వినోదాల రంగంలో వికసించిన నల్ల కలువ!

వినోద రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ (టీవీ రంగం), గ్రామీ (సంగీతం), అకాడమీ (అభినయం), టోనీ (నాటక రంగం) అవార్డులన్నీ అందుకున్న వారు అరుదుగానే ఉంటారు. ఆ కొద్దిమందిలో ఒకరిగా ఊపి గోల్డ్‌బర్గ్‌ ప్రాచుర్యం పొందింది. నాలుగు రంగాల్లో అత్యున్నతమైన నాలుగు అవార్డులు పొందడం ఒక విశేషమైతే, వర్ణ వివక్షలను దాటుకుని ఓ నల్లజాతి మహిళ కళా రంగంలో ఇంతటి గుర్తింపు పొందడం మరో విశేషం. నటిగా, కమేడియన్‌గా, రచయిత్రిగా, బుల్లితెర ప్రముఖురాలిగా అభిమానుల గుండెల్లో వికసించిన నల్ల కలువ ఆమె. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ‘ద కలర్‌ పర్పుల్‌’ సినిమాలో నటనకు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డును, ఆస్కార్‌ నామినేషన్‌ను అందుకుంది. ‘ఘోస్ట్‌’ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ‘సిస్టర్‌ యాక్ట్‌’, ‘మేడిన్‌ అమెరికా’, ‘కొరీనా కొరీనా’, ‘ద లయన్‌ కింగ్‌’, ‘ద లిటిల్‌ రాస్కెల్స్‌’, ‘బాయిస్‌ ఆన్‌ ద సైడ్‌’, ‘థియోడర్‌ రెక్స్‌’, ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ మిసిసిపీ’, ‘హౌ స్టెల్లా గాట్‌ హెర్‌ గ్రూవ్‌ బ్యాక్‌’, ‘గర్ల్‌ ఇంటరెప్టెడ్‌’, ‘ఫర్‌ కలర్డ్‌ గర్ల్స్‌’, ‘టీనేజ్‌ మ్యుటెంట్‌ నింజా టర్టిల్స్‌’, ‘నోబడీస్‌ ఫూల్‌’, ‘స్టార్‌ట్రెక్‌: ద నెక్స్ట్‌ జెనరేషన్‌’ లాంటి సినిమాల్లో ఆమె నటన అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్‌లో 1955 నవంబర్‌ 13న పుట్టిన ఆమె అసలు పేరు కేరిన్‌ ఎలైన్‌ జాన్సన్‌. గోల్డ్‌బెర్గ్‌ ఆమె తల్లి పిలిచే ముద్దుపేరు. చిన్నతనంలోనే నాటకరంగానికి ‘ఊపి’గా పరిచయమైంది. నాటకాలు, టీవీ, సినిమా రంగాల్లో అంచెలంచెలుగా దూసుకుపోడానికి ఆమె చలాకీతనం, ప్రతిభలే కారణమయ్యాయి. బుల్లితెరపై నటిగా, వ్యాఖ్యాతగా ఆమె ముద్ర ప్రశంసనీయం. వెండితెరపై అత్యధిక పారితోషికం అందుకున్న గౌరవాన్ని పొందిన నటి ఆమె. రచయిత్రిగా పిల్లల కోసం మంచి పుస్తకాలు కూడా రాసిన ఆమె, వేర్వేరు రంగాల్లో రాణించి 50కి పైగా అవార్డులను అందుకుంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.