హాస్య కేళి ...అలీ
ఆయన నవ్వుల హొలీ. హాస్య రస కేళి. ప్రేక్షకుల పెదాలపై సదా చిరునవ్వులు చిందించే చిద్విలాస మూర్తి. తెలుగు తెర సాక్షిగా ఆయన శతకోటి నవ్వుల కీర్తి. ఆయనే... అలీ. నాలుగేళ్ల వయసునుంచే సినీ కెమెరాతో బంధాన్ని, అనుబంధాన్ని అందంగా ముడివేసుకున్న గోదారి జిల్లా కుర్రోడు. సాహితీ, సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం... తెలుగు సినీ ప్రేక్షకుడికి అందించిన వరం అలీ.


వెయ్యికి పైగా సినిమాలు... నాలుగు తరాల తారలతో కలిసి నటించిన సుదీర్ఘ అనుభవం... నాలుగు దశాబ్దాలుగా సినీయానం... కమెడియన్‌గానే కాకుండా కధానాయకుడిగా కొన్ని సినిమాల్లో అలరించిన వైనం... చిన్నితెరపై కూడా హ్యూమరసాన్ని పెంచి పోషించిన విధానం వెరసి అలీ. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి హాస్యచక్రవర్తులుగా వీక్షక హృదయసీమల్లో వెలుగొందిన ఎందరో మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూనే తనకంటూ సుస్థిర స్థానాన్ని కల్పించుకున్న అలీ పుట్టినరోజు ఆక్టోబర్‌ 10.

జీవన నేపథ్యం
అలీ 1970, అక్టోబర్‌ 10న రాజమండ్రిలో ఓ పేద కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ఓ టైలరు. తల్లి గృహిణి. అలీ సోదరుడు ఖయ్యుమ్‌ కూడా నటుడే. 1994, జనవరి 23న మండపేటలో అలీకి వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


సినిమాలంటే ఇష్టం
అలీ కుటుంబానికి సినిమా రంగంతో సంబంధాలు లేవు. రాజమండ్రిలో ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్‌ జిత్‌ మోహన్‌ మిత్ర అలీకి గురువు. జిత్‌ మోహన్‌ మిత్రకు ఓ ఆర్కెస్ట్రా ఉండేది. టీ బ్రేక్‌లో ‘షోలే’ సినిమాలోని డైలాగులను ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల శైలిలో అలీ చెప్పేవారు. అలా ప్రేక్షకులను అలరించేవారు. మిమిక్రీ కళ అలీ ఎవరి నుంచి నేర్చుకోలేదు. స్వతహాగానే అబ్బింది. సినిమాలు, నాటకాలంటే ఎంతో ఇష్టం ఉండేది ఆలీకి. దాంతో చిన్నతనంలోనే సినీరంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు, తమిళ భాషలలో మొత్తం వెయ్యి సినిమాలకు పైగా నటించారు అలీ. టీవీ ప్రెజెంటర్‌గా కూడా వర్క్‌ చేశారు. ప్రధానంగా తెలుగు సినిమాలలోనే నటించారు అలీ. పూరీ జగన్నాథ్, పవన్‌ కళ్యాణ్‌ సినిమాలన్నిటిలో అలీ నటించారు. తమిళ్లో నాలుగు సినిమాలలో, కన్నడంలో రెండు సినిమాలలో హిందీలో ఒక చిత్రంలో నటించారు అలీ.

‘నిండు నూరేళ్లు’ సినిమాతో ఎంట్రీ
1979లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిండు నూరేళ్లు’ సినిమాతో పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘సీతాకొక చిలుక’ సినిమాలో బాల నటుల కోసం భారతి రాజా వెతుకుతున్నారని తెలుసుకొని చెన్నైకి వెళ్లారు అలీ. ఆ తరువాత ఆ చిత్రంలోని పాత్రను సంపాదించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించారు. కాస్త పెద్దయ్యిన కారణంగా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పాత్రలు దక్కనప్పుడు అలీ ఎంతో కష్టపడ్డారు. ఆ తరువాత హాస్యనటుడిగా మారారు.


దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి తన సినిమాలలో హాస్యనటుడి పాత్రలను అలీకి ఇచ్చారు. అలీ కోసం కొన్ని సందర్భాలలో కొత్త పాత్రలను కృష్ణారెడ్డి సృష్టించారు కూడా. ‘చాట’ అని హాస్యంలో తనదైన శైలిని అభివృద్ధి చేసుకున్నారు అలీ. ఓ ప్రముఖ ఛానల్‌లో ‘అలీ టాకీస్‌’ అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈటీవీలో ‘అలీతో సరదాగా’ అనే టాక్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.


చాటగాడు
అలీ పేరు చెప్పగానే ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలోని ‘ఎంద చాట’ డైలాగు చాలా మందికి గుర్తుకొస్తుంది. ఈ డైలాగు ఎంతో పాపులర్‌ అయింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తరువాత అలీకి వివాహమైంది. కుటుంబంతో కలిసి ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌కి వెళ్లారు అలీ. అక్కడ ఒక చిన్నపిల్లవాడు తన తల్లికి అలీని చూపిస్తూ ‘చాటగాడు’ అని అన్నాడట. ఈ విషయం అలీ మీడియా ముందు ఓ సందర్భంలో వివరించారు. ప్రేక్షకుల గుర్తింపే తమకు సిరి అని అలీ చెబుతారు.

రామారావు అభిమాని
ఎన్టీఆర్‌ సినిమాలంటే అలీకి ఎంతో ఇష్టం. ఎంతో చిన్న వయసులో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ స్టైల్స్‌లో డైలాగులను అలీ చెప్పడం వలన కొంతమంది ఆలీకి డబ్బులు ఇచ్చేవారు. కొంచెం డబ్బులను దాచుకొని మిగిలిన డబ్బులను తల్లికి ఇచ్చేసేవారు అలీ. అలా దాచుకొన్న డబ్బులతో రామారావు సినిమాలు రిలీజ్‌ అయిన వెంటనే చూసేవారు అలీ.

ఎక్కువ గమనించేవారు
అలీ ఈరోజు ఇంతబాగా వివిధ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారంటే, దాని వెనకాల ఎంతో కృషి ఉంది. అలీకి పరిశీలనా నైపుణ్యం ఎక్కువ. ఏ పాత్రను చూసినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలరు అలీ. వాస్తవానికి, అలీ పాత్రల్లో జీవిస్తారని చెప్పవచ్చు. సహచర హాస్యనటులు కూడా ఈ విషయంలో అలీని మెచ్చుకునేవారు.

రాజబాబు నుంచి స్ఫూర్తి
స్వతహాగా నటీనటులకు ఎక్కువ సానుభూతి ఉంటుంది. ఎవరైనా బాధ ఉందని చెబితే, అది నిజమా కదా అని ఆలోచించకుండా జేబులోంచి డబ్బులు ఇచ్చేస్తారని అలీ ఓ సందర్భంలో అన్నారు. రాజబాబు ఇలాగే చేశారని చెప్పారు. వ్యక్తిగతంగా రాజబాబు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని అన్నారు.

కెరీర్‌ మొదట్లో కష్టాలు
ఇంట్లో కూర్చుంటే వేషాలు రావని, పాత్రల కోసం ఎంతో కష్టపడ్డానని గుర్తుచేసుకున్నారు అలీ. ఉదయం టిఫిన్‌ చేసి ఐదారు ఆఫీసుల్లో అవకాశాల కోసం తిరిగేవారు. ప్రస్తుతానికి అవకాశాలు లేవని, ఉంటే చెబుతామని చెప్పేవారు అలీతో వాళ్ళు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ పాత్రల తరువాత ఎనిమిది సంవత్సరాల పాటు పాత్రల కోసం కష్టపడ్డారు. పారితోషికం వస్తే ఇంటికి పంపించాలని అనుకునేవారు అలీ. అనుకున్నట్టుగానే వచ్చిన పారితోషికంలో కొంతభాగం ఇంటికి పంపించేవారు.


