమీర్‌ ఖాన్‌ తొలిసారి దర్శకత్వం వహించింది ఈ చిత్రానికే. ప్రేక్షకుల, విమర్శకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది ఈ సినిమా. ‘గజిని’ కెరీర్‌లోనే బెస్ట్‌ 

2008లో, ‘గజిని’ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు అమీర్‌ ఖాన్‌. ఈ చిత్రం ఆత్యంత భారీ విజయం అందుకొంది. అలాగే ఎక్కువ వసూళ్లు రాబట్టింది కూడా. ఈ సినిమాలోని ప్రదర్శనకు గానూ అమీర్‌ ఖాన్‌ ఫిలింఫేర్‌ పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలకు నామినేట్‌ అయ్యారు కూడా.

2009లో, అమీర్‌ ఖాన్‌ నటించిన ‘త్రీ ఇడియట్స్‌’ రిలీజ్‌ అయింది. ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అంతకు ముందు రిలీజ్‌ అయిన ‘గజిని’ సినిమా సృష్టించిన రికార్డులను సైతం బ్రేక్‌ చేయడం ఓ విశేషం. చైనా, జపాన్‌ దేశాలలో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ఓవర్సీస్‌ మార్కెట్స్‌ లో విజయవంతమైన అతి కొద్ది భారతదేశ సినిమాలలో ఒకటిగా స్థానం సంపాదించుకొంది ఈ సినిమా.

చైనా మార్కెట్స్‌లో భారత సినిమాను ఓపెన్‌ చేసిన ఘనత అమీర్‌ ఖాన్‌కు దక్కింది. అంతకు ముందు, అమీర్‌ ఖాన్‌ తండ్రి తాహిర్‌ హుస్సేన్‌ నిర్మించిన ‘కారవాన్‌’ సినిమా చైనాలో విజయవంతమయినా... ఆ తరువాత చైనాలో భారతీయ సినిమాలు విడుదల అవడం బాగా తగ్గింది. ‘లగాన్‌’ సినిమా కూడా చైనాలో దేశవ్యాప్తంగా విడుదల అవడం విశేషం. ఆ విధంగా... చైనీయుల ఆదరాభిమానాలు దక్కించుకోగలిగాడు అమీర్‌ ఖాన్‌. ‘త్రీ ఇడియట్స్‌’ సినిమా చైనాలో వైరల్‌ అయిన తరువాత అమీర్‌ ఖాన్‌ నటించిన ‘తారే జమీన్‌ పర్‌’, ‘గజని’, సినిమాలు కూడా చైనీయుల అభిమానం సంపాదించడంలో విజయవంతమయ్యాయి. ‘ధూమ్‌ 3’, ‘పీకే’, ‘దంగల్‌’ సినిమాలు చైనాలో బాక్సాఫీసు వద్ద విజయం అందుకోవడానికి ఆ సినిమాలు దారి కల్పించాయని చెప్పవచ్చు. 2012లో ‘తలాష్‌’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అమీర్‌. ఈ చిత్రం భారత్‌ లోనే కాకుండా విదేశాల్లో కూడా హిట్‌ అయింది.


క్లిష్టమైన పాత్ర ‘ధూమ్‌ 3’

యాష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో అమీర్‌ ఖాన్‌ ×ధూమ్‌ 3× సినిమా కోసం వర్క్‌ చేశారు. తన కెరీర్‌ లో అత్యంత కష్టమైన పాత్ర అంటే ×ధూమ్‌ 3×లోని పాత్రే అని అమీర్‌ అభిప్రాయమట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2013 డిసెంబర్‌ 20న రిలీజ్‌ అయింది. రిలీజ్‌ అయిన రెండు రోజులలోనే 2013నాటి బిగ్గెస్ట్‌ హిట్‌ ‘ధూమ్‌3’ అని బాక్సాఫీసు ఇండియా వారు ప్రకటించారు. విడుదలైన మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. విడుదలైన పది రోజుల్లో నాలుగు బిలియన్ల వసూళ్లు రాబట్టి అల్‌ టైంలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన బాలీవుడ్‌ సినిమాగా నిలిచింది ఈ చిత్రం.‘పీకే’తో పీక్స్‌లో క్రేజ్‌

