సౌందర్య స్వాప్నికుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు

సెకండ్‌ షోకి వెళ్లి అర్ధరాత్రి వేళ తిరిగొస్తుంటే... ఆ ఒంటరితనాన్ని పోగొడుతూ పక్కనే ఆ చిత్ర నాయిక- అతిలోకసుందరి. వేటూరి పాటపాటలోని మాటలన్నీ పోగేసి కమ్మని కబుర్లు చెప్తూ కవ్విస్తూ, నవ్విస్తూ, కలవరింతల పలవరింతలకులోను చేసే శిల్ప సౌందర్యం- సాగరకన్యక. థియేటర్లోకి వెళ్లిన దగ్గర్నుంచి తెరంతా పరచుకుని, వొళ్ళంతా విరుచుకుని, కాటుక కళ్ళతో క్యాట్‌ వాక్‌ చేస్తూ ఒక్కసారిగా వెల్లువెత్తే అందాల అత్తరు తుపానులో వీక్షకులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి ఇంద్రజాలం అది. సెంట్‌ పర్సెంట్‌ పైసా వసూల్‌ రాఘవేంద్రజాలం. వినోదం, ఆనందం, ఆహ్లాదం సంపూర్ణం కలశంలో అందించి గమ్మత్తుగా వీక్షకుల్ని మత్తులో ముంచేసే మహా మంత్రజాలం. తెల్లారి లేస్తే ఎదురయ్యి కస్టాలు, నష్టాలు, కన్నీళ్లు, కడగండ్లను మరిచి దేవలోక ఇంద్రజలను, అలల చేతుల్తో ఆత్మీయంగా ఆహ్వానించే సాగర జలకన్యకలను పలకరించి, పులకరించేందుకు... ఆ కాసేపు ప్రేక్షకులను సైతం జగదేకవీరులు, సాహస వీరులుగా మార్చి ...మళ్లీ బతుకుపై రెట్టింపు ఉత్సాహాన్నికలుగజేసే మంత్రగాడు ఆయన. ఆయనే...దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు...బి.ఎ.   పుట్టినరోజు (మే 23)..  ఈసందర్భంగా ఆయన గురించి సితార.నెట్‌ పాఠకుల కోసం...



* బి.ఎ అంటే...?

రాఘవేంద్రరావు సినిమాలు చూసి చూసి వెర్రెత్తిపోయిన ప్రేక్షకులు ఆయన బి.ఎ., డిగ్రీపై కూడా సరదా సెటైర్లను అప్పట్లో వేసేవారు. బి.ఎ. అంటే బొడ్డు పై ఆపిల్‌ అని సరికొత్త అర్ధంతో రాఘవేంద్రరావు సినిమాల సారాన్ని ఒక్క పదంలో క్లుప్తంగా ఉదాహరించేవారు. తొలినాళ్లలో ‘జ్యోతి’, ‘ఆమె కథ’, ‘అమరదీపం’, ‘ప్రేమలేఖలు’, ‘కల్పన’లాంటి ఉత్తమాభిరుచిగల సినిమాలకు దర్శకత్వం వహించినా... ఆయన సినిమాలు హీరోయిన్‌ బొడ్డు చుట్టూ తిరగడంతోనే బి.ఎ. అంటే బొడ్డు పై ఆపిల్‌గా ప్రేక్షకులు, విమర్శకులు గుర్తించారు. ఈ విషయంలో ఆయన కూడా ఎక్కడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. తన చిత్రాలు స్త్రీ సౌందర్యానికి అభినందన పత్రాలు అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. అంతెందుకు...? ఓ సభలో రచయితలు పరచూరి బ్రదర్స్‌ రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ హీరోయిన్‌ బొడ్డు చూపించి నిర్మాతలను ఒడ్డుకు చేర్చే దర్శకుడంటూ కితాబిచ్చారు. ఔను.. .రాఘవేంద్రరావుకి తెరపై నాయికలను బహు సుందరంగా చెక్కడం వచ్చు. ఏ అందం ఏ కోణంలో కెమెరాని ఆకట్టుకుంటుందో ఆయనకీ బాగా తెలుసు. అందుకే... రాఘవేంద్రరావు హీరోయిన్స్‌ అందాల రాణుల్లా ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేస్తారు. ఆయన సినిమాలు రమణీయ దృశ్య కావ్యాలు. అప్పట్లో హీరోయిన్స్‌ రాఘవేంద్రరావు సినిమాలో ఒక్క ఛాన్స్‌ కోసం ఎంతగానో తపించిపోయారంటే ... ఆయన కెమెరా కన్ను ఎంత చురుకయినదో ఇట్టె అర్ధం చేసుకోవచ్చు. రెండక్షరాల ప్రేమను, అంతర్లీనంగా హృదయాల్ని రంజింపజేసే శృంగారాన్ని తెరపై సుందరంగా, సురుచిరాంగా మలచే రాఘవేంద్రరావు స్వప్నలోక సంచారి. సదా ఆనంద విహారి. బాలీవుడ్‌లో రాజ్‌ కపూర్‌లా టాలీవుడ్‌ రాజ్‌ కపూర్‌ మన రాఘవేంద్రరావు.





