టాలీవుడ్‌ ట్రెండీ భాయ్‌ .... జగ్గుభాయ్‌
ఆయన... అమ్మాయిల కలల ‘అల్లరి ప్రేమికుడు’. ఆ హీరో సినిమా పాటలనే ‘ప్రియరాగాలు’గా అమ్మాయిలు ఎక్కువగా ఆలపించేవారు. అంతేకాదండోయ్‌... కుటుంబ కథాంశాలతో కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యి ‘శుభాకాంక్షలు’ చెప్పించుకొన్నారు. తన నటనతో ‘ఆహ’ అని అనిపించుకొన్న ఆ హీరోతో ‘ఒక చిన్న మాట’ మాట్లాడాలని ఎంతో మంది తాపత్రయపడ్డారు. అయితే... ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు... సగం తెలుగు, సగం నలుపు కురులతో, స్టైలిష్‌ గడ్డంతో విలన్‌ పాత్రలు తండ్రి పాత్రలు చేస్తున్నారు. అయితే, హీరోగా ఉన్నప్పుడు కన్నా ఆ నటుడికి ఇప్పుడు ఇంకా మహిళా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయిందంటే అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఆ నటుడే టాలీవుడ్‌ భాయ్‌... జగ్గుభాయ్‌. ‘లెజెండ్‌’ చిత్రంతో టాలీవుడ్‌ ‘లెజెండ్‌’ ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన జగ్గూభాయ్‌ పుట్టినరోజు ఫిబ్రవరి 12న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ‘సితార.నెట్‌’ ప్రేక్షకుల కోసం.


జననం మచిలీపట్నం
జగపతిబాబు మచిలీపట్నంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్ర ప్రసాద్‌కు 12 ఫిబ్రవరి 1962న జన్మించారు. జగపతిబాబు బాల్యం అంతా చెన్నైలో గడిచింది. అందువలన, జగపతిబాబుకు తెలుగు మాట్లాడడం మాత్రమే వచ్చు. తమిళం చదవడం, రాయడం వచ్చు.

కుటుంబం
జగపతిబాబు భార్య పేరు లక్ష్మి. వీరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మేగ్నా. జగపతిబాబు పెద్ద కుమార్తె మేగ్నా వివాహం ఒక అమెరికన్‌తో జరిగింది. ఆ వివాహాన్ని ప్రైవేట్‌ వేడుకగా చేశారు జగపతిబాబు దంపతులు. వివాహానికి పెళ్ళికొడుకు తరుపు నుంచి ఆయన తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వివాహం వ్యక్తిగతం అని నమ్మే జగపతిబాబు ఈ వివాహాన్ని ఎంతో నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య జరిపించారు.


‘శుభలగ్నం’తో స్టార్‌ స్టేటస్‌
‘సింహ స్వప్నం’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు జగపతిబాబు. 1989నాటి ఈ చిత్రాన్ని నిర్మించింది ఆయన తండ్రి రాజేంద్రప్రసాదే. దర్శకత్వం వహించింది వి.మధుసూదన్‌ రావు. 1992లో విడుదలయిన ‘పెద్దరికం’ జగపతి బాబు కెరీర్‌ లో మొదటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా. 1993లో రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘గాయం’ సినిమా జగపతిబాబు కెరీర్‌ కు ఓ బ్రేక్‌ పాయింట్‌. 1994లో, సూపర్‌ హిట్‌ అయిన ‘శుభలగ్నం’తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు జగపతిబాబు. ఈ చిత్రంతో స్టార్‌ స్టేటస్‌ని కూడా సంపాదించుకోగలిగారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి చిత్రం ‘మావిచిగురు’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు జగపతిబాబు. 1997లో ‘శుభాకాంక్షలు’, ‘పెళ్లి పందిరి’ వంటి హిట్లను అందుకొన్నారు. 2000లో ‘మనోహరం’ సినిమా ద్వారా తాను ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే రాణించగలనని నిరూపించారు.

