కల్కి చిలక
ఈఫిల్‌ టవర్‌ని నిలబెట్టిన ఇంజనీర్‌ వంశం. భారతీయతపై నమ్మకంతో ఇక్కడికొచ్చేసింది. భక్తితో ఇక్కడే స్థిరపడిపోయింది. ఆ వంశానికి చెందిన ఓ వారసురాలు... కల్కి కొచ్లిన్‌. ఇప్పుడు హిందీ తెరపై వెలుగులు విరజిమ్ముతోంది. తెల్లటి జుట్టు, మత్తెక్కించే కళ్లు, పెదాలపై చెదిరిపోని చిరునవ్వుతో ప్రత్యేకంగా కనిపిస్తుంది కల్కి కొచ్లిన్‌. ‘దేవ్‌ డి’తో హిందీ తెరకు పరిచయమైంది. ఒక్కో సినిమాకి ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ ప్రధాన కథానాయికగా రాణిస్తోంది. ‘స్కాలర్‌షిప్’తో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న కల్కికొచ్లిన్‌ జీవితం, ప్రస్థానం వెనుక విశేషాలివి.


ఫ్రాన్స్‌ సంతతి
ఊటీ దగ్గర్లోని కలాట్టి గ్రామంలో 1984లో జనవరి 10న జన్మించింది. తండ్రి పేరు జోయెల్‌ కొచ్లిన్‌. ఈయన ఫ్రాన్స్‌కి చెందినవారు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ భక్తుడిగా పుదుచ్చేరిలోని అరబిందో ఆశ్రమానికి వచ్చారు. అదే సమయంలోనే ఆశ్రమానికి వచ్చిన మరో భక్తురాలు ఫ్రాంకోజ్‌ ఆర్మండీతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని ఊటీ దగ్గరల్లోని కలాట్టి గ్రామంలో స్థిరపడ్డారు. రకరకాల వ్యాపారాలు చేశారు. ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌కి స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, ఈఫిల్‌ టవర్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు కొచ్లిన్‌ పూర్వీకుడు మోరిన్‌ కొచ్లిన్‌.

ఊటీలోనే...
బాల్యమంతా ఊటీలోనే గడిచింది. అక్కడి హెర్బన్‌ స్కూల్‌లో పాఠశాల విద్యని అభ్యసించింది. ఆ తరువాత అక్కడి యూనివర్సిటీ వెళ్లి ఉన్నత విద్య చదువుకోవడానికి తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లండన్‌ వెళ్ళిపోయింది. లండన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యని అభ్యసించింది. అక్కడే డ్రామా, ధియేటర్‌ ఆర్ట్స్‌కి సంబంధించిన చదువులు కూడా పూర్తి చేసింది. ‘ది బ్లూ రూమ్‌’, ‘ది డిస్ప్యూట్‌’ ‘ది రైజ్‌ ఆఫ్‌ ది వైల్‌ హంట్‌’ లాంటి నాటకాల్లో నటించి అనుభవాన్ని గడిచింది.


వేశ్యగా...
లండన్‌లో చదువులు పూర్తయ్యాక... ఇండియాకి వచ్చింది. నటనకి సంబంధించిన విద్యలన్నీ తెలిసుండడంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. తొలుతమోడల్‌గా పలు వ్యాపార ప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకొంది. బాలీవుడ్‌ వర్గాల్ని ప్రకటనలతోనే ఆకట్టుకుంది. ఆ సమయంలోనే అనురాగ్‌ కశ్యప్‌ ‘దేవ్‌ డి’ కోసం కల్కిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకొన్నాడు. అప్పటిదాకా తమిళం, ఇంగ్లీష్, ఫ్రెంచ్‌ బాషలు మాత్రమే మాట్లాడడం తెలిసిన కొచ్లిన్‌... ‘దేవ్‌ డి’ కోసం హిందీ కూడా నేర్చేసుకుంది. ఇందులో ఆమె చంద్రముఖి (చందా) అనే ఓ వేశ్య పాత్రలో నటించింది. వేశ్య పాత్ర కోసం ఆడిషన్స్‌ నిర్వహించడం ‘దేవ్‌ డి’ సినిమా విషయంలోనే జరిగిందని బాలీవుడ్‌ వర్గాలు ఇప్పటికీ మాట్లాడుకొంటుంటాయి.

