అభిమాన సంద్రంలో ఆమెకు మరణమే లేదు
‘టైటానిక్‌’.. కేట్‌ విన్‌స్లెట్‌.. ఈ రెండు పేర్లు తెలియని సినీ ప్రేమికులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. మరపురాని ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా ‘టైటానిక్‌’ చిరస్థాయిగా ఎలా నిలిచిపోయిందో, ఆ చిత్రంలో రోజ్‌ పాత్రతో కేట్‌ పేరు అంతే శాశ్వతంగా నిలిచిపోయింది. కేట్‌ అంటే అందమొక్కటే కాదు.. అంతకు మించిన అభినయం కూడా. ఆమె ఇంట కొలువుదీరిన ఆస్కార్, ఎమ్మీ, గ్రామీ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలే అందుకు నిదర్శనం. ‘టైటానిక్‌’ ప్రమాదంలో రోజ్‌ మృత్యుంజయురాలిగా నిలిచింది. అలాగే కేట్‌ విన్‌స్లెట్‌ కూడా అభిమానుల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయింది. 42 ఏళ్ల వయసులోనూ క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటున్న కేట్‌ విన్‌స్లెట్‌ జీవిత విశేషాలివీ.

article image

కేట్‌ విన్‌స్లెట్‌ కుటుంబంలో తాతల తరం నుంచి అందరూ నటులే. తాత, అమ్మమ్మ రంగస్థల నటులు. స్వయంగా డ్రామా కంపెనీ నడిపేవారు. కేట్‌ తండ్రి కూడా నటుడే. అయితే సినిమా అవకాశాల కోసం ఆయన చాలా శ్రమిస్తూ ఉండేవారు. తల్లి వెయిట్రెస్‌గా పనిచేసేది. దీంతో కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉండేది. తండ్రి, తాతల ప్రభావంతో కేట్‌కు చిన్నప్పటినుంచే నటన పట్ల ఇష్టమేర్పడింది. స్కూల్‌ నాటకాల్లో నటించేది. ఐదేళ్ల వయసులో మేరీ మాత పాత్ర వేసింది. స్కూల్‌ డ్రామా మెంబర్‌గా 20కి పైగా నాటకాల్లో నటించింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కనిపించే అవకాశం కూడా వచ్చింది. స్కూల్‌ చదువులు పూర్తయ్యాక 15 ఏళ్ల వయసులో బీబీసీ సైన్స్‌ ఫిక్షన్‌ టీవీ సిరీస్‌ ‘డార్క్‌ సీజన్‌’లో నటించింది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్టా¬్య ఓ ఆహార పదార్థాల విక్రయశాలలో పనిచేసింది.

ఈ మెరుపు తీగ ఒకప్పుడు భారీకాయం..
కేట్‌ చిన్నప్పుడు చాలా లావుండేది. ఆ కారణంతోనే స్కూల్‌ నాటకాల్లో ప్రధాన పాత్రలు ఇచ్చేవారు కాదట. 16 ఏళ్ల వయసుకే 84 కిలోలు ఉండేదట. అప్పుడే ఓ బుల్లితెర చిత్రంలో ఊబకాయం ఉన్న మహిళకు కూతురి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తన ఆకారం గురించి చేసిన వ్యాఖ్యలతో ఎలాగైనా నాజూగ్గా తయారవ్వాలని నిర్ణయించుకుంది. పట్టుదలతో కసరత్తులు చేసి మెరుపుతీగలా తయారయింది.