2014లో, కామెడీ డ్రామా ‘పీకే’లో అమీర్‌ ఖాన్‌ కనిపించాడు. ఇందులో అనుష్క శర్మ, సుశాంత్‌ సింగ్‌ రాజపుత్, బోమన్‌ ఇరానీ, సంజయ్‌ దత్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విమర్శనాత్మక ప్రశంసలు అందుకొన్న ఈ సినిమా కూడా వసూళ్ల పరంగా సునామి సృష్టించింది. ఇందులోని నటనాపరంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు అమీర్‌. ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ‘పీకే’ సినిమాలోని అమీర్‌ ఖాన్‌ పర్ఫెక్షన్‌కి, నటన పట్ల ఆయనకు ఉన్న అంకితభావానికి ఎంతో ఇంప్రెస్‌ అయినట్టు సమాచారం. తన కుటుంబంతో క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాని చూసినట్టు తెలిసింది. ఈ సినిమాకు జపాన్‌కు చెందిన పురస్కారం కూడా లభించడం విశేషం.‘దంగల్‌’ సినిమాలో అమీర్‌ ఖాన్‌ నటించడమే కాదు నితీష్‌ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమీర్‌ ఖాన్‌ నిర్మించాడు కూడా. మహావీర్‌ సింగ్‌ ఫోగాట్‌ పాత్రలో ఇందులో కనిపిస్తారు అమీర్‌ ఖాన్‌. ఇందులోని 20 నుంచి 60 ఏళ్ళ వివిధ వయసులలో అమీర్‌ ఖాన్‌ పాత్ర ఉంటుంది. పెద్ద వయసు ఉన్నట్టుగా కనిపించడానికి బాగా బరువు పెరగడం అలాగే చిన్న వయసు ఉన్నట్టుగా కనిపించడానికి బరువు తగ్గడం వంటివి చేశాడు అమీర్‌. విమర్శకుల నుంచి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ సంపాదించుకోగలిగింది ఈ సినిమా. ‘పీకే’ సృష్టించిన రికార్డులను బ్రేక్‌ చేసి మరీ ఈ సినిమా విజయంతో ముందుకు దూసుకుపోయింది. చైనాలో కూడా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయింది.‘కుంగ్‌ ఫు యోగ’ సినిమాలో అమీర్‌ ఖాన్‌కు నటించే అవకాశం వచ్చిందని బాలీవుడ్‌లో ఓ టాక్‌ ఉంది. అయితే, ‘దంగల్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండడం వలన ఆ చిత్రానికి అమీర్‌ ఖాన్‌ డేట్స్‌ కేటాయించలేకపోయారని సమాచారం.

2017 అక్టోబర్‌లో, సొంత నిర్మాణ సంస్థ అయిన అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మితమయిన ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ సినిమాలో అమీర్‌ ఖాన్‌ ఓ సహాయనటుడి పాత్రలో నటించాడు. 2018 నవంబర్‌లో, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’లో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించాడు అమీర్‌ ఖాన్‌. ‘ధూమ్‌ 3’ దర్శకుడు విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికీ దర్శకత్వం వహించాడు. ఇందులో కత్రినా కైఫ్, సనా షేక్‌ నటించారు. సనా షేక్‌ ‘దంగల్‌’లో అమీర్‌ ఖాన్‌తో కలిసి నటించగా... ‘ధూమ్‌ 3’లో కత్రీనా కైఫ్‌ అమీర్‌ ఖాన్‌తో కలిసి నటించింది.

