అభిమానుల మదిలో ‘ఖైదీ’... చిరంజీవి
ప్రస్తుత తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్‌. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. అందులో చిరంజీవి మొదటివారు. మిగిలిన ఇద్దరు సోదరులు నాగేంద్రబాబు (నటుడు, నిర్మాత), పవన్‌కల్యాణ్‌ (కథానాయకుడు). 1980లో ప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (రామ్‌ చరణ్‌) ఉన్నారు. ప్రస్తుతం కుమారుడు కూడా సినిమాల్లో కథానాయకుడిగా కొనసాగుతున్నాడు.
article image
 తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్‌.టి. రామారావు తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు చిరంజీవి. ఆయన 1978లో ‘పునాదిరాళ్లు’ సినిమాతో తెరంగేట్రం చేశారు. అయితే ఈ చిత్రం కన్నా ముందు ఆయన నటించిన రెండవ సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. ‘మనవూరి పాండవులు’, ‘మోసగాడు’, ‘రాణీ కాసుల రంగమ్మ’, ‘ఇది కథ కాదు’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు, విలన్‌ పాత్రలు పోషించారు. 1983లో కోదండరామ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా.. చిరంజీవిని కథానాయకుడిగా నిలదొక్కుకునేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘చంటబ్బాయ్‌’, ‘ఛాలెంజ్‌’, ‘శుభలేఖ’ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. చిరంజీవిని మొదటి యాక్షన్‌−డ్యాన్స్‌ మాస్‌ హీరోగా చెప్పుకోవచ్చు. ‘పసివాడి ప్రాణం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు తొలిసారి ‘బ్రేక్‌ డ్యాన్స్‌’ను పరిచయం చేశారు చిరంజీవి. ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘స్వయం కృషి’, ‘రుద్రవీణ’, ‘ఆపద్భాందవుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘చూడాలని ఉంది’, ‘బావగారూ బాగున్నారా!’ ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ వంటి చక్కటి చిత్రాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల గుండెల్లో ‘మెగాస్టార్‌’గా నిలిచారు. దాదాపు నలభైఏళ్ల సినీ ప్రస్థానంలో 150 చిత్రాల్లో నటించిన చిరంజీవి.. తాజాగా పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నెం.150’ సినిమాతో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. చిరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు అనేక జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిలింఫెయిర్‌ పురస్కారాలు అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం:
ఎన్టీఆర్‌ తర్వాత చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన నటుడు చిరంజీవి. 2008 ఆగస్టులో ‘ప్రజా రాజ్యం’ పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 295 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి 18స్థానాల్లో గెలుపొందారు. 2011 ఫిబ్రవరిలో ‘ప్రజా రాజ్యం’ పార్టీని ‘కాంగ్రెస్‌’లో వీలీనం చేశారు. ఆ తర్వాత 2012 మార్చిలో రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. కేంద్ర పర్యాటకశాఖా మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)
సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.