కలల రాకుమారుడు...సల్మాన్‌ ఖాన్‌
అతడు అమ్మాయిల గుండెల్లో కలల రాకుమారుడు.. .
కానీ నేటికీ మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచిలరే...
యాభై ఏళ్లు వయసైనా... నేటికీ పాతికేళ్ల కుర్రాళ్లకు ఆరాధ్య దైవమే...
కొంచెం కండలు పెంచిన ఏ కుర్రాడు కనిపించినా... అరే సల్మాన్‌లా భలే ఉన్నావురా అని అనాలనిపిస్తుంది...
కండలు తిరిగిన దేహంతో కథానాయకుడి రూపానికి ఓ కొలమానం చూపించిందాయనే...
అందుకే అభిమానుల మదిలో సల్లూ భాయ్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
సహాయ నటుడిగా తెరంగేట్రం చేసి తనదైన నటనతో చలన చిత్ర రంగంలో చెరగని ముద్ర వేశాడు సల్మాన్‌ ఖాన్‌. కేవలం నటుడిగానే కాక నిర్మాతగా, గాయకుడిగా, బుల్లితెర వ్యాఖ్యాతగా విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నాడు సల్మాన్‌.


* అది సల్మాన్‌ పూర్తిపేరు..
సల్మాన్‌ ఖాన్‌ 1965 డిసెంబర్‌ 27న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు. తండ్రి సలీమ్‌ ఖాన్‌ (ప్రముఖ స్క్రీన్‌ రచయిత), తల్లి సుశీల చరక్‌. తండ్రి ఆప్ఘనిస్థాన్‌కు చెందిన పఠాన్‌ కుటుంబానికి చెందిన వారు కాగా తల్లి మహారాష్ట్రకు చెందిన వారు. వివాహానంతరం సల్మాన్‌ తల్లి తన పేరును సల్మా ఖాన్‌గా మార్చుకుంది. సల్మాన్‌ మాత్రం తనని తాను హిందూగానూ, ముస్లింగానూ చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఇంతకి సల్మాన్‌ ఖాన్‌ పూర్తి పేరేంటో తెలుసా.. అబ్దుల్‌ రషీద్‌ సలీం సల్మాన్‌ ఖాన్‌.

* సహాయ నటుడిగా.. అరువు గొంతుతో!
సల్మాన్‌ ఖాన్‌ తొలుత సినీ రంగప్రవేశం చేసింది సహాయనటుడిగా. 1988లో వచ్చిన ‘బివి హోతో అయిసీ’తో సల్మాన్‌ తొలిసారి వెండితెరపై సందడి చేశారు. కాకపోతే తన సొంతగొంతును మాత్రం సినిమాలో వినిపించలేకపోయాడు. అతని పాత్రకు వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు.


* 2 కోట్లతో తెరకెక్కిన తొలి సినిమాకు.. 28 కోట్లు!
‘బివి హోతో అయిసీ’ తర్వాత సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘మైనే ప్యార్‌ కియా’. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 1989లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.28 కోట్ల వసూళ్లను రాబట్టి అప్పటి స్టార్‌ హీరోలందరినీ ఆశ్చర్యపరిచింది. 80ల్లో వచ్చిన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే సల్మాన్‌ ఖాన్‌కు తిరుగులేని విజయాన్నందించింది. ఈ సినిమాలోని పాటలకు విపరీతమైన ఆదరణ లభించిందంటే.. బాలీవుడ్‌లో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన మ్యూజిక్‌ ఆల్బమ్‌ (1 కోటి)గా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు మొత్తం 6 ఫిలింఫేర్‌ అవార్డులు దక్కగా.. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకున్నాడు సల్మాన్‌ ఖాన్‌. ఇది తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో విడుదలై ఆరు సెంటర్లలో వందరోజులు పూర్తిచేసుకుంది. విశాఖపట్నంలో ఏకంగా 25వారాల పాటు ఆడిందీ చిత్రం.

* వరుస హిట్లతో స్టార్‌ హీరోగా..
మొదటి సినిమాతోనే బాలీవుడ్‌ను ఆకర్షించిన సల్మాన్, తర్వాత ‘పత్తర్‌ కే పూల్‌’ (1991), ‘భాగీ: ఎ రెబల్‌ ఫర్‌ లవ్‌’ (1990), ‘సనమ్‌ బెవాఫా’, ‘కుర్‌బాన్‌’ చిత్రాలతో వరుస హిట్లు అందుకొని బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


* సూరజ్‌తో రెండోసారి.. మూడు ఫిల్మింఫేర్లు..
హీరోగా తొలి అడుగులోనే సల్మాన్‌ ఖాన్‌కు ‘మైనే ప్యార్‌ కియా’తో భారీ హిట్టు అందించిన దర్శకుడు సూరజ్‌ ఆర్‌.బర్‌జాత్యా. వీరిద్దరి కలయికలో వచ్చిన రెండవ సినిమా ‘హమ్‌ ఆప్కే హైన్‌ కౌన్‌..!’. 1995లో విడుదలైన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా రెండవసారి ఫిలింఫేర్‌ అవార్డును తీసుకున్నాడు సల్మాన్‌ ఖాన్‌. దీనికి మూడు ఫిలింఫేర్‌ పురస్కారాలతో పాటు ఒక జాతీయ అవార్డు దక్కాయి. కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.

