ఆయన ‘గమ్యం’...సినీ ‘వేదం’
ఆయన ప్రపంచం సినిమా. ఆయన ‘గమ్యం’ సినిమా. ఆయన నిత్యపారాయణ గ్రంధం సినీ ‘వేదం’. తీసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యం. అటు ఇండస్ట్రీ పెద్దల్ని, ఇటు ప్రేక్షకులని విస్మయానందానికి గురిచేస్తూ... పదికాలాలు స్మరించుకునే సృజనాత్మక దర్శకుడిగా ఆయన తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు ఎన్నటికీ వన్నె తగ్గనివి. ఆయనే క్రిష్‌. పూర్తి పేరు రాధాకృష్ణ జాగర్లమూడి. 1976 నవంబర్‌ 10న ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులో క్రిష్‌ పుట్టి పెరిగారు. సినిమాయే ఆశగా, శ్వాసగా... అదే తన గమ్యంగా నిర్దేశించుకున్నారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి కొన్ని మంచి సినిమాలు తీసి సత్తా చాటుకున్నారు. వైవిధ్యమైన ఇతివృత్తాలు, కొన్ని భావోద్వేగాలు, కించిత్‌ తాత్వికతతో కూడిన ఆయన సినిమాలు కేవలం మేధావులనే కాదు... సామాన్య ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటాయి. 2008లో పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పటివరకూ రాశి కన్నా వాసిగల సినిమాలు తీస్తూ విజయాలతో పాటు కొన్ని వివాదాల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు.


తండ్రి ద్వారా చిత్రసీమలోకి ప్రవేశం
ఎంతో మంది నిర్మాతలను కలసి ‘గమ్యం’ కథ చెప్పి కన్విన్స్‌ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో... క్రిష్‌ని చిత్రసీమకి పరిచయం చేసింది ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబా. ఆయన బాబాయ్‌ బిబో శ్రీనివాస్‌. ఈ ఇద్దరితో పాటు క్రిష్‌ స్నేహితుడు రాజీవ్‌ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు. అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ తదితర తారాగణంతో తెరకెక్కిన ‘గమ్యం’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. విమర్శకుల ప్రశంసలు లభించాయి. సినీ పరిశ్రమకు అభిరుచిగల దర్శకుడు లభించాడన్న భరోసా అందించింది. బాక్సాఫిస్‌ బద్దలు కొట్టిన సూపర్‌ హిట్‌ చిత్రంగా ‘గమ్యం’ నిలించింది. అంతే కాదు... ఎన్నో అవార్డులు, పురస్కారాలు గెలుచుకుంది. 2009లో ఈ సినిమాకి సౌత్‌ ఫిలిం ఫేర్‌ ద్వారా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సినిమాగా అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి కూడా రీమేక్‌ అయ్యింది. తమిళ్‌లో ‘కాదాలన్న సుమ్మ యిల్లా’ గా, కన్నడలో ‘సవారీ’గా, బెంగాలీలో ‘దుల్‌ ప్రతాభి’గా రీమేక్‌ చేశారు. ‘గమ్యం’ తరువాత క్రిష్‌ నుంచి వచ్చే సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా ‘వేదం’ వచ్చింది. 2010లో విడుదలైన ఈ సినిమాలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్‌ కీలక పాత్రలు పోషించారు. సుమారు దశాబ్దం తరువాత తెలుగులో విడుదలైన మల్టీస్టారర్‌ మూవీగా ఈ చిత్రం పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో రెండోసారి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకున్నారు. అంతే కాకుండా, ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అనుష్క శెట్టి అవార్డులు గెలుచుకున్నారు. 1975లో విడుదలైన ‘జీవన జ్యోతి’ సినిమాలా ‘వేదం’ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.


తమిళంలో ‘వానం’
‘వేదం’ సినిమా తరువాత క్రిష్‌ తమిళ్లో ‘వానం’ సినిమాకి దర్శకత్వం వహించారు. సిలంబరసన్‌ రాజేందర్, భరత్, అనుష్క శెట్టి ఈ చిత్రంలో ప్రధాన భూమికల్ని పోషించారు. ఈ సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు భారీగానే దక్కాయి. ఆ తరువాత, క్రిష్‌ తెలుగులో రానా దగ్గుబాటి, నయనతార నటీనటులుగా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాకి దర్శకత్వం వహించారు. 2012లో ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది.


బాలీవుడ్‌లో ‘గబ్బర్‌ సింగ్‌ బ్యాక్‌’
బాలీవుడ్‌లో క్రిష్‌ ‘గబ్బర్‌ సింగ్‌ బ్యాక్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సంజయ్‌ లీలా భన్సాలీ ప్రొడెక్షన్‌ నుంచి నిర్మితమైనది. ఈ ప్రొడక్షన్‌కి బాలీవుడ్‌లో ఎంత పేరుందో చెప్పనక్కర్లేదు. 2015 ఏప్రిల్‌ 20న ఈ సినిమా విడుదలై విజయాన్ని అందుకుంది. అక్షయ కుమార్, కరీనా కపూర్, శృతి హాసన్‌ ఈ సినిమాలో ప్రధాన భూమికల్ని పోషించారు. ఆ తరువాత వరుణ్‌ తేజ హీరోగా తెలుగులో ‘కంచె’ సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి సద్విమర్శలు వెల్లువెత్తాయి.


బాలకృష్ణ వందో సినిమా దర్శకుడు
బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఇది చారిత్రాత్మక చిత్రం. 2017 జనవరి 12న విడుదలైన ఈ సినిమా విజయాన్ని సాహించింది. ఆ తరువాత... బాలకృష్ణతో ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవిత ఆధారంగా తీసిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన విజయాన్ని నమోదు చేసుకోవడంలో విఫలమయ్యాయి. ఆ తరువాత ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, సృజనాత్మక విభేదాల వల్ల ఈ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో... ఆ చిత్రానికి కో డైరెక్టర్‌ క్రెడిట్‌ మాత్రమే ఆయనకు దక్కింది. కాగా, ఈ చిత్రాన్ని తరువాత కథానాయిక కంగనా రౌనత్‌ పూర్తి చేయడంతో కాస్త వివాదం క్రిష్‌ చుట్టూ తిరిగింది.

వ్యక్తిగతం
2016 ఆగస్టు 7న క్రిష్‌ వివాహం రమ్యతో జరిగింది. ఆ వివాహ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. పరస్పర అంగీకారంతోనే ఈ ఇద్దరూ విడిపోయారు.


- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.