అలవోకగా ‘అల్లు’కున్న సినీ బంధం
తండ్రి టాలీవుడ్‌లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఘనుడు. కుమారుడు స్టైలిష్‌ స్టార్‌గా ఈ తరం వీక్షకుల మనస్సులు దోచుకున్న అగ్రహీరో. మూడు తరాలుగా పెనవేసుకున్న ఈ ఇద్దరి నడుమ సంచలన విజయాలు చేజిక్కించుకున్న అభిరుచిగల నిర్మాతగా ఆయన. ప్రస్తుతం కమనీయ రమణీయ మహాకావ్యమైన రామాయణాన్ని అత్యధిక భారీ బడ్జెట్తో తెరరూపమిచ్చేందుకు తహతహ, తపన పడుతున్న ఆయనే...అల్లు అరవింద్‌. ఔను... మరో ఇద్దరు మధు మంతెన, నమ్రత్‌ మల్హోత్రాతో కలసి సుమారు 500 కోట్ల నిర్మాణ వ్యయం కాగల వెండితెర రామాయణ మహాయజ్ఞానికి నడుం బిగించారాయన. నిర్మాతగా మంచి వ్యూహకర్త. కథల ఎంపికలో అనితర సాధ్యమైన ప్రతిభ. నటీనటుల సృజన గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. చేపట్టిన ఎంత భారీ ప్రాజెక్టు అయినా లాభసాటిగా వాణిజ్య చట్రంలో బంధించగల సత్తా ఉన్న వ్యక్తి. అందుకే...అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ అంటే టాలీవుడ్‌లో ఓ సంచలనం. అల్లు అరవింద్‌ పుట్టిన రోజు జనవరి 10. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు మీ కోసం.


అల్లు రామలింగయ్య వారసుడు
అల్లు అరవింద్‌ 1949 జనవరి 10న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. అల్లు రామలింగయ్య, అల్లు కనక రత్నం ఈయన తల్లిదండ్రులు. ఈయన భార్య పేరు అల్లు నిర్మల. అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌ ఈయన కుమారులు. ప్రస్తుతం అల్లు అరవింద్‌ హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు.

నిర్మాతగా
తెలుగులో ఎన్నో చిత్రాలను నిర్మించారు అల్లు అరవింద్‌. ‘దేవుడే దిగివస్తే’, ‘మావూళ్ళో మహాశివుడు’, ‘యమకింకరుడు’, ‘శుభలేఖ’, ‘హీరో’, ‘విజేత’, ‘పసివాడి ప్రాణం’, ‘ఆరాధన’, ‘చక్రవర్తి’, ‘న్యాయం కోసం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘మాస్టర్‌’, ‘ఇద్దరు మిత్రులు’, ‘అన్నయ్య’, ‘డాడీ’, ‘జానీ’, ‘అందరివాడు’, ‘హ్యాపీ’, ‘జల్సా’, ‘మగధీర’, ‘100% లవ్‌’, ‘బద్రీనాథ్‌’, ‘కొత్త జంట’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘భలే భలే మొగాడివోయ్‌’, ‘సరైనోడు’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ధ్రువ’, ‘గీత గోవిందం’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇవే కాకుండా ‘పరదేశి’, ‘పెళ్లి సందడి’, ‘గంగోత్రి’ సినిమాలను సి.అశ్విని దత్, కె.రాఘవేంద్రరావులతో కలిసి నిర్మించారు. ‘పెళ్ళాం ఊరెళితే’ చిత్రాన్ని అశ్విని దత్త్‌తో కలిసి సిరి మీడియా ఆర్ట్స్‌పై నిర్మించారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌తో కలిసి నిర్మించారు అల్లు అరవింద్‌. ‘మగధీర’ సినిమా కూడా ఆయన నిర్మాణసారథ్యంలోనిదే. రామ్‌ చరణ్‌కి ఈ సినిమా కెరీర్‌ పరంగా ఎంతో మైలేజ్‌ ఇచ్చింది.

