మహేష్‌బాబు
టాలీవుడ్‌ అందగాడిగా.. ప్రేక్షకుల మనసులు దోచిన రాజకుమారుడిగా.. అమ్మాయిల మదిలో యువరాజుగా తనదైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు మహేష్‌బాబు. 1975 ఆగస్టు 9న ప్రముఖ కథానాయకుడు ఘట్టమనేని కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు. మహేష్‌కు ఒక అన్న (రమేష్‌బాబు), ఇద్దరు అక్కలు (పద్మావతి, మంజుల), ఒక చెల్లి (ప్రియదర్శిని) ఉన్నారు. మాజీ మిస్‌ ఇండియా, ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ని మహష్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు (గౌతమ్, సితార) ఉన్నారు. మహేష్‌ పుట్టింది పెరిగింది చెన్నై లోనే అయినా చాలా కాలం తన అమ్మమ్మ దగ్గరే పెరిగారు. తండ్రి స్ఫూర్తిగా చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న మహేష్‌బాబు, తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన ‘నీడ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఓవైపు చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాల్లో బాలనటుడిగా నటించేవారు. అలా 1980 నుంచి 1990 వరకు బాల నటుడిగా ఎనిమిది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు మహేష్‌బాబు. వీటిలో ‘కొడుకు దిద్దిన కాపురం’లో మహేష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేయగా.. ‘పోరాటం’లో తండ్రి కృష్ణకు తమ్ముడిగా చేసి ప్రేక్షకులను అలరించారు. ‘శంఖారావం’, ‘బజార్‌ రౌడీ’ల్లో తన అన్న రమేష్‌ బాబు, తండ్రితో కలిసి నటించారు. ఇక చివరిగా 1990లో ‘బాల చంద్రుడు’, ‘అన్న− తమ్ముడు’ సినిమాలతో బాలనటుడిగా తన ప్రస్థానానికి ముగింపు చెప్పారు.

article image

మహేష్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం 1999లో వచ్చిన ‘రాజకుమారుడు’. దీని తర్వాత వచ్చిన ‘యువరాజు’, ‘వంశీ’ సినిమాలు కొంత నిరాశపర్చినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2001లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ మహేష్‌బాబుకు తొలి విజయాన్నందించింది. ఇక మహేష్‌బాబు కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం 2003లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’. ఆ సినిమా తర్వాత మహేష్‌ క్రేజ్‌ భారీగా పెరిగింది. అదే ఏడాది వచ్చిన ‘నిజం’ పరాజయం పాలైనా.. అందులో మహేష్‌ అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. అనంతరం వచ్చిన ‘అర్జున్‌’, ‘నాని’ చిత్రాలు నిరాశపర్చాయి. ఇలాంటి సమయంలో 2005లో త్రివిక్రమ్‌తో చేసిన ‘అతడు’తో మహేష్‌ భారీ విజయాన్నందుకున్నాడు. 2006లో పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ టాలీవుడ్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అందులోని మహేష్‌ నటనకు యావత్‌ ప్రేక్షకలోకం నీరాజనాలు పలికింది. ఆ తర్వాత ‘సైనికుడు’తో తన కెరీర్‌లోనే పెద్ద పరాజయాన్ని చవిచూశాడు మహేష్‌. దీంతో మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మహేష్‌బాబు ‘ఖలేజా’తో తిరిగి సత్తా చాటాడు. అక్కడి నుంచి ‘దూకుడు’, ‘బిజినెస్‌ మాన్‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ చిత్రాలతో వరుస విజయాలందుకున్నారు. మధ్యలో ‘బ్రహ్మోత్సవం’, ‘ఆగడు’, ‘1’ ‘స్పైడర్ ’ వంటివి ప్రేక్షకుల అలరించలేకపోయాయి. ప్రస్తుతం మహేష్‌బాబు కొరటాల దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’లో చేశారు. దీని తర్వాత వంశీపైడిపల్లితో మరో సినిమా చేయనున్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుంచే తనదైన ప్రత్యేకమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రిన్స్‌ మహేష్‌బాబు. ఇప్పటివరకు తన సినీ ప్రయాణంలో మొత్తం ఐదు నంది పురస్కారాలు, ఐదు ఫిల్మ్‌ఫెయిర్‌ అవార్డులు అందుకున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.