వన్నె తగ్గని అందం
మామూలుగా తెరపై ఓ కథానాయిక అందంగా కనిపించిందంటే ఏమనుకొంటాం? ‘ఆహా ఏం అందం..’ అంటూ మరో సారి ఆ సినిమా చూడటానికి వెళ్తాం. మాధురి దీక్షిత్‌ని తెరపై చూశాక కుర్రాళ్లంతా అలా అనుకొన్నారేమో కానీ..అమ్మాయిలు మాత్రం మేం కూడా అర్జంటుగా ఆమెలా అయిపోవాలని కలగన్నారు. ఆమె తెరపై చేసిన డ్యాన్సుల్ని నటననీ ఇంట్లో ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టారు. అందుకే ఏ చిత్ర పరిశ్రమకు వెళ్లి ఏ కొత్త కథానాయికని అడిగినా..‘నా అభిమాన కథానాయిక మాధురి దీక్షిత్‌’ అనే చెబుతుంది. డ్యాన్స్‌లో ఆమే, నటనలోనూ ఆమే మాకు ఆదర్శం అని సెలవిస్తుంది. ప్రేక్షకులపైనే కాకుండా నటులపై కూడా అంత ప్రభావం చూపింది మాధురి. ముఫ్పైఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న మాధురి దీక్షిత్‌లో ఇప్పటికీ వన్నె తగ్గలేదు. అదే అందం, అదే హుషారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మాధురీ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు..


* మరాఠా భామ
మరాఠీ భాష మాట్లాడే శంకర్, స్నేహలత దీక్షిత్‌ దంపతులకు (మే 15, 1967) జన్మించింది. చదువంతా డివైన్‌ చైల్డ్‌ హైస్కూల్, ముంబై యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం సాగించింది. తొలినాళ్లలో మైక్రోబయాలజిస్ట్‌ కావాలని కలగనేదట. కథక్‌ డ్యాన్స్‌లో తర్ఫీదు పొందిన మాధురికి కళలంటే ఎంతో ఆసక్తి. అదే చిత్రపరిశ్రమలోకి అడగుపెట్టేలా చేసింది.

* ఫ్లాప్‌..ఫ్లాప్‌...
1984లో ‘అబోధ్‌’ అనే చిత్రంతో తెరకి పరిచయమైంది. ఆ చిత్రం దారుణంగా పరాజయాన్ని చవిచూసింది. అయితే మాధురి నటనకి మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ‘ఆవారా బాప్‌’ అనే చిత్రంలో నటించింది. అది కూడా పరాజయం చవిచూసింది. 1986లోనూ ‘స్వాతి’, ‘మానవ్‌ హత్య’ అనే చిత్రాలు చేసింది. 1987లో ‘మోహ్రే’, ‘హిఫజత్‌’, ‘ఉత్తర్‌ దక్షిణ్‌’ చిత్రాల్లో మెరిసింది. అయినా జాతకం మారలేదు. ఆ చిత్రాలన్నీ పరాజయాన్ని చవిచూశాయి. ఓ దశలో ఫ్లాప్‌ హీరోయిన్‌ అనే ముద్ర కూడా వేశారు.
 

* మోహిని పాత్రలో..
తొలినాళ్లల్లో ఎన్ని పరాజయాలెదురైనా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఆమె అందం, నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడమే కారణం. ఒక దఫా పరాజయాల తరువాత ‘తేజాబ్‌’లో అనిల్‌కపూర్‌ సరసన నటించే అవకాశం దక్కించుకొంది. అందులో మోహిని పాత్రలో నటించింది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో ఇక తిరుగులేకుండా పోయింది. ఆ ఏడాది భారీ వసూళ్లు సాధించిన చిత్రంలో అదొకటి. మాధురి డ్యాన్సుల గురించి బాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పుకొన్నారు.
* 1990 తరువాత...
తొలి విజయం తరువాత మళ్లీ అనిల్‌కపూర్‌తోనే చేసింది. ‘రామ్‌లఖన్‌’, ‘ప్రేమ్‌ ప్రతిజ్ఞ’, ‘త్రిదేవ్‌’, ‘పరింద’ తదితర చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. 1990 నుంచి మాధురి హవా మొదలైంది. ‘దిల్‌’లో అమిర్‌ఖాన్‌ సరసన నటించింది. బాగా డబ్బున్న ఓ పొగరుబోతు అమ్మాయిగా మాధురి నటన అందరినీ ఆకట్టుకుంది. తరువాత బాలీవుడ్‌లోని అగ్రకథానాయిక హోదాని సంపాదించుకొంది. దీంతో సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్‌లాంటి స్టార్‌ కథానాయకలతో ‘సాజన్‌’ అనే చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ‘బేటా’, ‘ఖల్‌నాయక్‌’, అంజామ్‌’, హమ్‌ అప్‌కే హై కౌన్‌’, ‘గదర్‌’.ఇలా విజయపరంపర కొనసాగుతూనే వచ్చింది. ‘రాజా’, ‘యరానా’, ప్రేమ్‌గ్రంధ్‌’, ‘మృత్యుదంద్‌’, ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘వజూద్‌’, ‘అర్జూ’, ‘పుకార్‌’, ‘గజగామిని’, ‘యే రాస్తే హూ ప్యార్‌ కే’, ‘లజ్జా’ ‘దేవదాస్‌’ తదితర చిత్రాలు మాధురిలో సిసలైన నటిని ఆవిష్కరించాయి.