బాలీవూడ్‌లో కూడా
అల్లు అరవింద్‌ హిందీలోనూ కొన్ని సినిమాలను నిర్మించారు. ‘ప్రతిబంధ్‌’, ‘ద జెంటిల్‌ మ్యాన్‌’, ‘మేరె సాప్నో కి రాణి’, ‘కున్వారా’, ‘క్యా ఏహి ప్యార్‌ హై’, ‘కలకత్తా మెయిల్‌’, ‘గజిని’, ‘జెర్సీ’ సినిమాలను నిర్మించారు. తెలుగులో రాజశేఖర్, జీవిత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘అంకుశం’ సినిమా హిందీ రీమేకే ‘ప్రతిబంద్‌’. దక్షిణాదిన అర్జున్, మధుబాల హీరోహీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జెంటిల్‌ మ్యాన్‌’ సినిమా హిందీ రీమేకే ‘ద జెంటిల్‌ మ్యాన్‌’. ఈ రెండు హిందీ సినిమాల్లోనూ చిరంజీవి, జూహీ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ‘పెళ్లి సందడి’ సినిమాని ‘మేరె సప్నో కి రాణి’గా నిర్మించి హిందీ ప్రేక్షకుల ముందు ఉంచారు అల్లు అరవింద్‌. ఇందులో సంజయ్‌ కపూర్, ఊర్మిళా, మధుబాల హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో చిరంజీవి, రంభ, రచన ప్రధాన పాత్రల్లో నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాని హిందీలో ‘కున్వారా’గా రూపొందించారు అల్లు అరవింద్‌. తెలుగులో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్, దేవయాని నటించిన ‘సుస్వాగతం’ సినిమాని హిందీలో ‘క్యా యెహీ ప్యార్‌ హై’గా రూపొందించారు. ఇక్కడి ‘చూడాలని ఉంది’ సినిమాని హిందీ ప్రేక్షకులకు అనీల్‌ కపూర్, రాణి ముఖర్జీ, మనీషా కొయిరాలాలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘కల్కత్త మెయిల్‌’గా తెరకెక్కించారు. ఇక తెలుగు, తమిళ భాషలలో వసూళ్ల సునామి సృష్టించిన సూర్య, ఆసిన్ల ‘గజని’ సినిమాని హిందీలో అమీర్‌ ఖాన్‌తో అల్లు అరవింద్‌ అదే పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీలో ఇక్కడ హిట్‌ అయిన ‘జెర్సీ’ సినిమా రీమేక్‌ పనులతో బిజీగా ఉన్నారు అల్లు అరవింద్‌. కన్నడ భాషలో రెండు సినిమాలను, తమిళ భాషలో మూడు చిత్రాలను రూపొందించారు అల్లు అరవింద్‌.బావ చిరంజీవికి అండగా
తన బావ అయిన మెగాస్టార్‌ చిరంజీవికి అన్నివేళల్లో అండగా ఉంటూ కృష్ణార్జునుల మాదిరి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. కుమారుడు అల్లు అర్జున్‌ కూడా అగ్ర నటుడిగా ఎదిగి అల్లు అరవింద్‌కి పుత్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మరో కుమారుడు అల్లు శిరీష్‌ కూడా నటనతో పాటు నిర్మాణ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.


పురస్కారాలు
‘జల్సా’ సినిమాకు సంతోషం బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు లభించింది. ‘మగధీర’ చిత్రానికి సంతోషం బెస్ట్‌ ఫిల్మ్‌ పురస్కారంతో పాటు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో జాతీయ చిత్ర పురస్కారం, ఉత్తమ పాపులర్‌ చలన చిత్రంగా నంది అవార్డు, ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డు, ఉత్తమ చిత్రంగా సినీ‘మా’ అవార్డులు లభించాయి. హిందీ ‘గజిని’ సినిమాకి స్టార్‌ డస్ట్‌ హాటెస్ట్‌ న్యూ ఫిల్మ్‌ పురస్కారం లభించింది.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌ 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.