ఆమె నట ‘దీక్ష’
ఆ నటి... సినిమాల్లో ఎంతో ‘దీక్ష’గా నటించింది. ‘మిరపకాయ్‌’ అని ప్రేక్షకులు ఆమెను టీజ్‌ చేసేలా చేశారు. మోడల్‌గా కూడా సత్తా చాటిన ఆ హీరోయినే ‘వేదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన దీక్షాసేథ్‌. 2009 ఫెమినా మిస్‌ ఇండియా కాంటెస్ట్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచిన దీక్షాసేథ్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకునే ఫిబ్రవరి 14న పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ‘సితార.నెట్‌’.

ఢిల్లీ ముద్దుగుమ్మ
ఢిల్లీలోని 1990 ఫిబ్రవరి 14న పంజాబీ కుటుంబంలో దీక్ష పుట్టింది. తండ్రి ఐటీసీ సంస్థలో ఉద్యోగం చేస్తుండడంతో తరుచూ బదిలీలు అవుతుండేవి. దాంతో, దీక్షాసేథ్‌ కుటుంబం దేశంలో ముంబై, చెన్నై, కోల్‌కత్తా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, నేపాల్‌లోని ఖాట్మండు వంటి ప్రదేశాలలో మారుతూ వచ్చింది. చెన్నైలో మూడవ తరగతి వరకు చదువుకొన్న దీక్ష ఆ తరువాత రాజస్థాన్‌లో అజ్మెర్‌లో మాయో కాలేజ్‌ గర్ల్స్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో చేరింది. దీక్షకు ఒక సోదరి ఉంది. ప్రస్తుతం ఆమె ముంబైలోనే వర్క్‌ చేస్తూ నివసిస్తుంది.

స్విమ్మింగ్‌ ప్రాణం
దీక్షాసేథ్‌కు ఈత అంటే చాలా ఇష్టం. అట్టడుగు నీటిలో ఈదుతూ ఆనందపడేది. అంతేకాదు, దీక్ష సముద్రాంతర్భాగంలో పురావస్తు శాస్త్రవేత్త కావాలని కోరుకుందట.

ఆరు భాషల ప్రావీణ్యం
చిన్నతనం నుంచి రకరకాల ప్రదేశాలలో పెరగడం వలన దీక్షాసేథ్‌కు ఆరు భాషలు వచ్చు. బెంగాలీ, నేపాలీ, ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఫ్రెంచ్‌ భాషలు తెలుసు. కోల్‌కత్తాలో ఉండడం వలన బెంగాలి నేర్చుకొంది. నేపాలీలో ఉండడం వలన నేపాలీ భాషను నేర్చుకొంది. అలాగా రకరకాల ప్రాంతాలలో నివసించడం వలన ఆయా ప్రాంతాల భాషలను నేర్చుకొంది దీక్షాసేథ్‌.


అనుకోకుండా నటనలోకి
దీక్షాసేథ్‌ కుటుంబ సభ్యులంతా ఉన్నత విద్యావంతులు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. అందువలన నటనా రంగంలోకి వస్తానని ఎప్పుడూ తాను అనుకోలేదు. అయితే, నటన అంటే మాత్రం చిన్నతనం నుంచి ఇష్టం ఉంది. అలా అనుకోకుండా అంది వచ్చిన అవకాశంతో సినిమాల్లో నటి అయిపోయింది దీక్షాసేథ్‌.

