షారుఖ్‌ ఖాన్‌
article imageఅతను అమ్మాయిలకు కలల రాకుమారుడు... యువ హృదయాలలో వన్నె తగ్గని ప్రేమికుడు... అభిమానులకు కింగ్‌ఖాన్‌... సినీ ప్రియులకు బాలీవుడ్‌ బాద్షా. ఆయనే షారుఖ్‌ ఖాన్‌. కథానాయకుడిగా అసమానమైన నటనతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు షారుఖ్ ఖాన్‌. భారత చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నటుడు షారుఖ్‌. కేవలం నటుడిగానే కాక నిర్మాతగా, బుల్లితెర వ్యాఖ్యాతగా, క్రీడా ఫ్రాంఛైజీగా, వ్యాపారవేత్తగా విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు. ఫోర్భ్‌¬్స జాబితాలో అత్యధిక ఆదాయం ఆర్జించే తొలి వంద మంది సెలబ్రిటీస్‌లో ఒకరిగా షారుఖ్‌ పేరుపొందారు.

షారుఖ్‌ ఖాన్‌ 1965 నవంబరు 2న దిల్లీలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తండ్రి తాజ్ మొహమ్మద్‌ ఖాన్, తల్లి లతీఫ్‌ ఫాతిమా ఖాన్‌. తన తాత ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సంప్రదాయ పఠాన్‌ కుటుంబానికి చెందిన వారని, తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని షారుఖ్‌ పలు ఇంటర్వూ¬్యల్లో చెప్పాడు. ఆయన ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌కు అనుచరుడు, కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. అయితే భారత విభజన తర్వాత వీరి కుటుంబం దిల్లీకి వచ్చి స్థిరపడింది. తర్వాత కొన్నాళ్లు షారుఖ్‌ మంగుళూరులో తన అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ఆయన పుట్టింది దిల్లీలోనే అయినా తనని తాను హాఫ్‌ హైదరాబాదీ (తల్లి), హాఫ్‌ పఠాన్‌ (తండ్రి), హాఫ్‌ కశ్మీరీ (నాన్నమ్మ)గా అభివర్ణించుకుంటాడు. తనకు హైదరాబాద్‌తో ఓ విడదీయరాని బంధం ఉన్నట్లు షారుఖ్‌ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నాడు. తన బాల్యంలో కొంత కాలం హైదరాబాద్, టోలీచౌకీలో గడిపాడు. ప్రస్తుతం ముంబైలోని స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన దిల్లీలోని ఎస్‌టి. కొలంబస్‌ స్కూల్‌లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని సాగించాడు. తను చిన్నతనం నుంచి చదువులోనూ, ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండేవాడు. హాకీ, ఫుట్‌బాల్‌ వంటి క్రీడల్లో రాణిస్తూనే స్కూల్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో నటుడిగానూ తన ప్రతిభను చూపించేవాడు షారుఖ్‌. ముఖ్యంగా అప్పటి బాలీవుడ్‌ నటులను చక్కగా అనుకరించి చూపేవాడు. దిలీప్‌ కుమార్, అమితాబ్‌ బచ్చన్, ముంతాజ్‌లను ఎంతో ఆరాధించేవాడు. హన్స్‌రాజ్‌ కాలేజ్‌లో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసిన షారుఖ్‌ తర్వాత దిల్లీలోని థియేటర్‌ యాక్షన్‌ గ్రూప్‌లో ప్రవేశించాడు. ఇక్కడకు వచ్చాకే షారుక్‌ తనలోని నటనకు మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు. బాలీవుడ్‌లో రావడానికి ముందు కొంతకాలం దిల్లీలోనే ఉన్న ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’లోనూ శిక్షణ తీసుకున్నాడు.

