తిరుగులేని అభినేత్రి... సేవాగుణంలో మాతృమూర్తి

ప్రపంచం నలుమూలలా తెలిసిన నటి ఏంజెలీనా జోలీ అంటే అతిశయోక్తి కాదేమో. హాలీవుడ్‌ సినిమాల పట్ల ఆసక్తి లేనివారు కూడా జోలీ పేరు వినే ఉంటారు. అందుకు కారణం ఆమె నటిగా, దర్శకురాలిగా సత్తా చాటుతూ ఉన్నత శిఖరాలకు ఎదగడమొకటే కాదు.. మానవతావాదిగా దయార్ద్ర హృదయంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా. బుల్లితెర చిత్రాలతో బుడిబుడి అడుగులు వేస్తూ నట ప్రయాణం ప్రారంభించిన జోలీ ఆ తర్వాత వెండితెరపై సహాయ పాత్రల మజిలీ దాటి కథానాయిక స్థాయికి చేరుకుంది. అంతటితోనే ఆగిపోయింటే అందరిలా ఆమె కూడా ఓ మామూలు కథానాయికగానే మిగిలిపోయేది. తన ప్రతిభకు తపనను జోడించి సాహసోపేతమైన పాత్రలు, చిత్రాలు చేస్తూ అగ్రకథానాయకులకు దీటుగా స్టార్‌డమ్‌ దక్కించుకుంది జోలీ. అటు నటిగా, ఇటు సమాజ సేవకురాలిగా భావి తరాల నటీమణులకు మార్గదర్శకురాలిగా నిలిచిన జోలీ జీవిత విశేషాలివీ. ఈరోజు ఆమె (జూన్‌ 4) పుట్టినరోజు.


వారసత్వంలోనే నటన..

జోలీకి నటన వారసత్వంగా అబ్బినట్లుంది. ఆమెది సినిమా నేపథ్యమున్న కుటుంబం. తండ్రి జోన్‌ వొయిట్‌ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు. ఆస్కార్‌ పురస్కారం కూడా అందుకున్నారు. ఏడేళ్ల వయసులోనే తండ్రితో కలసి ఓ చిత్రంలో నటించింది జోలీ. అయితే మరో దశాబ్దం వరకూ చదువు మీదే దృష్టిపెట్టి కెమెరా ముందుకు రాలేదు. ‘సైబోర్గ్‌ 2’ చిత్రంతో మళ్లీ మేకప్‌ వేసుకుంది. అయితే అది పరాజయం చెందడంతో జోలీకి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘హ్యాకర్స్‌’లో టీనేజ్‌ హ్యాకర్‌గా కనిపించింది. ఆ చిత్రానికి పెద్దగా స్పందన రాకపోయినా జోలీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దీంతో బుల్లితెర చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. టీవీపై తొలి చిత్రం ‘జార్జ్‌ వాలెస్‌’తోనే సహాయ నటిగా గోల్డెన్‌ గ్లోబ్‌−టీవీ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం. మరో బుల్లి తెర చిత్రం ‘జియా’లో ఫ్యాషన్‌ మోడల్‌గా ప్రధాన పాత్రలో మెప్పించి మరోసారి గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. జోలీ ప్రతిభను గుర్తించి మళ్లీ వెండితెర పిలిచి అవకాశాలిచ్చింది.

ఛాలెంజింగ్‌ పాత్రతో ఆస్కార్‌..

వెండితెరపై జోలీకి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘గర్ల్, ఇంటరప్టెడ్‌’. 1999లో వచ్చిన ఈ చిత్రంలో మానసిక వ్యాధితో బాధపడే అమ్మాయిగా ఓ ఛాలెంజింగ్‌ పాత్రలో కనిపించింది. తన నటనతో ప్రేక్షకుల మనసులనేకాదు.. ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాలూ గెలుచుకుంది. ఆ తర్వాత నికోలస్‌ కేజ్‌ సరసన జోలీ నటించిన ‘గాన్‌ ఇన్‌ 60 సెకండ్స్‌’ ఘన విజయం సాధించింది.

ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు..

అప్పటివరకూ హాలీవుడ్‌కు మాత్రమే తెలిసిన జోలీ పేరును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘లారా క్రాఫ్ట్‌: టాంబ్‌ రైడర్‌’. టాంబ్‌ రైడర్‌ వీడియో గేమ్‌ సిరీస్‌ ఆధారంగా 2001లో వచ్చిన ఈ చిత్రంలో విలువైన పురాతన వస్తువులను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే పురాతత్వవేత్తగా ప్రధాన పాత్రలో కనిపించింది జోలీ. ఆమె నటన, ముఖ్యంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఆమె చేసిన పోరాటాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నాయికా ప్రాధాన్య యాక్షన్‌ చిత్రాల్లో ఈ సినిమాకే అత్యధిక ప్రారంభ వసూళ్లు రావడం గమనార్హం. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘లారా క్రాఫ్ట్‌: టాంబ్‌ రైడర్‌− ది క్రెడిల్‌ ఆఫ్‌ లైఫ్‌’లోనూ మరోసారి తన ఫైట్లతో అదరగొట్టింది జోలీ. లారా క్రాఫ్ట్‌ సిరీస్‌లో మరో సీక్వెల్‌నూ తెరకెక్కించారు. అయితే మరోసారి లారా క్రాఫ్ట్‌ పాత్రలో నటించేందుకు జోలీ అంగీకరించకపోవడంతో అలీసియా వికిందర్‌ ఆ పాత్రలో నటించింది.