వింత అనుభవం
‘దేవ్‌ డి’ విడుదలవ్వగానే అందులో చందా పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. బాలీవుడ్‌ జనాలు, వేశ్యగా కల్కి అభినయించిన విధానం చాల బాగుందని మెచ్చుకొన్నారు. అమాయకమైన యువతిగా కనిపిస్తూ పాత్రని రక్తికట్టించిందని విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ పాత్రకి లభించిన స్పందన గురించి ఇప్పటికీ ఆనందం వ్యక్తం చేస్తుంటుంది. కల్కి. నిజానికి అదొక వివాదాస్పదమైన పాత్ర. అనురాగ్‌ కశ్యప్‌లాంటి ఒక మంచి దర్శకుడు తీస్తున్న సినిమా కావడంతో ఒప్పుకొన్నా. తెరపై చాలా మంది వేశ్య పాత్రలు పోషించారు. కానీ వాటికి ఏమాత్రం పోలికలేని పాత్రని నేను పోషించాను. విటులను ఆకట్టుకోవడానికి ఏదేదో చేస్తూ కనిపిస్తుంటాయి. కొన్ని పాత్రలు ఇందులో మాత్రం అలా అస్సలు కనిపించను. కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి పాత్ర దొరకడం వింత అనుభూతినిచ్చిందని చెబుతుంది.


ప్రాధాన్యమున్న పాత్రల్లో..
2009లో ప్రారంభమైన కల్కి 2011లో ఊపందుకొంది. మద్యలో ‘ది ఫిల్మ్‌ ఎమోషనల్‌ అత్యాచార్‌’ అనే చిత్రాంలో మాత్రమే నటించింది. 2011లో మాత్రం ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ‘సైతాన్‌’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘దట్‌ గర్ల్‌ ఇన్‌ యెల్లో బూట్స్‌’, ‘మై ఫ్రెండ్‌ పింటో’ చిత్రాలు విడుదలై మంచి పేరు తీసుకొచ్చాయి. ‘సైతాన్‌’లో నటన విమర్శకుల్ని మెప్పించింది. ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రంలో అభయ్‌ డియోల్, హృతిక్‌ రోషన్, పర్హాన్‌ అక్తర్, కత్రినాకైఫ్‌ లాంటి తారల మధ్య నటించినా... కల్కికి చక్కటి గుర్తింపు లభించింది. కేవలం కధానాయికగానే నటించాలని కాకుండా... ప్రాధానమున్న పాత్రల్ని ఎంపిక చేసుకొని ప్రయాణం సాగించింది. ‘త్రిష్ణ’, ‘షాంఘై’, ‘ఏక్‌ ది దయాన్‌’, ‘యే జవానీ హై దివానీ’ తదితర చిత్రాల్లో కల్కి పాత్రలు గుర్తుండిపోతాయి. ‘హ్యాపీ ఎండింగ్‌’, ‘మార్గిరిటా ఎ స్ట్రా’, ‘జియా ఔర్‌ జియా’, ‘సెవెరింగ్‌ టైస్‌’ ‘రిబ్బన్‌’, ‘అజ్మాఇష్‌: ఏ జర్నీ త్రో ది సబ్‌కాంటినెంట్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రంలో నటించింది. ‘స్కాలర్‌ షిప్‌’, ‘గల్లీభాయ్‌’, ‘హాథీ మేరా సాథీ’లో తదితర చిత్రాల్లో నటించింది. అపుడప్పుడు బుల్లితెరలోనూ మెరుస్తుంది. వాటిలో చెప్పుకోదగినవి.. ‘కల్కి గ్రేట్‌ ఎస్కేప్‌’, ‘షాకర్స్‌’, ‘స్కోమ్‌’, ‘మేడిన్‌ హెవెన్‌’ల్లో కనిపించింది.
అనురాగతో పెళ్లి..
‘దేవ్‌ డి’ విడుదలయ్యాక రెండేళ్ల పాటు ఆ చిత్ర దర్శకుడు అనురాగ్‌ కశ్యíతో డేటింగ్‌ చేసింది. ఆ తరువాత 2011 ఏప్రిల్‌ 30న ఊటీలో అనురాగ్‌ని వివాహం చేసుకొంది. ఇద్దరూ కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే ఉన్నారు. అనురాగ్‌ తీసిన ‘దట్‌ గర్ల్‌ ఇన్‌ యెల్లో బూట్స్‌’ చిత్రంలో నటించింది. నవంబర్‌ 13, 2013న ఇద్దరు విడిపోతున్నట్లు మీడియాకు ఓ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే విడాకులు మాత్రం ముంబై ఫ్యామిలీ కోర్టు మే 9, 2015న మంజూరు చేసింది.