* సినీ కుటుంబ నేపథ్యం

రాఘవేంద్రరావు సినీ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి కోవెలమూడి సూర్య ప్రకాశరావు, దర్శకుడు. తల్లి కోటేశ్వరమ్మ. సోదరుడు కోవెలమూడి బాపయ్య. 1942 మే 23న విజయవాడ కంకిపాడు దగ్గర కొలవెన్ను గ్రామంలో రాఘవేంద్రరావు పుట్టారు. భార్య సరళ. కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి, కూతురు మాధవి. 1961లో ‘వాగ్దానం’ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసి మెళకువలు నేర్చుకున్న తరువాత మరికొన్ని చిత్రాల్లో కూడా పనిచేసి అనుభవం సంపాదించుకుని దర్శకుడిగా 1975లో ‘బాబు’ సినిమాతో పరిచయమై విజయయాత్రను ప్రారంభించారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు సినిమా కెరీర్‌లో 90 శాతం సూపర్‌ హిట్స్‌ ఉన్నాయంటే...అది చరిత్రే. కధానాయకుడు శోభన్‌ బాబు ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా నాయకుడైనా...అగ్ర హీరోలందరి చిత్రాలకూ దర్శకత్వం వహించారాయన. దర్శక నిర్మాత క్రాంతి కుమార్‌ స్కూల్‌కి అలవాటు పడిన ఆయన అభిరుచిగల సినిమాలకు దర్శకత్వం వహించారు. తర్వాత్తర్వాత బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతూ కాసులు కురిపించే కమర్షియల్‌ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎవరెస్టు శిఖరారోహణ చేసారు. ఎన్నో విజయాలు అందుకున్నారు. అగ్రశ్రేణి దర్శకుడిగా కొన్ని దశాబ్దాలు ప్రభావితం చేసారు. ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు.



* ఎంత ప్రతిభో?

కేవలం దర్శకుడిగానే కాకుండా సినీ మాధ్యమంలో వివిధ కళారూపాలను ఆవహించుకున్నారు. ఔపోషన పట్టారు. దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్కీన్ర్‌ రైటర్, ప్రొడ్యూసర్, ప్రజంటర్, కొరియోగ్రాఫర్‌...ఇలా ఆయన అడుగుపెట్టని రంగాలు లేవు. డైరెక్టర్‌గా 108 సినిమాలు. దర్శకత్వ పర్యవేక్షణలో 2001లో ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’, 2002లో ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’, 2004లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాలకు దిక్సూచి అయ్యారు. ప్రజంటర్‌గా 1992లో ‘సరిగమలు’, 2001లో ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’, 2002లో ‘బాబీ’,. 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’, 2015లో ‘బాహుబలి ది బిగినింగ్‌’, 2017లో ‘బాహుబలి ది కంక్లూజన్‌’ చిత్రాలకు తన ప్రతిభ అద్దారు. కొరియోగ్రాఫర్‌గా 1996లో ‘పెళ్లి సందడి’ చిత్రానికి పనిచేసారు.



