తుషార్‌... అభిమానులకు హుషార్‌
నిన్నటి తరం నటుడు జితేంద్ర సినీ వారసుడు... తుషార్‌ కపూర్‌. ఈయన ఏక్తా కపూర్‌ సోదరుడు. బాలాజీ టెలీఫిల్మ్స్, బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌కు సహ యజమానిగా వ్యవహరించారు ‘ముఝే కుచ్‌ కెహనా హై’, ‘ఖాకీ’, ‘క్యా కూల్‌ హై హమ్’, ‘గోల్మాల్‌ - ఫన్‌ అన్లిమిటెడ్‌’, ‘డోల్‌’, ‘గోల్మాల్‌ రిటర్న్స్‌’ సినిమాలు తుషార్‌ కపూర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తుషార్‌ ఎంటర్టైన్మెంట్‌ హౌస్‌ అనే నిర్మాణ సంస్థను ఈయన స్థాపించారు. ఈ సంస్థకు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న మొట్టమొదటి సినిమా ‘లక్ష్మీ బాంబ్‌’. ‘లక్ష్మీ బాంబ్‌’ దక్షిణాదిలో విజయవంతమైన ‘కాంచన’ సినిమాకు హిందీ రీమేక్‌. 1976, నవంబర్‌ 20న తుషార్‌ కపూర్‌ జన్మించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇది.


వ్యక్తిగత జీవితం
తుషార్‌ కపూర్‌ తల్లిదండ్రుల పేర్లు జితేంద్ర, శోభా కపూర్‌. తండ్రి జితేంద్ర ‘దిల్దార్‌’ చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడు తుషార్‌ పుట్టాడనే వార్త ఆయనకు తెలిసింది. తుషార్‌ సోదరి ఏక్తా కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బొంబాయి స్కాటిష్‌ స్కూల్‌లో జితేంద్ర విద్యాభ్యాసం జరిగింది. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేవారు తుషార్‌. ఆ తరువాత స్టీఫెన్‌ ఎం.రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో బిబిఎ డిగ్రీ చదివారు. తండ్రిలాగే, తుషార్‌ కపూర్‌ కూడా నిచిరెన్‌ బౌద్ధమతం అనుచరుడు. తుషార్‌ ఐవిఎఫ్‌ను ఎంచుకుని, జూన్‌ 2016లో సరోగసీ ద్వారా లక్సయ కపూర్‌కు ఒంటరి తండ్రి అయ్యారు.


కెరీర్‌
సినిమాల్లో నటించక ముందు దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ దగ్గర తుషార్‌ కపూర్‌ సహాయకుడిగా పనిచేశారు. దీని తరువాత, అతను రోషన్‌ తనేజా, మహేంద్ర వర్మలతో కలిసి వారి నటన పాఠశాలలో నటనలో శిక్షణ పొందారు. నిమేష్‌ భట్‌తో కలిసి నాట్యంలో శిక్షణ పొందారు.


2001లో ‘ముఝే కుచ్‌ కెహెనా హై’ సినిమాతో వెండితెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో పవన్‌ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ ‘తొలిప్రేమ’ సినిమాకు ఈ చిత్రం రీమేక్‌. ఈ సినిమాలో నటనకు బెస్ట్‌ మేల్‌ డెబ్యూగా ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత రాహుల్‌ పాత్రలో ‘క్యా దిల్‌ నే కహా’ అనే సినిమాలో ఈషా డియోల్‌తో నటించారు. ఆ తరువాత తెలుగులో హిట్‌ అయిన ‘మనసంతా నువ్వే’ సినిమాకు హిందీ రీమేక్‌ అయిన ‘జీనా సిర్ఫ్‌ మెరే లియే’లో, ‘నువ్వు నేను’కు రీమేక్‌ అయిన ‘యే దిల్‌’ సినిమాలో నటించారు.


ఆ తరువాత 2004లో రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో వచ్చిన ‘గాయబ్‌’ సినిమాలో నటించారు. ఇది బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడింది. కానీ, తుషార్‌ కపూర్‌కి మాత్రం నటనాపరంగా ప్రశంసలు దక్కాయి. 2004లో, తుషార్‌ కమర్షియల్‌గా విజయవంతమైన ‘ఖాకీ’, ‘క్యా కూల్‌ హై హమ్’, ‘గోల్మాల్‌’, ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ లోఖండ్వాలా’ సినిమాలలో నటించారు. ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ లోఖండ్వాలా’ తుషార్‌ గ్యాంగ్స్టర్‌ దిలీప్‌గా నటించారు. ఇంకా ‘గోల్మాల్‌ రిటర్న్స్’, ‘గోల్మాల్‌ 3’, ‘ద డర్టీ పిక్చర్‌’, ‘క్యా సూపర్‌ కూల్‌ హై హమ్’, ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’, ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ వాడాలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.