మరికొన్ని విషయాలు...

*నటిని కాకపోయుంటే క్రిమినల్‌ సైకాలజిస్ట్‌ని అయ్యుండేదాన్ని. ఎందుకంటే... మనుషుల ఆలోచనలు ఎప్పుడెలా మారుతుంటాయో తెలుసుకోవడమంటే నాకు చాలా ఇష్టం. ఒక నటిగా అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోవాలని ఉంటుంది.

*
వ్యక్తిగతంగా మాత్రం రొమాన్స్, కామెడీ కలగలసిన సినిమాలంటేనే ఇష్టం. గురుదత్‌ ‘ప్యాసా’ అంటే చాలా ఇష్టం. ఆ చిత్రం మళ్లీ తీస్తే అందులో భాగం కావాలని ఉంది.

*
కష్టపడే మనస్తత్వం ఉండాలి కానీ... బాలీవుడ్‌ చాలా అవకాశాల్ని ఇస్తుందని నమ్ముతుంటా. చాలా యేళ్లుగా ఇక్కడే గడుపుతున్నాను కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్నా.
* ఊటీకి దగ్గర్లో ఉన్న అమ్మావాళ్ల ఇంట్లో గడపమంటే నాకు చాలా ఇస్టం. అక్కడ మొబైల్‌ నెట్‌వర్క్‌ కూడా ఉండదు. సేదతీరడానికి, చదువుకోవడానికి అంతకంటే మంచి వాతావరణం ఇంకెక్కడా ఉండదేమో!

*
శ్రీఎఎమ్‌ ఫ్రెండ్‌ అంటుంటారు కదా. ఆ రకమైన ఫ్రెండ్‌ అంటే మా ఎదురింటావిడ కలిరాయ్‌. ఆమె రంగస్థల నటి. నాకు ఏం అవసరమొచ్చినా ఆమె దగ్గరికే పరిగెత్తుతా. నిద్రలోనైనా ఆవిడని లేపి సాయం కోరేంత చనువుంది.

*
వీధుల్లో ఆమె తినుబండారాలంటే నాకు చాలా ఇష్టం. ఢిల్లీలో స్ట్రీట్‌ఫుడ్‌ చాలా బాగుంటుంది. నేను గోల్‌గప్పాని ఎక్కువగా తింటుంటా.

*
లండన్‌లో చదువుకొనేటప్పుడు నా కాలేజీ ఫీజులకు డబ్బులు సొంతంగా సంపాదించుకొనేదాన్ని. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసేదాన్ని. నాకు సంబంధించి నేను అన్నీ సొంతంగా చేసుకున్నదంటే అప్పుడే.

*
స్విమ్మింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఖాళీ దొరికితే చాలు... స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేస్తా. ఫిట్‌నెస్‌ పేరుతో ఎప్పుడూ జిమ్‌లో గడపడమంటే నాకు అస్సలు ఇష్టముండదు. అప్పుడప్పుడు నడక, యోగాలాంటివి మాత్రం చేస్తుంటా.

*
దురదృష్టవశాత్తూ క్రమం తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనలేకపోతున్నా. ఈసారి ఓటేస్తే మాత్రం నోటా బటన్‌ నొక్కుతా. రాజకీయ పార్టీల నుంచి నేను కోరుకునే హామీ ఏంటంటే... 18 ఏళ్ళ వయసు వరకు అందరికీ ఉచిత విద్యని అందించాలి. మహిళలపై ఆకృత్యాలకి పాల్పడిన నేరస్థులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా శిక్ష విధించాలి. 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.