అందాల మతాబు.. టబు
‘నిన్నే పెళ్లా‌డతా’ అంటూ నాగా‌ర్జున ఒక్కరే వెంట‌పడలేదం‌డోయ్‌. ఆ సిని‌మాలో టబుని చూశాక దాదాపు తెలుగు కుర్రాళ్లంతా అదే మాట‌న్నారు. చూడ్డా‌నికి ముంబై ముద్దు‌గుమ్మలా ఉంటుం‌ది‌గానీ... టబు మన తెలు‌గ‌మ్మాయే‌. హైద‌రా‌బా‌ద్‌లో పుట్టిపెరిగింది. ఇక్కడే చదు‌వు‌కొంది. ఆ తర్వాత ముంబై వెళ్లింది. కథానా‌యి‌కగా గుర్తింపు తెచ్చు‌కొంది. అన్నట్టు విదే‌శాల్లోనూ టబుకి అభిమా‌ను‌లు‌న్నారు. ‘ది నేమ్‌ సేక్‌’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ చిత్రాల్లో ఆమె నటన ప్రపం‌చ‌వ్యా‌ప్తంగా ఎంతో‌మంది హృద‌యాల్ని కొల్ల‌గొ‌ట్టింది. అదేంటో తెలీదు కానీ... దేవుడు అన్నీ ఒక్క‌రికే ఇచ్చే‌స్తుటాడు. టబుకి అందం ఇచ్చే‌శాడు. అద‌నంగా నటనని కూడా ఇచ్చే‌శాడు. అందుకే అవా‌ర్డులు ఇంటికి నడు‌చు‌కొంటూ వచ్చాయి. ఆర‌డు‌గు‌లకి ఒక‌ట్రెండు పాయింట్లు తక్కువుండే ఈ సోయగం... హిందీ ప్రేక్ష‌కు‌లపై చెర‌గని ముద్ర వేసింది. తెలుగువాళ్లతోనూ మా కథానా‌యిక అని‌పిం‌చు‌కొంది. తమిళం, మల‌యాళం, బెంగాళీ ఇలా పలు భాషల్లో నటించి రాణిం‌చింది. 34 యేళ్లుగా వెండి‌తె‌రతో అను‌బం‌ధాన్ని కొన‌సా‌గి‌స్తోంది. ‌ట‌బు జీవితం, ప్రస్థానం గురించి కొన్ని విష‌యాలు...

article image

* తబు‌స్సుమ్‌..
అసలు పేరు తబు‌స్సుమ్‌ హష్మి. 1971 నవంబరు 4న హైద‌రా‌బా‌ద్‌లో జన్మిం‌చింది. తండ్రి జమాల్‌ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్‌ టీచర్‌. బాల్యంలో ఉండ‌గానే తల్లి‌దం‌డ్రు‌లి‌ద్దరూ విడి‌పో‌యారు. అధ్యా‌పకు‌లైన అమ్మమ్మ, తాత‌య్యల దగ్గర పెరి‌గింది. హైద‌రా‌బా‌ద్‌లోని సెంట్‌ ఆన్స్‌ హై స్కూల్‌లో చదువు‌కొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీ‌లకి టబు స్వయానా మేన‌కో‌డలు. వాళ్లను స్ఫూర్తిగా తీసు‌కొని 1983లో హైద‌రా‌బాద్‌ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్న‌టి తరానికి చెందిన ప్రముఖ కథా‌నా‌యిక ఫరానాజ్‌ కూడా టబుకి బంధువు అవు‌తారు.

* చిన్న పాత్రతో...
1980లోనే కెమెరా ముందు‌కె‌ళ్లింది. ‘బజార్‌’ అనే చిత్రంలో బాల‌న‌టిగా ఓ చిన్న పాత్ర పోషిం‌చింది. ఆ తర్వాత ఐదే‌ళ్లకు ‘హమ్‌ నే జవాన్‌’లో దేవానం‌ద్‌కి కూతు‌రిగా నటిం‌చింది. పద్నా‌లు‌గేళ్ల వయ‌సులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీ‌వుడ్‌ వర్గాల్ని ఆక‌ట్టు‌కొంది. బోణీ‌క‌పూర్‌ తన సంస్థలో నిర్మిం‌చ‌నున్న ‘రూప్‌కీ రాణీ చోరోంకా రాజా’, ‘ప్రేమ్‌’ చిత్రాల కోసం టబుని కథా‌నా‌యి‌కగా ఎంపిక చేసు‌కొ‌న్నాడు. ‘ప్రేమ్‌’లో సంజ‌య్‌క‌పూర్‌ సర‌సన నటిం‌చింది టబు. అయితే ఆ చిత్రం పూర్తి కావ‌డా‌నికి సుమారు ఎని‌మి‌దేళ్లు పట్టింది. సుదీ‌ర్ఘ‌కాలం తర్వాత విడు‌ద‌లైనా... ఆ చిత్రం ఘోర పరా‌జ‌యాన్ని చవి‌చూ‌సింది. దీంతో టబుకి ఏ మాత్రం కలి‌సి‌రా‌లేదు.