* ధక్‌ ధక్‌ గర్ల్‌
నటిగానే కాదు.. ఓ డ్యాన్స్‌ర్‌గా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది మాధురి. ఆమెని హిందీలో ముద్దుగా ధక్‌ ధక్‌ గర్ల్‌ అని పిలుచుకొంటుంటారు. ‘బేటా’ చిత్రంలో ధక్‌ ధక్‌ కర్నే లగా’ అనే పాటలో వేసిన స్టెప్పులు ఆమెకి ఈ ముద్దుపేరును తెచ్చిపెట్టింది. ‘తేజాబ్‌’లో ఏక్‌ దో తీన్‌... ‘శైలాబ్‌’లో హమ్‌కో ఆజ్‌ కల్‌ హై..., ‘హమ్‌ అప్‌కే హై కౌన్‌’లో దీదీ తేరా దేవర్‌ దీవానా, ‘ఖల్‌ నాయక్‌’లో చోలీకే పీచే క్యా హై.., ‘రాజా’లో అఖియా మిలాన్‌..లాంటి గీతాలు మాధురిలోని ఓ కొత్త అందాన్ని ఆవిష్కరించాయి. ఆ పాటల్లో అందం, నృత్యాల్ని చూడటానికే ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లేవారంటే అతియో శక్తి కాదు. స్వతహాగా డ్యాన్స్‌ అంటే ప్రాణం ఇచ్చే మాధరికి ఆసక్తి ఉన్నవారికోసం ఆన్‌లైన్‌లో డ్యాన్స్‌ అకాడమీని నిర్వహిస్తోంది.

                                 

* తిరిగొచ్చింది...
సుమారు పదిహేనేళ్లపాటు హిందీ చిత్రసీమలో స్టార్‌ కథానాయికగా వెలిగింది మాధురి. అగ్రకథానాయకులందరూ ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తిచూపేవారు. 1999లో వైద్యుడు శ్రీరామ్‌ నెనెని వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. వివాహం తరువాత కూడా రెండు మూడు చిత్రాల్లో నటించిన ఆమె ఆ తరువాత సినిమాలకి దూరమైంది. దశాబ్ద కాలంపాటు అమెరికాలోనే గడిపిన ఆమె ఇద్దరులకు తల్లైంది. 2006లో ‘ఆజా నాచ్‌లే’ చిత్రం కోసం మళ్లీ ఇండియా వచ్చింది. ఆ చిత్రం అనుకొన్న స్థాయిలో ఆదరణ పొందకపోయినా..నటన, అందంలో మాత్రం వన్నెతగ్గలేదని నిరూపించింది. 2011లో ఆమె తల్లితండ్రులను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో ముంబైకి మకాం మార్చింది.

* మళ్లీ బిజీ...
అమెరికా నుంచి వచ్చాక పలు రియాల్టీ షోలలో పాల్గొన్న మాధురి..‘గులాబ్‌ గ్యాంగ్‌’, ‘దేడ్‌ ఇష్కియా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 2018లో ‘బకెట్‌ లిస్ట్‌’, ‘టోటల్‌ ధమాల్‌’లో (2019) నటించింది. ‘మోగ్లీ: ది లెజెండ్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ నిశా పాత్రకు హిందీ డబ్బింగ్‌ చెప్పింది. ఈ మధ్యనే తెరపైకొచ్చిన ‘కళంక్‌’ చిత్రంలో బహార్‌ బేగమ్‌గా నటించింది.* మాధురి మనసులోని మాటలు..

* నటిగా కెరీర్‌ని మొదలుపెట్టడం నా జీవితంలో కీలక మలపు.

* చిన్నప్పుడు నేను ఓ పెద్ద వాగుడుకాయని. ఛాటర్‌ బాక్స్‌లా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేదాన్ని. ‘షోలే’లో బసంతి పాత్ర, నేను ఒకటే అని చెప్పొచ్చు.

* డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ పేరుతో స్కూల్‌ హోమ్‌ వర్క్‌ తప్పించుకొనేదాన్ని. ఆ విషయం ఇంట్లోవాళ్లకి, స్కూల్‌ టీచర్లకు ఎన్ని అబద్ధాలు చెప్పానో లేక్కేలేదు.

* నేను వర్తమానంలో బతకడానికి ఇష్టపడతాను. భవిష్యత్తు గురించి ఆలోచించడానికి నా మనసు ఎప్పుడూ ఒప్పుకోదు.

* నా సినిమాల్లో చెప్పుకోదగిన పాటలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో నాకు ఎప్పుడూ గుర్తొచ్చే పాట ‘ఆబోద్‌’లో ఘని ఘని అమారియా.

* నాకు ఇలాంటి వాడు భర్తగా రావాలని ఎప్పుడూ కలగనేదాన్ని కాదు. కాకపోతే..‘తొలి చూపులోనే ఇతను నాకోసమే పుట్టాడనిపించాలి’ అనుకోనేదాన్ని. ఓ వేడుకలో శ్రీరామ్‌ నెనెని చూశాక అదే అనిపించింది. అతనే నా జీవిత భాగస్వామి అయ్యాడు.

* మా ఆయనకి నేను ఇచ్చిన ఓ ఆశ్చర్యకరమైన బహుమతి ఏంటంటే..మా రెండో అబ్బాయి.

* కాలంతో పోటీపడటం నాకు చాలా ఇష్టం. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. మా ఆయనకి సాంకేతిక విషయాలపై చక్కటి అవగాహన ఉంది. ఆయనకి ఇది వరకు ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీ ఉండేది. తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.