2012లో, నిరాశ్రయులైన పిల్లల కోసం డబ్బును సేకరించే ‘ఫ్యాషన్‌ ఫర్‌ ఎ కాజ్‌’ కార్యక్రమంలో తుషార్‌ కపూర్‌ పాల్గొన్నాడు. ‘చార్‌ దిన్‌ కి చాందిని’ అనే సినిమాను సహా నిర్మించారు. ఇందులో ఆయన నటించారు కూడా. తుషార్‌ బాలీవుడ్‌ అడల్ట్‌ కామిడీస్‌ అయిన ‘క్యాయా కూల్‌ హైన్‌ హమ్‌ 3’ (2016), ‘మస్తిజాదే’ (2016) లలో ప్రధాన నటుడిగా పనిచేశారు. ఈ రెండు సినిమాలు యావరేజ్‌ బిజినెస్‌ చేశాయి.

2017లో, ‘గోల్మాల్‌ అగైన్‌’లో లక్కీగా నటించారు. ఇది బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని చవి చూసింది. 2018లో, తుషార్‌ ‘సింబా’లో ‘ఆంఖ్‌ మేరీ’ పాటలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. పాటలో కొంత భాగానికి గాత్రదానం కూడా చేశారు. 2019లో ‘బూ సబ్కి ఫతేగి’ అనే హారర్‌ వెబ్‌ సిరీస్‌లో మల్లికా శెరావత్‌తో స్కీన్ర్‌ని షేర్‌ చేసుకొన్నారు. ‘లక్ష్మీ బాంబ్‌’లో గౌరవ్‌గా నటిస్తున్నారు.

                                   

తుషార్‌ నటించిన సినిమాలు
2001లో ‘ముఝే కుచ్‌ కెహెనా హై’ సినిమాలో కరణ్‌గా, ‘క్యా దిల్‌ నే కహా’లో రాహుల్‌గా, ‘జీనా సిర్ఫ్‌ మేరె లియే’లో కరణ్‌గా, ‘కుచ్‌ తో హై’లో కరణ్‌గా, ‘యే దిల్‌’లో రవిగా, ‘శరత్‌: ద ఛాలెంజ్‌’లో జై కపూర్‌గా, ‘గాయబ్‌’లో విష్ణు ప్రసాద్‌ గా, ‘ఖాకీ’లో సబ్‌ ఇన్స్పెక్టర్‌ అశ్విన్‌ గుప్తేగా, ‘ఇన్సాన్‌’లో అవినాష్‌గా, ‘క్యా కూల్‌ హై హమ్’లో రాహుల్‌గా, ‘గోల్మాల్‌’లో లక్కీగా, ‘గుడ్‌ బాయ్‌ బాడ్‌ బాయ్‌’లో రాజన్‌ మల్హోత్రాగా, ‘క్యా లవ్‌ స్టోరీ హై’లో అర్జున్‌గా, ‘డోల్‌’లో సమీర్‌ సామ్‌ ఆర్యగా, ‘వన్‌ టూ త్రి’లో లక్ష్మి నారాయణ్‌గా, ‘గోల్మాల్‌ రిటర్న్స్’లో లక్కీగా, ‘లైఫ్‌ పార్టనర్‌’లో భవేష్‌గా, ‘గోల్మాల్‌ 3’లో లక్కీగా, ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’లో తిలక్‌గా, ‘లవ్‌ యు... మిస్టర్‌ కళాకార్‌’లో సాహిల్‌గా, ‘హమ్‌ తుం సభానా’లో రిషి మల్హోత్రాగా, ‘ద డర్టీ పిక్చర్‌’లో రమాకాంత్‌గా, ‘చార్‌ దిన్‌ కి చాందిని’లో వీర్‌ విక్రమ్‌ సింగ్‌గా, ‘క్యా సూపర్‌ కూల్‌ హై హమ్’లో ఆదిగా, ‘పోస్టర్‌ బాయ్స్‌’లో లక్కీగా, ‘గోల్మాల్‌ అగైన్‌’, ‘సింబా’లలో లక్కీగా తదితర పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అలరిస్తూ వస్తున్నారు కూడా. చేసినవి కొద్దీ చిత్రాలే అయినా... తనకంటూ పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.