బహుమతుల భగీరథుడు... గౌతమ్‌ ఘోష్‌
గౌతమ్‌ ఘోష్‌ పేరు వింటేనే బహుమతుల జాబితా గుర్తుకొస్తుంది. గౌతమ్‌ కేవలం చలనచిత్ర దర్శకుడే కాదు... ఒక మంచి కథకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, మంచి సినిమాటోగ్రాఫర్, అంతకంటే మంచి సంగీత దర్శకుడు. ఇన్ని ‘క్రాఫ్టులు’ తనే ఎందుకు నిర్వహిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు గౌతమ్‌ ఇచ్చే జవాబు...‘నేను నిర్మించే సినిమాలు సమస్యలకి ముదివడివుంటాయి. నా సృజనాత్మకత సెల్యూలాయిడ్‌ మీద ఎక్కించాలంటే నేను మరొక ఫోటోగ్రాఫర్‌కు విడమరచి వివరించి నాకు కావలసిన గొప్పఫలితం రాబట్టలేను. అలాగే సంగీతం కూడా. ఎక్కడ సంగీతం ఎంత అవసరమో అంతమేరకే నేను వాద్య పరికరాలను వాడుతాను. కమర్షియల్‌గా నా సంగీతం విజయవంతం కావాలని నేను కోరుకోను. సన్నివేశానికి అనుగుణంగా సంగీతం ఉండాలే కానీ, అసంబద్ధంగా ఉండకూడదని నమ్మిన వాడిని. అందుకే నేనే స్వయంగా ఈ శాఖల్ని నిర్వహిస్తూ వుంటాను’ అని సెలవిచ్చారు. గౌతమ్‌ ఘోష్‌ సినిమాలు ఆలోచింపజేసేవి... అంతేకానీ కేవలం కాసులు రాల్చేవి కాదు. అందుకే గౌతమ్‌ లఘు బడ్జెట్‌ చిత్రాలకు మాత్రమే ప్రాణం పోశారు, కానీ కమర్షియల్‌ చిత్రాల జోలికి వెళ్ళలేదు. తొలిసారిగా గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వ బాధ్యతలు మోసింది ఒక తెలుగు చిత్రం (మాభూమి) కావడం విశేషం. గౌతమ్‌ నిర్మించిన డాక్యుమెంటరీలు కానీ, సినిమాలు కానీ బహుమతులు పొందకుండా వున్నవి ఒకటి, రెండుకు మించి వుండవు. బెంగాలిబాబులు కళాత్మక, సమస్యాత్మక చిత్రాలను ప్రోత్సహిస్తారు కనుకనే గౌతమ్‌ ఘోష్‌ ఎక్కువగా బెంగాలీ భాషలోనే చిత్రాలు నిర్మించారు. జూలై 24న గౌతమ్‌ ఘోష్‌ 69వ జన్మదినం సందర్భంగా ఈ విశిష్ట వ్యక్తిని గురించి తెలుసుకుందాం...
డాక్యుమెంటరీ నిపుణుడుగా...
గౌతమ్‌ ఘోష్‌ కలకత్తాలో (24 July 1950) జన్మించారు. సంతన, హిమాంశు కుమార్‌ ఘోష్‌ గౌతమ్‌ తల్లిదండ్రులు. ప్రాధమిక విద్యను గౌతమ్‌ సెయింట్‌ జాన్స్‌ డయోసెసన్‌ స్కూలులో అభ్యసించారు. హైస్కూలు విద్య కేథడ్రల్‌ మిషనరీ బాలుర పాఠశాలలో కొనసాగించారు. తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ పట్టా అందుకున్నారు. కొంతకాలం ఫోటో జర్నలిస్టుగా పనిచేశారు. కలకత్తాలో గ్రూప్‌ థియేటర్‌ మూవ్మెంట్‌లో చురుకైన పాత్రను పోషించారు. 1978లో నీలాంజన అనే అమ్మాయిని వివాహమాడారు. వీరికి ఆనంద్‌ ఘోష్, ఇషాన్‌ ఘోష్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. 1973లో గౌతమ్‌ ‘న్యూ ఎర్త్‌’ అనే ఒక డాక్యుమెంటరీ సినిమాను నిర్మించారు. తరువాతి సంవత్సరం ‘హంగ్రీ ఆటమ్’ అనే మరొక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఈ డాక్యుమెంటరీకి ఓబర్‌ హూసెన్‌ చలనచిత్రోత్సవంలో బహుమతి లభించింది. ముచ్చటగా ‘చైన్స్‌ ఆఫ్‌ బాండేజ్‌’ అనే డాక్యుమెంటరీ నిర్మించిన తరువాత చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
                                                                  