ఫెమినా ఫ్రెష్‌ పేస్‌ టైటిల్‌ విజేత
అది 2009... కళాశాల విద్య అభ్యసిస్తున్నారు దీక్షాసేథ్‌. ఒకసారి ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు ఫెమినా మిస్‌ ఇండియా కాంటెస్ట్‌ యొక్క స్కౌట్‌ దీక్షాసేథ్‌ను చూసారు. ఆ వ్యక్తే దీక్షాసేథ్‌ని సౌందర్య పోటీలలో పాల్గొనమని, మోడలింగ్‌ చేయమని ఒప్పించారు. ఆ తరువాత ఫెమినా మిస్‌ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొనడానికి తండ్రి స్నేహితుడి సహాయంతో ఓ పోర్ట్‌ ఫోలియో చేయించుకున్నారు దీక్షాసేథ్‌. మోడలింగ్‌ రంగంలో ఎటువంటి అనుభవం లేకపోయినా... టాప్‌ టెన్‌ ఫైనలిస్టుల్లో దీక్ష ఒకరిగా నిలిచింది. ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ని గెలుచుకుంది.

                       

‘వేదం’ ద్వారా సినీరంగ ప్రవేశం
హైదరాబాద్‌లో మోడలింగ్‌ చేస్తున్నప్పుడు, దీక్షాసేథ్‌ను ‘వేదం’ సినిమా కాస్టింగ్‌ డైరెక్టర్‌ చూసారు. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ పోషించిన కేబుల్‌ రాజు పాత్రకి గర్ల్‌ ఫ్రెండ్‌ అయిన పూజ పాత్రలో దీక్షాసేథ్‌ నటించింది. ఈ పాత్రకు సుమారు 70 మంది అమ్మాయిల పేర్లను పరిశీలించిన చిత్రబృందం ఎట్టకేలకు దీక్షాసేథ్‌ను ఎంపిక చేశారు. ఆ సినిమా స్క్రిప్ట్‌ దీక్షాసేథ్‌కు బాగా నచ్చడంతో అందులో నటించడానికి అంగీకరించింది. ‘వేదం’ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. అలాగే ఆ చిత్రానికి ఎన్నో పురస్కార వేడుకల్లో కూడా అనేక ప్రశంసలు వరించాయి. ఆ తరువాత రెండు సినిమాలకు సంతకం చేసింది దీక్షాసేథ్‌. అందులో ఒకటి ‘మిరపకాయ్‌’ కాగా రెండవది ‘వాంటెడ్‌’ సినిమా. రవితేజ హీరోగా నటించిన ‘మిరపకాయ్‌’ చిత్రం భారీగా కమర్షియల్‌ విజయం అందుకొంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకు గోపీచంద్‌తో దీక్షాసేథ్‌ నటించిన ‘వాంటెడ్‌’ సినిమా విడుదల అయింది. ఇందులో మొదటిసారి ప్రధాన కథానాయికగా నటించింది దీక్షాసేథ్‌. అయితే ఇది మాత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం సాధించేలేకపోయింది. ఆ తరువాత ప్రభాస్‌తో ‘రెబెల్‌’, రవితేజతో రెండవసారి ‘నిప్పు’, సోషియో ఫాంటసీ సినిమా ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా’ వంటి చిత్రాలలో నటించింది దీక్షాసేథ్‌. అదే విధంగా కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించింది దీక్షాసేథ్‌.

దీక్షాసేథ్‌ హిందీ చిత్రాలు
దీక్షాసేథ్‌ హిందీలో కూడా నటించింది. ‘లేకర్‌ హమ్‌ దీవానా దిల్‌’, ‘ద హౌస్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2’, ‘సాత్‌ కదం’ చిత్రాలలో నటించింది.

ఏకైక కన్నడ సినిమా
కన్నడంలో ఒక్క సినిమాలోనే నటించింది దీక్షాసేథ్‌. రాఘవేంద్ర హెగ్డే దర్శకత్వంలో దర్శన్‌ హీరోగా తెరకెక్కిన ‘జగ్గు దాదా’లో హీరోయిన్‌గా నటించింది.
                                 
ఏకైక తమిళ సినిమా
విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ‘రాజపట్టయి’ అనే తమిళ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి తమిళ ప్రేక్షకులని కూడా మెప్పించింది దీక్షాసేథ్‌. ఇంకా నటించాలని ఉన్నా అనివార్యంగా వచ్చిన విరామం ఆమెకి అడ్డంకిగా మారింది.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.