నాగ్ చిరునవ్వుల అమల
అమల అక్కినేని, టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకొన్న వ్యక్తి. నాగ్, అమలలది టీ టౌన్‌లో ఓ అందమైన జంట. వివాహానికి ముందు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా...ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు.

నేపథ్యం
అమల అక్కినేని జన్మస్థలం కోల్‌కత్తా. 1967, సెప్టెంబర్ 12న ఆమె పుట్టారు. తండ్రి భారతీయుడు, తల్లి ఐరిష్ దేశస్తురాలు. చెన్నై కళాక్షేత్ర కళాశాల నుంచి భరత నాట్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్సులో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అమల. తన డాన్స్ ట్రూపుతో దేశ, విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రసిద్ధ కళాకారిణి రుక్మిణి దేవి ఆరెండల్ ఈ సంస్థని స్థాపించారు. 13 సంవత్సరాల వయసు నుంచే రుక్మిణి దేవి బృందంతో ప్రదర్శనలు ఇస్తూ దేశవిదేశాలు పర్యటించారు.

మొదటి సినిమా అవకాశం
అలా ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ప్రముఖ నటుడు, దర్శకుడు టీ. రాజేందర్ సినిమాలో అవకాశం వచ్చింది ప్రేమకథల్ని రసరమ్యంగా తెరకెక్కించగల సత్తా ఉన్న సృజనాత్మక దర్శకుడు తన చిత్రంలో క్లాసికల్ డాన్సర్ పాత్ర కోసం అమలను సంప్రదించారు. గ్రాడ్యుయేషన్ అప్పుడే పూర్తైన సంవత్సరంలో ఆ అవకాశం వచ్చిన కారణంగా సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలిగిందట అమలకు. అందువల్ల ఆ అవకాశాన్ని చేజార్చుకోలేదు. అంతేకాదు పూర్తి స్థాయి నాట్యకారిణి పాత్ర చేయడం కూడా తనకు సౌకర్యవంతంగా ఉందని అప్పట్లో మీడియా ముందు చెప్పారు. ఒక నర్తకిగా ప్రదర్శనల ఇవ్వడం కన్నా సినిమాలో నటించడం బాగుందనిపించింది ఆమె చెబుతుంటారు.


54 చిత్రాల విజయవంతమైన సినీయానం
అమల మొత్తం 54 సినిమాలలో నటించారు. టి. రాజేందర్ సినిమా 'మైథిలీ ఎన్నై కాథలి'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె అనతికాలంలోనే డార్లింగ్ ఆఫ్ ఇండస్ట్రీ గా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధితిస్తూ ఆమె ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషా చిత్రాల్లో అమలకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.

హాస్టల్లో పెరగడం
అమల హాస్టల్లో పెరిగారు. తండ్రి నేవీ అధికారిగా పనిచేస్తూ ఉండడం, తల్లి ఐర్లాలాండ్లో ఉండడం వలన అమల హాస్టల్లో పెరిగారు. అందువల్ల అమల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం కూడా ఇలాంటిదే. అమల నిర్ణయాన్ని తల్లిదండ్రులు గౌరవించారు.

తల్లిదండ్రులు పెట్టిన పేరే
అచ్చం తెలుగు పేరులా అనిపించే 'అమల' అన్న పేరు బెంగాలీ పేరు కూడా తల్లిదండ్రులే నామకరణం చేశారు. అప్పుడప్పుడే తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అమలని అక్కినేని వారబ్బాయి నాగార్జున అభిమానించారు. నిర్ణయం సినిమాలో వీరిద్దరి లవ్ ట్రాక్‌కి నిదర్శనమా అన్నట్లు...హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం... ప్రేమించాను దీన్నే... కాదంటోంది నన్నే... .అన్న పాట అప్పట్లో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. గొప్ప ఇంటి కుర్రవాణ్ణి....అక్కినేని అంతటోన్ని... కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా? అంటూ సినిమాలోనే నాగార్జున ప్రపోజ్ చేశారు.

మొదట నాగ్ ప్రపోజ్
నాగార్జున అమలని మొదటగా ప్రపోజ్ చేశారు. 'నిర్ణయం' సినిమా తరువాత నాగ్ ప్రొపోజ్ చేయడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని అమల అన్నారు. నాగ్ ప్రొపోజ్ చేసిన వెంటనే ఒప్పేసుకున్నానని చెప్పారు. తామిద్దరూ పరిణితి చెందిన వారు కాబట్టి తమ పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదని చెప్పారు. అక్కినేని నాగార్జున, అమల వివాహం 1992లో జరిగింది. వీరి కుమారుడు సినిమా హీరో అక్కినేని అఖిల్.