‘మాభూమి’ తెలుగు సినిమాతో వెండితెరకు...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కిషన్‌ చందర్‌ రచించిన ‘జబ్‌ ఖేత్‌ జాగే’ అనే ఉర్దూ నవల ఆధారంగా నిర్మాతలు బి. నరసింగరావు, జి.రవీంద్రనాథ్‌ 1980లో చైతన్య చిత్ర ఇంటర్‌ నేషనల్‌ బ్యానర్‌ మీద ‘మాభూమి’ చిత్ర నిర్మాణానికి నడుంబిగించారు. తెలంగాణలో ప్రబలుతున్న ఫ్యూడల్‌ వ్యవస్థను ఎండగడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా కార్మికులు చేసిన ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. నిర్మాతలలో ఒకరైన నరసింగరావుకు బెంగాలీ చిత్రపరిశ్రమ సుపరిచితం కావడంతో యువ దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. నవల చదివి, తెలంగాణా సాయుధపోరాట వాస్తవాలను గ్రహించి దాని ఆధారంగా గౌతమ్‌ ఘోష్‌ ట్రీట్మెంట్‌ రాసుకొని హైదరాబాదు వచ్చి, తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య రాసుకున్న రిపోర్టులు, ప్రెస్‌ రిపోర్టులు అధ్యయనం చేసి పకడ్బందీగా స్క్రిప్టు రూపొందించారు. ఇదే గౌతమ్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా. బి.నరసింగరావు, గౌతమ్‌ ఘోష్, పార్థూ బెనర్జీ, ప్రాణ్‌రావు కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రూపొందించారు. కమల్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ, డి.రాజగోపాల్‌ ఎడిటింగ్‌ పనులు నిర్వహించారు. సుద్దాల హనుమంతు, యాదగిరి, ముక్కామల నాగభూషణం పాటలు రచించగా, గద్దర్, కె.బి.కె.మోహన్‌ రాజు, అనుపమ విల్సన్, సంధ్య పాటలు ఆలపించారు. బి.నరసింగరావు గౌతమ్‌ ఘోష్‌కు దర్శకత్వంలో సహాయపడ్డారు. ఇందులో త్రిపురనేని సాయిచంద్, కాకరాల, ఎం.బి.వి.ప్రసాదరావు, లక్ష్మణరావు, హంస ముఖ్యపాత్రలు పోషించగా నరసింగరావు, గద్దర్, రామిరెడ్డి కొన్ని ప్రత్యేక పాత్రలు పోషించారు. మిగతా నటీనటులంతా స్థానికులే. సారథి స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న ‘మాభూమి’ చిత్రం 1980 కార్లోవి వరీ చలనచిత్రోత్సవంలో భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. తరువాత కైరో, సిడ్నీ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుంది. సి.ఎన్‌.ఎన్‌ గుర్తించిన 100 అత్యుత్తమ భారతీయ చిత్రాల జాబితాలో ‘మాభూమి’కి చోటు దక్కింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు నంది బహుమతులు దక్కగా, ఫిలింఫేర్‌ సంస్థ ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి ప్రదానం చేసింది. ఈ సినిమా తరువాత గౌతమ్‌ ‘డెవలప్మెంట్‌ ఇన్‌ ఇరిగేషన్‌’(1981) అనే డాక్యుమెంటరీ నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ ఫిలిం తరువాత 1982లోపశ్చిమ బెగాల్‌ ప్రభుత్వ నిర్మాణతలో ‘డఖల్‌’ అనే బెంగాలి చిత్రాన్ని నిర్మించారు. అందులో మమత శంకర్, రాబిన్‌ సేన్‌ గుప్త, సునీల్‌ ముఖర్జీ, సుజల్‌ రాయ్‌ చౌదరి ముఖ్య తారాగణం. ఈ సినిమాకి రచన, ఫోటోగ్రఫీతోబాటు సంగీత దర్శకత్వం కూడా గౌతమ్‌ ఘోష్‌దే. ఆంధ్రదేశంలో కాకులను వేటాడి జీవించే సంచార గిరిజన జాతుల ప్రజలు దక్షిణ బెంగాల్‌ ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ గుప్తమైన పనుల్లో ఉంటూ జమీందారులచేత మోసగింపబడటం ఈ చిత్రకథా నేపథ్యం. ఈ సినిమాకి ఉత్తమ చిత్ర జాతీయ బహుమతి లభించింది. పారిస్‌ నగరంలో అంతర్జాతీయ మానవ హక్కుల మీద జరిగిన చలనచిత్రోత్సవంలో ‘డఖళ్’ గ్రాండ్‌ జ్యూరీ బహుమతి అందుకుంది.

