ఏం చేసినా సంచలనమే...

స్టేజి ఎక్కి కమేడియన్‌గా నవ్వించడమే కాదు...

వేదికలెక్కి నిలదీయగలదు...

టీవీ షోల ద్వారా ప్రముఖులనైనా ప్రశ్నించగలదు...

సంచలన ప్రకటనలు కూడా ఆమెకు అలవాటే...

‘అవును నేను స్వలింగ సంపర్కురాలినే!’ అంటుందోసారి!

అలాంటివారి హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహిస్తుందింకోసారి!

డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలిని, జార్జి బుష్‌ శైలిని కూడా ఏకిపారేయగలదు!

వీటితో పాటు మ్యాగజైన్‌ ఎడిటర్‌గా సంచలన వ్యాసాలు కూడా ప్రచురించగలదు!ఇలా... నటిగా, కమేడియన్‌గా, నిర్మాతగా, రచయిత్రిగా, టీవీ ప్రముఖురాలిగా సంచలన పథంలో దూసుకుపోతున్న ఆమే... రోజీ ఒడోనెల్‌. ‘క్వీన్‌ ఆఫ్‌ నైస్‌’ అనే ముద్దు పేరుతో ప్రాచుర్యం సంపాదించుకుంది. టీనేజిలోనే వేదికలెక్కి కమేడియన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె, అడుగడుగునా తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ సాగిపోతోంది. టీవీల్లో ప్రత్యేకంగా టాక్‌షోలు నిర్వహించింది. రేడియోల ద్వారా గళాన్ని వినిపించింది. మ్యాగజైన్‌లకు ఎడిటర్‌గా వ్యవహరించింది. ఎన్నో పుస్తకాలు వెలువరించింది. ‘స్లీప్‌లెస్‌ ఇన్‌ సియాటిల్‌’, ‘ఎనదర్‌ స్టేకౌట్‌’, ‘ఫ్యాటల్‌ ఇన్‌స్టింక్ట్‌’, ‘ఐ విల్‌ డూ ఎనీథింగ్‌’, ‘ఎగ్జిట్‌ టు ఈడెన్‌’, ‘నౌ అండ్‌ దెన్‌’, ‘బ్యూటిఫుల్‌ గర్ల్స్‌’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. న్యూయార్క్‌లో 1962 మార్చి 21న పుట్టిన ఈమె, కాలేజి రోజుల్లోనే కామెడీ షోలపై ఆసక్తి పెంచుకుంది. కమేడియన్‌గా నవ్విస్తూనే టీవీ అవకాశాలు పొంది ప్రత్యేకమైన షోలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. వెండితెరపై విలక్షణ పాత్రలతో అలరించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.