ఎనిమిదేళ్లకే సొంత నిర్ణయం
హాస్టల్లో ఉండి డాన్స్ నేర్చుకోవాలన్న అమల సొంతంగా నిర్ణయించుకున్నారు. అది కూడా ఎనిమిదేళ్ల వయసులో. కేవలం డాన్స్ నేర్చుకోవాలన్న లక్ష్యంతో ఉండేవారు అమల. వారంలో రెండు సార్లు డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడం కంటే, ప్రతి రోజూ నాట్య సాధన చేయడం మంచిదని భావించారు. అందుకే హాస్టల్లో చేరి మరీ డాన్స్ నేర్చుకొన్నారు. చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం వలన పరిణతి ఎంతో వచ్చిందని చెబుతుంటారు అమల. మొదటి నుంచి అమలకు మూగజీవాలపై మక్కువ ఎక్కువ. 6 సంవత్సరాల వయసులో గాయపడిన ఓ కాకిని రక్షించారు అమల. జంతువుల రక్షణ విషయంలోనూ కూడా తన తల్లి తననెప్పుడూ నిరుత్సాహపరిచలేదని చెప్పారు. ఎనిమిదేళ్ల వయసు నుంచి నాగార్జునను పెళ్లి చేసుకునేంతవరకు హాస్టల్లోనే నివసించేవారు అమల. ఆ సమయంలో ఆర్థిక విషయంలోనూ కూడా తన తల్లిదండ్రులపై ఆధారపడలేదు అమల.

20 ఇయర్స్ లాంగ్ హాలిడే
అమల, నాగార్జున... ఇద్దరికీ ఆధునిక ఆలోచనలు. అయితే, అమల వివాహం అయిన తరువాత సినిమాలు చేయడం మానేశారు. ఎనిమిది సంవత్సరాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ నాట్యం నేర్చుకోవడం, దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం, ఆ తరువాత వెంటనే సినిమాల్లోకి రావడం చకచకా జరిగిపోయాయి అమల జీవితంలో. అయితే, ఇవన్నీ ఎంతో శారీరకంగా అలసటకు గురి చేసేవే. అందుకే, పెళ్లి అయిన తరువాత ఒకసారి సరదాగా 'రేపు షూటింగ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా' అని నాగార్జునని అడిగారట అమల. నాగ్ నవ్వుతూ నీ ఇష్టం అనేశారట. అయితే, పెళ్లి తరువాత ఓ లాంగ్ హాలిడే తీసుకోవాలని అమల ఆశపడ్డారు. ఆ లాంగ్ హాలిడే 20 సంవత్సరాల పాటు గడిచిందని నవ్వుతూ అంటారు. ఆ మధ్యనే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో మళ్ళీ వెండితెరపై కనిపించారు.


బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు
పెళ్ళై హైదరాబాద్‌కి వచ్చిన రెండవ రోజే ఓ ట్రక్ వలన జంతువుకు ఆక్సిడెంట్ అవడాన్ని చూశారు అమల. ఆ జంతువుని వెంటనే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో జంతు సంరక్షణ కేంద్రాలు అప్పట్లో లేవు. దాంతో, ఇంట్లోనే గాయపడిన జంతువులను పెట్టుకునే వారు అమల. అలా, ఒక నెలలోనే 50, 60 గాయపడిన జంతువులను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. గ్యారేజ్‌లో కూడా గాయపడిన ఎద్దు ఉండడంతో ఒకసారి కారుని బయట పార్క్ చేశారు నాగ్. మంగూస్, కుందేళ్లు, కుక్కపిల్లలు, పిల్లిపిల్లలు, గద్దెలు, పావురాలు వంటి జంతువులకు షెల్టర్ ఇచ్చారు. అప్పుడు అమలతో ఇల్లు జూ లా అయిపోయిందని వ్యాఖ్యానించారట. ఆర్గనైజ్‌డ్‌గా చేయమని అమలకి సలహా ఇచ్చారు నాగ్. నాగ్ సలహాతో జంతువులను సంరక్షించే విషయంలో చెన్నైలోనున్న బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా వారి సహాయంతో శిక్షణ పొందారు. వాళ్ళ సహాయంతో బ్లూ క్రాస్‌ని స్థాపించారు అమల. 4 లక్షల 50 వేల జంతువులకు సహాయం చేయగలిగారు. ఆరు వందలపైగా వాలంటీర్లు, శ్రేయోభిలాషులు ప్రస్తుతం ఈ సొసైటీలో ఉన్నారు. గాయపడిన జంతువులకు సహాయం చేస్తూ ఉంటే ఎంతో సంతృప్తిగా భావిస్తారు అమల.


