బుసలుకొట్టిన అందం
మల్లిక అంటే ఓ మంత్రం. అందాల మంత్రం. ఆమె తెరపై హోయలు పోయిందంటే చాలు..కుర్రకారు పనీపాట వదిలేసి థియేటర్‌లో వాలిపోవాల్సిందే. అంతగా ఆకర్షించింది. బాలీవుడ్‌ బాక్సాఫీసుని వసూళ్లతో మురిపించింది. నిజానికి..బాలీవుడ్‌ అందాలు కొత్తకాదు. ఎక్కడ ఏ అందం కనిపించినా..తనవైపులాగేసింది. అయితే మల్లిక అందాన్ని చూసి బాలీవుడ్‌ సైతం విస్తుపోయింది. ఆమె పది నిమిషాలు ఆడిపాడటం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరించారు. ఆ అందాల్ని ఆస్వాదిస్తామని హాలీవుడ్‌ వర్గాలు సైతం పోటీపడ్డాయి. ఇటు చైనా నుంచి జాకీచాన్‌ వచ్చేశాడు. అటు అమెరికా నుంచి బ్రూనో మార్స్‌ వచ్చాడు. మల్లిక అందాన్ని తమ కెమెరాల్లో బంధించి ఆస్వాదించారు. తమ ప్రేక్షకులకూ వినోదాన్ని పంచారు. హర్యానాలో ఓ మారుమూలన పుట్టి పెరిగిన మల్లిక ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకల్ని అలరించింది. మల్లికా శెరావత్‌ ప్రయాణం గురించి కొన్ని విషయాలు.  
                                                                             

చిన్నప్పట్నుంచే..
హర్యానాలోని సేథ్‌ చాజు రామ్‌ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. జాట్స్‌ వర్గానికి చెందిన ఆ కుటుంబంలోనే 24 అక్టోబర్ 1976న జన్మించింది మల్లిక. తండ్రి ముఖేష్‌ కుమార్‌ లాంబా. సొంత ఊరు రొహ్తక్‌. మధుర రోడ్‌ని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకొంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫిలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పట్నుంచి స్వతంత్ర భావాలతో పెరిగింది.

మల్లిక కాదు..రీమా
మల్లికా శెరావత్‌ అసలు పేరు రీమా లాంబా. రీమా పేరుతో చాలామంది కథానాయికలు ఉన్నారని తను మల్లికా శెరావత్‌ అని మార్చుకొంది. మల్లిక అనేది తన సొంత ఆలోచనే అయినా..శెరావత్‌ అన్నది మాత్రం మల్లికా తల్లి ఇంటి పేరట. తన ఇష్టాయిష్టాలను తెలుసుకొని నటిగా ఎదగడానికి తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతుంటుంది మల్లిక. అందుకే ఆమె ఇంటి పేరును తన పేరు చివర చేర్చుకొందట.

గాల్లో తేలింది..
నటి కాకుముందు..మల్లికా శెరావత్‌ ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసిందని చెబుతుంటారు. ఆమె కొన్నాళ్లపాటు ఆ వృత్తిలో కొనసాగింది. అక్కడే తనకి సినీయర్‌ కెప్టెన్‌గా పనిచేసిన కరణ్‌సింగ్‌ గిల్‌ని వివాహం చేసుకొంది. ఆ తరువాత మోడలింగ్‌ రంగంపై దృష్టి పెట్టింది. షారుఖ్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌లాంటి కథానాయకులతో కలిసి వ్యాపార ప్రకటనల్లో నటించే అవకాశం అందుకొంది.   
                                                                           

తొలి అవకాశం..
మోడలింగ్‌ రంగంలో కొనసాగుతూనే సినిమా అవకాశాలపై దృష్టి పెట్టింది మల్లిక. 2002లో ‘జీనా సిర్ఫ్‌ మేరే0 లియే’ అనే చిత్రంలో తొలి అవకాశాన్ని అందుకొంది. అందులో కనిపించేది కొద్దిసేపే అయినా..మల్లిక పరిశ్రమ దృష్టిని బాగా ఆకర్షించింది. దీంతో అవకాశాలు వరుసకట్టాయి.

సెక్సీ సింబల్‌..
మల్లిక హవా 2003 నుంచి మొదలైందని చెప్పొచ్చు. ఆమె నటించిన ‘ఖ్వాషిప్‌’ చిత్రం అదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఘన విజయం సాధించింది. ఆ వెంటనే ‘మర్డర్‌’లో నటించింది. అందులో మల్లిక..ఇమ్రాన్‌ హస్మీతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. మల్లిక ‘సెక్స్‌ సింబల్‌’ అనే గుర్తింపు ఈ చిత్రంతోనే సొంతం చేసుకొంది. అప్పట్లో మల్లిక నటనపై కొద్దిమంది విమర్శలు కూడా వ్యక్తం చేశారు.
                                                                                   


అడ్డుకున్నారు..
మల్లికా శెరావత్‌ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడం కుటుంబంలో ఎవ్వరికి ఇష్టం లేదు. హర్యానాలోని పేరున్న కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు సినిమా రంగంలోకి వెళ్లకుండా తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే మల్లిక మాత్రం వారందరిని ప్రతిఘటించి ముంబై చేరుకుంది. ఒకానొక దశలో కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకొందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతుంటాయి. తొలినాళ్లలో సొంతూరికి చెందిన ప్రజలు కూడా మల్లికని తిరస్కరించారని అంటుంటారు. ఆమె నటిగా పేరు తెచ్చుకొన్నాక..మళ్లీ కుటుంబం దగ్గరైంది.