* బుల్లితెరపై కూడా విశేష ప్రతిభ

బుల్లితెరపై కూడా రాఘవేంద్రరావు విశేష ప్రతిభ కనబరిచారు. 2002లో ‘శాంతి నివాసం’ సీరియల్‌కి రైటర్‌గా పనిచేసారు. 2014లో ఈ టీవీ ఆధ్వర్యంలో ‘సౌందర్య లహరి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిసారి మౌనం మాట్లాడుతోందంటూ సౌందర్య లహరిలో ఆయన ఎన్నో ముచ్చట్లు చెప్పారు. తన సినీ జీవిత గమనాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. చేసిన సినిమాలు, గడించిన అనుభవాలు, తీపి తీపి జ్ఞాపకాలు...ఆయా చిత్రాల్లోని నాయికా నాయకులతో కలసి పంచుకున్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఔత్సాహికులకు ఎంతో స్ఫూర్తిని అందించింది. 2016లో ‘కోయిలమ్మ’, 2017లో ‘సై సై సయ్యారే’, అదే సంవత్సరం ‘అగ్ని సాక్షి’ సీరియల్‌కి తన ప్రతిభ అద్దారు.




* ‘అడవిరాముడి’తో కమర్షియల్‌ హిట్‌

‘అడవిరాముడు’ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వ ఇమేజ్‌ని సంపూర్ణంగా మార్చేసింది. అప్పటికే అగ్ర హీరోగా ఇండస్ట్రీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఎన్టీఆర్‌తో రాఘవేంద్రారావు కాంబినేషన్‌కి బీజం వేసిన చిత్రం ఇది. 1973లో కన్నడలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ‘గంధడ గుడి’ సినిమాకి తెలుగు అనువాదం ‘అడవిరాముడు’. ఈ చిత్రం అప్పట్లో సాధించిన విజయం అత్యద్భుతం. ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది. జయప్రద, జయసుధ..ఇద్దరు నాయికలు, అడవి నేపథ్యం, ఏనుగులతో ఆసక్తికర సన్నివేశాలు, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాననే... ’ వేటూరి అల్లరల్లరి పాటలు... ఈ చిత్రాన్ని విజయపధంలోకి నడిపించాయి. ఆ తరువాత ...ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌కి ఇమేజ్‌ బాగా పెరిగింది. ‘సింహబలుడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘వేటగాడు’, ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’, ‘గజదొంగ’, ‘తిరుగులేని మనిషి’, ‘సత్యం శివం’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాధించారు.






* అగ్రహీరోలతో కూడా

అక్కినేని నాగేశ్వరరావుతో కూడా రాఘవేంద్రరావు అతి తక్కువగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ప్రేమకానుక’, ‘అగ్ని పుత్రుడు’, ‘సత్యం శివం’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్‌ శ్రీదేవి జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘పదహారేళ్ళవయసు’ అద్భుత విజయాన్ని చవి చూసింది. శోభన్‌ బాబుతో ‘మోసగాడు’, ‘ఇద్దరు దొంగలు’, ‘దేవత’ తీశారు. ఇక, కృష్ణంరాజుతో ‘అడవి సింహాలు’, ‘అమరదీపం’, ‘త్రిశూలం’, ‘రగిలే జ్వాల’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘రావణ బ్రహ్మ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కృష్ణ కి కూడా కొన్ని విజయవంతమైన చిత్రాలు అందించారు. ‘భలే కృష్ణుడు’, ‘ఘరానా దొంగ’, ‘ఊరికి మొనగాడు’, ‘శక్తి’, ‘అగ్నిపర్వతం’, ‘వజ్రాయుధం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవితో కమర్షియల్‌ హిట్స్‌ అందించారు. ‘అడవిదొంగ’, ‘కొండవీటి రాజా’, ‘చాణక్య శపధం’, ‘యుద్దభూమి’, ‘రుద్రనేత్ర’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’, ‘శ్రీ మంజునాథ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జునతో తీసిన చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ‘అగ్ని’, ‘ఘరానా బుల్లోడు’, ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘షిర్డీ సాయి’, ‘ఓం నమో వెంకటేశాయా’ చిత్రాలు తీశారు. భక్తి ప్రధానమైన చిత్రాల్ల్లో ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘షిర్డీ సాయి’ చిత్రాలు మంచి ఆదరణకు నోచుకున్నాయి. బాలకృష్ణ, మోహన్‌ బాబు, రాజశేఖర్, జెడి చక్రవర్తి... ఇలా ఎంతోమంది హీరోలతో ఆయన చిత్రాలు తీసి హిట్‌ చేశారు. అల్లు అర్జున్‌ మొదటి సినిమా రాఘవేంద్రరావు వందో సినిమా ‘గంగోత్రి’, మహేష్‌బాబు మొదటి సినిమా ‘రాకుమారుడు’...ఇలా ఈతరం నటులతో కూడా ఆయన సినిమాలు తీశారు. నితిన్, త్రిష జంటగా ‘అల్లరిబుల్లోడు’ సినిమా కూడా హిట్‌ అయింది. మంచు మనోజ్‌తో ‘ఝుమ్మంది నాదం’ సినిమా తీశారు.




