ఇనుప కండరాల నటుడు...ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌

‘‘ఉక్కులాంటి శరీరం..’’ ఇది మనం సాధారణంగా ఎప్పుడూ వింటుండే మాటే..

కానీ ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్‌ను చూస్తే మాత్రం ‘‘అది ఉక్కును మించిన దేహం..’’ అనేస్తారు.

అతను పెద్ద పెద్ద ట్రక్కుల్ని తన బలప్రయోగంతో చిన్నకార్ల సైజుకు నలిపేయగలడు..

మనుషుల పుర్రెల్ని అరచేత్తో నొక్కి నుగ్గునుగ్గు చేసేయగలడు..

పెద్దపెద్ద భవంతుల్ని సైతం ఒక్క గుద్దుతో పిండిపిండి చేసేయగలడు..

అయ్యో! అలా అని అతన్ని చూసి భయపడాల్సిన పనిలేదు..

ఎందుకంటే అవన్నీ అతను వెండితెరపై చేసే స్టంట్లే..

కండలు పెంచాలనుకునే కుర్రకారుకు ఆర్నాల్డ్‌ అంటే ఓ స్ఫూర్తిప్రదాత..

అమ్మాయిల మదిలో గుబులు రేపే గ్రీకువీరుడు..

కథానాయకుడన్న పేరుకు నిలువెత్తు నిర్వచనం.. ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌.


అది నోరుతిరగడానికి కష్టమైన పేరు. అందుకే ప్రపంచ సినీ ప్రియులంతా అతన్ని ముద్దుగా ఆర్నాల్డ్‌ అనే పిలుచుకుంటారు. ఒళ్లమ్ముకునే ఆడవాళ్ల గురించి మనం విన్నాం.. అయితే అలాంటి మగవాళ్లు కూడా ఉంటారని నిరూపించిన వాడు ఆర్నాల్డ్‌. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే అతను ‘బాడీబిల్డింగ్‌’ అదేనండి ‘కండలు పెంచే’ విధానాల గురించి ఎన్నో పుస్తకాలు, వీడియో టేపులు, రికార్డులు రూపొందించి వాటి అమ్మకం ద్వారా ఎంతో సంపాదించాడు. కథానాయకుడిగా మారడాని కన్నా ముందే తన కండలు తిరిగిన దేహంతో ‘మిస్టర్‌ ఒలింపియా’గా ఏడుసార్లు, ‘మిస్టర్‌ యూనివర్స్‌’గా ఐదుసార్లు, ‘మిస్టర్‌ వరల్డ్‌’గా ఒకసారి ఎన్నికై ప్రపంచం దృష్టిని ఆకర్షించాడీ ఆస్ట్రియా అందగాడు. నటుడిగా, మోడల్‌గా, వ్యాపారవేత్తగా, రాజకీయనాయకుడిగా ఆర్నాల్డ్‌ విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కాలిఫోర్నియాకు 38వ గవర్నర్‌గా ఆర్నాల్డ్‌ సేవలందించాడు.


* పోలీసు కావాలనుకొని బాడీబిల్డర్‌గా..

ఆర్నాల్డ్‌ స్వార్జెనెగర్‌ ఆస్ట్రియాలోని థాల్‌ అనే చిన్నపల్లెటూరిలో 1947 జులై 30న జన్మించాడు. తండ్రి గుస్టావ్ స్వార్జెనెగర్‌‌ ‌ పోలీసు అధికారి. తల్లి ఆరేలియా జాడెర్నీ. ఆర్నాల్డ్‌ చిన్నతనం నుంచి పాఠశాలలో చదువులో అంత చురుగ్గాలేకపోయినా క్రీడల్లో ఎంతో చురుగ్గా ఉండావాడు. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడేవాడు. వాస్తవానికి మొదట్లో అతను సాకర్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్లకు తన తండ్రిలాగే పోలీస్‌ అధికారి కావాలనుకున్నాడు. అవన్నీ చేయాలి అనుకున్నవే కానీ ఆర్నాల్డ్‌ కచ్చితంగా ఇదే నా కెరీర్‌ అని గట్టిగా నిర్ణయించుకుంది మాత్రం తన 14వ ఏటనే. అప్పుడే బాడీబిల్డర్‌గా మారాలని ఓ దృఢమైన సంకల్పాన్ని తన మనసులో నాటుకున్నాడు ఆర్నాల్డ్‌. అయితే అంతకు ముందువరకు ఎక్కువగా సాకర్‌ ఆడటం వల్ల ఆర్నాల్డ్‌ చాలా బక్కపల్చగా కనిపించేవాడు. దీంతో తాను బాడీబిల్డర్‌గా తయారవ్వగలనా అన్న అనుమానం ఆర్నాల్డ్‌లో ఉండేదట. ఆర్నాల్డ్‌ బాడీబిల్డింగ్‌లో రెగ్‌ పార్క్, స్టీవ్‌ రీవ్స్, జాని విస్మల్లర్‌ వంటి వారిని చూసి స్ఫూర్తిపొందేవాడు. స్థానిక థియేటర్లలో ప్రదర్శితమయ్యే వారి చిత్రాలను చూస్తూ వారిలా తయారవ్వాలనే కసి, పట్టుదలతో గంటలకొద్దీ జిమ్‌లో శ్రమించేవాడు ఆర్నాల్డ్‌. శరీరంపై మెదడు శక్తిని తెలుసుకునేందుకు 15ఏళ్ల వయసులో సైకాలజీ నేర్చుకున్నాడు. ఇక ఆర్నాల్డ్‌ తన పదిహేడవ ఏట నుంచి బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అతను తొలినాళ్లలో గెలుచుకున్న పోటీల్లో 1965లో జరిగిన జూనియర్‌ మిస్టర్‌.యూరోప్‌ పోటీ ఒకటి. దాని తర్వాత 23 ఏళ్ల వయసులో తొలిసారి మిస్టర్‌. ఒలంపియాగా నిలిచి అత్యంత చిన్నవయసులో ఈ రికార్డును అందుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ రికార్డు నేటికీ పదిలంగానే ఉంది. అక్కడి నుంచి ఏడుసార్లు మిస్టర్‌ ఒలంపియాగా, ఐదుసార్లు మిస్టర్‌ యూనివర్స్‌గా, ఓసారి మిస్టర్‌ వరల్డ్‌గా నిలిచి బాడీబిల్డింగ్‌ సామ్రాజ్యానికి రారాజులా వెలుగొందాడు.