175 మందిని దాటి మరీ నిలిచింది..
19 ఏళ్ల వయసులో ‘హెవెన్లీ క్రీచర్స్‌’ చిత్రంతో వెండితెర ప్రవేశం చేసింది కేట్‌. ఆ చిత్రం కోసం 175 మందిని ఆడిషన్‌ చేస్తే, వారిలో కేట్‌ తన ప్రతిభతో మెప్పించి పాత్రను సొంతం చేసుకోవడం గమనార్హం. ఓ యథార్థ హత్యోదంతంతో తెరకెక్కిన ఈ చిత్రంలో, బాయ్‌ఫ్రెండ్‌ చేసిన హత్యకు సహకరించిన టీనేజ్‌ అమ్మాయిగా నటించింది కేట్‌. ఆ వయసులోనే తన పాత్ర కోసం చాలా అధ్యయనం చేసింది. హత్యకు సంబంధించి కోర్టు విచారణ పత్రాలను క్షుణ్నంగా చదవడంతో పాటు, అందులో సంబంధమున్న వ్యక్తులతో మాట్లాడి పాత్ర కోసం సన్నద్ధమైంది. ఆమె శ్రమకు తగిన ఫలితం దక్కింది. తొలి చిత్రంలోనే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తాయ్‌ చీ.. పియానో.. ప్రశంసలు..
తొలి చిత్రం తర్వాత ‘సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ’లో కేట్‌కు అవకాశం వచ్చింది. పాత్ర సన్నద్ధతలో భాగంగా తాయ్‌ చీ అనే మార్షల్‌ ఆర్ట్‌¬్సతో పాటు పియానో వాయించడం నేర్చుకోమని దర్శకుడు సూచిస్తే ఎంతో శ్రమకోర్చి నేర్చుకుంది. ఆమె కష్టం వృథా పోలేదు. ఆ చిత్రంతో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. బాఫ్టా అవార్డు సొంతమైంది. ఈ చిత్రం తర్వాత ఎ కిడ్‌ ఇన్‌ కింగ్స్‌ ఆర్థర్‌ కోర్ట్, జూడ్, హమ్లెట్‌ చిత్రాల్లో నటించింది కేట్‌.

టైటానిక్‌తో గ్లోబల్‌ స్టార్‌గా..
కేట్‌ విన్‌స్లెట్‌ కెరీర్‌లో ‘టైటానిక్‌’ చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో ప్రియురాలిగా నటించిన కేట్‌ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైపోయింది. రోజ్‌ పాత్రలో తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది కేట్‌. నిజానికి రోజ్‌ పాత్ర కోసం తొలుత కామెరూన్‌ ఎవరైనా అగ్రకథానాయికను ఎంచుకోవాలని అనుకున్నారు. అయితే కేట్‌ ఆ పాత్రను తానే చేస్తానని పట్టుబట్టి కామెరూన్‌ను ఒప్పించింది. చిత్రీకరణలో భాగంగా ఎక్కువ రోజులు చల్లటి నీటిలో ఉండాల్సిరావడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. అయినా వాటన్నిటినీ అధిగమించి తను ప్రేమించిన రోజ్‌ పాత్రలో జీవించింది. ఈ చిత్రంతో కేట్‌కు ఉత్తమ నటిగా ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. ఈ చిత్రంతో రాత్రికి రాత్రి వచ్చిన తన స్టార్‌డమ్‌తో భారీ చిత్రాల కోసం ఎగబడలేదు కేట్‌. తను నటనలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ లో బడ్జెట్‌ చిత్రాలనే ఎంపిక చేసుకోవడం విశేషం. హైడియస్‌ కింకీ, హోలీ స్మోక్, క్విల్స్, ఎనిగ్మా లాంటి చిన్న చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది.

చీరకట్టు.. నుదుట బొట్టు...
కేట్‌ భారతీయ స్త్రీలా చీరకట్టి నుదుట బొట్టుపెట్టి ఓ చిత్రంలో నటించింది. అదే ‘హోలీ స్మోక్‌’. భారతదేశంలోని ఓ బాబా దగ్గర శిష్యురాలిగా చేరడానికి వచ్చే ఆస్ట్రేలియా మహిళగా ఆ చిత్రంలో నటించింది కేట్‌. ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో పూర్తి నగ్నంగా కనిపించాల్సి ఉండగా ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించి సంచలనం రేపిందామె.

ఆరునెలల బిడ్డతో సెట్‌కు..
ఐర్లాండ్‌కు చెందిన నవలా రచయిత్రి ఐరిస్‌ ముర్డోచ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఐరిస్‌’లో యుక్తవయసులో ఉన్న ఐరిస్‌గా సహాయ పాత్రలో నటించింది కేట్‌. తన ఆరు నెలల పసిబిడ్డతో కలసి సెట్‌కు వెళ్లి నటించేది. ఐరిస్‌ రాసిన నవలలు, ఆమె ఇంటర్వ్యూలు చదివి పాత్రను ఆకళింపు చేసుకుని నటించింది. ఈ చిత్రంతో ఆమె ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ నామినేషన్‌ అందుకుంది. ఇది ఆమెకు దక్కిన మూడో ఆస్కార్‌ నామినేషన్‌.

