సొగసుల ‘చిత్రం'
పదహారు సంవత్సరాలుగా ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే. అందులోనూ కొన్ని ప్రత్యేక పాత్రలు మాత్రమే పోషించింది. వాటిలో విజయం సాధించిని మరీ తక్కువ. అయితేనేం? ఆమె పేరు మాత్రం ఎప్పుడూ చిత్ర పరిశ్రమలో మార్మోగుతుంటుంది. ప్రాంతీయ పరిశ్రమల్లోనూ ఆమె పేరు చెబితే చాలు... టక్కున గుర్తుపట్టేస్తారు. అదే చిత్రాంగద సింగ్‌ ప్రత్యేకత. మోడలింగ్‌ నుంచి వెండితెరపైకి అడుగుపెట్టిన ఈ పొడగు కాళ్ల సుందరి నాలుగు పదులు వయసు దాటి కూడా ఇప్పటికీ కుర్రాళ్ల హృదయాల్లో సెగలు రేపుతోంది. తన అందంతో ఎదుటివారిని కట్టిపడేసే ఈ ముద్దగుమ్మ ప్రత్యేక పాత్రలు, గీతాలపై తనదైన ముద్రవేసింది. బాలీవుడ్‌లో అత్యంత అందమైన కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొన్న చిత్రాంగద సింగ్‌ ప్రయాణం వెనక పదినిసలు ‘సితార’ డిజిటల్‌ పాఠకుల కోసం...


* మీరట్‌ నుంచి...

స్వస్థలం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో (ఆగస్టు 20, 1976) జన్మించింది. తండ్రి ఉద్యోగ రీత్యా కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్థిరపడింది. అక్కడే చిత్రాంగద పెరిగి పెద్దయింది. న్యూఢిల్లీలోని ఐర్విన్‌ కళాశాలలో చదువుకొని హోమ్‌సైన్స్‌ నుండి డిగ్రీ పట్టా పుచ్చుకొంది. ఆ వెంటనే మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. పలు వాణిజ్య ప్రకటనలు చేయడంతో పాటు కొన్ని కార్పొరేట్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది.

* వీడియో ఆల్బమ్స్‌తో....
స్వతహాగా కథక్‌ నృత కళాకారిణి అయిన చిత్రాంగదకి నటనంటే ప్రాణం. అందుకే నటి కాకమునుపు వీడియో ఆల్బమ్స్‌లో ఆడిపాడింది. ప్రముఖ గాయకుడు అజిత్‌ భట్టాచార్యతో కలిసి ఓ వీడియోలో కనిపించింది. ఆ ఆల్బమ్‌లో తళుకుబెళుకులు చూసిన ఓ ప్రొడక్షన్‌ మేనేజర్‌ చిత్రాంగద గురించి ప్రముఖ దర్శకుడు సుధీర్‌మిశ్రాకి చెప్పాడు. దీంతో సుధీర్‌మిశ్రా తన ‘హజరాన్‌ ఖ్వాషే ఐసీ’ చిత్రంలో అవకాశమిచ్చారు. అంతే.. ఆ చిత్రంతో ఆమె పేరు పరిశ్రమలో మార్మోగిపోయింది. అటు విమర్శకులతో పాటు ఇటు ప్రేక్షకుల మెప్పు కూడా పొందిన ‘హజరాన్‌’తో చిత్రాంగదకి మంచి గుర్తింపు లభించింది. ఆమె ఒకప్పటి కథానాయిక స్మితాపాటిల్‌ని పోలి వుంటుందని బాలీవుడ్‌ వర్గాలు విశ్లేషిస్తుంటాయి. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ కూడా అదే విషయం చెబుతుంటారు.


* మధ్యలో విరామం...
తొలి చిత్రం విజయవంతం కాగానే వరుసగా అవకాశాలు వచ్చాయి. పలువురు అగ్ర దర్శకులు చిత్రాంగదని తమ సినిమా కోసం ఎంపిక చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆచితూచి 2005లో తన రెండో చిత్రంగా ‘కల్‌’ చేసింది. అందులో భావన అనే యువతి పాత్రను పోషించింది. అయితే ఆ చిత్రం ఏ రకంగానూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు చిత్రాంగద కూడా కుటుంబ పరిస్థితుల వల్ల విరామం తీసుకోవాలని నిర్ణయించుకొంది. మూడేళ్ల వరకు ఆమె మరే సినిమాకి సంతకం చేయలేదు. 2008లో మళ్లీ సంజయ్‌ సూరి సరసన ఓనిర్‌ దర్శకత్వంలో ‘సారీ భాయ్‌’ చేసింది. చిత్రాంగద రీ ఏంట్రీ అనే ప్రచారంతో ఆ సినిమాకి మంచి క్రేజ్‌ ఏర్పంది. అయితే... సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగాయి. దీంతో ఆ సినిమా దారుణంగా పరాజయాన్ని చవిచూసింది.


