నేలపై జాబిలి...కరీనా కపూర్‌!
ఆకాశంలో జాబిలి నేలపై దిగివస్తే తనలానే ఉంటుందేమో అనేంత అందం..
గ్రీకు దేవత వీనస్‌ స్వయంగా చెక్కిందా అన్నట్టుండే సోయగం..
నడిచే అందమైన తాజ్‌మహల్‌ ఆమె రూపం..
ఆ సొగసు చూస్తే చాలు మనసుకు రెక్కలొస్తాయి..
తుళ్లిపడని గుండెల్ని కూడా కదిలించి కల్లోలపరుస్తుంది..
నటనలో భేష్‌.. డ్యాన్స్‌లో బెస్ట్‌.. ఆడియన్స్‌లో షేక్‌..
అందుకే కరీనా కపూర్‌ అంటే వన్నెచిన్నెలతో మాయలు చేసే వయ్యారి భామగా సినీ ప్రియుల హృదయాలలో చెరగని ముద్రవేసుకుంది..

article image

రొమాంటిక్‌ కామెడీ చిత్రాలైనా.. క్రైం డ్రామాలైనా.. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో అలరించిన ముద్దుగుమ్మ ఎవరంటే గుర్తొచ్చే తొలి పేరు కరీనా కపూరే. ఐటెంగీతాలతో కుర్రకారును ఉర్రూతలూగించాలన్నా.. ‘చమ్మక్‌ చల్లో’ అంటూ యువతరాన్ని చిందేయించాలన్నా వెండితెరపై కరీనా కపూర్‌ కనిపించాల్సిందే. అందుకే కరీనా అంటే దర్శక, నిర్మాతలకు కాసులు కురిపించే కనకలక్ష్మి. వయసెక్కువయ్యే కొద్దీ వైన్‌ మధురమన్నట్టుగా ముగ్ధమనోహర రూపంతో నేటికీ కుర్రకారు గుండెల్ని మెలిపెడుతునే ఉంటోంది కరీనా కపూర్‌. పెళ్లి చేసుకోని ఓ బిడ్డకు తల్లైనా.. యువ కథానాయికలకు దీటుగా అంతే చెరగని సోయగాలతో నేటికీ సినీ ప్రియులను కనువిందు చేస్తోంది కరీనా కపూర్‌. అందుకే నేటికీ ఆ పేరు వినిపించినా, తెరపై ఆ సౌందర్యరాశి కనిపించినా రెప్పవేయకుండా చూస్తుండిపోతారు సినీ ప్రియులు.

* ఐరెన్‌లెగ్‌ ముద్ర నుంచి వసూళ్ల కథానాయిక స్థాయి వరకు...
కరీనా కపూర్‌ వాళ్లది సినీ నేపథ్యమున్న కుటుంబం. ప్రముఖ బాలీవుడ్‌ నటులు రణధీర్‌ కపూర్, బబితాల కుమార్తె కరీనా. 1983 సెప్టెంబరు 21న ముంబయిలో జన్మించింది. కరీనా తాత (తండ్రికి తండ్రి) రాజ్‌కపూర్, అక్క కరిష్మా కపూర్‌ కూడా సినీ రంగంలోనే రాణించారు. ఆ వారసత్వం వల్లే బాల్యం నుంచే కరీనా సైతం తనకు తెలియకుండానే సినీ రంగంపై మక్కువ ఏర్పరచుకుంది. కరీనా తొలిసారి 2000లో ‘రెఫ్యూజీ’తో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో అక్రమంగా పాక్‌ తరలింపబడే యువకుడితో ప్రేమలో పడే బంగ్లాదేశ్‌ యువతిగా కరీనా చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ ఆమె నటనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తర్వాత ‘కభీ ఖుషీ కభీ గమ్‌’తో తొలిబ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. అయితే తర్వాత కొన్నాళ్లపాటు ఒకే తరహా పాత్రల్లో నటించిన ఆమె చిత్రాలు వరుస పరాజయాలు చవిచూడటంతో చిత్రపరిశ్రమలో కరీనాను ఐరెన్‌లెగ్‌గా చూసేవారు. ఆమె నటనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది విమర్శలు చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె నటించిన ‘చమేలీ’ (2003), ‘దేవ్‌’ (2004) చిత్ర విజయాలు కరీనా సినిమా కెరీర్‌కు ఎంతో ఊపునిచ్చాయి. ఇవి కరీనా సినీప్రయాణంలో మైలురాళ్లలా నిలిచాయి. ఇక ఇక్కడి నుంచి ‘ఓంకారా’, ‘జబ్‌ వియ్‌ మెట్‌’, ‘వియ్‌ ఆర్‌ ఫ్యామిలీ’, ‘కుర్బానా’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘బాడీగార్డ్‌’, ‘రావన్‌’, ‘భజరంగీ భాయీజాన్‌’, ‘తలాష్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లతో బాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి చేరుకున్నారు. వీటిలో చాలా చాలా వరకు వసూళ్లపరంగానూ రికార్డుల మోతమోగించాయి. కరీనా ‘కుర్బానా’, ‘ఓంకారా’, ‘రావన్‌’ చిత్రాల్లో తనదైన నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కొద్దిమంది ప్రముఖ కథానాయికల్లో ఒకరిగానూ వెలుగొందింది కరీనా కపూర్‌.

* నటి మాత్రమే కాదు.. రచయిత కూడా..
కరీనా కపూర్‌ ఇప్పటివరకు 10 ఫిలింఫేర్‌ నామినేషన్లకు గానూ 6 సార్లు పురస్కారాలను దక్కించుకొంది. ‘రెఫ్యూజీ’లోని నటనకు తొలి చిత్రంతోనే ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని గెలుచుకోగా, ‘చమేలీ’ (2003), ‘దేవ్‌’ (2004), ‘ఓంకారా’ (2006) సినిమాల్లోని నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకుంది. ఇక ‘జబ్‌ వియ్‌ మెట్‌’ (2007), ‘వియ్‌ ఆర్‌ ఫ్యామిలీ’ (2010) చిత్రాల్లోని నటనకు ఉత్తమ సహాయ నటిగానూ పురస్కారాలు దక్కించుకుంది కరీనా. కరీనా కేవలం నటిగానే కాక స్టేజ్ ఫెర్ఫార్మర్‌గా, రచయితగానూ పేరు తెచ్చుకుంది. రచయితగా ఇప్పటివరకు ఆమె రాసిన మూడు పుస్తకాల్లో ఒకటి ఆమె జీవిత చరిత్రకాగా మరో రెండు పోషక విలువలకు సంబంధించినవి. కరీనా 2012లో సైఫ్‌ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ తైమూర్‌ అలీఖాన్‌ అనే తనయుడు ఉన్నాడు. ఇటీవలే ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంతో కథానాయికగా రెండవ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టి సత్తా చాటింది.  ఈ నాయికా ప్రాధాన్య చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.130 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.