ఎ సీరియల్‌ కిస్సర్‌...ఇమ్రాన్‌ హష్మీ

నాయికల అరుణాధరాలపై ముద్దుల ముద్ర వేసే ఆనవాయితీ ఉన్న కథానాయకుడతడు. బాలీవుడ్‌ రొమాంటిక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అతడు. బింబాధరాల చుంబనాల వీక్షణకోసం ప్రేక్షకులు ఆయన సినిమాలకే ఎగబడతారు. ఎ సీరియల్‌ కిస్సర్‌గా వినోద ప్రపంచంలో విఖ్యాతి పొందిన ఈ కధానాయకుడి పుట్టిన రోజు మార్చి 24. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముద్దుల వీరుడు ఇమ్రాన్‌ హష్మీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.


ముద్దుల వెనుక విషాదం

ఇమ్రాన్‌ హష్మీ కెమెరా కూడా అసూయపడేలా కథానాయికల అధరామృత సేవనంలో తరిస్తారనే ప్రచారం విస్తృతంగా ఉంది. అయితే...ఆ ముద్దుల వెనుక ఉన్న విషాదం మాత్రం...ఆ కధానాయకుడి గుండె కింద తడికి మాత్రమే తెలుసు. ఔను... ఇది నిజం. సీరియల్‌ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్‌ హష్మీ రచయితగా తానూ అనుభవిస్తున్న విషాదాన్ని అక్షరాల్లోకి మలచారు. బిలాల్‌ సిద్ధిక్‌ సహా రచయితగా ఇమ్రాన్‌ హష్మీ రాసిన పుస్తకం పేరులోనూ కిస్‌ ఉంది. ‘ది కిస్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో రాసిన ఈ పుస్తకం ఆయన మనసుకు అక్షర దర్పణం. అయాన్‌ ఆయన తనయుడు. నాలుగేళ్ల ముద్దుల తనయుడు కాన్సర్‌తో పోరాడుతుంటే... చూడలేక నానా నరకయాతన అనుభవించిన ఇమ్రాన్‌ హష్మీ కాన్సర్‌పై పరిశోధన గ్రంధం లాంటి ‘ది కిస్‌ ఆఫ్‌ లైఫ్‌’ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం పుణ్యామా... కాన్సర్‌ గురించి సంపూర్ణ సమాచారం పాఠకులకు అందుతుంది. ఓ పక్క షూటింగ్‌లతో బిజీ షెడ్యూల్‌...మరో పక్క తనయుడు అయాన్‌తో కలసి హాస్పిటల్‌ కారిడార్లలో పచార్లు...ఇంకో పక్క...బాధను భరించలేని స్థితిలో భార్య పర్వీన్‌కి ఓదార్పు నివ్వడం... ఇలా పైకి ముద్దుల కోసం తపించే హీరోగా కనిపించినా... కన్రెప్పల్ని కాటేసే కన్నీళ్ళని గుండెల్లోనే అణచుకుంటూ...రీల్‌ హీరోగానే కాకుండా...రియల్‌ హీరోగా కూడా ఆత్మసైర్థ్యంతో నిలదొక్కుకున్నాడు. అంటే... కష్టాలు, కన్నీళ్లు, కడగండ్ల జడివానలో తడిసి ముద్దయినా... హీరోగా నిలుచోవాలన్న తపనే... ఇమ్రాన్‌ హష్మీ నుంచి నేర్చుకోవాల్సిన వ్యక్తిత్వ పాఠం.

ఇంటినిండా సినీ ప్రముఖులే

ఇమ్రాన్‌ హష్మీ 1979 మార్చి 24న ముంబాయిలో జన్మించాడు. తండ్రి సయ్యద్‌ అన్వర్‌ హష్మీ వ్యాపారవేత్త. తల్లి మెహరా హష్మీ గృహిణి. తండ్రికి కూడా సినిమాలంటే ఆసక్తి మెండు. ఆయన 1968లోని ‘బాహారొంకి మంజిల్‌’ చిత్రంలో నటించాడు. తండ్రి వారసత్వంగా ఇమ్రాన్‌ హష్మీ కూడా సినిమాల పట్ల అనురక్తి పెంచుకున్నాడు. ఇమ్రాన్‌ హష్మీ మాతామహుడు సయ్యద్‌ సాఖుట్‌ హష్మీ దేశ విభజన తరువాత పాకిస్థాన్‌కి తరలిపోయాడు. ఇమ్రాన్‌ హష్మీ అమ్మమ్మ మెహర్బానో మహ్మద్‌ అలీ కూడా సినిమాల్లో స్క్రీన్‌ పేరు పూర్ణిమ. ఆమె ఇండియా లోనే ఉంటూ పాకిస్థాన్‌ నుంచి విడివడి... నిర్మాత దర్శకుడైన భగవాన్‌ దాస్‌ని వివాహమాడింది. బాలీవుడ్‌ ప్రముఖులైన మహేష్‌ భట్, ముఖేష్‌ భట్‌ ఈమె పిల్లలే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ మోహిత్‌ సూరికి ఇమ్రాన్‌ హష్మీ కజిన్‌. పూజ భట్, అలియా భట్‌ కూడా ఇమ్రాన్‌ హష్మీకి కజిన్‌ సిస్టర్స్‌. అలా ఇమ్రాన్‌ ఇంట సినీ వాతావరణం మెండుగా ఉంది. ఇమ్రాన్‌ హష్మీ చదువు ముంబైలోని జమునా భాయ్‌ నర్సులే స్కూల్‌లో జరిగింది. డిగ్రీ చదువు కూడా జమునా భాయ్‌ కాలేజీలోనే జరిగింది. ముంబయ్‌ యూనివర్సిటీ నుంచి ఆయన బ్యాచలర్‌ డిగ్రీ పొందాడు.