2019 మార్చిలో తన 54వ పుట్టినరోజు సందర్బంగా తాను త్వరలోనే ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ అనే సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటించాడు అమీర్‌ ఖాన్‌. 1994లో హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాకు ఇది అనుకరణ అని తెలుస్తోంది. అమీర్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. అమీర్‌ ఖాన్‌ని ఇదివరకు ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ సినిమా కోసం దర్శకత్వం వహించాడు అద్వైత్‌ చందన్‌. 2020లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.


బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’

అమీర్‌ ఖాన్‌ ‘సత్యమేవ జయతే’ అనే టాక్‌ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఒక సామజిక కార్యక్రమం. ఈ కార్యక్రమపు ఒక ఎపిసోడ్‌ కి అమీర్‌ ఖాన్‌ ముప్పై మిల్లియన్లు తీసుకున్నట్టు సమాచారం. ఆ విధంగా జూన్‌ 2012 నాటికి భారతీయ టెలివిజన్‌ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హోస్ట్‌గా అమీర్‌ ఖాన్‌ నిలిచినట్టు బాలీవుడ్‌ విశ్లేషకులు అంటున్నారు. స్టార్‌ ప్లస్, స్టార్‌ వరల్డ్, దూరదర్శన్‌లలో ఈ షో 11 గంటలకు ఆదివారం పూట ప్రసారం అయ్యేది. అన్నట్టు ఈ షోని ఎనిమిది భాషలలో ప్రదర్శించారు. మొదట, రేటింగ్‌ విషయంలో ఈ షో వెనకపడినా ఆ తరువాత ఈ షో విజయవంతమైంది.ఈ షోలో చర్చించిన సమస్యలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి, అనేక విషయాలు పార్లమెంటులో చర్చకు వచ్చాయి. రాజకీయ నాయకులు, చట్టసభ సభ్యులను చర్య తీసుకోవడానికి ప్రభావితం చేశాయి. మరొక ఎపిసోడ్లో వైద్య దుర్వినియోగం అనే విషయం గురించి చర్చించిన తరువాత, భారత పార్లమెంటు అమీర్‌ ఖాన్‌ని ఆహ్వానించింది. అలా అమీర్‌ ఖాన్‌ భారత పార్లమెంటుకు ఆహ్వానించబడిన మొదటి నాన్‌-ఎంపి అయ్యారు.బ్రాండ్‌ ఎండార్సుమెంట్స్‌

టైటాన్‌ వాచెస్, స్నాప్‌ డీల్, కోకో - కోల, టాటా స్కై, శాంసంగ్, గోద్రెజ్‌లకు అమీర్‌ బ్రాండ్‌ అంబాసడర్‌గా వ్యవహరించాడు. బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లకు అమీర్‌ ఎక్కువ వసూళ్లు చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్‌ ఉంది. అయితే, అమీర్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ దృష్టిలో పెట్టుకుని సంస్థలు కూడా ఆయన డిమాండ్‌కు అంగీకరిస్తున్నాయి అని కూడా సినిమా విశ్లేషకులు అంటారు.వివాహం-విడాకులు

1986 ఏప్రిల్‌ 18న అమీర్‌ ఖాన్, రీనా దత్తాని వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, అమీర్‌ ఖాన్‌ 2002లో తన భార్యతో విడాకులకు ఫైల్‌ చేశారు. ప్రస్తుతం పిల్లల బాధ్యత రీనా దత్తా తీసుకొన్నారు. 2005 డిసెంబర్‌ 28న కిరణ్‌ రావుని వివాహమాడాడు అమీర్‌ ఖాన్‌. 2011లో సరోగసీ ద్వారా వీరికి ఒక కుమారుడు జన్మించాడు. అమీర్‌ ఖాన్‌ ముస్లిం కాగా కిరణ్‌ రావు హిందూ మతానికి చెందినవారు. 2015లో తన భార్య కిరణ్‌ రావు జీవన శైలికి స్ఫూర్తి పొంది తాను కూడా మాంసాహారం నుంచి శాకాహారానికి మారుతున్నట్టు ఓ ప్రకటన చేశారు అమీర్‌ ఖాన్‌. 2019 సెప్టెంబర్‌లో అమీర్‌ ఖాన్‌ కుమార్తె ఇరా తాను ఒక నాటకాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘యూరిపీడెస్‌ మెడియా’ పేరుగల ఆ నాటకాన్ని కమల్‌ హాసన్‌ మాజీ భార్య సారిక, ఆమె కుమార్తె అక్షర హాసన్‌ నిర్మించారు. అమీర్‌ ఖాన్‌ సోదరి ఫర్హాత్‌ దత్తా ఈ నాటకపు ప్రమోషన్‌ కి పోస్టర్‌ ని పెయింట్‌ చేశారు.