మహేష్‌ బాబు బదులు అలీ
‘యమలీల’లో అలీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రంలో మహేష్‌ బాబు హీరోగా నటించాల్సి ఉంది. ‘నెంబర్‌ వన్‌’ సినిమా తరువాత కృష్ణకు ఎస్వీ కృష్ణారెడ్డి ‘యమలీల’ కథను చెప్పి, అందులో మహేష్‌ బాబును హీరోగా అనుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణకు ఆ కథ నచ్చింది. అయితే, మహేష్‌ బాబు చాలా చిన్నవాడనీ కొన్ని సంవత్సరాలు ఆగమని కృష్ణారెడ్డితో కృష్ణ చెప్పారట. ఆ సమయంలో ఓ ఫంక్షన్‌లో ‘మాయలోడు’ సినిమాలో ‘చినుకు చినుకు’ పాటకు అలీ డాన్స్‌ చేయడం చూశారట కృష్ణారెడ్డి. ఆ తరువాత అలీని ‘యమలీల’ సినిమాకు హీరోగా ఎంపిక చేశారు.


కమెడియన్‌ పాత్రలకే ప్రాధాన్యత
సాధారణంగా కమెడియన్‌గా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరో అవ్వాలని చాలా మంది చూస్తారు. అలా హీరోగా సెటిల్‌ అయిన వారు కూడా ఉన్నారు. అయితే, అలీ హీరోగా కొన్ని సినిమాలలో చేసినప్పటికీ మళ్లీ కమెడియన్‌ పాత్రలు చేశారు. తనకు కమెడియన్‌ పాత్రలకు ఎక్కువ పేరు వచ్చిందని అలాగే డిమాండ్‌ కూడా బాగా ఉందన్న విషయం గుర్తుచేసుకున్నారు. అందుకే కమెడియన్‌ పాత్రలకు ప్రాధాన్యతను ఇచ్చానని కూడా అన్నారు. తాను కమెడియన్‌ పాత్రలకే పుట్టానని చెబుతారు అలీ. తనది హీరో పర్సనాలిటీ కాదని చెబుతారు. పెద్ద హీరో అవ్వాలని తనకు ఏనాడు అనిపించలేదని తన అభిప్రాయాన్ని చెప్పారు. కమెడియన్‌ గానే తన జీవితం గడిచిపోవాలని అనుకున్నట్లు చెబుతారు.


నాయకా ప్రాధాన్యత పాత్రల్లో అలీ
అలీ హీరోగా ‘అమ్మాయి కాపురం’, ‘అక్కుమ్‌ బక్కుమ్‌’, ‘ఆవారాగాడు’, ‘పిట్టల దొర’, ‘ఆడాళ్ళ మజాకా’, ‘ఘటోత్కచుడు’, ‘సర్కస్‌ సత్తిపండు’, ‘కుర్రాళ్ళ రాజ్యం’, ‘గుండమ్మ గారి మనవడు’, ‘గజిబిజి’, ‘తిన్నామ పడుకున్నామా, తెల్లారిందా’, ‘అలీ బాబా ఒకటే దొంగ’ తదితర చిత్రాల్లో నటించారు.

బాలనటుడిగా అలీ
‘సీతాకోక చిలుక’, ‘నాలుగు స్తంభాలాట’, ‘చంటబ్బాయ్‌’, ‘స్వాతి ముత్యం’, ‘పుణ్యస్త్రీ’ తదితర సినిమాలలో నటించారు.


పురస్కారాలు
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘సూపర్‌’ చిత్రాలకు ఉత్తమ కమెడియన్‌గా ఫిలింఫేర్‌ పురస్కారాలను అందుకొన్నారు. ‘సీతాకోక చిలుక’ సినిమాలోని ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డును తన ఖాతాలో వేసుకొన్నారు. ‘పిట్టల దొర’ సినిమాకి నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డును సంపాదించారు. అలీ కనిపిస్తే చాలు...ప్రేక్షకుల గుండెల్లో నవ్వుల పువ్వుల గుభాళింపులు వేనవేలు. ఆయన మరిన్ని సినిమాల్లో నటించి నవ్వించాలని అభిమానులు కోరుతున్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.