వివాహం

2006 డిసెంబర్‌లో ఇమ్రాన్‌ హష్మీ ఆరున్నర సంవత్సరాల రిలేషన్‌ తరువాత తన స్వీట్‌ హార్ట్‌ పర్వీన్‌ సహానీని వివాహం చేసుకున్నారు. 2010 ఫిబ్రవరి 3న ఈ దంపతులకు అయాన్‌ హష్మీ జన్మించాడు. 2014 జనవరిలో అయాన్‌కి మొదటి దశ కాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉన్నా ... తనయుడు కాన్సర్‌ బారిన పడినందువల్ల మానసికంగా కృంగిపోయినా పైకి కనిపించనీయలేదు. కాన్సర్‌ గురించి తాను తెలుసుకున్న విషయాలను అక్షరీకరించిన పుస్తకం కిస్‌ ఆఫ్‌ లైఫ్‌ని 2016లో ఆవిష్కరించాడు.

రొటీన్‌కి భిన్నంగా ఇమ్రాన్‌ నటన

బాలీవుడ్‌ తెరపై ఇమ్రాన్‌ హష్మీ సరికొత్తగా ఎగిసిపడ్డ కెరటం. కింద పడడమే కాదు...తిరిగి లేచి ఉవ్వెత్తున ఎగిసిపడే ఓ అల. కొత్తగా పైటేసిన యువత కళ్ళల్లో మెరిసి మురిసే ఈస్టమన్‌ కలర్‌ ఫుల్‌ కల. ఇమ్రాన్‌ హష్మీ సినిమాలు ఆద్యంతం వినోదాత్మకమే కాకుండా ... హృదయాలలో కొన్నాళ్లపాటు గూడు కట్టుకుని ఉంటాయి. 2003లో ‘ఫుట్‌ పాత్‌’ ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకూ పలుసార్లు అవార్డులకు నామినేట్‌ అయిన నటుడు ఇమ్రాన్‌ హష్మీ. 2002లో హర్రర్‌ మూవీ రాజ్‌కి సహాయ దర్శకుడిగా పనిచేసాడు. 2004లో ‘మర్డర్‌’, 2005లో ‘జెహెర్‌’, ‘కలియుగ్‌’, ‘అక్సర్‌’, 2006లో ‘గ్యాంగ్‌స్టర్‌’, 2007లో ‘ఆవారా పాన్‌’ తదితర చిత్రాల ద్వారా ఇమ్రాన్‌ హష్మీ విలక్షణ నటనతో వీక్షకులను అలరించాడు. 2008లో ఇమ్రాన్‌ హష్మీ నట జీవితంలో మెచ్చు తునక అనదగ్గ సినిమా ‘జన్నత్‌’ వచ్చింది. ఈ క్రైం డ్రామాలో ఆయన తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. 2009లో ‘రాజ్‌...ది మిస్టరీ కంటిన్యూస్‌’, 2011లో సిల్క్‌ స్మిత జీవిత కదా ఆధారంగా రూపొందిన ‘ది డర్టీ పిక్చర్‌’ అదే సంవత్సరం సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘మర్డర్‌ 2’ ఆయనకు విశేష పేరు ప్రతిష్టలు తెచ్చాయి. 2012లో క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘జన్నత్‌2’, అదే సంవత్సరం ‘రాజ్‌ 3’, 2013లో ‘ఏక్‌ థీ దయాన్‌’ సినిమాలు చేశాడు. ఈ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు లెక్కకు మిక్కిలిగా వచ్చాయి. 2010లో అండర్‌ వరల్డ్‌ డ్రామా ‘వన్స్‌ అపాన్‌ టైం ఇన్‌ ముంబాయి’. 2012లో పొలిటికల్‌ థ్రిల్లర్‌ సంఘాయి చిత్రాల్లోనే నటనకు గాను ఫిలిం ఫేర్‌ అవార్డు కోసం ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఇమ్రాన్‌ హష్మీ పేరు నామినేషన్‌కి వెళ్ళింది.

ఆ తరువాత ఆయన నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో ఆశించిన విజయాల్ని నమోదు చేయడంలో విఫలం చెందాయి. అనంతరం బయోగ్రాఫికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘అజహర్‌’ ఆయన్ని గట్టెక్కించింది. 2015లో ‘హమారీ ఆదూరి కహాని’, 2016లో ‘రాజ్‌ రాబౌట్‌’ 2017లో ‘బాద్షా’ సినిమాలు ఇమ్రాన్‌ ఉనికిని నిరూపించాయి.



అవార్డులు

2005లో ‘మర్డర్‌’ సినిమాలో విలన్‌గా ప్రతిభ కనబరించినందుకు స్కీన్ర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. 2007లో ‘గ్యాంగ్‌స్టర్‌’లో విలన్‌గా ఉత్తమ నటన ప్రదర్శించినందుకు ఫిలింఫేర్, ఐఐ ఎఫ్‌ఏ అవార్డు కోసం నామినేట్‌ అయ్యాడు. ఇలా అనేక సినిమాల్లో నట ప్రతిభకు గాను ఫిలిం ఫేర్, స్కీన్ర్, జీ సినిమా అవార్డులు, స్టార్‌ డస్ట్‌ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యాడు.

- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌ 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.