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పిట్‌..

ప్రముఖ కథానాయకుడు బ్రాడ్‌పిట్‌కు జోడీగా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’లో నటించింది జోలీ. వారిద్దరూ కిరాయి హంతకులైన భార్యాభర్తల పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం చక్కటి విజయం అందుకోవడమే కాదు వారి జంట ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పిట్, జోలీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రేమలోకంలో విహరించి 2014లో పెళ్లి చేసుకుని మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పిట్‌గా మారారు. అయితే మూడేళ్ల తర్వాత వారు విడిపోయారు.

ఆ చిత్రాలతో తారాపథంలోకి..

తీవ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన ఫ్రెంచ్‌ జర్నలిస్ట్‌ మెరియన్‌ పెర్ల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఏ మైటీ హార్ట్‌’లో ప్రధాన పాత్రలో నటించింది జోలీ. ఆమె నటనకు విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో చిత్రం ‘చాంజెలింగ్‌’ కూడా జోలీకి పేరుతెచ్చిపెట్టింది. బాలలపై జరిగే నేరాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అపహరణకు గురైన కుమారుడి ఆచూకీ తెలియక విలవిల్లాడే తల్లి పాత్రలో కన్నీరు పెట్టించింది జోలీ. ఆ పాత్ర ఆమెకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ నామినేషన్‌ తెచ్చిపెట్టింది. 2010లో జోలీ నటించిన సాల్ట్, టూరిస్ట్‌ చిత్రాలు ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2014లో వచ్చిన డార్క్‌ ఫాంటసీ చిత్రం మేల్‌ఫిషియంట్‌ జోలీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 758 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

మెగా ఫోన్‌తోనూ మెరిపించి..

దర్శకురాలిగా మెగాఫోన్‌ చేతపట్టి విభిన్నమైన చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించింది జోలీ. ఇప్పటివరకూ నాలుగు చిత్రాలు తెరకెక్కించింది. తొలి ప్రయత్నంగా ‘ఇన్‌ ద ల్యాండ్‌ ఆఫ్‌ బ్లడ్‌ అండ్‌ హనీ’ చిత్రంతో బోస్నియా యుద్ధ నేపథ్యంలో జరిగే ఓ ప్రేమకథను కళ్లకు కట్టింది. రెండో చిత్రంగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘అన్‌బ్రోకెన్‌’ చిత్రాన్ని తెరకెక్కించింది. మూడోసారి ఓ రొమాంటిక్‌ ప్రేమకథను ఎంచుకుని ‘బై ద సీ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. ఇందులో ప్రధాన పాత్రల్లో జోలీ, బ్రాడ్‌ పిట్‌ నటించారు. ఇవే కాకుండా వియత్నాం యుద్ధం నేపథ్యంలో ‘ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌’ చిత్రాన్ని రూపొందించింది. నటిగానే కాదు దర్శకురాలిగానూ విజయవంతమైంది జోలీ.

చేప.. పులి.. జోలీ:

జోలీ నటిగానే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ మెప్పించింది. యానిమేషన్‌ చిత్రం షార్క్‌ టేల్‌లో చేపకు, కుండ్‌ ఫు పాండాలో ఆడపులికి గాత్రదానం చేసింది. తన గొంతుతో ఆ పాత్రలకు ప్రాణం పోసి పిల్లలను అలరించింది.

సమాజ సేవకురాలిగా:

టాంబ్‌ రైడర్‌ సినిమా చిత్రీకరణ కాంబోడియాలో జరుగుతున్నప్పుడు యుద్ధంతో చితికిపోయిన అక్కడి ప్రజల పరిస్థితిని చూసి చలించిపోయింది జోలీ. ప్రపంచ శాంతి కోసం తన వంతు బాధ్యత నిర్వర్తించాలని నిర్ణయించుకుంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో శరణార్థుల శిబిరాలను సంప్రదించడం మొదలుపెట్టింది. పాకిస్థాన్‌లోని ఆఫ్ఘన్‌ శరణార్థుల సహాయ కార్యక్రమాల కోసం ఐక్యరాజ్య సమితికి మిలియన్‌ డాలర్లు విరాళమిచ్చింది. అప్పటికి ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి ఆ సంస్థ అందుకున్న అతి పెద్ద విరాళమది. ఐక్యరాజ్య సమితి ఆమెను ప్రచారకర్తగా నియమించుకుంది. 30కి పైగా దేశాల్లో 40 సార్లు సందర్శించి వేలాది శరణార్థుల బాగు కోసం శ్రమించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు ఆహారం, మందులు చేరవేసేందుకుగానూ విమానం నడపడంలో శిక్షణ తీసుకుని మరీ పైలెట్‌గా మారింది.


