ఇండియన్‌ జాకీచాన్‌ అక్షయ్‌కుమార్‌
ఇమేజ్‌ చట్రానికి తలవంచని కథానాయకుడతను..
కొత్తదనానికి చిరునామా..
నవ్విస్తాడు.. కవ్విస్తాడు.. కంటతడిపెట్టిస్తాడు..
అదిరిపోయే పోరాటాలతో అలరిస్తాడు..
మదిని కదిలించే స్ఫూర్తి గాథలతో మెప్పిస్తాడు..
అందుకే సినీ ప్రియులకు ఆయన ఇండియన్‌ జాకీచాన్‌ అయ్యాడు.
ప్రేక్షకుల మదిలో యాక్షన్‌ కుమార్‌గా సుస్థిర స్థానం సాధించుకున్నాడు.

సా
ధించాలనుకునే కోరిక, తపన బలంగా ఉంటే ఆపడం ఎవరితరం. ఇది బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ జీవితానికి సరిపోయే మాట. చిన్నప్పుడు ఎవరైనా నువ్వు ఏం అవుతావు అని అడిగితే.. డాక్టరనో, పోలీసనో, కలెక్టరనో నోటికొచ్చింది చెప్పేస్తారు. కానీ ఎంతమంది ఆ దిశగా విజయం సాధిస్తారన్నది అనుమానమే. అక్షయ్‌ మాత్రం అలా కాదు. బాల్యంలోనే వాళ్ల నాన్నకు చెప్పేశాడట నేను కచ్చితంగా గొప్ప నటుడిని అవుతానని. అందుకు తగ్గట్టే స్కూల్‌ రోజుల నుంచి స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌లు ఇస్తూ.. నటుడిగా తన ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లాడు అక్షయ్‌. తర్వాత బ్యాంకాక్‌లో మార్షల్‌ ఆర్ట్స్ లో శిక్షణ పొంది దానిలో ప్రావిణ్యం సంపాందించాడు. చిత్ర సీమలో అక్షయ్‌కుమార్‌ను యాక్షన్‌ స్టార్‌గా నిలబెట్టడంలో ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆయన చాలా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లను డూప్‌ లేకుండా చేసి చూపించారు. అందుకే అభిమానుల మదిలో ఇండియన్‌ జాకీచాన్‌గా పేరు తెచ్చుకున్నాడు అక్షయ్‌. ఇంతకీ అక్షయ్‌కుమార్‌ అసలు పేరేంటో తెలుసా.. రాజీవ్‌ హరి ఓం భాటియా. 1967 సెప్టెంబరు 9న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హరి ఓం భాటియా, అరుణా భాటియా దంపతులకు జన్మించాడు.

article image

* 20 బిలియన్‌ రూపాయలు వసూళ్లు సాధించిన హీరో..
బాలీవుడ్‌ నటుడిగా, నిర్మాతగా, మార్షల్‌ ఆర్ట్స్ కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకున్న అక్షయ్‌కుమార్‌ ఇప్పటివరకు దాదాపు 100 చిత్రాల్లో నటించారు. ‘దీదార్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన అక్షయ్‌ తొలినాళ్లలో ఎక్కువగా ‘వక్త్‌ హమారా హై’ (1993), ‘మోహ్రా’ (1994), ‘ఎలాన్‌’ (1994), ‘సుహాగ్‌’ (1994), ‘సపూట్‌’ (1996), ‘జాన్వర్‌’ (1999) వంటి యాక్షన్‌ సినిమాలతో పేరుతెచ్చుకున్నాడు. కానీ తర్వాత డ్రామా, రొమాంటిక్, హాస్యభరిత చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు అక్షయ్‌. ‘యే దిల్లగీ’ (1994), ‘ధడ్కన్‌’ (2000), ‘అందాజ్‌’ (2003), ‘నమస్తే లండన్‌’ (2007), ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ (2008), ‘హౌస్‌ఫుల్‌ 2’ (2012), ‘రౌడీ రాథోడ్‌’ (2012), ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ (2015) సినిమాలతో అన్నిరకాల జోనర్లలో నటించి మెప్పించారు అక్షయ్‌కుమార్‌. వీటిలో ‘రౌడీ రాథోడ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 2’ చిత్రాలు 1 బిలియన్‌ వసూళ్లు సాధించాయి. ఆయన నటించిన చిత్రాలన్నీ కలిపి 20 బిలియన్‌ రూపాయలు వసూలు చేయడం బాలీవుడ్‌లో ఓ రికార్డుగా నిలిచింది. భారత సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కథానాయకుడిగా అక్షయ్‌కు పేరుంది.