* బాలీవుడ్‌ హీరోలతో

బాలీవుడ్‌ హీరోలతో కూడా రాఘవేంద్రరావు పనిచేసారు. జితేంద్ర, పూనమ్‌ ధిల్లాన్‌తో ‘నిశానా’, జితేంద్ర, హేమామాలినితో ‘ఫర్జ్‌ ఔర్‌ కానూన్‌’, జితేంద్ర, శ్రీదేవితో ‘హిమ్మత్‌ వాలా’, ధర్మేంద్ర, జితేంద్ర, పర్వీన్‌ బాబీ, శ్రీదేవితో కలసి ‘జానీ దోస్త్‌’, జితేంద్ర, శ్రీదేవి, జయప్రదతో కలసి ‘తోఫా’, జితేంద్ర, షబానాజ్మితో కలసి ‘కామ్యాబ’్, రాజేష్‌ ఖన్నా, జయప్రదతో ‘నయా కదం’, జితేంద్ర, జయప్రదతో ‘హోషియార్‌’, రాజేష్‌ ఖన్నా, శ్రీదేవితో కలసి ‘మాస్టర్జీ’, జితేంద్ర, శ్రీదేవితో ‘మేరా సాధీ’, దిలీప్‌ కుమార్, జితేంద్రతో కలసి ‘ధర్మాధికారి’, జితేంద్ర, శ్రీదేవితో ‘సుహాగన్‌’ చిత్రాలు తీశారు.

 





* ఫిలిం ఫేర్‌ సౌత్‌ పురస్కారాలు

1977లో ‘ప్రేమలేఖలు’, 1990లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, 1993లో ‘అల్లరి ప్రియుడు’, 1997లో ‘అన్నమయ్య’, చిత్రాలకుగాను ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్‌ సౌత్‌ అవార్డులు రాఘవేంద్రరావుని వరించి వచ్చాయి. 2002లో ఫిలిం ఫేర్‌ సౌత్‌ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.



* నంది అవార్డులు

1984లో ‘బొబ్బిలి బ్రహ్మన్న’, 1993లో ‘అల్లరి ప్రియుడు’, 1996లో ‘పెళ్లి సందడి’, 1997లో ‘అన్నమయ్య’ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు. ప్రత్యేకించి అన్నమయ్య చిత్రానికి అదనంగా ఉత్తమ చిత్రంగా మరో నంది కూడా వచ్చింది. 2009లో తెలుగు సినిమాకు అందించిన సృజనకుగాను బి.ఎన్‌.రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని రాఘవేంద్రరావు అందుకున్నారు. 2017లో అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌తో ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని ఐఐఎఫ్‌ఎ సంస్థ అందించింది. 2014లో సైమా జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 2012లో జీవన సాఫల్య పురస్కారాన్ని సినిమా అవార్డులు అందించింది. 2013లో ‘షిరిడీ సాయి’ సినిమాకిగాను సినిమా అవార్డు స్పెషల్‌ జ్యూరీ పురస్కారం అందింది. 2016లో అల్లు రామలింగయ్య అవార్డును రాఘవేంద్రరావు అందుకున్నారు.


- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.