అమితాబ్‌ బచ్చన్
article imageఆయన కోట్లాది అభిమానులకు ‘యాంగ్రీ యంగ్‌ మాన్‌’.. బాలీవుడ్‌కే కాదు యావత్‌ భారత చలన చిత్ర పరిశ్రమకు పెహెన్‌ షా.. స్టార్‌ ఆఫ్‌ ద మిలీనియం.. ఓ సామాన్యుడిగా జీవితం మొదలుపెట్టి అసామాన్యమైన నటనతో భారత చలన చిత్రరంగంపై తనదైన ముద్ర వేసిన బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ప్రేక్షకుల గుండెల్లో బిగ్‌ బి. అమితాబ్‌ పూర్తి పేరు.. అమితాబ్‌ హరివంశ్‌ బచ్చన్‌. 1942 అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ (కవి), తల్లి తేజీ బచ్చన్‌. అమితాబ్‌ అసలు పేరు ఇంక్విలాబ్‌. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదానికి ఆకర్షితులైన హరివంశ్‌ అమితాబ్‌కు ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత స్నేహితుడు సలహామేరకు అమితాబ్‌ అని పేరు మార్చారు హరివంశ్‌. అమితాబ్‌ తల్లికి నటనపై ఆసక్తి ఎక్కువ. అనేక నాటకాల్లో నటించారు. తర్వాత ఆమెకు సినిమా అవకాశం వచ్చినప్పటికీ గృహిణిగా ఉండటానికే ఇష్టపడింది. అలా కళారంగంపై తల్లి తేజీకున్న ఆసక్తే అమితాబ్‌కు వచ్చింది. ఆయన సినీ రంగంవైపు రావడంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉంది. అయితే అమితాబ్‌కు సినిమా అవకాశాలేం అంత తేలికగా రాలేదు. అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. మొదట్లో అమితాబ్‌ ఎత్తు, అతని బక్కపల్చని దేహం చూసి అతను సినిమాల్లో హీరోగా ఏమాత్రం పనికి రాడని చెప్పి తిప్పి పంపించేసేవారు. కొంతమంది అతని గొంతు విని ఆ బొంగురు గొంతుతో సినిమాల్లో ఎలా చేస్తావు అని విమర్శించారు. అయితే బిగ్‌బి ఏమాత్రం అధైర్యపడకుండా తన ప్రయత్నాలు కొనసాగించారు. అలా అమితాబ్‌ 1969లో ‘భువన్‌ షోం’ అనే సినిమాతో నేపథ్య కథకునిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. మృణిల్‌ సేన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. నటుడిగా అమితాబ్‌ తొలిసినిమా ‘సౌత్‌ హిందుస్తానీ’. ఖాజ్వా అబ్బాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఏడుగురు ప్రధాన పాత్రల్లో ఒకరిగా బిగ్‌బి కనిపించారు. ఆ తర్వాత రాజేష్‌ ఖన్నాతో కలిసి ‘ఆనంద్‌’లో చిన్న పాత్రలో నటించారు. ఇందులో అమితాబ్‌ నటనకు.. ఉత్తమ సహాయనటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కింది. తర్వాత అమితాబ్‌ ‘పర్వానా’, ‘రేష్మా ఔర్‌ షేరా’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

అమితాబ్‌ సినిమా కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం 1973లో ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన ‘జంజీర్‌’. ఈ చిత్రంలో హీరోగా విజయ్‌ ఖన్నా పాత్రలో అమితాబ్‌ అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను అలరించారు. భారీ విజయాన్నందుకుంది ‘జంజీర్‌’. ఈ సినిమాతో అమితాబ్‌ యాంగ్రీ యంగ్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియాగా గొప్ప కీర్తిని అందుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఇక అదే ఏడాది ‘జంజీర్‌’లో కథానయికగా చేసిన జయను, అమితాబ్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు (అభిషేక్‌ బచ్చన్‌). వివాహం తర్వాత కూడా జయ, అమితాబ్‌ల జోడీ అనేక చిత్రాల్లో సందడి చేసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అభిమాన్‌’ చిత్రంతో రెండవసారి అమితాబ్‌ ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నాడు. 