శ్రీనివాస నట చక్రవర్తి

దర్శకుడు ఆర్జీవీ ప్రియ శిష్యుడు. గురువు అడుగుజాడల్నే సదా అనుసరించ ఇష్టపడేవాడు. ఆయన సిద్ధాంతాల్ని, రాద్ధాంతాల్నీ ఆశ్చర్యంతో అవలోకించేవాడు. వర్మ దర్శకత్వంలోని ‘శివ’ సినిమాలో యువ విలన్‌ పాత్రలో రాణించి... ఆపై ఆయన మనస్సు దోచుకున్న నటుడు. కేవలం తెర ముందు కనిపించే నటుడిగానే కాకుండా... తెర వెనుక సహాయ దర్శకుడిగా, తర్వాత్తర్వాత దర్శకుడిగా కూడా ప్రతిభ కనబరిచిన అతడే... శ్రీనివాస చక్రవర్తి ఎలియాస్‌ జేడి చక్రవర్తి. ఆయన పుట్టిన రోజు ఏప్రిల్‌ 16. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.


పక్కా హైదరాబాదీ

జేడీ చక్రవర్తి అసలు పేరు శ్రీనివాస చక్రవర్తి. 1972 ఏప్రిల్‌ 16న హైదరాబాద్‌లో జన్మించాడు. తండ్రి నాగులపాటి సూర్యనారాయణ రావు రాజమండ్రికి చెందినవారు. తల్లి కోవెల శాంత విజయవాడకు చెందినవారు. వ్యవసాయ శాఖలో పనిచేసిన తండ్రి చిన్నవయసులోనే కన్నుమూశారు. చక్రవర్తి తల్లి గాయని. అధిక విద్యావంతురాలైన ఆవిడ ప్రొఫెసర్‌గా పని చేశారు. జేడీ చక్రవర్తి హైదరాబాద్‌లోనే పెరిగాడు. హైదరాబాద్‌లోని సెయింట్‌ జార్జ్‌ గ్రామర్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బీఈ చేశాడు. జేడీ చక్రవర్తి భార్య పేరు అనుకృతి నాగులపాటి. వీరి వివాహం 2016లో జరిగింది.‘శివ’అవకాశం

రామ్‌గోపాల్‌ వర్మ ‘శివ’ సినిమాతో జేడీ చక్రవర్తి పరిశ్రమకి పరిచయమయ్యాడు. వాస్తవానికి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని జేడీకి ఉండేది. నటుడు ఉత్తేజ్‌తో మొదట నుంచి మంచి స్నేహం ఉంది. ఒకసారి ఉత్తేజ్‌ జేడీ చక్రవర్తిని వర్మకు పరిచయం చేశారు. వర్మ కొన్ని సీన్‌ పేపర్లు ఇచ్చి యాక్ట్‌ చేసి చూపించమన్నాడు. అలా తనకు ‘శివ’ సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పాడు జేడీ చక్రవర్తి.‘శివ’ తరువాత మంచి గుర్తింపు

‘శివ’ సినిమాతో జేడీ అనే పాత్ర పేరు కాస్తా, అతడి ఇంటి పేరుగా మారిపోయింది. తెలుగు ‘శివ’ తరువాత హిందీ ‘శివ’కు పని చేద్దామని వర్మతో లొకేషన్లు చూడడానికి వెళ్లిన జేడీ చక్రవర్తినే అందరూ వచ్చి పలకరించేవారట. పక్కనే ఉన్న రాంగోపాల్‌ వర్మను కాకుండా తనతో మాట్లాడుతున్నారేమిటీ అని జేడీ చాలా భయపడ్డాడట. అంతలా ‘శివ’ సినిమా తనకు గుర్తింపు తెచ్చిపెట్టిందని.... ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదని చెబుతాడు జేడీ చక్రవర్తి.


జేడీ కోసం వర్మ ‘గులాబీ’ నిర్మాణం

కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గులాబీ’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ అందరికీ గుర్తే. వాస్తవానికి ఈ సినిమా కథ కృష్ణవంశీ చెప్పగానే జేడీకి విపరీతంగా నచ్చేసింది. దాంతో, ఆ ఓ నిర్మాత దగ్గరకు తీసుకెళితే, ఆయన రాజశేఖర్‌తో తీయాలనుకున్నాడు. దాంతో, ‘గులాబీ’ సినిమా కోసం తన ఇల్లుని అమ్మేయాలనుకున్నాడు జేడీ. ఆ విషయం తెలుసుకొన్న రామ్‌గోపాల్‌ వర్మ, ‘గులాబీ’ని నిర్మించడానికి ముందుకు వచ్చాడు. కథ కూడా వినకుండానే జేడీ చక్రవర్తిపై నమ్మకంతో ఆ సినిమాని నిర్మించాడు వర్మ.‘రాఘు’ అని దర్శకేంద్రుణ్ణి పిలుస్తా!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, రంభ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘బొంబాయి ప్రియుడు’ సినిమా భారీ విజయం సొంతం చేసుకొని జేడీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తొలిసారి రాఘవేంద్రరావుతో ఈ సినిమా కోసం కలిసినప్పుడు ఓ సరదా సంభాషణ తమ మధ్య చోటు చేసుకుందని ఓ ఇంటర్వ్యూలో గుర్తుకుతెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. ఆ సరదా సంభాషణ ఏమిటంటే... జేడీ చక్రవర్తి చాలా పెద్ద పేరనీ... చక్రి అని పిలవవచ్చా అని జేడీని రాఘవేంద్రరావు అడిగారట. అందుకు తిరిగి జేడీ చక్రవర్తి ‘కె.రాఘవేంద్రరావు చాలా పెద్ద పేరనీ రాఘు అని పిలవవచ్చా’ అని అడిగారట. అందుకు ఒకే అన్నారు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావుతో తనకు మంచి స్నేహం ఉందని చెబుతాడు జేడీ చక్రవర్తి.దర్శకత్వం వైపు