కంబోడియా పౌరసత్వం:

కంబోడియాలో ఓ జాతీయ పార్కులోని అడవి జంతువులను వేటగాళ్లు చంపేస్తున్న విషయం తెలుసుకున్న జోలీ, వాటి పరిరక్షణకు నడుంబిగించింది. 60వేల హెక్టార్ల వైశాల్యమున్న ఆ పార్కును కొనుగోలు చేసి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మార్చేసింది. కాంబోడియాలోని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్న తన కుమారుడు పేరు మీద దానికి మడాక్స్‌ జోలీ ప్రాజెక్ట్‌(ఎంజేపీ) అని పేరుపెట్టి ఆ పార్కులోని జంతువులను కంటికి రెప్పలా కాపాడుతోంది. వేటగాళ్లతో ఆ వృత్తి మానిపించి ఆ పార్కులో రేంజర్లుగా ఉద్యోగాలిచ్చింది. కాంబోడియాకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన అక్కడి రాజు ఆమెకు తమ దేశ పౌరసత్వం ఇచ్చి గౌరవించారు.

సేవకు ఆమె ఇల్లే ప్రధాన కార్యాలయం:

ఎంజేపీని మరింత విస్తరించి కెన్యాలో చిన్నాభిన్నమైన పది గ్రామాలను కలిపి మిలీనియం విలేజ్‌గా అభివృద్ధి చేసింది. పాఠశాలలు, రహదార్లు, పాల ఉత్పత్తి కేంద్రం లాంటి సౌకర్యాలు సొంత నిధులతో నిర్మించింది జోలీ. ఆరు వేల మందికి పైగా అక్కడి గ్రామస్థులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆమె సేవాకార్యక్రమాలకు సొంత ఇంటినే ప్రధాన కార్యాలయంగా మార్చింది. వలస బాలలకు విద్య, స్త్రీల సంరక్షణ, మానవ హక్కుల విషయంలో కూడా జోలీ పాటుపడుతూ తన విశాల హృదయాన్ని చాటుకుంటోంది. ఆమెకు సేవకు మెచ్చి పలు దేశాలు, సంస్థలు పురస్కారాలతో సత్కరించాయి.


అనాథలకు తల్లిగా మారి:

ఎలాంటి కల్మషమెరుగని పిల్లలంటే జోలీకి ఎంతో ప్రేమ. ఆమె తొలిసారి కాంబోడియాకు చెందిన ఏడు నెలల అనాథ బాలుడు మడాక్స్‌ను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఇథియోపియాలోని అనాథాశ్రమం నుంచి ఆరు నెలల బాలికను దత్తత తల్లిగా అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత జోలీ, బ్రాడ్‌పిట్‌ దంపతులు ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. ఆ చిన్నారి ఫొటోలను కొన్ని మీడియా సంస్థలకు ఇవ్వడం ద్వారా వచ్చిన 7.6 మిలియన్‌ డాలర్లను యూనిసెఫ్‌ సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత వియత్నాంలోని మూడేళ్ల అనాథ బాలుడికీ దత్తత తల్లిగా మారింది జోలీ. వీరి తర్వాత జోలీ, పిట్‌ దంపతులకు కవల పిల్లలు(కుమారుడు, కుమార్తె) జన్మించారు. వారి ఫొటోల కోసం మీడియా సంస్థలు చెల్లించిన సుమారు 14 మిలియన్ల డాలర్లను తమ సొంత సంస్థ జోలీ పిట్‌ ఫౌండేషన్‌ కోసం వినియోగించారు.

వివాహ బంధం మూడుసార్లు విఫలం:

జోలీ ఇప్పటివరకూ మూడు సార్లు వివాహం చేసుకుంది. అయితే ఆ మూడు బంధాలు విడాకులతో ముగిసిపోయాయి. ‘హ్యాకర్స్‌’ చిత్రంలో నటిస్తున్నప్పుడు సహ నటుడు జానీ లీ మిల్లర్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ పెళ్లికి తన టీషర్టు మీద మిల్లర్‌ పేరును తన రక్తంతో రాసుకుని వచ్చింది జోలీ. అయితే మూడేళ్లకు వారు విడిపోయారు. ఆ తర్వాత మరో నటుడు బిల్లీ బాబ్‌ థార్న్‌టన్‌ను ప్రేమించింది. తమ ప్రేమకు గుర్తుగా జోలీ రక్తం నింపిన లాకెట్‌ను బిల్లీ, అతని రక్తం నింపిన లాకెట్‌ను జోలీ ధరించి తిరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నా ఆ బంధం విరిగిపోయింది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌ చిత్రీకరణ సమయంలో అప్పటికే వివాహమైన బ్రాడ్‌పిట్‌తో ప్రేమలో పడింది జోలీ. ఆ తర్వాత పిట్‌ విడాకులు తీసుకున్నాడు. పిట్, జోలీ తొమ్మిదేళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ బంధం కూడా రెండేళ్లకే ముగిసిపోయింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.