నాగ్ లవ్ లైఫ్...
నాగార్జునకి ఎక్కువ మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో, అమలని చాలా మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారట. అయితే, నాగార్జున జీవితంలో తానే లవ్ అన్నదే కదా నిజమని అమల ప్రశ్నిస్తున్నారు. నాగార్జున ఎంత దూరంలో ఉన్నా తనని దగ్గరే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందట అమలకు. అలాగే, నాగ్ కూడా ఎప్పుడూ తనని నిర్లక్ష్యం చేయలేదని చెబుతూ ఉంటారు. వాస్తవానికి నాగార్జున పక్కన తాను ఉన్నప్పటికీ ఎన్నోరకాల పత్రికలు నాగ్ పై రూమర్లు రాస్తూ ఉంటారని, అవి తెలుసుకున్నప్పుడు నవ్వుకలుగుతుందని అంటుంటారు. అలాగే, నాగ్ కుటుంబంతోనే బయటకు వెళ్ళడానికి ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. నిన్నటికి నిన్న 60 సంవత్సరాలోకి అడుగుపెట్టిన నాగార్జున కుటుంబంతో విదేశాలకు వెళ్లి వేడుక చేసుకున్నారు. ఆ వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.


కెరీర్
అమల తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలలో నటించారు. తమిళ్లో 22 సినిమాలు, మలయాళంలో 4 సినిమాలు, కొన్ని కన్నడ చిత్రాలు, 6, 8 తెలుగు చిత్రాలు, 5 హిందీ చిత్రాల్లో నటించారు అమల. మలయాళంలో ఎక్కువ హిట్లను అందుకొన్నారు.

ఫిట్నెస్ అంటే ప్రాణం
అమలకు యాక్టివ్ గా ఉండడం ఇష్టం. యోగ, నడక, వ్యాయామాలు చేయడం అమలకు ఇష్టం. శాకహార భోజనం చేస్తారు అమల. స్వీట్ల జోలకు పోరు. ఇంట్లోనే ట్రైనర్ సహకారంతో జిమ్ చేస్తారు. మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి కాబట్టి కాబట్టి ఫిజికల్ ఆక్టివిటీ అంటే తనకు ప్రాణమని చెబుతూ ఉంటారు.

నాగ్‌తో సినిమాలు
నాగార్జున, అమల హీరోహీరోయిన్లుగా 'కిరాయి దాదా', 'చినబాబు', 'శివ', 'ప్రేమ యుద్ధం', 'నిర్ణయం', సినిమాలలో నటించారు. ఇంకా తెలుగులో అమల నటించిన సినిమాలలో 'పుష్పక విమానం', 'రక్త తిలకం', 'రాజా విక్రమార్క', 'అగ్గిరాముడు', 'ఆగ్రహం' ఉన్నాయి. ఇవన్నీ అమల సినీ కెరీర్ లో మెచ్చు తునకలు.


రీ ఎంట్రీ
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు అమల. ' కేర్ ఆఫ్ సైరాభాను' చిత్రంతో 25 సంవత్సరాల తరువాత మలయాళ సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చారు. 'మనం' చిత్రంలో డాన్స్ టీచర్ గా ఓ చిన్న పాత్రలో మెరిశారు.

పురస్కారాలు
1991లో ఓ మలయాళ సినిమాకి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకొన్నారు. 2012లో తెలుగులో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలోని పోషించిన పాత్రకి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును పొందారు. ఇదే చిత్రానికి ఉత్తమ అవుట్స్టాండింగ్ యాక్ట్రెస్ గా 2012లో సినిమా అవార్డును అందుకొన్నారు.

-పి.వి.డి.ఎస్. ప్రకాష్.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.