అందిన ఆస్కార్‌ ఫలం..
‘ఎటర్నల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ ది స్పాట్‌లెస్‌ మైండ్‌’ చిత్రంతో నాలుగో సారి, ‘లిటిన్‌ చిల్డ్రన్‌’తో ఐదోసారి ఆస్కార్‌ బరిలో నిలిచింది కేట్‌. ఆ రెండు చిత్రాలకూ ఉత్తమ నటి విభాగంలో ఆమెకు నామినేషన్లు దక్కాయి. అయితే పురస్కారం కల మాత్రం నెరవేరలేదు. చివరికి ఆరోసారి ఆమె ఆశ ఫలించింది. ‘ది రీడర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఆస్కార్‌ పురస్కారం గెలుచుకుంది. 33 ఏళ్ల వయసుకే తన ఖాతాలో ఆరు ఆస్కార్‌ నామినేషన్లు వేసుకున్న కేట్, అతి పిన్న వయసులో ఆరు ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఆ పాత రికార్డు కూడా కేట్‌ పేరునే ఉండటం విశేషం. స్టీవ్‌ జాబ్స్‌ జీవితకథతో తెరకెక్కిన ‘స్టీవ్‌ జాబ్స్‌’ చిత్రంతో మరోసారి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ నామినేషన్‌ అందుకుంది కేట్‌. ఫైండింగ్‌ నెవర్‌ల్యాండ్, ది హాలిడే, ది డ్రెస్‌మేకర్‌ తదితర చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘మైల్డ్‌రెడ్‌ పియర్స్‌’ టీవీ సిరీస్‌కుగానూ ఎమ్మీ అవార్డు గెలుచుకుంది. రచయిత్రిగా మారి ఆటిజం వ్యాధి గురించి ఓ పుస్తకం రాసింది. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. సినిమాల్లో తాను వాడిన వస్తువులు, స్వయంగా డిజైన్‌ చేసిన వస్తువులను వేలం వేసి వచ్చిన నిధులను ధార్మిక సంస్థలకు విరాళంగా ఇచ్చింది.

అవతార్‌ సీక్వెల్‌లో..
తనకు ‘టైటానిక్‌’ లాంటి మరపురాని చిత్రాన్నిచ్చిన జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో మరోసారి నటిస్తోంది కేట్‌. ‘అవతార్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ‘అవతార్‌ 2’లో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇదే కాక నాలుగు పదులు దాటిన వయసులో మరింత ఉత్సాహంతో విభిన్నమైన చిత్రాలను అంగీకరిస్తోంది. ప్రముఖ అమెరికన్‌ ఫ్యాషన్‌ మోడల్, ఫొటోగ్రాఫర్‌ లీ మిల్లర్‌ జీవితకథా చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

దాంపత్య జీవితం..
15 ఏళ్ల వయసులో తన తొలి టీవీ సిరీస్‌లో కలసి నటించిన తనకన్నా 12 ఏళ్లు పెద్దవాడైన స్టీఫెన్‌ ట్రెడర్‌తో ప్రేమలో పడింది. నాలుగేళ్ల తర్వాత వారు విడిపోయారు. అయినా అతనంటే కేట్‌కు అభిమానమే. ఆ తర్వాత అతను ఎముకల క్యాన్సర్‌తో చనిపోయాడు. అతని దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ‘టైటానిక్‌’ ప్రీమియర్‌ షోకు గైర్హాజరైంది. ‘హైడియస్‌ కింకీ’ చిత్రీకరణ సమయంలో సహాయ దర్శకుడు జిమ్‌ త్రియప్లెటన్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత విడిపోయింది. ఆ తర్వాత దర్శకుడు శామ్‌ మెండిస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నెడ్‌ రాక్‌ఎన్‌రోల్‌ అనే వ్యక్తిని వివాహమాడింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.