కండల వీరుడు
హాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా, స్క్రీన్‌ ప్లే రచయితగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి సిల్వెస్టర్‌ స్టాలోన్‌. హాలీవుడ్‌లోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా, యాక్షన్‌ స్టార్‌గా, రాకీ బాల్బోగా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు స్టాలోన్‌. ‘రాకీ’ సిరీస్‌ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఈ నటుడి జీవితం వడ్డించిన విస్తరి కాదు. స్టాలోన్‌ తొలినాళ్ల నుంచి ఎన్నో కష్టాలను దాటుకోని, అనేక అవమానాలను ఎదుర్కోని ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అందుకే స్టాలోన్‌ది ఒక స్ఫూర్తిదాయక జీవిత కథనం.

article image
సిల్వెస్టర్‌ స్టాలోన్‌ 1946 జులై 6న అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు మైఖెల్‌ సిల్వెస్టర్‌ స్టాలోన్‌. తండ్రి ఫ్రాంక్‌ స్టాలోన్‌ (కేశాలంకరణ నిపుణుడు), తల్లి జాకీ స్టాలోన్‌ (నృత్యకారిణి). స్టాలోన్‌ దురదృష్టవశాత్తూ పుట్టుకతోనే కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టాలోన్‌ను తల్లిగర్భంలో నుంచి బయటకు తీసే క్రమంలో డాక్టర్లు చేసిన చిన్న పొరపాటు వల్ల స్టాలోన్‌ తలలోని కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అతని ముఖంలోని కొంత భాగం చచ్చుబడిపోయింది. స్టాలోన్‌ చిన్నతనంలోనే వారి కుటుంబం వాషింగ్‌టన్‌కు వచ్చి స్థిరపడింది. అదే సమయంలో తండ్రి బ్యూటీషియన్‌ స్కూల్‌ ఏర్పాటు చేయగా.. తల్లి మహిళల వ్యాయామశాలను నిర్వహించేది. స్టాలోన్‌కు 9ఏళ్ల వయసున్నప్పుడు అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత స్టాలోన్‌ తల్లితోనే దగ్గరే ఉండిపోయాడు. తల్లి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే డ్యాన్స్‌ నేర్చుకున్న స్టాలోన్‌కు మొదటి నుంచి చదువుపై ఆసక్తి తక్కువ. చిన్నతనం నుంచి నటన పట్ల ఆసక్తి పెంచుకున్న స్టాలోన్‌.. తొలిసారి ఓ శృంగార చిత్రంతో నటుడిగా తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. 1970లో వచ్చిన ఈ సినిమా పేరు ‘ది పార్టీ ఎట్‌ కిట్టి అండ్‌ స్టడ్స్‌’. ఇందులో రెండురోజల పాటు నటించినందుకు స్టాలోన్‌కు 200డాలర్ల రెమ్యునేషన్‌ ఇచ్చారు. కానీ ఈ సినిమా విడుదలయ్యాక అతను అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ చిత్రం చూసిన స్టాలోన్‌ అపార్ట్‌మెంట్‌ యజమాని అతన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. ఫలితంగా చాలా రోజులు రోడ్లపై గడపాల్సి వచ్చింది. ఆకలితో అలమటించాడు. చివరకు తను పెంచుకున్న కుక్కకు తిండి పెట్టలేక దాన్ని 50డాలర్లకు అమ్మేశాడు స్టాలోన్‌. ఆ తర్వాత ‘నో ప్లేస్‌ హైడ్‌’, ‘ద లార్డ్స్‌ ఆఫ్‌ ఫ్లాట్‌బుష్‌’, ‘కాపోన్‌’, ‘డెత్‌ రేస్‌ 2000’, ‘ఫేర్‌వెల్‌ మై లవ్లీ’ చిత్రాల్లో చిన్నాచితకా పాత్రల్లో నటించాడు.


