మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు
టాలీవుడ్‌లో మంచు కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. సినిమా మీద ఆసక్తితో స్వయంశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన మంచు మోహన్‌ బాబు కలెక్షన్‌ కింగ్‌గా, విలక్షణ నటుడిగా విఖ్యాతి గాంచారు. భక్తవత్సలం నాయుడిగా సినీ పూర్వాశ్రమంలో ఆయన పి.టి. టీచర్‌. గురువుగా భావించే దాసరి నారాయణరావు ఆశీస్సులతో సినీ ఎంట్రీ ఇచ్చిన మోహన్‌ బాబు ప్రతినాయకుడి పాత్రల నుంచి నాయక పాత్రల దాకా ఎదిగి... మంచు కుటుంబానికి పేరు తీసుకొచ్చారు. మోహన్‌ బాబు సినీ వారసుడిగా మంచు విష్ణువర్ధన్‌ తన సత్తా చాటుతున్నాడు. 1981 నవంబర్‌ 23న విష్ణువర్ధన్‌ చెన్నైలో జన్మించాడు. మోహన్‌ బాబు, దివంగత విద్యాదేవి ఈయన తలిదండ్రులు. సోదరుడు మంచు మనోజ్, సోదరి మంచు లక్ష్మితో పెరిగాడు. పద్మశేషాద్రి బాలభవన్‌ పాఠశాల నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత, కంప్యూటర్‌ సైన్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలను ముఖ్య సబ్జెక్టులుగా శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందాడు. ఆ సమయంలో, విష్ణు... భాస్కర్‌ జెఎన్‌టియు క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే, విశ్వవిద్యాలయ బాస్కెట్‌బాల్‌ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు.


వ్యక్తిగతం
2009లో మంచు విష్ణు... విరానికా రెడ్డిని వివాహమాడాడు. దివంగత రాజకీయ నాయకుడు వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తమ్ముడి కూతరే విరానికా రెడ్డి. 2011లో, మంచు విష్ణు, విరానికా రెడ్డి దంపతులకు కవల కుమార్తెలు జన్మించారు. 2018 జనవరిలో, ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. 2019 ఆగస్టులో, వీళ్లకు ఒక కుమార్తె జన్మించింది.కెరీర్‌
తండ్రి మంచు మోహన్‌ బాబు నటించిన 1985నాటి సినిమా ‘రగిలే గుండెలు’ సినిమాలో బాల నటుడిగా నటించాడు విష్ణు మంచు. ఇదే విష్ణు మంచుకు తొలి సినిమా.

కథానాయకుడిగా
2003 సంవత్సరంలో ‘విష్ణు’ అనే సినిమాతో తెలుగు సినిమాకు మంచు విష్ణు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకి షాజీ కైలాస్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని నటనకు బెస్ట్‌ డెబ్యూ మేల్‌ కేటగిరీలో ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకొన్నాడు. 2004లో ‘సూర్యం’, 2005లో ‘పొలిటికల్‌ రౌడీ’, 2006లో ‘అస్త్రం’, ‘గేమ్‌’ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. ‘ఢీ’ సినిమాతో మొదటి కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను పొందాడు. ఇందులో ఆయనకు జోడీగా జెనీలియా నటించింది. ఇది 2007లో విడుదల అయింది. ఈ సినిమా తరువాత 2008లో ‘కృష్ణార్జున’, 2009లో ‘సలీం’, 2010లో ‘వస్తాడు నా రాజు’ అనే సినిమాలలో నటించాడు.