* సంజయ్‌ లీలాతో రెండు...
ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. వీటిలో ‘కామోషి: ది మ్యూజికల్‌’ పరాజయాన్ని చవిచూడగా.. ‘హమ్‌ దిల్‌ దె చుకే సనమ్‌’ భారీ విజయాన్నందుకుంది. రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలై రూ.51 కోట్ల కలెక్షన్లను సాధించింది.


* తొలిసారి తెలుగు రీమేక్‌లో..
సాధారణంగా హిందీలో హిట్టయిన సినిమాలను తెలుగు కథానాయకులు రీమేక్‌ చేస్తుంటారు. కానీ సల్మాన్‌ తొలిసారి ఓ తెలుగు సినిమా రీమేక్‌లో నటించి భారీ విజయాన్నందుకున్నాడు. ప్రిన్స్‌ మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ చిత్రాన్ని సల్మాన్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌లో ‘వాంటెడ్‌’గా ప్రభుదేవా తెరకెక్కించారు. 2009లో విడుదలైన ఈ చిత్రం సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్టుగా నిలిచింది.

* తొలివారంలో అత్యధిక కలెక్షన్లు..
సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో ‘దబాంగ్‌’ ఓ మైలురాయి. 2010లో విడుదలైన ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా తొలివారంలోనే రూ.808.7 మిలియన్ల వసూళ్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు సల్మాన్‌. దీనికి మొత్తం రూ.2.15 బిలియన్‌ వసూళ్లు లభించాయి. నిజాయితీ, ధైర్యం కలిగిన పోలీసు అధికారిగా సరదాగా కనిపిస్తూ.. సల్మాన్‌ ఇందులో చేసిన సందడికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇది ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడంతో పాటు పలు అవార్డులను అందుకుంది. సినిమా తెలుగులో ‘గబ్బర్‌ సింగ్‌’గా రీమేక్‌ అయి వరుస అపజయాలతో డీలా పడిన పవన్‌ కెరీర్‌కు భారీ హిట్టును అందించింది. అయితే ‘దబాంగ్‌’ సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ బాలీవుడ్‌లో విజయం సాధించగా.. తెలుగు రీమేక్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సల్మాన్‌ ఖాన్‌ తర్వాత ‘రెడీ’, ‘బాడీగార్డ్‌’, ‘ఏక్తా టైగర్‌’ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు.


*తొమిదేళ్లపాటు అత్యధిక వసూళ్లు..
బాలీవుడ్‌లో తొమ్మిదేళ్ల పాటు వరుసగా అత్యధిక వసూళ్లు అందించిన కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌. 2010 నుంచి వరుసగా ‘దబాంగ్‌’, ‘బాడీగార్డ్‌’ (2011), ఏక్‌ థా టైగర్‌’ (2012), ‘కిక్‌’ (2014), ‘బజరంగీ భాయీజాన్‌ (2015), సుల్తాన్‌ (2016) చిత్రాలతో ప్రతి ఏడాదీ భారీ కలెక్షన్లు సాధించిన నటుడు సల్మాన్‌. ముఖ్యంగా ‘బజరంగీ బాయీజాన్‌’, ‘సుల్తాన్‌’లు సల్మాన్‌ కెరీర్‌లోనే భారీ హిట్లుగా, అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాలుగా నిలిచాయి. అత్యధిక ఆదాయం ఆర్జించే భారత సెలబ్రిటీస్‌లో ఒకరిగా ఫోర్భ్‌ జాబితాలలోనూ చోటు దక్కించుకన్నాడు సల్మాన్‌. ఈ ఏడాది 'రేస్ 3 'తో ప్రేక్షకుల్ని పలకరించిన సల్మాన్ చేదు ఫలితాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కత్రినాతో కలిసి 'భారత్'లో నటిస్తున్నాడు.


* వినోదంతో పాటు.. వివాదాలు
సల్మాన్‌ నటుడిగా ఎంత కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడో, వివాదాలతో అంతటి స్థాయిలో తన కీర్తిని మసకబార్చుకున్నాడు. ఐశ్వర్యరాయ్‌తో ప్రేమకథ, కృష్ణజింకలను వేటాడటం, పుట్‌పాత్‌పై ఐదుగురిపై నుంచి కారు పోనివ్వడం వంటి కేసులతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు సల్మాన్‌. అయితే సామాజిక సేవకుడిగా, గొప్పదాతగా సల్మాన్‌కు మంచి పేరుంది. బీయింగ్‌ హ్యూమన్‌ అనే సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.