                                 


హిందీ చిత్రసీమలోకి...
1984లో గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ‘పార్‌’ అనే హిందీ చిత్రం విడుదలైంది. పార్థ బెనర్జీ నిర్మించిన ఈ హిందీ సినిమాలో నసీరుద్దీన్‌ షా, షబానా ఆజ్మీ, ఉత్పల్‌ దత్, ఓంపురి ముఖ్య తారాగణం. బెంగాల్‌ రచయిత సమరేష్‌ బసు నవల ‘పారి’ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు వెనిస్‌ ఫిలిం ఫెస్టివల్‌లో యునెస్కో వారి బహుమతి లభించింది. షబానా ఆజ్మీ, నసీరుద్దీన్‌ షాలకు ఉత్తమ నటీనటులుగా జాతీయ బహుమతి లభించింది. గౌతమ్‌ ఘోష్‌కు ఉత్తమ స్కీన్ర్‌ ప్లే బహుమతి లభించింది. నసీరుద్దీన్‌ షా ‘వోల్పి కప్‌’ కూడా గెలుచుకున్నాడు. బీహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో ధనికుల ఆగడాలు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సహకరించిన ఉపాధ్యాయుణ్ణి చంపడం వంటి ఆకృత్యాల నేపథ్యంలో నిర్మించిన చిత్రమది. తరువాత 1987లో ‘సతీసహగమనం’ నేపథ్యంలో గౌతమ్‌ ఘోష్‌ ‘మహాయాత్ర’ చిత్రాన్ని హిందీలో, అదే చిత్రాన్ని ‘అంతర్జలి జాతర’ పేరుతో బెంగాలిలో నిర్మించారు. ఈ చిత్రానికి కమల్‌ కుమార్‌ మజుందార్‌ రచించిన ‘మహాయాత్ర’ నవల ఆధారం. ఇందులో మరణశయ్య మీద వున్న ఒక ధనవంతుడికి అతని ఆస్తిని హస్తగతంచేసుకునేందుకు ఒక తండ్రి తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లిచేసేందుకు ఉపక్రమించిన నేపథ్యం వుంది. ఈ బెంగాలి సినిమా కూడా ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. ఇందులో శత్రుఘ్నసిన్హా, వసంత్‌ చౌదరి, రబీ ఘోష్, ప్రమోద్‌ గంగూలి నటించారు. గౌతమ్‌ ఘోష్‌కు లఘు బడ్జెట్‌ చిత్రాలు నిర్మించడమన్నా, డాక్యుమెంటరీలు తీయడమన్నా మక్కువ. ‘మహాయాత్ర’ తరువాత ‘సంగే మీల్‌ సే ములాకాత్‌’, ‘మొహోర్‌’, ‘ది బర్డ్‌ ఆఫ్‌ టైమ్’ డాక్యుమెంటరీలు నిర్మించారు.


‘పతంగ్‌’ చిత్రంలో...
                                      