* స్టార్‌ అయింది..
‘కూలీ నెంబర్‌ 1’ చిత్రంతో తెలు‌గులో కథానా‌యి‌కగా పరిచ‌య‌మైంది. 1987లో ప్రేక్ష‌కుల ముందు‌కొ‌చ్చిన ఆ చిత్రం చక్కటి ఆద‌రణ పొందింది. వెంక‌టేష్‌ సరసన నటిం‌చిన టబు గురించి తెలుగు ప్రేక్ష‌కు‌లంతా ప్రత్యే‌కంగా మాట్లా‌డు‌కొన్నారు. అంత‌లోనే హిందీ చిత్రా‌లతో మరింత బిజీ అయి‌పో‌యింది. ‘విజ‌య్‌ప‌థ్‌’లో అజయ్‌ దేవ‌గణ్‌ సర‌సన నటించి తొలి విజ‌యా‌న్నం‌దు‌కొంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెను‌ది‌రిగి చూసు‌కో‌లేదు. ‘సాజన్‌ చలే ససు‌రాల్‌’, ‘జీత్‌’ చిత్రాలు ఆమెని స్టార్‌ కథా‌నాయి‌కని చేశాయి. 90వ దశకమంతా బాగా కలి‌సొ‌చ్చింది. అటు గ్లామర్‌ పాత్రల‌తోనూ, ఇటు నట‌నకు ప్రాధాన్య‌మున్న కథ‌ల్లోనూ నటిం‌చింది. హిందీలో చేసిన ‘మ్యాచిస్‌’ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పుర‌స్కా‌రాన్ని తెచ్చి‌పె‌ట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒది‌గి‌పో‌యిన విధానం అంద‌రినీ ఆక‌ట్టు‌కుంది. ఆ వెంటనే ప్రియద‌ర్శన్‌ దర్శ‌క‌త్వంలో ‘కాలా‌పానీ’ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకు‌రా‌వ‌డం‌తో‌ పాటు తమిళంలో అవ‌కా‌శాల్ని తెచ్చి‌పె‌ట్టింది.

article image
* ఆచి‌తూచి...
చేతికందిన అవ‌కా‌శా‌ల‌న్నిం‌టినీ ఒప్పు‌కొ‌నుంటే... టబు బోలె‌డన్ని చిత్రాలు చేసేది. కానీ ఆమె ఆచి‌తూచి కథల్ని ఎంచు‌కొం‌టుంది. మన‌సుకు నచ్చిన పాత్రల్లోనే నటి‌స్తుంది. దర్శ‌కుడు, నిర్మాత తది‌తర విష‌యాల‌న్నిం‌టినీ పరి‌గ‌ణ‌న‌లోకి తీసు‌కొని నటి‌స్తుంది. అందుకే ఆమె ప్రయాణం కాస్త నిదానంగా సాగి‌నట్టు అని‌పి‌స్తుం‌టుంది. ‘బార్డర్‌’, ‘విరా‌సత్‌’, ‘బివి నెంబర్‌ 1’, ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’, ‘హేరా ఫేరీ’, ‘అస్తిత్వ’, ‘చాందినీ బార్‌’, ‘మక్బూల్‌’, ‘చీనీ కమ్‌’ తది‌తర చిత్రా‌లతో ఆమె ప్రయాణం బిజీ‌బి‌జీగా సాగింది. తమి‌ళంలోనూ ‘కాదల్‌ దేశమ్‌’, ‘కందు‌కొం‌డైన్‌ కందు‌కొండైన్‌’లాంటి సిని‌మాలు చేసింది. మల‌యా‌ళంలో ‘స్నేగి‌తీయే’, ‘ఉరుమి’‌లాంటి చిత్రాల్లో నటిం‌చింది బెంగాలీ, మరాఠీ చిత్రా‌ల్లోనూ నటించి తన అభి‌రు‌చిని చాటింది. గతకొంత కాలంగా వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘తల్వార్‌’, ‘ఫితూర్‌’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ఈ ఏడాది ఇప్పటికే ‘సంజు’, ‘అంధాదున్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇప్పుడీ భామ చేతిలో సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారత్‌’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కూడా ఉంది. ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో కనిపిస్తుందట.  

* తెలు‌గుపై ముద్ర..
కథానా‌యి‌కగా టబు తెలు‌గుపై చెర‌గని ముద్ర వేసింది. చేసింది తక్కువ సిని‌మాలే అయినా... టబు అన‌గానే తెలుగు ప్రేక్ష‌కబలు ‘మా కథానా‌యికే’ అంటుం‌టారు. ‘కూలీ నెంబర్‌1’ తర్వాత చాలా రోజు‌లకి ‘నిన్నే పెళ్లాడతా’లో నటిం‌చింది. ఆ సిని‌మాలో నాగా‌ర్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లా‌డుకొన్నారు. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’, ‘చెన్న‌కే‌శ‌వ‌రెడ్డి’, ‘అంద‌రి‌వాడు’, ‘పాండు‌రం‌గడు’, ‘ఇదీ సంగతి’ తదితర చిత్రాల్లో నటించి అల‌రిం‌చింది. ఆమె తమి‌ళంలో నటిం‌చిన ‘కాదల్‌దేశమ్‌’ తెలు‌గులో ‘ప్రేమ‌దే‌శం’గా విడు‌దలై ఘన‌వి‌జయం అందు‌కొంది.


