అమ్మాయిల మదిలో గ్రీకువీరుడు!
ఎవరైనా తెరపై అతడి డ్యాన్స్‌ చూస్తే... ‘అబ్బ...ఏం చేశాడు రా.. ఒంట్లో ఎముకలు ఉన్నాయో లేవో!’ అని ఆశ్చర్యపోతారు...
కానీ అతను చిన్నతనంలో వెన్నుపూస సమస్యతో ఇబ్బంది పడ్డాడని తెలుసా!
ఇపుపడు తన వైవిధ్యమైన నటనతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా నిలచాడు...
ఇతడే బాల్యంలో నలుగురితో కలవడానికి ఇబ్బంది పడినవాడని తెలుసా!
నేడు వెండితెరపై పేజీల కొద్దీ ఉన్న డైలాగులనైనా అలవోకగా చెప్పగల ఆ హీరో...
చిన్నతనంలో నత్తితో బాధపడిన వాడని తెలిస్తే మరింత ఆశ్చర్యమేస్తుంది!
అతడు ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌హీరో హృతిక్‌ రోషన్‌.

article image

పుట్టుకతో చుట్టుముట్టిన అనేక లోపాలను పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో అధిగమించి నేడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సినీ కుటుంబం నుంచి వచ్చినా సొంత ప్రతిభతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు హృతిక్‌ రోషన్‌. అతను అమ్మాయిల మదిలో గ్రీకువీరుడు. ప్రపంచం మెచ్చిన అందగాడు. కండలు తిరిగిన ఆ దేహం యువకులకు ఓ స్ఫూర్తి మంత్రం.

* అందరికీ ఐదు.. హృతిక్‌కు ఆరు వేళ్లు!
హృతిక్‌ రోషన్‌ 1974 జనవరి 10న ముంబయిలో జన్మించాడు. తండ్రి రాకేష్‌ రోషన్‌ (బాలీవుడ్‌ నటుడు), తల్లి పింకీ రోషన్‌. హృతిక్‌ వాళ్లది సినీ నేపథ్యమున్న కుటుంబం. అతని తాత (తండ్రి తరపు) రోషన్‌ లాల్‌ సంగీత దర్శకుడు కాగా, మరో తాత (తల్లి తరపు) ఓం ప్రకాశ్‌ ప్రముఖ దర్శకులు. హృతిక్‌ చిన్నతనంలో ఎప్పుడూ ఒంటరిగా గడిపేవాడు. అతనికి పుట్టుకతోనే కుడిచేతికి అదనపు బొటన వేలుతో జన్మించాడు. దీంతో పిల్లలు అతన్ని ఆటపట్టించడం, ఎగతాలి చేయడం వంటివి చేసేవారు. అందుకే ఎవరితోనూ కలివిడిగా ఉండేవాడు కాదు. వీటితో పాటు నత్తి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాడు. తర్వాత కొన్నాళ్లకు స్పీచ్‌ థెరపీ సహాయంతో నత్తి సమస్య నుంచి బయట పడ్డాడు.

* తొలి పారితోషికం రూ.100...
హృతిక్‌ రోషన్‌ ఆరేళ్ల వయసులో ‘ఆశా’ (1980) చిత్రంతో తొలిసారి బాలీవుడ్‌లోకి బాలనటుడిగా అడుగుపెట్టాడు. తన తాత ఓం ప్రకాశ్‌ తీసిన ఈ సినిమాలో ఓపాటలో చిన్న డ్యాన్స్‌ చేశాడు హృతిక్‌. దీనికి తన తాత నుంచి హృతిక్‌ తీసుకున్న పారితోషికం రూ.100. వాస్తవానికి దీన్ని హృతిక్‌కు తెలియకుండా, రహస్యంగా కెమెరాలు పెట్టి చిత్రీకరించారట.

* హృతిక్‌ కనిపిస్తే చాలు సినిమా హిట్టు..
హృతిక్‌ అంటే ఇప్పుడు అందరికీ సెలబ్రిటీ కానీ చిన్నతనంలోనే అతను వాళ్లింట్లో ఓ పెద్ద సెలబ్రిటీ. ఎందుకంటే హృతిక్‌ను వాళ్లింట్లో అదృష్టంగా భావించేవారు. తను సినిమాలో కనిపిస్తే అది హిట్టవుతుందని నమ్మేవాళ్లు అందుకే డైలాగులు ఉన్నా లేకున్నా చిన్నపాత్రలోనైనా హృతిక్‌ను తెరపై చూపించేందుకు ఇష్టపడేవారట. అలా తండ్రి రాకేష్‌ తీసిన ‘ఆప్‌ కే దీవాన్‌’ (1980), తాత ఓం ప్రకాశ్‌ ‘ఆస్‌ పాస్‌’ (1981) చిత్రాల్లో చెప్పుకోవడానికి వీలు లేనంత చిన్నపాత్రల్లో కనిపించాడు హృతిక్‌.  హృతిక్‌ సంభాషణలను తొలిసారి వెండితెరపై వినిపించిన సినిమా ‘భగవాన్‌ దాదా’ (1986). ఓం ప్రకాశ్‌ తీసిన ఈ సినిమాతో 12 ఏళ్ల వయసులో హృతిక్‌ తన తొలి డైలాగును చెప్పాడు.

