ఒక్క విజయం తర్వాత ఇక్కట్ల ఇమ్రాన్‌ ఖాన్‌

మొదట్లో ఆయన వన్‌ ఫిలిం వండర్‌. తర్వాత్తర్వాత కొన్ని కమర్షియల్‌ మూవీస్‌ ద్వారా విజయాన్నందుకున్న నటుడు. బాలీవుడ్‌లో విఖ్యాతి గాంచిన స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్, డైరెక్టర్‌ మన్సూర్‌ ఖాన్‌ల మేనల్లుడు. అంతేనా? బాలీవుడ్‌ దర్శక నిర్మాత నజీర్‌ హుస్సేన్‌ మనమడు కూడా. తమ కుటుంబానికి చెందిన వాళ్లంతా చిత్రసీమలో ప్రవేశానికి ముందే... స్టూడియోలు, షూటింగ్‌ స్పాట్స్, సినీ వాతావరణంతో కొద్దో గొప్పో పరిచయం ఉన్నవాడు. సెవెంటీ ఎంఎం స్కీన్ర్‌ పై తనని చూసుకోవాలన్న తపన... తాత, మేనమామల స్పూర్తితో తానూ వెలిగిపోవాలని తాపత్రయంతో సినీ అరంగేట్రం చేసాడు. బాలనటుడిగా 1988లో ‘ఖయామత్‌ సే ఖయామత్‌’, ‘జో జీతా వహీ సికిందర్‌’ 1992లో సినిమాల ద్వారా కనిపించి... 2008లో ‘జానే తూ...యా జానేనా’ రొమాంటిక్‌ కామెడీ సినిమాలో యువహీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమా విజయవంతమయ్యాక...తరువాత వచ్చిన మరో రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోవడంలో వెనకపడిపోగా... మీడియా ఆయన సినీ కెరీర్‌ని విశ్లేషిస్తూ వన్‌ ఫిలిం వండర్‌గా ఆట పట్టించింది. ఆ యువనటుడు...ఇమ్రాన్‌ ఖాన్‌. ఆయన పుట్టిన రోజు జనవరి 13. ఎంత సినీ నేపథ్యం ఉన్నా హీరోగా వెలుగొందాలంటే సొంత ప్రతిభ కచ్చితంగా ఉండాల్సిందేనని నిరూపించి కొన్ని విజయవంతమైన చిత్రాల ద్వారా అభిమానుల గుండెల్లో స్థానం సంపాందించుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.


జాతిమతాలకతీత కుటుంబ కదంబం

ఇండో అమెరికన్‌ కల్చర్‌ ఇమ్రాన్‌ ఫామిలీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కులాలు, మతాలు, దేశాల సరిహద్దులు దాటిన కుటుంబ బంధం వారిది. ఇమ్రాన్‌ తండ్రి అనిల్‌ పాల్‌ ముస్లిం మహిళను వివాహమాడారు. ఆయన యూ ఎస్‌ కాలిఫోర్నియాలో యాహూ కంపెనీలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తల్లి సైకాలాజిస్ట్‌ నుజ్జత్‌ ఖాన్‌. ఇమ్రాన్‌ ఖాన్‌ విస్కాన్‌ సిన్‌ మాడిసన్‌లో 1983 జనవరి 13న పుట్టారు. ఇమ్రాన్‌ తాత బెంగాలీ అయినా బ్రిటిష్‌ మహిళను వివాహమాడారు. ఇమ్రాన్‌ తండ్రి సంప్రదాయ బెంగాలీ. తల్లి నుజ్జత్‌ ఖాన్‌ బాలీవుడ్‌ దర్శక నిర్మాత నజీర్‌ హుస్సేన్‌ కూతురు. డైరెక్టర్‌ మన్సూర్‌ ఖాన్‌ సోదరి. అమీర్‌ ఖాన్‌ నుజ్జత్‌ ఖాన్‌ కజిన్‌. ఇమ్రాన్‌ ఖాన్‌ చిన్నతనంలోనే ఇమ్రాన్‌ ఖాన్‌ తల్లి తండ్రులు విడిపోయారు. దాంతో, నుజ్జత్‌ ఖాన్‌ ముంబాయికి వచ్చేసింది. పెరిగి పెద్దవుతున్న తరుణంలో... సవితి తండ్రి రాజ్‌ జుత్‌ షీ తన ఆలనా పాలన చూశారాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబయ్‌ స్కాటిష్‌ స్కూల్‌లో చేరిన ఇమ్రాన్‌ ఖాన్‌ అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతే కాదు, మాట్లాడేందుకు కూడా జంకేవాడు. దాంతో... మాటలు తడబడేవి. దీని కారణంగా టీచర్ల ఆగ్రహానికి గురయ్యేవాడు. పరిస్థితిని గమనించిన పెద్దలు తమిళనాడు కూనూరులోని బ్లూ మౌంటెన్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు. బోర్డింగ్‌ స్కూల్‌ వాతావరణానికి నెమ్మదిగా అలవాటు పడుతున్న వేళలో... ప్రిన్సిపాల్‌ ఆ స్కూల్‌ని వదిలి వెళ్లిపోయారు. దాంతో, ఇమ్రాన్‌ ఖాన్‌తో సహా కొంత మంది విద్యార్థులు ఆ ప్రిసిపాల్‌తో పాటు ఊటీలోని గురుకుల్‌ పాఠశాలలో చేరారు. కొత్తగా పెట్టిన ఆ గురుకుల్‌లో విద్యుత్‌ సౌకర్యం లేదు. విద్యార్థులు ఎవరి దుస్తులు వారే ఉతుక్కోవాల్సి వచ్చేది. అలాగే, ఆహార పదార్ధాలు కూడా స్వయంగా చేసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తరచూ స్కూల్స్‌ మారడంతో ఇమ్రాన్‌ ఖాన్‌కి స్వతంత్రత వచ్చింది. అదే సమయంలో... ఒంటరితనం కూడా వేధించేది. తరువాత కాలిఫోర్నియాలో సన్నీవేల్‌లో చేరాడు. చిత్రాల్లో చేయాలనే అభిలాష మెండుగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ లాస్‌ ఏంజిల్స్‌లోని న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్‌లో డిగ్రీ తీసుకున్నారు. రైటింగ్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వంలో శిక్షణ పొందారు.