* సామాజిక బాధ్యతగా...
అక్షయ్‌కుమార్‌ వెండితెరపైనే కాక నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు విడిచిన ఆర్మీ జవానులను ఆదుకోవడంలో అక్షయ్‌ ఎన్నోసార్లు తన దాతృత్వాన్ని చూపించాడు. తన సినిమాలు సైతం ఎక్కువగా దేశభక్తిని పెంపొందించే విధంగా ఉంటాయి. మహిళల రుతుక్రమ సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని అరుణాచలం మురగనాథన్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ‘ప్యాడ్ మాన్‌’తో సమాజానికి చక్కటి సందేశాన్ని అందించారు. వాస్తవంగా ఇదొక ఛాలెంజింగ్‌ పాత్ర. యాక్షన్‌ హీరోగా, మంచి కమర్షియల్‌ హిట్లతో దూసుకుపోతున్న ఓ అగ్రకథానాయకుడు ఇలాంటి కథాంశంలో నటించడం ఓ ప్రయోగమే. దానికి తోడు ఆయనే దాన్ని స్వయంగా నిర్మించడం మరో విశేషం. ఈ ఏడాదే 'గోల్డ్' వంటి దేశభక్తి కథతోనూ సినీ ప్రియులను మెప్పించాడు. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.


* స్టార్‌డమ్‌కు దూరంగా పిల్లల్ని..
అక్షయ్‌కుమార్‌ 2001 జనవరి 17న ప్రముఖ నటి ట్వింకిల్‌ ఖన్నాను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రముఖ బాలీవుడ్‌ నటులు రాజేష్‌ ఖన్నా, డింపుల్‌ కపాడియాల కుమార్తె. అక్షయ్‌కు ట్వింకిల్‌ ఖన్నాతో రెండుసార్లు నిశ్చితార్థం జరగడం విశేషం. వీరికి ఓ కుమారుడు (ఆరవ్‌), కుమార్తె (నేత్ర) ఉన్నారు. వీరి పెంపకంలో అక్షయ్‌కుమార్‌ తీసుకున్న జాగ్రత్త ఎంతో అమూల్యమైనది. తన స్టార్‌డమ్‌ కారణంగా పిల్లలు తమ విలువైన చిన్నతనాన్ని ఎక్కడ దూరం చేసుకుంటారో అని, వారి స్వేచ్ఛకు భంగం కలుగకుండా మీడియాకు దూరంగా పెంచుతూ ఆదర్శ తండ్రిగా నిలిచాడు.

 అక్షయ్‌కుమార్‌ నటుడుగానే కాక బుల్లితెర వ్యాఖ్యాతగా ‘ఫాక్టర్‌− ఖత్రోం కే ఖిలాడీ’ షోతో మంచి గుర్తింపు సాధించారు. హరి ఓం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను స్థాపించి సొంతంగా సినిమాలను నిర్మిస్తున్నారు. భారత సినీపరిశ్రమకు అక్షయ్‌కుమార్‌ చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించగా, విండర్స్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది. ఆయన నటించిన అనేక సినిమాలు ఫిలింఫేర్‌ అవార్డులకు నామినేట్‌ అవగా రెండు సార్లు పురస్కారాలు దక్కించుకున్నారు. 2015లో ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యధిక రెమ్యునేషన్‌ తీసుకునే నటుల జాబితాలో అక్షయ్‌ 9వ స్థానంలో నిలిచారు.

- మందలపర్తి రాజేశ్ శర్మ


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.