చాలా మంది నటీనటులకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని ఉంటుంది. జేడీ చక్రవర్తి మాత్రం సుమారు 18 ఏళ్లు సహాయ దర్శకుడిగా పని చేసిన తరువాత దర్శకుడిగా మారాడు. వాస్తవానికి ‘శివ’కి, ఆ తరువాత రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘క్షణక్షణం’, తదితర చిత్రాలకూ సహాయ దర్శకుడిగా, అసోసియేట్‌గా పని చేశాడు జేడీ చక్రవర్తి. ‘సత్య’ సినిమాకు ఎడిటింగ్, సౌండ్‌ డిజైనింగ్‌ విభాగాల్లో కూడా పాలు పంచుకున్నాడు. 2008వ సంవత్సరంలో తాను తెరకెక్కించిన ‘డర్నా జరూరియా’ సినిమాని న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఓ పాఠంగా పెట్టడం తనకు ఓ విజయం అంటాడు జేడీ. ‘దుర్గ’, ‘డర్నా జరూరి హై’, ‘దర్వాజా బంద్‌ రఖో’, ‘హోమం’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్‌ మనీ’, ‘ఆల్‌ ది బెస్ట్‌’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ‘పాపే నా ప్రాణం’, ‘దుర్గ’ సినిమాలను నిర్మించాడు.

                                 

చిరుకి వీరాభిమాని

మెగాస్టార్‌ చిరంజీవి నుంచి స్ఫూర్తి పొంది సినిమా పరిశ్రమకు వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు. జేడీ చక్రవర్తి కూడా మెగాస్టార్‌కు వీరాభిమానే. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సినిమాల పట్ల జేడీకి ఎంతో పట్టు ఉంది.


అద్భుతమైన సినిమా - నిరాశపరిచిన సినిమా

తన కెరీర్‌కు ఎంతో బాగా ఉపయోగపడే సినిమా ‘గులాబీ’ అని, ‘సత్య’ లాంటి సినిమా మళ్ళీ రాదని అంటుంటాడు జేడీ. హాలీవుడ్‌కు చెందినవారు రూపొందించిన ‘ప్రపంచంలోనే వంద ఉత్తమ చిత్రాలు’ జాబితాలో ‘షోలే’, ‘మదర్‌ ఇండియా’ చిత్రాలతో పాటు ‘సత్య’ కూడా ఉందని గర్వంగా చెబుతాడు జేడీ. తనని బాగా నిరుత్సాహ పరిచిన సినిమా ‘నవ్వుతూ బతకాలిరా’ అని చెబుతాడు.


టాప్‌ డైరెక్టర్స్‌తో

జేడీ చక్రవర్తి తన కెరీర్‌లో మణిరత్నం, కృష్ణవంశీ, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.రాఘవేంద్రరావు, కోడిరామకృష్ణ, ఈవీవీ సత్యనారాయణ, శివ నాగేశ్వరరావు, గుణశేఖర్, వంశీ వంటి టాప్‌ డైరెక్టర్స్‌తో పని చేశాడు.


తెలుగులో జేడీ సినిమాలు

‘శివ’, ‘నేటి సిద్దార్థ’, ‘రక్షణ’, ‘మనీ’, ‘వన్‌ బై టు’, ‘మనీ మనీ’, ‘మృగం’, ‘దెయ్యం’, ‘బొంబాయి ప్రియుడు’, ‘ఎగిరే పావురమా’, ‘అనగనగా ఒక రోజు’, ‘వైఫ్‌ ఆఫ్‌ వి.వరప్రసాద్‌’, ‘నేను ప్రేమిస్తున్నాను’, ‘ప్రేమకు వేళయరా’, ‘హరిశ్చంద్ర’, ‘పాపే నా ప్రాణం’, ‘కోదండ రాముడు’, ‘నవ్వుతూ బతకలిరా’, ‘మా పెళ్ళికి రండి’, ‘సూరి’, ‘ప్రేమకు స్వాగతం’, ‘కాశి’, ‘మధ్యాహ్నం హత్య’, ‘మర్రి చెట్టు’, ‘దుబాయ్‌ శీను’, ‘హోమం’, ‘జోష్‌’, ‘మనీ మనీ మోర్‌ మనీ’, ‘ఆల్‌ ది బెస్ట్‌’, ‘నక్షత్రం’, ‘హిప్పీ’ తదితర సినిమాలలో నటించాడు.పురస్కారాలు

‘గులాబీ’ చిత్రానికి నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం అందుకొన్నాడు. ‘సత్య’ సినిమాకు స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ అందుకొన్నాడు.


- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.