అన్నింట్లోనూ నేనున్నాను...

కొందరంతే. ఎన్నో రంగాల్లో దూసుకుపోతారు. అన్నింటిలోనూ తమదైన ముద్ర వేస్తారు. ‘వీడికి రాని విద్య లేదా?’ అని ఆశ్చర్యపరుస్తారు. అలాంటివాడే నికొలాస్‌ క్యానన్‌. అతడిని పరిచయం చేయాలంటే... యాక్టర్, ర్యాపర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెలివిజన్‌ ప్రెజెంటర్, రేడియో పెర్సనాలిటీ, కమేడియన్, సింగర్, సాంగ్‌రైటర్, రైటర్, బ్రాడ్‌కాస్టర్, ఎంటర్‌ప్రెన్యూర్, యాక్టివిస్ట్‌... అని ఓ పెద్ద జాబితా చెప్పాలి. టీవీల్లో ప్రేక్షకాదరణ పొందిన అనేక కార్యక్రమాలతో హుషారెత్తించాడు. ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’, ‘వైల్డ్‌ అండ్‌ ఔట్‌’లాంటి హిట్‌ ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా ఆకట్టుకున్నాడు. వెండితెరపై ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌2’, ‘డ్రమ్‌లైన్‌’, ‘లవ్‌ డోన్ట్‌ కాస్ట్‌ ఎ థింగ్‌’, ‘రోల్‌ బౌన్స్‌’, ‘వాటెవర్‌ ఇట్‌ టేక్స్‌’, ‘షల్‌ ఉయ్‌ డ్యాన్స్‌’, ‘ఈవెన్‌ మనీ’, ‘గోల్‌2: లైవింగ్‌ ద డ్రీమ్‌’, ‘డే ఆఫ్‌ ద డెడ్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌హాల్‌’, ‘నిక్‌ క్యానన్‌: ద వ్లాడ్‌ కౌచ్‌’లాంటి ఎన్నో సినిమాలతో అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాడు. కాలిఫోర్నియాలో 1980 అక్టోబర్‌ 8న పుట్టిన నికొలాస్‌ స్కాట్‌ క్యానన్, చిన్నప్పుడే మ్యూజిక్‌ రంగంలో అడుగుపెట్టాడు. ర్యాప్‌ గ్రూప్స్‌లో రఫ్ఫాడించాడు. ఆల్బమ్స్‌తో అదరగొట్టాడు. సింగిల్స్‌తో దూసుకుపోయాడు. రేడియో హోస్టింగ్‌తో రెపరెపలాడాడు. కామెడీ షోలతో కడుపుబ్బ నవ్విస్తూ ఊరూవాడా ప్రదర్శనలిచ్చాడు. వీటన్నింటితో పాటు ‘డు సమ్‌థింగ్‌’ అనే సంస్థ స్థాపించి సామాజిక సేవ చేస్తూ యువకులను కూడా ఆ బాటలో నడిపించాడు. ఇన్ని రంగాల్లో సేవలకు అనేక అవార్డులు అందుకుని ముందుకు సాగుతున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.