అందాల యువ తార... ఎమ్మా వాట్సన్‌
ఆమె ‘హ్యారీ పోటర్‌’ మాయా ప్రపంచానికి మకుటం లేని మహరాణి...
బార్బీ బొమ్మలా ముద్దులొలికే రూపం...
పికాసో కుంచె నుంచి జాలువారిందా అన్నట్లుండే సోయగం...
ప్రపంచాన్ని మెప్పించిన అందాల అభినయ రాశి ఎమ్మా వాట్సన్‌...


సాధారణంగా ఆరేళ్లప్రాయమున్న పిల్లలు ఏం చేస్తుంటారు..! ఏముందీ... అప్పుడప్పుడే పుస్తకాలతో కుస్తీలు పట్టడం మొదలెడుతుంటారు. అమ్మానాన్నల ప్రేమలో గారాలు పోతుంటారు. అల్లరి, ఆటపాటలతో మధురమైన బాల్యాన్ని చక్కగా ఆస్వాదిస్తుంటారు. కానీ ఎమ్మావాట్సన్‌ మాత్రం ఆరేళ్ల వయసుకే తన జీవితానికి ఓ చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రపంచం మెచ్చే నటిగా ఎదగాలనుకుంది. అనుకున్నట్లుగానే తొమ్మిదేళ్లకే ఆ లక్ష్యాన్ని సగర్వంగా చేరుకుంది. జె.కె.రౌలింగ్‌ సృష్టించిన ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌తో బాల నటిగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ప్రపంచ సినీ ప్రియులను తనవైపు తిప్పుకుంది ఎమ్మా. పట్టుమని పద్దెనిమిదిళ్లు కూడా నిండక ముందే వేల మిలియన్‌ డాలర్ల సంపాదనతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన యువతారగా వెలుగులు చిందించింది. నేడు హాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతోంది.


* నటిగా స్కూల్‌ స్థాయి నుంచే ప్రశంసల జల్లు..
ఎమ్మా అసలు పేరు.. ఎమ్మా చార్లోటే డ్యుర్రే వాట్సన్‌. 1990 ఏప్రిల్‌ 15న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జన్మించింది. బ్రిటీష్‌ న్యాయవాదులు జాక్వలిన్‌ లిస్బీ, క్రిస్‌ వాట్సన్‌ ఆమె తల్లిదండ్రులు. తనకు ఐదేళ్ల వయసు వరకు పారిస్‌లోనే పెరిగిన ఎమ్మావాట్సన్‌ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తల్లితో కలిసి ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చేరుకుంది. ఆరేళ్ల వయసులో నటిగా మారాలని నిర్ణయించుకున్న ఎమ్మావాట్సన్‌ అందుకోసం కొన్ని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ‘స్టేజ్‌కోచ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌’లో కొన్నేళ్లపాటు నటనలో శిక్షణ తీసుకొంది. ఎమ్మా జీవితాన్ని మలుపు తిప్పింది ఆ స్టేజ్‌కోచ్‌ థియేటరే. అక్కడే పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం నేర్చుకుంది ఎమ్మా. ఓవైపు పాఠశాల్లో చదువుకుంటూనే ‘ఆర్థుర్‌: ది యంగ్‌ ఇయర్స్‌’, ‘ది హ్యాపీ ప్రిన్స్‌’ వంటి పలు నాటకాల్లో నటించి అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులను మెప్పించింది ఎమ్మావాట్సన్‌. అంత చిన్నవయసులో నటనలో ఆమె పలికించే హావభావాలు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.


* తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు..
బ్రిటీష్‌ రచయిత్రి జె.కె.రౌలింగ్‌ రాసిన నవల ఆధారంగా ‘హ్యారీ పోటర్‌ ది ఫిలాసఫెర్స్‌ స్టోన్‌’ సినిమాను తెరకెక్కించేందుకు 1999లో నటీనటుల ఎంపిక మొదలైంది. అందులో ముఖ్య పాత్రలైన హ్యారీపోటర్, హ్యారీ ప్రాణ స్నేహితులైన హెర్మియాన్‌ గ్రాంజెర్, రాన్‌ వెస్లే క్యారెక్టర్ల కోసం అప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలైంది. అదే సమయంలో ఆక్స్‌ఫర్డ్‌ థియేటర్‌ ఉపాధ్యాయుడి ద్వారా చిత్ర బృందానికి ఎమ్మావాట్సన్‌ గురించి తెలిసింది. చిత్రంలోని హెర్మియాన్‌ గ్రాంజెర్‌ పాత్ర కోసం ఎమ్మాను పరిశీలించగా.. ఆమెలోని నటనా కౌశలం, ధైర్యం చూసి నిర్మాతలు ఎంతో అబ్బురపడ్డారు. మరోవైపు రచయిత్రి జె.కె.రౌలింగ్‌ సైతం ఆ పాత్రకు ఎమ్మానే సరైనదని చిత్ర బృందానికి సూచించడంతో ఎంపిక అంతా చకచకా జరిగిపోయింది. అలా తొమ్మిదేళ్ల వయసులో ఎమ్మావాట్సన్‌ తొలిసారి కెమెరా ముందుకు నిలబడింది. 2001లో విడుదలైన ‘హ్యారీ పోటర్‌ అండ్‌ ది ఫిలాసఫర్స్‌ స్టోన్‌’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా చిత్రంలోని మూడు పాత్రలకు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. హెర్మియన్‌ గ్రాంజెర్‌గా ఎమ్మా వాట్సన్‌ తొలి చిత్రంతోనే ఐదు అవార్డులు అందుకోవడంతో పాటు యువ నటిగా ‘యంగ్‌ ఆర్టిస్ట్‌ అవార్డు’ను గెలుచుకుంది. ‘ది డెయిలీ టెలిగ్రాఫ్‌’, ‘ఐజిఎన్‌’ వంటి ప్రముఖ సంస్థలు సైతం ఎమ్మా నటనను ఎంతో ప్రశంసించాయి. తర్వాత ఆ సిరీస్‌లో వరుసగా ‘హ్యారీ పోటర్‌ అండ్‌ ది ఛాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్‌’ (2002), హ్యారీ పోటర్‌ అండ్‌ ది ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్కాబాన్‌’ (20004), ‘హ్యారీ పోటర్‌ అండ్‌ ది గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌’ (2005), ‘హ్యారీ పోటర్‌ అండ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫినిక్స్‌’ (2007), ‘హ్యారీ పోటర్‌ అండ్‌ ది హాఫ్‌ బ్లడ్‌ ప్రిన్స్‌’ (2009) చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రియులను అలరించి వారందరి అభిమానాన్ని చూరగొంది ఎమ్మా వాట్సన్‌. వీటిలో ‘ప్రిజినర్‌ ఆఫ్‌ అజ్కాబాన్‌’కు రెండు వోట్టో అవార్డులు, టోటల్‌ ఫిల్మ్‌ నుంచి ఛైల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఆఫ్‌ ది ఇయర్, ‘గ్లోబెట్‌ ఆఫ్‌ ఫైర్‌లో నటనకు కాంస్య వోట్టో అవార్డు, ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫోనిక్స్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా ‘నేషనల్‌ మూవీ అవార్డు’ను, మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకుంది.


* నటిస్తూ.. చదువుల్లో రాణిస్తూ..
ఎమ్మా వాట్సన్‌కు చిన్నతనం నుంచి నటనపై ఎంత ఆసక్తి ఉన్నా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఓవైపు నటిస్తూనేే సెట్లో విరామం దొరికినప్పుడల్లా పుస్తకాలను ముందేసుకొనేది. అంతేకాదు సెట్లో ఉన్న తన మిగతా సహచరులకూ ఎమ్మావాట్సన్‌ చదువు చెప్తుండేది. ఆమె పాఠశాల స్థాయిలో ఆంగ్ల సాహిత్యం, భూగోళశాస్త్రం, ఆర్స్ట్‌లో పరీక్షల్లో ఏ గ్రేడ్‌లు, మరో ఏడు సబ్జెక్ట్‌లలో ఏ ప్లస్‌ గ్రేడ్‌లు సాధించింది. ఎమ్మా వాట్సన్‌ హిస్టరీ ఆఫ్‌ ఆర్స్ట్‌లో అడ్వాన్సెడ్‌ సబ్సిడెరీ లెవల్‌ను సాధించింది. ఎమ్మావాట్సన్‌ హ్యారీ పోటర్‌ సిరీస్‌ చిత్రాల ద్వారా చిన్నవయసులోనే కొన్ని వేల మిలియన్‌ డాలర్ల సంపాదనను ఆర్జించింది. 2009 ఫోర్బ్స్‌ ‘అత్యంత ప్రజాదరణ పొందిన యువతారల’ జాబితాలోనూ, ఆస్క్‌మెన్‌ ‘టాప్‌ 99 అవుట్‌ స్టాండింగ్‌ ఉమెన్స్‌ 2015’ జాబితాలోనూ ఎమ్మావాట్సన్‌ చోటుదక్కించుకుంది. హ్యారీ పోటర్‌ సిరీస్‌ తర్వాత ఎమ్మావాట్సన్‌ నటించిన ‘ది బ్లింగ్‌ రింగ్‌’ (2013), ‘దిస్‌ ఈజ్‌ ది ఎండ్‌’ (2013), ‘నోవా’ (2014), ‘రిగ్రెషన్‌’ (2015), ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’ (2017), ‘ది సర్కిల్‌’ (2017) చిత్రాలు నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా హెర్మియాన్‌ గ్రాంజెర్‌ పాత్ర తర్వాత ఎమ్మా వాట్సన్‌కు అంత పేరుతెచ్చిన పాత్ర ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’లోని బెల్లీ క్యారెక్టర్‌.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.