వ్యక్తిగతం

అవంతిక మాలిక్‌ని 2011 ఫిబ్రవరిలో ఇమ్రాన్‌ ఖాన్‌ వివాహమాడారు. పదేళ్ళపాటు ప్రేమలో ఉండి... ఆ తరువాత ఈ ఇద్దరూ పెళ్లాడారు. 2013 డిసెంబర్‌ 6న ఈ దంపతులకి కూతురు పుట్టింది. వివాద రహితంగా ప్రతి ఒక్కరితో స్నేహ బంధాన్ని కొనసాగించే ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యక్తిత్వం ఆకర్షణీయమైనదని ఆయన సన్నిహితులు చెప్తారు.

సినీ అరంగేట్రం

యాక్టింగ్‌ స్కూల్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటూనే రచయిత, దర్శకుడు అయినా అబ్బాస్‌ టైరేవాలెతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆయన...2008లో ‘జానే తూ...యా జానేనా’ రొమాంటిక్‌ కామెడీ సినిమాలో కీలక పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా విజయం సాధించింది. 54వ ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఇమ్రాన్‌ ఖాన్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ చిత్రం తరువాత సంజయ్‌ గాంధి జీవితాధారంగా రూపొందిన ‘కిడ్నాప్‌’ సినిమాలో కిడ్నాపర్‌ కబీర్‌ శర్మగా ఇమ్రాన్‌ ఖాన్‌ నటించారు. సంజయ్‌ దత్, మనీషా లంబా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పాత్ర జనాలకు చేరువ కాలేదు. సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. 2009లో ‘లాక్‌’ సినిమాలో ఇమ్రాన్‌ ఖాన్‌ నటించారు. ఈ సినిమాలో సంజయ్‌ దత్, శృతిహాసన్, మిదున్‌ చక్రవర్తి తదితరులున్నారు. ఈ సినిమా కూడా వైఫల్యాన్ని చవి చూసింది. వరుస వైఫల్యాలతో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌కి మీడియా ఇచ్చిన బిరుదు...వన్‌ ఫిలిం వండర్‌. అయితే, 2010లో ‘ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌’ వచ్చి కొత్త ఊపిరినిచ్చింది. ఆ తరువాత ‘బ్రేక్‌ కె బాద్‌’ సినిమాలో నటించినా చేదు అనుభవాన్ని మిగిల్చింది.

2011 నుంచి విజయాలు

2011 నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. బ్లాక్‌ కామెడీ మూవీ ‘ఢిల్లీ బెల్లి’, ‘మేరీ బ్రథర్‌ కి దుల్హû’Â, 2012లో ‘ఏక్‌ మై... ఏక్‌ తూ’, ‘మాత్రూ కీ బిజిలీ కా మండోలా’ సినిమాలు విడుదల అయ్యాయి. 2013కి ‘బొంబాయ్‌ టాకీస్‌’, ‘ఒన్స్‌ అపాన్‌ ఏ టైం ఇన్‌ ముంబాయి’, ‘దోబారా’, ‘గోరి తేరా ప్యార్‌ మే’, 2015లో ‘కట్టీ బట్టీ ’ చిత్రాల్లో నటించారు. 2018లో ‘మిషన్‌ మార్స్‌: కీప్‌ వాకింగ్‌ ఇండియా’ అనే షార్ట్‌ ఫిలింకి ఆయనే డైరెక్ట్‌ చేశారు.

అవార్డులు-పురస్కారాలు

2008లో ‘జానే తూ...యా జానేనా’ రొమాంటిక్‌ కామెడీ సినిమాకి గాను బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రానికి అప్సర ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ బెస్ట్‌ మేల్‌ డెబ్యూగా సత్కరించింది.


షబ్‌ సే ఫేవరేట్‌ ఖాన్‌ అవార్డ్స్‌ ద్వారా షబ్‌ సే నయా హీరో పురస్కారం దక్కింది. స్కీన్ర్‌ అవార్డ్స్‌ మోస్ట్‌ ప్రామిసింగ్‌ న్యూ కమర్‌ అవార్డుతోయ్‌ సత్కరించింది. స్టార్‌ డస్ట్, ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ, అప్సర ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్, ఏఎక్స్‌ఎన్‌ యాక్షన్‌ అవార్డ్స్...కిడ్నాప్‌ మూవీలో ఇమ్రాన్‌ ఖాన్‌ నటనకు గాను పురస్కారాలు లభించాయి. ‘ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌’కి నటనకి గాను స్కీన్ర్, స్టార్‌ డస్ట్‌ అవార్డులు లభించాయి. ‘ఢిల్లీ బెల్లి’, ‘ఏక్‌ మై... ఏక్‌ తూ’ సినిమాలకు కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ సంస్థల ద్వారా అవార్డులు అందుకున్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.