అనేక పురస్కారాలు

‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ సినిమాకు బెస్ట్‌ మేల్‌ డెబ్యూగా ఓ ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకొన్నాడు అమీర్‌ ఖాన్‌. ఆ తరువాత ‘రాజా హిందుస్తానీ’ చిత్రానికి ఉత్తమ నటుడిగా మరో ఫిలింఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకోగలిగాడు. అమీర్‌ ఖాన్‌ నిర్మించిన ‘లగాన్‌’ సినిమాకు ఉత్తమ సినిమాగా ఫిలింఫేర్‌ అవార్డు వచ్చింది. అలాగే ఆ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడి విభాగంలో కూడా అమీర్‌ ఖాన్‌కు ఓ పురస్కారం దక్కింది. ‘రంగ్‌ దే బసంతి’ చిత్రానికి ఉత్తమ నటుడు (విమర్శకుల) విభాగంలో అమీర్‌ ఖాన్‌ని ఓ ఫిలింఫేర్‌ పురస్కారం వరించింది. అమీర్‌ ఖాన్‌ నిర్మించి దర్శకత్వం వహించిన ‘తారే జమీన్‌ పర్‌’ సినిమాకు ఉత్తమ దర్శకుడి విభాగంలో, ఉత్తమ సినిమా విభాగంలో విభాగాల్లో ఫిలింఫేర్‌ పురస్కారాలు రావడం విశేషం. అమీర్‌ ఖాన్‌ నిర్మించిన ‘దంగల్‌’ సినిమాకు కూడా ఉత్తమ సినిమా విభాగంలో ఓ ఫిలింఫేర్‌ పురస్కారం లభించింది. అలాగే, ఆ చిత్రంలోని నటనకుగానూ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు సంపాదించుకోగలిగాడు అమీర్‌.

‘లగాన్‌’ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, మూవీ ఆఫ్‌ ది డికేడ్‌ విభాగాల్లో ఐఫా పురస్కారాలు అందుకొన్నాడు అమీర్‌ ఖాన్‌. ఇంకా ఎన్నో సార్లు స్కీన్ర్‌ పురస్కారాలు కూడా అందుకొన్నాడు అమీర్‌ ఖాన్‌.‘తారే జమీన్‌ పర్‌’ సినిమాకు ఉత్తమ తొలి దర్శకుడిగా గొల్లపూడి శ్రీనివాస్‌ పురస్కారం లభించింది అమీర్‌ ఖాన్‌కు. 2003లో అమీర్‌ ఖాన్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 2010లో పద్మ భూషణ్‌ పురస్కారం కూడా అమీర్‌ ఖాన్‌ను వరించడం విశేషం. 2009లో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సినిమా పరిశ్రమలో తాను చేసిన కృషికిగానూ రాజ్‌ కపూర్‌ స్మిత్రి విషెష్‌ గౌరవ్‌ పురస్కార్‌ దక్కింది. 2017లో చైనా ప్రభుత్వం నుంచి నేషనల్‌ ట్రెజర్‌ ఆఫ్‌ ఇండియా పురస్కారం అందుకొన్నారు అమీర్‌ ఖాన్‌. ఇంకా అమీర్‌ ఖాన్‌ ఖాతాలో ఎన్నో పురస్కారాలు, గౌరవాలు, గుర్తింపులూ ఉన్నాయి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.