సృజనాత్మక నటుడు
విలక్షణమైన నటనకు ఆయన పెట్టింది పేరు. ఓ చిత్రంలో నవ యువకుడిగా మెప్పిస్తారు. అంతలోనే అరవై ఏళ్ల ముసలాడిగా మురిపిస్తారు. గతం మర్చిపోయే గజని అయినా ఆయనే.. గ్రహాలు దాటొచ్చి దైవత్వాన్ని ప్రశ్నించిన గ్రహాంతరవాసైనా ఆయనే. నటనతో అలరిస్తారు, ఆనందింపజేస్తారు. అదే సమయంలో తన చిత్రాలతో బాధ్యతలను గుర్తుచేసే నిజమైన భారతీయుడిగా అందరినీ ఆలోచింపజేయిస్తారు. అందుకే ఆయన అభిమానుల మదిలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యారు. కథానాయకుడిగా విభిన్న పాత్రలతో అలరించి బాలీవుడ్‌లో అగ్రకథానాయకుడిగా తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు ఆమీర్‌ఖాన్‌. దర్శకుడిగా, నిర్మాతగా, బుల్లితెర వ్యాఖ్యాతగానూ ఆమీర్‌ మంచి గుర్తింపు సాధించారు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆమీర్‌. అసలు పేరు మహమద్‌ ఆమీర్‌ హుస్సేన్‌ ఖాన్‌. 1965 మార్చి 14న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించారు. తండ్రి తాహిర్‌ హుస్సేన్‌ (సినీ నిర్మాత), తల్లి జీనత్‌ హుస్సేన్‌. ఆమీర్‌ వాళ్లది చాలావరకు సినీ నేపథ్యమున్న కుటుంబం.


ఆమీర్‌ ఖాన్‌ ముంబయిలోని జె.బి.పెటిట్‌ స్కూల్, సెయింట్ అన్నేస్‌ హైస్కూల్, బాంబే స్కాటిష్‌ స్కూల్స్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేశారు. చిన్నతనం నుంచి చదువులో కన్నా ఆటల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచిన ఆమీర్, టెన్నిస్‌లో రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా రాణించారు. ఆయన సినీ కుటుంబంలో పుట్టిపెరగడం వల్ల చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఏర్పడింది. ఆమీర్‌ ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి ‘యాదోంకి బారాత్‌’ (1973) చిత్రంతో బాలనటుడిగా బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ఈ సినిమాను ఆయన పెద్దనాన్న నాసిర్‌ హుస్సేన్‌ నిర్మించారు. తర్వాత తన తండ్రి తీసిన ‘మధోష్‌’లో చిన్నప్పటి హీరో పాత్రలో నటించారు ఆమీర్‌. తర్వాత కొన్నాళ్లపాటు చదువులకే పరిమితమైన ఆమీర్‌ తిరిగి ‘హోలి’ (1984) అనే ఓ ప్రయోగాత్మక చిత్రంతో వెండితెరపై మెరిపించారు. ఆయన కథానాయకుడిగా నటించిన తొలిసినిమా ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ (1988). నాసిర్‌ హుస్సేన్‌ నిర్మించిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నందుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత 1989లో ‘రాఖ్‌’ అనే క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటించారు ఆమీర్‌. ఇది ఆయనకు భారీ హిట్టును అందించడమే కాక ఆమీర్‌ నటన గురించి జాతీయ పురస్కారాల వేడుకలో ప్రత్యేకంగా పేర్కొనెలా చేసింది. ఈ చిత్రంతో ఆమీర్‌ బాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ హీరోగా మారిపోయారు. దీంతో పాటు 1990లో వచ్చిన ‘దిల్‌’, ‘దిల్‌ హై కే మన్‌తా నహీన్‌’ (1991) చిత్రాలు వరుస విజయాలందుకున్నాయి. ఆ తర్వాత ‘హమ్‌ హైనా రహి ప్యార్‌కే’ (1993), ‘అన్‌దాజ్‌ అప్నా అప్నా’, ‘రంగీలా’ (1995) సినిమాలు నటుడిగా ఆమీర్‌ ఖాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక నటుడిగా ఆయనకు తొలి ఫిలింఫేర్‌ తెచ్చిపెట్టిన సినిమా ‘రాజా హిందుస్తాని’ (1996). సామాన్య కారు డ్రైవర్‌కు ఒక గొప్ప ఇంటి అమ్మాయికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కారు డ్రైవర్‌గా ఆమీర్‌ చూపిన అభినయానికి విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిందీ సినిమా. దీని తర్వాత మళ్లీ అంతటి పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘సర్ఫరోష్‌’ (1999). దీంతో రెండోసారి ఉత్తమనటుడిగా ఫిలింఫేర్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు ఆమీర్‌. ‘ఎర్త్‌’ (1998) కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.