1974లో వచ్చిన ‘కుంవారా బాప్‌’, ‘దోస్త్‌’, రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ సినిమాల్లో చిన్న, సహాయనటుడి పాత్రల్లో కనిపించి తన నటనతో మెప్పించారు అమితాబ్‌. బిగ్‌బి 1975లో వివిధ రకాల జోనర్‌ చిత్రాల్లో నటించారు. వాటిలో ‘చుప్కే చుప్కే’(కామెడీ), ‘ఫరార్‌’(క్రైం) అమితాబ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఇదే ఏడాది వచ్చిన ‘దీవార్‌’, ‘షోలే’ సినిమాలు అమితాబ్‌ కెరీర్‌లోనూ, బాలీవుడ్‌ చరిత్రలోనూ అత్యంత భారీ హిట్లుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఇండియా టైమ్స్‌ వారి తప్పక చూడాల్సిన టాప్‌−25 బాలీవుడ్‌ చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ముఖ్యంగా ‘షోలే’ 1975 సంవత్సరంలోనే కాక, అప్పటికి మొత్తం భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. దీనికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఆ తర్వాత ‘కభీ కభీ’, ‘అదాలత్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంతోనియా’ చిత్రాలతో మంచి విజయాలందుకున్నారు అమితాబ్‌. 1978లో ‘కసమే వాదే’, ‘డాన్‌’ సినిమాల్లో బిగ్‌బి ద్విపాత్రాభినయంతో అదరగొట్టారు. ‘సుహాగ్‌’, ‘మిస్టర్‌’, ‘నట్వర్‌ లాల్‌’, ‘కాలా పత్తర్‌’, ‘ది గ్రేట్‌ గేంబ్లర్‌’ చిత్రాలు అమితాబ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 80లలో వచ్చిన ‘షాన్‌’ (1980), ‘శక్తి’ (1982), సినిమాలు బిగ్‌బికి నిరాశను మిగిల్చినా ‘రాం బలరాం’ (1980), ‘నసీబ్‌’ (1981), ‘లారిస్‌’ (1981) మంచి హిట్లను అందించాయి. తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయ రంగంలో గడిపిన అమితాబ్, 1988లో ‘పెహెన్‌ షా’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి వచ్చి భారీ విజయాన్నందుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసి మళ్లీ విరామం తీసుకన్న అమితాబ్‌ కొన్నాళ్లకు ‘అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎబిసిఎల్‌)’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలను నిర్మించారు. అనంతరం అమితాబ్‌ దీనివల్ల కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. దీంతో 1998లో ‘మియాన్‌ చోటే మియాన్‌’తో తిరిగి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అప్పటి నుంచి కేవలం హీరోగానే కాక విభిన్నరకాల పాత్రల్లో నటిస్తూ అమితాబ్‌ బాలీవుడ్‌లో తన సత్తా చూపిస్తూ వచ్చారు. ‘మొహొబ్బతే’, ‘కభీ కుషీ కభీ గమ్‌’, ‘బగ్బాన్‌’, ‘అక్స్‌’, ‘బ్లాక్‌’, ‘దేవ్‌’, ‘బంటీ అవుర్‌ బబ్లీ’, ‘ఆగ్‌’, ‘భూత్‌ నాధ్‌’, ‘పా’, ‘కందహర్‌’, ‘పింక్‌’, ‘పీకు’ సినిమాలు అమితాబ్‌కు మంచి హిట్లు అందించాయి. అమితాబ్‌ కేవలం సినిమాలతోనే కాక ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తాజాగా అమితాబ్‌ ‘102 నాటౌట్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. దాదాపు ఆరుదశాబ్దాల సినిమా ప్రస్థానంలో అమితాబ్‌ ఇప్పటివరకు సుమారు 200పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.