అందానికి చిరునామా... ఐశ్వర్యరాయ్‌!
ఆకాశంలో మెరుపును తీసి రవివర్మ గీసిన అందమైన చిత్రం ఆమె రూపం..
నీలికళ్ల సోయగంతో ప్రపంచాన్ని తన మత్తులోకి దింపిన సౌందర్యరాశి..
మర మనిషిలోనూ మనసును మొలిపించేంత సోయగం ఆమె సొంతం..
నాటి నుంచి నేటి వరకు యువతరానికి ఆమే కలల రాణి..
నడిచే పాలరాతి శిల్పం. ప్రేమదేశపు రాకుమారి..
మొత్తంగా ప్రపంచ సినిమాకు పట్టిన తేనె తుట్టె ఐశ్వర్యారాయ్‌..

article image

నూరడుగుల శిలను తెచ్చి చేయి తిరిగిన శిల్పకారులంతా కలిసి అందమైన ఆరడుగుల శిల్పంలా చెక్కితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది ఐశ్వర్యారాయ్‌. అందుకే ప్రపంచం మెచ్చిన విశ్వసుందరిగా, మిస్‌ ఇండియాగా విశేష ఆదరణ చూరగొంది. అందంతో పాటు అద్భుతమైన అభినయంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సినీ ప్రియులను ఉర్రూతలూగించింది ఐశ్వర్యారాయ్‌. వెండితెరపై తన సోయగాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టే ఐశ్వర్యారాయ్‌.. 1973 నవంబరు 1న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి కనబరిచిన ఐశ్వర్య ఆ ఆసక్తితోనే టీనేజిలోనే శాస్త్రీయ సంగీతం, నాట్యంలో ఐదేళ్లపాటు శిక్షణ తీసుకుంది. కళాశాల స్థాయికి వచ్చేనాటికి మోడల్‌గా మారిన ఆమె మిస్‌ ఇండియాగా, విశ్వసుందరిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించింది.

* ఎన్నాళ్లైనా కుర్రాకారు గుండెల్లో కలల రాకుమారే...
ఐశ్వర్యారాయ్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పటికి రెండుదశాబ్దాలు దాటుతున్నా నాటి నుంచి నేటి వరకు తరగని అందంతో సినీ ప్రియుల మదిలో కలల రాకుమారిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది ఐశ్వర్యారాయ్‌. 1997లో మణిరత్నం సినిమా ‘ఇరువర్‌’ (ఇద్దరు)తో తెరంగేట్రం చేసిన ఐశ్వర్య తొలి చిత్రంతోనే నటిగా మంచి ప్రశంసలు దక్కించుకుంది. కానీ వాస్తవానికి ఐశ్వర్య అందాన్ని మణిరత్నం ఆ చిత్రంలో సరిగా పరిచయం చేయలేదనే చెప్పాలి. అదే ఏడాది హిందీలో ‘ఔర్‌ ప్యార్‌ హో గయా’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక ఐశ్వర్య సౌందర్యాన్ని సరికొత్తగా ఆవిష్కరింప జేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన దర్శకుడు శంకర్‌. 1998లో వచ్చిన ‘జీన్స్‌’లో శంకర్‌ ఐశ్వర్య అందాన్ని ప్రపంచ వింతల మధ్య అందంగా ఆవిష్కరించిన విధానం ఎంతో ఆకర్షించింది. ఐశ్వర్య సౌందర్యాన్ని ప్రపంచ ఎనిమిదో వింత అన్నట్టుగా వెండితెరపై అద్భుతంగా చూపించాడు. దీంతో ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా కుర్రకారు మదిలో కలల రాకుమారిగా వెలిగిపోయింది. అక్కడి నుంచి ‘దేవదాసు’, ‘దిల్‌ దే చుకే సనమ్‌’, ‘చొఖెర్‌ బలి’, ‘రెయిన్‌ కోట్‌’, ‘ప్రొవోక్డ్‌’, ‘మొహబ్బతే’, ‘ధూమ్‌ 2’, ‘జోధా అక్బర్‌’, ‘రోబో’, ‘జబ్బా’ వంటి సినిమాల్లో అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. పెళ్లై తల్లయినా, కాలంతో పాటు వయసు పెరుగుతున్నా అయస్కాంతం లాంటి ఐశ్వర్య సౌందర్యం మాత్రం నేటికీ ఓ దివ్యకాంతిలా వెండితెరపై వెలుగులు విరజిమ్ముతునే ఉంటోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.