నటిని కూడా..
తెరపై ఆమె కనిపించిన విధానం చూసి అందరూ సెక్స్‌ సింబల్‌ అన్నారు. అయితే మల్లిక కేవలం అందాన్నే నమ్ముకోలేదు. తను చేసే ప్రతి సినిమాలోనూ నటిగా కూడా చక్కటి ప్రతిభ కనబరిచింది. భావోద్వేగాలు పండించడంలో తిరుగులేని నటిగా గుర్తింపును సంపాదించింది. ‘ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘వెల్‌కమ్‌’, ‘అగ్లీ ఔర్‌ పగ్లి’, ‘మన్‌ గాయే మొఘల్‌ ఏ అజమ్‌’, ‘డబుల్‌ ధమాల్‌’ తదితర చిత్రాల్లో మల్లిక నటనను విమర్శకుల ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ‘ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’ చిత్రంలో ఆమె నటినకి మంచి ప్రశంసలు దక్కాయి.

ఐటెమ్‌ అదరహో..
మణిరత్నం..‘గురు’లో మయ్యా మయ్యా..అనే ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ తరువాత ‘థ్యాంక్యూ’, ‘బిన్‌ బులాయే బంటి’, ‘తేజ్‌’ తదితర చిత్రాల్లో ఆమె చేసిన ప్రత్యేక గీతాలు ఎంతగానో అలరించాయి. మల్లిక ఆడిపాడితే సినిమా తప్పకుండా విజయం సాధింస్తుందని పరిశ్రమ వర్గాలు అప్పట్లో అభిప్రాయపడేవి. ఆమెకోసం దర్శకనిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి కనిపించేది. ‘ఆప్‌ కా సురూర్‌’ చిత్రంలో పదినిమిషాల పాత్ర కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు పారితోషికం తీసుకుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతుంటాయి. దక్షిణాదిలో ‘దశవతారం’, ‘ఓస్తే’ చిత్రాల్లో మల్లిక నటించింది.          
                                                                                        

అంతర్జాతీయ స్థాయిలో..
తొలి అడుగుల్లోనే అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది మల్లిక. 2005లో ‘ది మిథ్‌’ అనే చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించింది. అందులో భారతీయ యువతిగానే కనిపించింది. నదిలో పడిన జాకీచాన్‌ని రక్షించే పాత్ర అది. ఆ చిత్రంతో మల్లికకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆ తరువాత ‘హిస్‌’, ‘పాలిటిక్స్‌ లవ్‌’ తదితర చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకొంది. ‘హిస్‌’ చిత్రం కోసం నిజమైన పాములతో సహవాసం చేస్తూ నటించింది. ఆ చిత్రం ప్రచారం కోసం కేన్స్‌ చిత్రోత్సవాలకు వెళ్లింది. అక్కడ కూడా నిజమైన పాములను తన మెడకు చుట్టుకొని సినిమాకి ప్రచారం చేసింది. అమెరికాలో గౌరవ పౌరసత్వాన్ని పొందింది మల్లిక. ఆమె నటనతో పాటు అక్కడ చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకుగానూ అమెరికా ప్రభుత్వం మల్లికకి అమెరికా గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది.

                                                                                    
                                                                

జోరు తగ్గింది...
తొలినాళ్లతో పోలిస్తే..మల్లిక హవా ఇప్పుడు బాగా తగ్గింది. 2011 వరకు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన మల్లికా ఆ తరువాత మాత్రం అవకాశాలు తక్కువయ్యాయి. చేసిన సినిమాలు సరైన ఆదరణ పొందకపోవడం, మల్లిక ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులంటూ అమెరికా వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. ‘తేజ్‌’, ‘కిస్మత్‌ లవ్‌ పైసా ఢిల్లీ’, ‘డర్టీ పాలిటిక్స్‌’, ‘టైమ్‌ రైడర్స్‌’ అనే చైనా చిత్రంలో (2016), ‘జీనత్‌’ (2017)లో చేసింది.  ప్రస్తుతం ‘బూ సబ్‌ కీ ఫతేగి’ అనే వెబ్‌ సీరీస్‌లో నటిస్తుంది.

విజయ్‌సింగ్‌తో...
‘ది బ్యాచిలరేట్‌ ఇండియా..మేరీ ఖయాలన్‌ కీ మల్లికా’ పేరుతో ఓ రియాలిటి షోకి హోస్ట్‌గా వ్యవహరించింది మల్లిక. ‘లైఫ్‌ ఓకే’ ఛానలో ప్రసామైంది ఆ కార్యక్రమం. అందులో లండన్‌ స్థిరపడ్డ భారతీయుడు విజయ్‌సింగ్‌ తన జీవిత భాగస్వామిగా మల్లికా శెరావత్‌ని ఎంచుకొన్నారు. ‘హవేళి ఫైవ్‌-ఓ’ టెలివిజన్‌ షో కూడా చేసింది. తొలుత పెళ్లిచేసుకొన్న కరణ్‌సింగ్‌ గిల్‌తో మల్లిక ఇది వరకే విడిపోయింది. 2014 సంవత్సరంలో 65 ఐక్యరాజ్య సమితి (డిపిఐ/ఎన్‌జీఓ) కాన్పరెన్స్‌లో మహిళ హక్కుల గురించి చర్చించింది మల్లిక. ఈ మధ్యనే ఇండియాకు మద్ధతుగా కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ (2018)లో మహిళా హక్కుల కోసం ‘ఫ్రీ గర్ల్‌ ఇండియా ఎన్‌జీఓ సంస్థ తరపున హాజరై తన గళాన్ని వినిపించింది మల్లిక.

                                                                                                                                                                 - నర్సిమ్‌ ఎర్రకోట


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.