హాంగ్‌కాంగ్‌ యాక్షన్‌ హీరో

బ్రూస్‌లీ, జాకీచాన్‌లాంటి నటుల తర్వాత యాక్షన్‌ హీరోగా తనదైన ముద్రవేసిన చౌ యున్‌ఫ్యాట్‌ పేరు చెప్పగానే, ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. ‘ఎ బెటర్‌ టుమారో’, ‘ద కిల్లర్‌’, ‘హార్డ్‌బాయిల్డ్‌’, ‘క్రౌంచింగ్‌ టైగర్‌ హిడెన్‌ డ్రాగన్‌’, ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియాన్‌: ఎట్‌ వరల్డ్స్‌ ఎండ్‌’ లాంటి సినిమాల్లో ఇతడి నటన అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. ఉత్తమ నటుడిగా మూడు హాంగ్‌కాంగ్, రెండు గోల్డెన్‌ హార్స్‌ అవార్డులు అందుకున్న ఇతడి విలువ వ్యాపారాత్మకంగా 5.6 హాంగ్‌కాంగ్‌ డాలర్లని అంచనా.




కరెంటు లేని ఇంటి నుంచి...:

హాంగ్‌కాంగ్‌లో 1955 మే 18న పుట్టిన ఇతడి తల్లి కూరగాయలు పండించే రైతు అయితే, తండ్రి ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌. కరెంట్‌ కూడా లేని ఇంట్లో తల్లిదండ్రులకు సాయం చేయడం కోసం తెల్లవారుజామునే లేచి వీధుల్లో తేనీరుతో పాటు ఆహార పదార్థాలు అమ్మేవాడు. మధ్యాహ్నం పొలం పనులు చేసేవాడు. చదువును మధ్యలోనే ఆపేసి బెల్‌బాయ్, పోస్ట్‌మ్యాన్, కెమేరా సేల్స్‌మ్యాన్, టాక్సీడ్రైవర్‌గా రకరకాల పనులు చేసి కాస్తో కూస్తో ఆర్జించేవాడు. ఓసారి పేపర్లో టీవీ నటులు కావాలనే ప్రకటన చూసి వెళ్లడమే అతడి జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. టీవీ ద్వారా అతడు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎప్పటికైనా వెండితెరకెక్కాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేసేవాడు. అలా హాంగ్‌కాంగ్‌ దర్శక నిర్మాత జాన్‌వూ దృష్టిలో పడి ‘ఎ బెటర్‌ టుమారో’లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆపై అతడి జీవితంలో అన్నీ ‘బెటర్‌ టుమారో’లే వచ్చాయి. అతడిని కోట్లకు పడగలెత్తేలా చేశాయి!



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.