వడ్రంగి కొడుకు... జేమ్స్‌బాండ్‌!
అయిదో జేమ్స్‌బాండ్‌గా ప్రపంచ సినీ ప్రేక్షకులకు పరిచయమై నాలుగు సినిమాలతో అలరించిన పియర్స్‌ బ్రాస్నన్‌ పుట్టిన రోజు ఇవాళే. ఐర్లాండ్‌లోని ఓ చిన్న గ్రామంలో 1953 మే 16న పుట్టిన పియర్స్‌ బ్రెంన్‌ బ్రాస్నన్‌ అడుగులు, పదహారేళ్ల వయసు నుంచే నటనా రంగంవైపు పడ్డాయి. లండన్‌లోని డ్రామా సెంటర్‌లో నటన నేర్చుకున్న బ్రాస్నన్‌ నాటకాల ద్వారా పేరు సంపాదించి టీవీల్లోకి వచ్చాడు. అప్పట్లో ‘రెమింగ్టన్‌ స్టీలే’ (1982-1987) అనే రొమాంటిక్‌ కామెడీ సిరీస్‌ ద్వారా ఇంటింటి వీక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి ‘ద ఫోర్త్‌ ప్రోటోకాల్‌’, ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’లాంటి సినిమాల్లో నటించాడు. జేమ్స్‌బాండ్‌గా 1994లో అవకాశం వచ్చింది. ఆ పాత్రలో 1995 నుంచి 2002 వరకు వచ్చిన ‘గోల్డెన్‌ ఐ’, ‘టుమారో నెవర్‌ డైస్‌’, ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’, ‘డై ఎనదర్‌ డే’ సినిమాలతో ప్రపంచ సినీ అభిమానులకు ఆకట్టుకున్నాడు. బాండ్‌ పాత్ర తర్వాత ‘డాంటేస్‌ పీక్‌’, ‘ద థామస్‌ క్రౌన్‌ ఎఫైర్‌’, ‘మామ్మామియా’, ‘ద ఘోస్ట్‌ రైటర్‌’, ‘ద నవంబర్‌ మ్యాన్‌’ లాంటి సినిమాలలో నటించాడు.


వడ్రంగి పని చేసే థామస్‌ బ్రాస్నన్‌కు పుట్టిన ఇతడు, ఒడిదుడుకుల బాల్యాన్నే గడిపాడు. ఊహ తెలియని రోజుల్లోనే నాన్న వదిలిపెట్టేస్తే అమ్మ చేయి పట్టుకుని అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఎదిగాడు. అమ్మ లండన్‌లో నర్స్‌గా పనిచేస్తుంటే బోర్డింగ్‌ స్కూల్స్‌లో చదువుకున్నాడు. సవతి తండ్రి విలియం, బ్రాస్నన్‌కు 11 ఏళ్ల వయసులో చూపించిన బాండ్‌ సినిమా ‘గోల్డ్‌ఫింగర్‌’ అతడిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పటికైనా నటుడిని కావాలనుకున్నాడు. ఆ కోరికే అతడితో పాటు పెరిగి పెద్దదై అతడిని నటుడినే కాదు, జేమ్స్‌బాండ్‌గా కూడా మార్చేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.