* టీ అందించడం నుంచి ఫ్లోర్‌ తుడవడం వరకు..
హృతిక్‌ సినిమాల్లోకి రావడానికి ముందు కొంతకాలం తండ్రి రాకేష్‌ రోషన్‌ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాడు. ఈ సందర్భంగా ఎడిటింగ్, లైటింగ్, కెమెరామెన్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇలా అన్ని విభాగాల్లో పనిచేశాడు. చివరికి టీ అందించడం ఫ్లోర్‌ తుడవడం వంటి పనులు కూడా చేశాడు. రాకేష్‌ దర్శకత్వం వహించిన ‘కింగ్‌ అంకుల్‌’(1993), ‘కరణ్‌ అర్జున్‌’ (1995), ‘కోయల్‌’ (1997) సినిమాలకు హృతిక్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

* హృతిక్‌ డ్యాన్స్‌ చేయలేడన్నారు..
నేడు బాలీవుడ్‌ కథానాయకుల్లో అద్భుతమైన డ్యాన్సర్‌గా పేరుతెచ్చుకున్న హృతిక్‌ను మొదట్లో డ్యాన్సుకు పనికిరాడనుకున్నారట. ఈ విషయం చెప్పింది డాక్టర్లు. అందరికీ వెన్నుపూస ‘ఎస్‌’ ఆకారంలో ఉంటే హృతిక్‌ది ‘సి’ ఆకృతిలో కొన్నిడిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉందట. దీనివల్ల అతను డ్యాన్సులు చేసేటప్పుడు క్లిష్టతరమైన భంగిమలు ప్రదర్శించలేడు. అలా చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ హృతిక్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో వివిధ రకాల కఠిన వ్యాయామాల ద్వారా ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు.


* తొలి సినిమాతోనే ఫిలింఫేర్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్
హృతిక్‌ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘కహో నా ప్యార్‌ హై’ (2000). దీనికి రాకేష్‌ రోషన్‌ దర్శకుడు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ఇందులో రోహిత్‌ మెహ్రాగా, రాజ్‌చోప్రాగా రెండు భిన్నపాత్రల్లో నటించిన హృతిక్‌.. అద్భుతమైన నటనను ప్రదర్శించి తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 11వ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాక అత్యధిక అవార్డులు (102) సాధించిన బాలీవుడ్‌ చిత్రంగానూ లిమ్మాబుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం సాధించింది. ఆ తర్వాత ‘ఫిజా’ (2001), ‘కభి ఖుషి ఖభీ గమ్‌’లతో కమర్షియల్‌ హిట్లందుకున్నాడు.

* క్రిష్‌ సిరీస్‌కు ప్రాణం.. ‘కోయి మిల్‌ గయా’
హాలీవుడ్‌లో స్పైడర్ మ్యాన్, సూపర్‌ మ్యాన్, బ్యాట్‌ మ్యాన్‌ ఇలా రకరకాల సూపర్‌ హీరోలున్నారు. మరి మనకు ఎవరున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన సినిమానే ‘కోయి.. మిల్‌ గయా’. 2003లో వచ్చిన ఈ చిత్రం హృతిక్‌ సినిమా కెరీర్‌ను మలుపు తిప్పడంతో పాటు మన దేశానికి ‘క్రిష్‌’ అనే సూపర్‌ హీరోను పరిచయం చేసింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘క్రిష్‌’ (2006), ‘క్రిష్‌ 3’ (2013) సినిమాలతో ప్రపంచానికి సరికొత్త సూపర్‌ హీరోను పరిచయం చేశాడు హృతిక్‌ రోషన్‌. ఇవి బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలు సాధించడంతో పాటు భారతీయ సినిమా శక్తిని హాలీవుడ్‌ స్థాయికి తీసుకువెళ్లాయి.

* విభిన్న పాత్రలు.. వైవిధ్యమైన నటన
చాలా మంది హీరోలకు లవర్‌బాయ్‌ అనో, యాక్షన్‌ హీరో అనో ఓ ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. హృతిక్‌ వీటికి అతీతం. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచి చూపిస్తుంటాడు. ‘ధూమ్‌ 2’లో దొంగగా విభిన్న రూపాల్లో కనువిందు చేసిన హృతిక్, ‘జోదా అక్బర్‌’ చిత్రంలో అక్బర్‌గా చారిత్రక కథానాయకుడిగా నటించి మెప్పించారు. ఈ రెండూ భారీ విజయాలనందుకున్నాయి. తర్వాత ‘గుజారిష్‌’లో చక్రాలకే కుర్చీకే పరిమతమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ తరహాలోనే ‘జిందగి నా మిలేగి దోబారా’, ‘అగ్నిపథ్‌’, ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ చిత్రాల్లో వైవిథ్యమైన పాత్రలు పోషించి విలక్షన కథానాయకుడిగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

* ఆకర్షణీయమైన నటుడు..
హృతిక్‌ రోషన్‌ తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు 6 ఫిలింఫేర్‌ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు. భారత్‌లోని అత్యంత ప్రభావవంతమైన ఫోర్బ్స్ వందమంది ప్రముఖుల జాబితాలో హృతిక్‌ ఒకరు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా హృతిక్‌కు పేరుంది. భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన కథానాయకుడిగా, ప్రపంచ అందగాడిగా పేరు ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.