1993లో ‘పతంగ్‌’ అనే హిందీ సినిమాను సంజయ్‌ సాహె, దురా సాహెలు నిర్మించగా గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. స్కీన్ర్‌ ప్లే, ఫోటోగ్రఫీ, సంగీతం కూడా గౌతమే సమకూర్చారు. ఇందులో షబానా ఆజ్మీ, ఛిఖిఖి షఫీక్‌ సయ్యద్, ఓంపురి, రబీ ఘోష్‌ నటించారు. గయా రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో వుండే మురికివాడల ప్రజల జీవన రీతులు హైలైట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయచిత్ర (హిందీ) బహుమతి లభించగా, టయోర్మినా ఫిలిం ఫెస్టివల్‌లో షబానా ఆజ్మీకి ఉత్తమ నటి బహుమతి లభించింది. అదే సంవత్సరం గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ఇండో-బంగ్లా సంయుక్త సమర్పణలో బెంగాల్‌ ప్రభుత్వం ‘పద్మా నదిర్‌ మాఝి’ అనే సినిమా నిర్మించింది. మాణిక్‌ బందోపాధ్యాయ నవల ఈ సినిమాకు ఆధారం. ఇందులో రైసుల్‌ ఇస్లాం అసాద్, చంప, ఉత్పల్‌ దత్, రూపా గంగూలి, రబీ ఘోష్‌ నటించగా సినిమాటోగ్రఫి, సంగీతం గౌతమ్‌ ఘోష్‌ నిర్వహించారు. పద్మా డెల్టా ద్వీపం మీద ఒక పెద్ద రిసార్టు కట్టే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ చిత్రంగా ఈ సినిమాకు బహుమతి రాగా, ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా (బెంగాలీ) జాతీయ బహుమతి లభించింది. గౌతమ్‌ ఘోష్‌కు ఉత్తమ దర్శకుడిగా జాతీయ బహుమతి దక్కింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చంప, రైసుల్‌ ఇస్లాం అసాద్‌లకు ఉత్తమ నటీనటుల బహుమతులు, సినిమాకు ఉత్తమ చిత్ర బహుమతి ప్రదానం చేసింది. ఇవి కాకుండా మరో రెండు బహుమతులను కూడా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ప్రదానం చేసింది. గౌతమ్‌ ఘోష్‌ నిర్మించిన ‘బియాండ్‌ ది హిమాలయాస్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. 1996లో ‘గుడియా’అనే హిందీ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. మిథున్‌ చక్రవర్తి, నందన సేన్, ప్రాణ్, మసూద్‌ అఖ్తర్, టికు తల్సానియా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గౌతమ్‌ ఘోషే నిర్వహించారు. మహాశ్వేతాదేవి నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి ధ్వన్యనుకరణ సామ్రాట్‌ పాత్రను పోషించాడు. తరవాత ‘రాయ్‌’ (1999), ‘దేఖా’ (2001) సినిమాలకు గౌతమ్‌ దర్శకత్వం వహించారు. 2003లో మరలా ‘అబర్‌ అరణ్యే’ అనే బెంగాలి సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో సౌమిత్ర చటర్జీ, సుభేందు చటర్జీ, శశ్వత చటర్జీ, షర్మీలా టాగూర్, సమిత్‌ భంజా నటించారు. సత్యజిత్‌ రాయ్‌ నిర్మించిన ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ సినిమాలోని పాత్రలను తీసుకొని వారు అరణ్యం నుంచి బయటకు రావడాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి గౌతమ్‌ ఘోష్‌ ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ స్కీన్ర్‌ ప్లే రచయితగా రెండు జాతీయ బహుమతులు అందుకున్నారు. షర్మీలా టాగూర్‌కి జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. 2006 లో గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వంలో బిపిన్‌ వోహ్రా ‘యాత్ర’ అనే హిందీ సినిమా నిర్మించారు. రేఖా, నానా పటేకర్, దీప్తి నావల్, జీవా, మసూద్‌ అఖ్తర్‌ నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, సంగీతం గౌతమ్‌ ఘోష్‌ నిర్వహించారు. ఖయ్యాం గౌతమ్‌కి సంగీత నిర్వహణలో సహకరించారు. 2009లో ‘కాల్బెలా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తే అందులో సౌమిత్ర చటర్జీ, పరంవ్రత చటర్జీ నటించారు. నక్సలైట్‌ మూవ్మెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణం జరిగింది. తరువాత గౌతమ్‌ ఘోష్‌ వరసగా ‘’మొనేర్‌ మనుష్‌’ (2010), ‘శున్యో ఆంకో- యాక్ట్‌ జీరో’ (2013), ‘శంఖాచిల్‌’ (2016) చిత్రాలకు దర్శకత్వం వహించారు.

                                            

నటుడుగా, నిర్మాతగా...
1982లో గౌతమ్‌ ఘోష్‌ బుద్ధదేవ్‌ దాస్‌ గుప్తా నిర్మించిన ‘గృహజుద్ధ’ సినిమాలో అంజన్‌ దత్, మమతా శంకర్‌లతో కలిసి నటించారు. 1987లో శాంతను బౌమిక్‌ నిర్మించిన ‘గాయక్‌’ చిత్రంలో నటించారు. 2011లో శ్రీజిత్‌ ముఖర్జీ చిత్రం ‘బైషే శ్రావణ్‌’ సినిమాలో విశ్రాంత పోలీసు అధికారిగా నటించారు. 2012లో సందీపన్‌ రాయ్‌ చిత్రం ‘ఏక్తా ఆకాష్‌’లో, శ్రీజిత్‌ ముఖర్జీ మరో సినిమా ‘చౌశుష్‌ కోనే’లో కూడా నటించారు. గౌతమ్‌ ఘోష్‌ నిర్మాతగా మారి ‘రాయ్‌’ చిత్రాన్ని నిర్మించారు. తను దర్శకత్వం వహించిన అధికశాతం సినిమాలకు తనే కథను సమకూర్చి, స్కీన్ర్‌ ప్లే కూడా తయారు చేసుకునేవారు. తరువాత అధిక శాతం సినిమాలకు ఫొటోగ్రఫీ, సంగీత నిర్వహణ తనే చూసుకునేవారు. ‘దఖల్‌’ చిత్రానికి గౌతమ్‌ ఘోష్‌ స్వర్ణకమలం అందుకున్నారు.

- ఆచారం షణ్ముఖాచారి 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.