1980వ దశకం చివర్లో టీవీ సీరియళ్ల ద్వారా నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు షారుఖ్‌. 1992లో తొలిసారి ‘దీవానా’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. షారుఖ్‌ ఇందులో రిషీ కపూర్, దివ్యభారతిలతో కలిసి నటించాడు. సినిమా ద్వితియార్థంలో అతని పాత్ర కనిపిస్తుంది. ఇది బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకోవడంతో పాటు నటుడిగా షారుఖ్‌కు తొలిచిత్రంతోనే ఫిల్మ్‌ఫెయిర్‌ అవార్డును అందించింది. దీని తర్వాత ‘డర్‌’, ‘బాజిగర్‌’ (1993), ‘అంజామ్‌’ (1994) చిత్రాల్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలను పోషించారు. ముఖ్యంగా ‘బాజిగర్‌’ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో షారుఖ్‌ తొలిసారి సోలోహీరోగా సందడి చేశాడు. ‘హీరో ఒక అమాయకురాలైన హీరోయిన్‌ను చంపటం అనే విభిన్నమైన కథాశంతో’ థ్రిల్లర్‌గా అప్పటి బాలీవుడ్‌ ఫార్ములాకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నందుకుంది. ఇందులో షారుఖ్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక షారుఖ్‌ ఖాన్‌ను రొమాంటిక్‌ హీరోగా మార్చిన సినిమా ‘దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే’. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా కాజోల్‌ నటించింది. 1995 అక్టోబరు 20న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. భారతీయ రొమాంటిక్‌ చలన చిత్రంగా ఖ్యాతి తెచ్చుకోవడమేకాక వివిధ విభాగాల్లో అత్యధిక ఫిలింఫేర్‌ అవార్డులు (10) అందుకున్న ఏకైక సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో షారుఖ్‌ ఒక్కసారిగా బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ‘దిల్‌ తో పాగల్‌ హై’ (1997), ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ (1998), ‘మొహొబ్బతే’ 2000, ‘కభి ఖుష్‌ కభీ గమ్‌’ (2001) సినిమాలతో బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘దేవదాస్‌’ (2002), ‘స్వదేశ్‌’ (2004), ‘చక్‌ దే! ఇండియా’ (2007), ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ (2010) సినిమాల్లో షారుఖ్‌ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. విదేశాల్లోనూ మంచి వసూళ్లను సాధించాయి ఈ చిత్రాలు. తొలినాళ్లలో ఎక్కువగా ప్రేమ కథల్లోనే కనిపించిన షారుఖ్‌ ఖాన్‌ తర్వాత నుంచి దేశభక్తి, సామాజిక సమస్యలు ఇతివృత్తంగా ఉన్న కథలను ఎంపిక చేసుకొని మంచి విజయాలందుకున్నాడు. ఆయన నటించిన ‘చెనై¬్న ఎక్స్‌ప్రెస్‌ (2013), ‘హ్యపీ న్యూ ఇయర్‌’ (2014), ‘దిల్‌వాలే’ (2015)లు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. 2017లో వచ్చిన ‘రయీస్‌’ మంచి ఫలితాన్నే అందించింది. ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో ‘జీరో’ చిత్రంలో మరుగుజ్జుగా నటిస్తున్నాడు.

ఓవైపు నటుడిగా రాణిస్తూనే ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలను నిర్మించాడు. దీంతో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (ఐపిఎల్‌) ‘కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌’ యజమానిగా ఉన్నారు. వీటితో పాటు అనేక ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వ్యాధులపై అవగాహన ప్రచారంలోనూ, విపత్తుల సందర్భంగా నిరాశ్రయులను ఆదుకోవడంలో షారుఖ్‌ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిల్లల చదువు ఆవశ్యకతను ప్రచారం చేయడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2011లో యునెస్కో ‘పిరమిడ్‌ కాచ్‌ మర్నీ’ పురస్కారంతో షారుఖ్‌ను గౌరవించింది. దాదాపు తన రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 80 పైగా చిత్రాల్లో నటించిన షారుఖ్‌ ఖాన్‌ ఇప్పటివరకు 14 ఫిలింఫెర్‌ పురస్కారాలు అందుకున్నారు. సినిమాల్లో ఆయన చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ‘ఒర్డరే డెస్‌ ఆర్ట్‌¬్స ఎట్‌ దెస్‌ లెట్టర్స్‌’, ‘లెగియన్‌ డి హానర్‌’ అవార్డులతో గౌరవించాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.