* అంత‌ర్జా‌తీయ నటి..
మీరా‌నా‌యర్‌ దర్శ‌క‌త్వంలో తెర‌కె‌క్కిన ఆంగ్ల చిత్రం ‘ది నేమ్‌ సేక్‌’లో టబు కీలక పాత్ర పోషిం‌చింది. 2012లో విడు‌ద‌లైన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’లోనూ ఓ కీలక పాత్ర పోషించి అల‌రిం‌చింది. టబు హిందీలో చేసిన ‘చీనీ‌కమ్‌’ కూడా అంత‌ర్జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణను చూర‌గొంది. ఆ చిత్రానికి అమె‌రికా, ఇంగ్లం‌డ్‌లలో ప్రేక్ష‌కులు బ్రహ్మ‌రథం పట్టారు. భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కా‌రాన్ని ప్రక‌టిం‌చింది. పలు అంత‌ర్జా‌తీయ పుర‌స్కా‌రాలు సైతం ఆమెని వరిం‌చాయి.

* ప్రేమా‌యణం..
నల‌భయ్యేళ్లు పైబ‌డినా టబు ఇంకా పెళ్లి చేసుకో‌లేదు. ఆమె ప్రేమలో పడిం‌దని పలుమార్లు మీడి‌యాలో ప్రచారం సాగింది. నాగా‌ర్జు‌నతో సన్ని‌హి‌తంగా మెలు‌గు‌తోందని, వాళ్లి‌ద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ సాగు‌తోం‌దని అన్నారు. బాలీ‌వుడ్‌ నిర్మాత సాజిద్‌ నడి‌యా‌డ్‌వాలాతోనూ బంధం ఉందని అంటుం‌టారు. అయితే టబు మాత్రం.. ‘‘నా బాయ్‌ఫ్రెండ్స్‌ అంటూ చాలా మంది పేర్లు ప్రచా‌రం‌లోకి ‌వస్తుం‌టాయి. ‌బా‌య్‌ఫ్రెం‌డ్స్‌ ‌ఎం‌త‌మం‌దైనా రావొచ్చు, పోవచ్చు. కానీ నాకు నాగా‌ర్జున మాత్రం ప్రత్యేకం’ అని చెబు‌తుం‌టుంది.


నచ్చినవి.. మెచ్చినవి
* ఖాళీ సమ‌యాల్లో సంగీతం వింటుంటా. సిని‌మాలు చూస్తుంటా. చిన్న చిన్నపద్యాలు రాయడం ఓ హాబీ.
* ఇష్ట‌మైన కథానా‌య‌కులు... అమి‌తాబ్‌ బచ్చన్, దేవా‌నంద్, షారు‌ఖ్‌ ‌ఖాన్, ఆమీ‌ర్‌ఖాన్, కమ‌ల్‌హా‌సన్, రజ‌నీ‌కాంత్‌.
* ఇష్ట‌మైన కథా‌నా‌యి‌కల గురించి చెప్పా‌ల్సొస్తే శ్రీదేవి ముందు వర‌సలో ఉంటారు. రేఖ, నర్గీస్‌ నట‌నని కూడా అమి‌తంగా ఇష్ట‌ప‌డతా. నాకు రోల్‌మో‌డల్‌... షబానా ఆజ్మీ.
* నచ్చిన రంగులు... నలుపు, తెలుపు. నేను ధరించే దుస్తులు ఎక్కు‌వగా ఆ రంగు‌ల్లోనే ఉంటాయి.
* ఇష్ట‌మైన ప్రదేశాలు ముంబై, న్యూజి‌లాండ్‌.
* ఇళ‌య‌రాజా, ఎ.ఆ‌ర్‌.‌రె‌హ‌మాన్‌ సంగీతం అంటే చెవి‌కో‌సుకుంటా.
* సీ ఫుడ్స్‌తో పాటు భార‌తీయ వంట‌కాల్ని ఇష్టంగా తింటా.
* గాయ‌కుల్లో ఎస్‌.‌పి.‌బా‌ల‌సు‌బ్రహ్మణ్యం, హరి‌హ‌ర‌న్‌లంటే ఇష్టం.
* తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు బాగా మాట్లా‌డ‌తాను.
* నచ్చిన ఆటలు క్రికెట్, స్విమ్మింగ్‌.
* ఎదు‌టి‌వా‌రిలో నచ్చేది... అమా‌య‌కత్వం, కష్ట‌పడే తత్వం, ప్రకృ‌తిని ప్రేమించే గుణం.
* నచ్చ‌న‌ది... బద్ధకం, అప‌రి‌శు‌భ్రత, కఠి‌నత్వం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.