* ఐటెమ్‌ అదుర్స్‌....
విరామం తరువాత చేసిన సినిమా దారుణంగా పరాజయాన్ని చవిచూడటంతో చిత్రాంగద నిరుత్సాహానికి గురైంది. ఆ వెంటనే తేరుకొని మళ్లీ తనకు తొలి అవకాశాన్నిచ్చిన సుధీర్‌ దర్శకత్వంలో ‘యే సాలీ జిందగీ’లో నటించింది. గాయనిగా ఎదగాలనుకొన్న ఓ యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆ తరువాత ‘దేశీ బాయ్స్‌’లో నటించింది. అందులో చిత్ర ఎకనామిక్స్‌ టీచర్‌గా అక్షయ్‌కుమార్‌ సరసన నటించింది. వీరిద్దరూ కలిసి చేసిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. 2012లో అక్షయ్‌ కోసమే ఐటెమ్‌ భామ అవతారమెత్తింది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘జోకర్‌’లో ఐటెమ్‌భామగా ఆడిపాడి కుర్రకారును అలరించింది. ఆ తరువాత ‘ఐంకార్‌’, ‘ఐ మి జౌర్‌ మై’ చిత్రాలతో పాటు ‘కర్చియాన్‌’ అనే ఓ లఘచిత్రంలోనూ నటించింది.

* దక్షిణాదిలోకి....
ప్రాంతీయ పరిశ్రమలకీ చిత్రాంగద పేరు పరిచయమే. ఆమె తమ చిత్రాల కోసం ఎంపిక చేసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. కానీ ఆమె సుముఖత వ్యక్తం చేయేలేదు. నటుడు సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అంజాన్‌’లో ఓ ప్రత్యేక గీతం చేసింది. ఆ చిత్రం తెలుగులోనూ ‘సికిందర్‌’ పేరుతో విడుదల అయింది. అలాగే అక్షయ్‌కుమార్‌ కథానాయకుడుగా తెరకెక్కిన ‘గబ్బర్‌’లోనూ ఓ ప్రత్యేక గీతం చేసింది.


* విడిపోయింది...
ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు జ్యోతిసింగ్‌ రంధ్వాతో 2001లో పెళ్లి జరిగింది. పన్నెండేళ్లు కాపురం చేసిన ఈ జంట 2013లో విడిపోయింది. తరువాత వీరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. వీళ్లకి జొరావర్‌ రంధ్వా అనే ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం ప్రకటనలు, సినిమా అవకాశాలపైనే దృష్టి పెట్టింది చిత్ర.

* చీరకి అభిమానిని
టీనేజ్‌ అమ్మాయిలకి ఏమాత్రం తీసిపోనట్లుగా కనిపిస్తుంటుంది చిత్రాంగద సింగ్‌. ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి క్రమశిక్షతో కూడిన జీవితమే కారణం అని చెబుతుంటుందామె. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడపడమే నా బలం అంటోంది.

* చిత్ర చెబుతున్న కబుర్లివీ...


* బాదం పప్పు జ్యూస్‌తో నాకు రోజు మొదలవుతుంది.


* ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తాను. మితాహారంవల్లే అందం, ఆరోగ్యం సాధ్యమని నమ్ముతా.


* ఖాళీ సమయంలో సంగీతం వింటా, షాపింగ్‌ చేస్తుంటా, స్మిమ్మింగ్‌ చేయడంవంటివి కూడా నా హాబీల్లో భాగమయ్యాయి.


* గ్రిల్డ్‌ చికెన్‌ నాకు ఇష్టమైన ఆహారం.


* నాకు ఇష్టమైన ప్రదేశాలు బాలి, స్కాట్లాండ్‌. ఒక చోట వాతావరణం వేడిగా ఉంటుంది. మరో చోట చల్లగా ఉంటుంది.


* మీని స్కర్టు, కాటన్‌ శారీ... ఈ రెండూ పక్కపక్కన వుంటే నా ఓటు కాటన్‌ శారీకే. నా తొలి చిత్రంలో నేను చీరలో కనిపించిన విధానం నాకు బాగా నచ్చింది. అప్పుటి నుంచి చీరకి అభిమానినయ్యా.


* ప్రేమ, కుటుంబం, చేతిలో ఫోను... ఇవి లేకుండా నేను జీవితాన్ని ఊహించలేను.


* గోల్ఫ్‌ ఆటంటే చాలా ఇష్టం. ఆడతాను కూడా.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.