article image
* సరదాగా సినిమాల్లోకి...

ఓవైపు బాడీబిల్డర్‌గా రాణిస్తూనే మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగుపెట్టి రెండు చేతులా సంపాదించడం మొదలుపెట్టాడు ఆర్నాల్డ్‌. అంతటితో ఊరుకోకుండా అంగబలం, అర్థబలం ఉన్నాయి కనుక సరదాగా సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే మంచి బాడీబిల్డర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పెద్దగా కష్టపడకుండానే యాక్షన్‌ హీరోగా అవకాశాలు వరుసకట్టాయి. అలా 1970లో తొలిసారి ‘హెర్కు¬్యలస్‌ ఇన్‌ న్యూయార్క్‌’ చిత్రంతో హాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశారు ఆర్నాల్డ్‌. అది మంచి విజయాన్నందుకుంది. తర్వాత ‘స్టే హంగ్రీ’ చిత్రంలో చెవిటి, మూగ వ్యక్తిగా మాబ్‌ హిట్‌ మాన్‌ పాత్రలో నటించారు. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను సాధించింది. ఇందులో ఆర్నాల్డ్‌ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కడంతో పాటు ఆ చిత్రానికి గాను ‘గోల్డెన్‌ గ్లోబ్‌ ఫర్‌ న్యూ మేల్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ‘పంపింగ్‌ ఐరెన్‌’, ‘కోనన్‌ ది బార్బేరియన్‌’, కోనన్‌ ది డెస్ట్రాయరర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో హాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆర్నాల్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం హాలీవుడ్‌ దర్శకధీరుడు జేమ్స్‌ కామెరూన్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రం ‘ది టర్మినేటర్‌’తో ఆర్నాల్డ్‌ నటుడిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 6.4 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 78.9 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించి హాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘ప్రిడేటర్‌’, ‘ది రన్నింగ్‌ మ్యాన్‌’, ‘టెర్మినేటర్‌−2’, ‘టెర్మినేటర్‌−3’, ‘ది ఎక్స్‌పాండబుల్‌’, ‘ఎక్స్‌పాండబుల్‌−2’, ‘ఎక్స్‌పాండబుల్‌−3’, ‘ఎస్కేప్‌ ప్లాన్‌’, వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించాడు.


* అమ్మాయిల మదిలో కలల రాకుమారుడు..

డబ్బున్న మనిషి చుట్టూ బంధువులు మాత్రమే కాదు అందమైన ఆడపిల్లలు చేరొచ్చు! ఇక ఆర్నాల్డ్‌లాంటి గ్రీకువీరుడిని చూస్తే ఇక చెప్పేదేముంటుంది. మరియ ష్రైవర్‌ కూడా అందరమ్మాయిల్లాగే ఆర్నాల్డ్‌పై మనసు పారేసుకుంది. ఇంతకీ మరియ ష్రైవర్‌ ఎవరంటే?.. ఒకప్పటి అమెరికన్‌ అధ్యక్షుడైన జాన్‌ కెనెడీకి స్వయానా మేనకోడలు. ఆమెకి స్విమ్మింగ్‌ అన్నా, టెన్నిస్‌ అన్నా ప్రాణం. కానీ ఆర్నాల్డ్‌లాంటి అందగాడిని చూశాక, అవన్నీ ‘ఆఫ్ట్రాల్‌’ అనుకొని అతన్ని ఆరాధించడం మొదలుపెట్టింది. తర్వాత ఇద్దరూ దంపతులయ్యారు. ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. కానీ నేటికీ 71 ఏళ్ల వయసులోనూ ఉక్కులాంటి శరీరంతో వన్నెతగ్గని వీరుడిగా సినీప్రియుల హృదయాలను దోచుకుంటున్నాడు. ఆర్నాల్డ్‌ ప్రస్తుతం ‘ది ఎక్స్‌పాండబుల్‌−4’ చిత్రంతో పాటు ‘టెర్మినేటర్‌’ సిరీస్‌లో వస్తున్న మరో సినిమాలోనూ నటిస్తున్నారు.

 Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.