                                

2003 నుంచి 2005 వరకు ‘కబడ్డీ కబడ్డీ’, ‘అతడే ఒక సైన్యం’, ‘పెదబాబు’, ‘అనుకోకుండా ఒక రోజు’ వంటి హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జగబతిబాబు. 2006లో ‘సామాన్యుడు’, ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత 2007లో ‘లక్ష్యం’ సినిమాలో నటించారు. జగపతిబాబు మొదటి తమిళ సినిమా ‘మద్రాసి’. 2012లో తమిళ చిత్రం ‘తాండవం’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు జగపతిబాబు. ఆ తరువాత, ‘జై బోలో తెలంగాణ’లో ప్రధాన పాత్రను పోషించారు. 2012లో కన్నడ సినిమా ‘బచ్చన్‌’లో పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఇందులో ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌ ప్రధాన పాత్రలో కనిపించారు. ఆ తరువాత 2014లో నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్‌’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.


‘లెజెండ్‌’తో విలన్‌గా మరో దశ
‘లెజెండ్‌’ చిత్రంలో నటనకుగానూ ఎన్నో ప్రశంసలను అందుకొన్నారు జగపతిబాబు. అలాగే కొన్ని అవార్డులు కూడా స్వీకరించారు. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ స్టార్‌కు. ఎన్నో సహాయ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటున్నారు. అదే సంవత్సరం, తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటించిన ‘లింగా’లో కూడా విలన్‌గా నటించారు. 2015లో, ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్‌ బాబు తండ్రిగా నటించారు. 2016లో, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించగా ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటించి ప్రేక్షకులను అలరించారు. 2017లో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలో నాగచైతన్య తండ్రి పాత్రను పోషించారు. సూపర్‌ హిట్‌ మూవీ ‘రంగస్థలం’లో విలన్‌ పాత్రలో నటించారు. రవితేజ నటించిన ‘నేల టికెట్‌’లో కూడా ప్రతినాయకుడి పాత్రను పోషించారు జగపతిబాబు. 2018లో ‘గూఢచారి’ సినిమాలో కూడా విలన్‌గా నటించారు. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘మహర్షి’లో కూడా విలన్‌ పాత్రనే పోషించారు జగపతిబాబు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మకమైన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’లో ఒక ప్రధాన పాత్రలో నటించారు జగపతిబాబు

పతనం నుంచి
2011, 2012 సంవత్సరాలలో ఇక ఇండస్ట్రీలో తన పని అయిపోయిందని భావించారు జగపతిబాబు. ఇల్లు అమ్మినా మూడు కోట్లు మైనస్‌ స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చారు జగపతిబాబు. కుటుంబ పోషణ కోసం సీరియల్స్‌లో చేద్దామని అనుకొన్నారు. ఇక ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఫోన్‌ కాల్‌ రావడం అంటే ఒక మిరాకిలే అని అనుకొన్నారు జగపతిబాబు. ఇప్పుడు చేతిలో ఎన్నో సినిమాలతో బిజీగా ఉన్నారు

ఫస్ట్‌ ఎంట్రీలో హీరో... రీ ఎంట్రీలో విలన్‌
సుమారు వంద సినిమాలలో హీరోగా నటించిన జగపతిబాబు ‘లెజెండ్‌’ సినిమాలో మొదటిసారి విలన్‌ పాత్రను పోషించడం విశేషం. అలాగే తండ్రి పాత్రలను కూడా పోషిస్తున్నారు. ఇక్కడ విషయమేమిటంటే... హీరోగా చేస్తున్నప్పుడు జగపతిబాబుకు మహిళా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రీ ఎంట్రీలోనూ ఆ ఫాలోయింగ్‌ పెరగడం విశేషం.

