‘ఇష్టం’తో వచ్చి... ఇష్టమైపోయి!

వయసు మీదపడినా... వన్నె తరగని అందాల భామల జాబితాని తయారు చేస్తే అందులో శ్రియ శరణ్‌ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె వయసు 35 యేళ్లు. కానీ నవతరం భామలకి దీటైన అందంతో తెరపై మెరుస్తుంటుంది. అవకాశాల్ని అందుకోవడంలోనూ ఆమె జోరును ప్రదర్శిస్తోంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ఇష్టం’తో తెరకు పరిచయమైందీ భామ. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసు దోచుకొంది. దాంతో వెంటనే అవకాశాలు వరుస కట్టాయి. ‘సంతోషం’ చిత్రంలో నాగార్జున సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక అక్కడ్నుంచి ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు, మిగతా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి పేరు తెచ్చుకొంది. హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ మెరిసింది. డెహ్రాడూన్‌లో సెప్టెంబరు 11, 1982లో జన్మించిన శ్రియ, హరిద్వార్‌లో పెరిగింది. ఈమె పూర్తి పేరు శ్రియశరణ్‌ భట్నాగర్‌. దిల్లీలోని లేడీ శ్రీరమ్‌ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది. చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌పై పట్టు పెంచుకొన్న శ్రియ కథక్, రాజస్థాన్‌ ఫోక్‌ డ్యాన్స్‌ నేర్చుకుంది. కాలేజీలో చదువుతున్నప్పుడే డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రోత్సాహంతో ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించే అవకాశం లభించింది. ఆ వీడియోనే ఆమెకి సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. 2003లో ‘తుఝే మేరీ కసమ్‌’ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా శ్రియకి మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో ‘నువ్వే నువ్వే’తో పాటు, ‘ఠాగూర్‌’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నేనున్నాను’, ‘అర్జున్‌’, ‘బాలు ఏబీసీడీఈఎఫ్‌జి’, ‘నా అల్లుడు’, ‘సదా మీ సేవలో’, ‘సోగ్గాడు’, ‘సుభాష్‌ చంద్రబోస్‌’, ‘మొగుడు పెళ్లాం ఓ దొంగోడు’, ‘ఛత్రపతి’, ‘భగీరథ’ ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంది శ్రియ. గత నాలుగేళ్లుగా ఆమె ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘పైసావసూల్‌’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. ఇటీవలే ‘వీరభోగ వసంతరాయలు’ అనే చిత్రంలో నటించింది. రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చీవ్‌ని 12 మార్చి 2018లో వివాహం చేసుకొన్న శ్రియ, ఆ తర్వాత కూడా సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తమిళంలో ‘నరగాసూరన్‌’, హిందీలో ‘తడ్కా’ చిత్రాలు చేస్తోంది శ్రియ. ఈరోజు శ్రియ పుట్టినరోజు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.