నటుడిగా ఆమీర్‌ ఖాన్‌ ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన చిత్రం ‘లగాన్‌’. 2001లో ఆమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి సినిమాగా ‘లగాన్‌’ను నిర్మించారు. క్రికెట్‌ నేపథ్యంగా సాగే చారిత్రక చిత్రమిది. ఇది ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. దీంతో పాటు జాతీయ ఉత్తమ పాపులర్‌ సినిమాగానూ అవార్డు దక్కించుకుంది. ఈ సినిమాతో ఆమీర్‌ బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తర్వాత మూడేళ్లపాటు సినిమాలకు దూరమైన ఆమీర్‌ ఖాన్‌ ‘మ్యాడ్‌నెస్‌ ఇన్‌ ది డిసర్ట్‌’ అనే డాక్యుమెంటరీలో నటించి మెప్పించారు. దీనికి ఉత్తమ సాహస చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. ఆ తర్వాత ‘ఫనా’ (2006), ‘రంగ్‌ దే బసంతి’ (2006)లతో మంచి విజయాలందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలిసినిమా ‘తారే జమీన్‌ పర్‌’. దీనికి ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా రెండు ఫిలింఫేర్‌లు అందుకున్నారు ఆమీర్‌. ‘గజని’ (2008), ‘త్రీ ఇడియట్స్‌’ (2009), ‘ధూమ్‌ 3’ (2013) సినిమాలు కమర్షియల్‌గానూ భారీ హిట్లు సాధించడంతో పాటు నటుడిగా విమర్శకులను సైతం మెప్పించారు. 2014లో వచ్చిన ‘పికె’తో తొలి రూ. 500కోట్ల మార్కును అందుకున్న ఇండియన్‌ హీరోగా రికార్డు సృష్టించారు ఆమీర్‌. రూ.75కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.900 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డును నెలకొల్పింది. 2016లో వచ్చిన ‘దంగల్‌’ ప్రపంచ వ్యాప్తంగా రూ.2,000 కోట్లు వసూళ్లు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా అనేక రికార్డులను నమోదు చేసింది. దీనిలో అత్యధిక భాగం చైనా దేశం నుంచి రావడం విశేషం. చైనా బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం నిలవడంతో పాటు ఆ దేశంలో ఉత్తమ చిత్రంగానూ మన్ననలు అందుకుంది. ఇదే ఊపులో 2017లో వచ్చిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సైతం చైనాలో భారీ వసూళ్లు దక్కించుకుంది. రూ.42 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.965 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రంతో వరుసగా మూడుసార్లు 500కోట్ల వసూళ్లను సాధించిన కథానాయకుడిగా ఆమీర్‌ అరుదైన రికార్డు నెలకొల్పారు. గతేడాది అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’లో నటించారు ఆమీర్‌. కానీ, ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్లాప్‌ టాక్‌ను తెచ్చుకొంది.

ఆమీర్‌ ఖాన్‌ రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటివరకు దాదాపు 60 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తొమ్మిది ఫిలింఫేర్‌ అవార్డులు, నాలు జాతీయ పురస్కారాలు, ఒక ఎఎసిటిఎస్‌ అవార్డును అందుకున్నారు. సినీ రంగంలో ఆయన చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌ పురస్కారాలతో ఆమీర్‌ ఖాన్‌ను సత్కరించింది. దీంతో పాటు 2017లో గౌవర్నమెంట్‌ ఆఫ్‌ చైనా అవార్డును అందుకున్నారు. ఆమీర్‌ బుల్లితెరపై చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.