రీ ఎంట్రీలోనే ఎక్కువ సంతోషం
రీ ఎంట్రీలో చేస్తోన్న సినిమాలతోనే చాలా హ్యాపీగా ఉంటున్నట్టు ఒకసారి మీడియా ముందు చెప్పారు జగపతిబాబు. అందుకు కారణం... సినిమా గురించి టెన్షన్‌ లేకపోవడమేనట. సినిమా రిలీజ్‌ అవుతుందా లేదా అన్న టెన్షన్‌ గానీ ఓపెనింగ్‌ని వెళ్లాలన్న టెన్షన్‌ గానీ ఆడుతుందా లేదా అన్న టెన్షన్‌ వంటివేమీ తనకు లేదని జగపతిబాబు అన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తాను నటిస్తున్న కారణంగా నిర్మాత నుంచి తీసుకోవడమే కానీ ఎదురవ్వవలసిన అవసరం లేదు కాబట్టి తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. ఈ స్వేచ్ఛతో ఎంతో హ్యాపీగా ఉన్నానని అన్నారు. హీరోగా ఉన్నప్పుడు నిర్మాతలకు ఎదురవ్వవల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుకుతెచ్చుకొన్నారు. షూటింగ్‌ ఆగిపోయినా, సినిమా ప్లాప్‌ అయినా జగపతి బాబు నిర్మాతలకు డబ్బులు వెనక్కి ఇచ్చేసేవారట. ఒకానొక సందర్భంలో తీసుకొన్న డబ్బు కన్నా ఎక్కువ డబ్బుని ఇచ్చేసేవారట.


ఇలా...‘లెజెండ్‌’ అవకాశం
ఆర్ధిక పరిస్థితుల కారణంగా తన ఇల్లు అమ్మడానికి అడ్వాన్స్‌ పుచ్చుకున్నారు జగపతిబాబు. ఆ సమయంలో సినిమా అవకాశాలతో ల్యాండ్‌ ఫోన్‌ అయినా మొబైల్‌ ఫోన్‌ అయినా మోగితే బాగుణ్ణు అని జగపతిబాబు అనుకుంటున్న రోజులవి. అటువంటి సమయంలో జగపతిబాబు తీసుకొన్న ఫోటో సెషన్‌ను చూసిన బోయపాటి శ్రీను ‘లెజెండ్‌’లో ప్రతినాయకుడి పాత్రకు ఆయన్ను సంప్రదించారట. బోయపాటి వచ్చి కథ చెప్పి తనని విలన్‌గా నటించమని అడిగిన తరువాత వెంటనే ఒప్పుసుకొన్నారు జగపతిబాబు. అయితే, సినిమా స్టార్ట్‌ అయ్యే ప్రాసెస్‌లో కొన్ని రోజులు ఆలస్యం అయింది. అప్పుడు ఆ సినిమా అవకాశం తనకు వస్తుందా రాదా అని చాలా కంగారు పడ్డారట జగపతిబాబు. పాత్ర వస్తుందా రాదా అని జగపతిబాబు టెన్షన్‌ పడుతుంటే.... జగపతిబాబు ఆ క్యారెక్టర్‌లో నటిస్తారా లేదా అని ‘లెజెండ్‌’ చిత్ర బృందం మరోపక్క టెన్షన్‌ పడుతోందట. ఎట్టకేలకు ఆ సినిమా స్టార్ట్‌ అవడం అందులో విలన్‌గా తాను నటించడం ఒక్కసారిగా తన రీ ఎంట్రీ వలన తనకు అమాంతం పేరు పెరిగిపోవడం వంటివి జరిగిపోయాయి.


‘అంతఃపురం’ లాంటి సినిమాల వలెనే
‘అంతఃపురం’ లాంటి సినిమాలలో నటించడం వలన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడానికి తాను ఓపెన్‌ మైండెడ్‌గా ఉండేవాడినని అన్నారు జగపతిబాబు.

కొంతమంది చిన్నచూపు
రీ ఎంట్రీలో తనని ఎవరూ చిన్న చూపు చూడలేదని చెప్పారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలకు తనమీద అపారమైన గౌరవం ఉందని అన్నారు. తాను హీరోగా చేస్తున్నప్పుడు సరిగ్గా డైలాగ్‌ చెప్పకపోతే ముందు తరం హీరోయిన్లు అందుకు నవ్వుకునేవారని అన్నారు జగపతిబాబు. అటువంటి పరిస్థితులు ఒకటి రెండు సార్లు తాను ఎదురుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే రైజ్‌లో ఉన్న హీరోలు కూడా తనని చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.