స్టాలోన్‌ జీవితాన్ని మార్చివేసిన సినిమా 1976లో వచ్చిన ‘రాకీ’. 1975 మార్చి 24న ప్రముఖ బాక్సర్‌ మహ్మద్‌ అలి, చుక్‌ వెప్‌నర్‌ల మధ్య జరిగిన బాక్సింగ్‌ పోరును చూసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్టాలోన్‌ ‘రాకీ’ కథను రాశాడు. ఆ కథలో తానే హీరోగా నటించాలనుకున్నాడు. కానీ అతనికి సినిమా నిర్మించేంత స్తోమత లేకపోవడంతో ఆ కథను పట్టుకోని అనేక స్టూడియోల చుట్టూ తిరిగాడు. చాలా మందికి కథ నచ్చినప్పటికీ స్టాలోన్‌కు హీరోగా అవకాశమిచ్చేందుకు ఒప్పుకోలేదు. ఓ స్టూడియో తనకు కథ అమ్మితే 350,000 డాలర్లకు ఇస్తామని ఆశ చూపించినప్పటికీ స్టాలోన్‌ తన కథపై ఉన్న నమ్మకంతో దాన్ని ఇచ్చేందుకు నిరాకరించాడు. చివరకు అదే స్టూడియో ఆ కథకు స్టాలోన్‌నే హీరోగా తీసుకోని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కానీ దానికి కేవలం 35,000 డాలర్లను మాత్రమే ఇస్తామని స్టాలోన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా 1976లో ‘రాకీ’తో స్టాలోన్‌ హీరోగా పరిచయమయ్యాడు. అది బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించడంతో స్టాలోన్‌ను రాత్రికి రాత్రే ప్రముఖ కథానాయకుడిగా మారిపోయాడు. ఆ ఏడాది జరిగిన అకాడమీ అవార్డుల్లో ‘రాకి’ ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్‌ విభాగాల్లోనూ పురస్కారాలు దక్కించుకుంది. ఆ తర్వాత స్టాలోన్‌ 1978లో ‘పారడైస్‌ అలే’ చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్నందున్నాడు. 1979లో వచ్చిన ‘రాకీ−2’తో వరుసగా మరో హిట్టందుకున్న స్టాలోన్‌ అక్కడ నుంచి నటుడిగా, దర్శకుడిగా హాలీవుడ్‌లో దూసుకుపోయారు. ఇక అదే సిరీస్‌లో వచ్చిన ‘రాకీ−3’, ‘రాకీ−4’, ‘రాకీ−5’ చిత్రాలు కూడా స్టాలోన్‌ను హాలీవుడ్‌లో అగ్రతారగా నిలబెట్టాయి. యాక్షన్‌ హీరోగా స్టాలోన్‌ తీసిన రాకీ సిరీస్‌తో పాటు ‘రాంబో’ సిరీస్‌లు కూడా అతనికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ‘ఫస్ట్‌బ్లడ్‌’, ‘రాంబో ఫస్ట్‌ బ్లడ్‌ పార్ట్‌2’, ‘రాంబో3’, ‘రాంబో4’లు మంచి విజయాలందుకోవడంతో పాటు హాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. వీటితో పాటు ‘కోబ్రా’, ‘లాకప్‌’, ‘ఆస్కార్‌’, ‘డే లైట్‌’, ‘కాప్‌ లాండ్‌’, ‘షేడ్‌’, ‘రాకీ బాల్బో’, ‘ది ఎక్స్‌పాండబుల్‌’, ‘ఎక్స్‌పాండబుల్‌2’, ‘క్రీడ్‌’, ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ’ చిత్రాలు స్టాలోన్‌కు మంచి విజయాలనందించాయి. ప్రస్తుతం సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ‘రాంబో: లాస్ట్‌ బ్లడ్‌’లో నటిస్తున్నాడు. తన యాక్షన్‌ సినిమాల్లో భాగంగా ఎన్నోసార్లు ప్రమాదాలకు గురైన స్టాలోన్‌ ‘రాకీ−4’ సినిమాలో ఓ పోరాట సన్నివేశం చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడి నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో గడిపాడు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.