జగ్గూ వైఫల్యాలపై తండ్రి రియాక్షన్‌
జగపతిబాబు సినిమాలు విజయం సాధించినప్పుడు ‘నువ్వు ఇల్లు అమ్మేస్తావు’ అన్న మాటని ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్‌ అన్నారట. ఆ మాటలు రోజూ అంటుండే వారట. ఈ మాటలు వింటూ ఉంటే ఏంటో నెగటివ్‌గా అనిపించేదట జగపతిబాబుకి. అయితే, తన తండ్రి అలా అనడంలో తప్పు లేదని, పరిస్థితులు అప్పుడు అలా వచ్చాయని, ఇప్పుడు సినిమాలు చేస్తూ హాయిగా ఉన్నందుకు హ్యాపీగా ఉందని చెప్పారు జగపతిబాబు. ‘లెజెండ్‌’ సినిమాని రాజేంద్రప్రసాద్‌ చూసారు. హ్యాపీగా ఫిల్‌ అయ్యారు. చివరి రోజుల్లో కొడుకు పురోగతి చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు.

అమ్మ ఉత్తరం అంటే భయం
అమ్మ రాసిన ఉత్తరం అంటే జగపతిబాబుకు భయం. అల్లరి చేసినప్పుడు, సిగరెట్‌ కాల్చినప్పుడు, మందు తాగినప్పుడు వాళ్ళ అమ్మ నుంచి నిరంతరంగా ఉత్తరాలు వచ్చేవి. ఆవిడ ఎంత భాధపడ్డారో ఆ ఉత్తరాల్లో రాసేవారు. వాటిని చదవడం అంటే జగపతిబాబుకు ఎంతో టెన్షన్‌గా ఉండేదట. పెరిగింది చెన్నైలో కావడం వలన ఆ ఉత్తరాల్ని మరొకరితో చదివించుకునేవారు జగపతిబాబు. అలా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు జగపతిబాబు.

తన గొడవ తనదే
జగపతిబాబు ఎప్పుడూ తన కుటుంబం, తన పనులు వంటి విషయాలతో బిజీగా ఉంటారు. కుటుంబం విషయాలలోనే సంతోషంగా ఉంటారు జగపతిబాబు. ముఖ్యమైన విషయాలైతే ఎవరో ఒకరు చెబుతారు కదా అని ఆయనకు పేపర్‌ చదివే అలవాటు కూడా లేదు.

పురస్కారాలు
‘లక్ష్యం’, ‘లెజెండ్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలకు ఉత్తమ సహాయనటుడిగా ఫిలింఫేర్‌ పురస్కారాలను అందుకొన్నారు జగపతిబాబు. 1989నాటి ‘అడవిలో అభిమన్యు’ సినిమాకి స్పెషల్‌ జ్యూరీ నంది పురస్కారాన్ని అందుకొన్నారు జగపతిబాబు. ‘గాయం’, ‘మావిచిగురు’, ‘మనోహరం’ సినిమాలకు ఉత్తమ నటుడిగా మూడు సార్లు నంది పురస్కారాలను అందుకొన్నారు. ‘అంతఃపురం’, ‘లక్ష్యం’ చిత్రాలకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు ఆయన్ని వరించాయి. ‘లెజెండ్‌’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలకు ఉత్తమ విలన్‌గా సైమా పురస్కారాలు సంపాదించుకోగలిగారు. ‘శ్రీమంతుడు’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఐఫా పురస్కారాన్ని అందుకోగలిగారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ప్రతినాయక పాత్రలో ఉత్తమ నటుడిగా మరో ఐఫా పురస్కారాన్ని రాబట్టుకోగలిగారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌ 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.