2003 నుంచి 2006 వరకు
‘విష్ణు’ సినిమాలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన చిన్ననాటి ప్రేమను గెలవాలనుకుని తపన పడే పాత్రలో నటించాడు మంచువిష్ణు. ‘సూర్యం’ చిత్రంలో తన తల్లి చివరి కోరికను తీర్చాలనుకునే వ్యక్తిగా నటించాడు. రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ‘పొలిటికల్‌ రౌడీ’ సినిమాలో డాన్సర్‌గా ఓ అతిథి పాత్రలో నటించాడు. ఓ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ‘అస్త్రం’ సినిమాలో ఓ ఐపీఎస్‌ అధికారిగా నటించాడు. ‘గేమ్‌’ సినిమాలో విజయ్‌ రాజ్‌ పాత్రలో కనిపిస్తారు. ఇందులో తండ్రి మోహన్‌ బాబుతో, నిన్నటి తరం హీరోయిన్‌ శోభనతో స్కీన్ర్‌ని షేర్‌ చేసుకొన్నాడు మంచు విష్ణు. ఆ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఢీ’ సినిమాలో నటించాడు. 


కమర్షియల్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచు మనోజ్‌ కెరీర్‌కి 2007వ సంవత్సరంలో బూస్ట్‌ ఇచ్చినట్లయింది. ఈ సినిమాలోని తన కామిక్‌ టైమింగ్‌తో పరిణితి చెందిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు మంచు విష్ణు.

2008 నుంచి విష్ణు తదుపరి చిత్రాలు ‘కృష్ణార్జున’ (2008), ‘సలీం’ (2009), ‘వస్తాడు నా రాజు’ (2010). 2012లో కామెడీ సినిమాగా తెరకెక్కిన ‘దేనికైనా రెడీ’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు మంచు విష్ణు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా 200 మిలియన్లు వసూళ్లు రాబట్టింది. ఆ తరువాత వీరు పోట్ల దర్శకత్వం వహించిన ‘దూసుకెళ్తా’ సినిమాలో నటించాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. విడుదలైన మొదటి వారంలోనే బాక్సాఫీసు వద్ద 126.3 మిలియన్లు రాబట్టగలిగింది ఈ సినిమా. ఆ తరువాత తండ్రి మోహన్‌ బాబుతో కలిసి మరోసారి స్కీన్ర్‌ని షేర్‌ చేసుకొన్నాడు. ‘రౌడీ’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించింది రామ్‌ గోపాల్‌ వర్మ. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకోగలిగింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘దేనికైనా రెడీ’ సినిమా విజయాన్ని అందుకొని, విష్ణుకు అప్పటివరకు ఉన్న ఇమేజ్‌ని మార్చడంలో విజయవంతమైంది. ‘రౌడీ’ సినిమాలో  కృష్ణ పాత్రలో మంచి నటనను కనబరిచాడు విష్ణు. ఆ తరువాత సంవత్సరం, వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దూసుకెళ్తా’ సినిమాలో నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే అవకాశాన్ని పొందాడు విష్ణు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా 15 కోట్లు తెచ్చిపెట్టింది. మంచు మనోజ్, మోహన్‌ బాబు, రవీనా టాండన్, హన్సిక మోత్వానీ, ప్రణీతా సుభాష్, వరుణ్‌ సందేష్‌ నటించిన కామెడీ చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో గోపి అనే జూదగాడి పాత్రను పోషించాడు విష్ణు. ఆ తరువాత ‘అనుక్షణం’ అనే సినిమాలో డిసిపి గౌతమ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకొన్నాడు. ఆ తరువాత 2014లో దివంగత దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి, నిర్మించిన ‘ఎర్ర బస్సు’ సినిమాలో నటించాడు. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘డైనమైట్‌’ సినిమాలో నటించాడు. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలో తన హాస్య ప్రతిభని చూపించారు విష్ణు. ఇందులో రాజ్‌ తరుణ్‌ కూడా నటించాడు. 2017లో ‘లక్కున్నోడు’ అనే సినిమాలో నటించాడు. 2017 చివరి నాటికి 20 సినిమాలలో నటించాడు విష్ణు.


2018లో క్రైమ్‌ డ్రామాగా నేపథ్యంలో తెరకెక్కిన ‘గాయత్రీ’లో శ్రియ శరన్, తండ్రి మోహన్‌ బాబుతో స్కీన్ర్‌ని షేర్‌ చేసుకున్నాడు విష్ణు. అదే సంవత్సరం కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’, పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఓటర్‌’ సినిమాలు ఉన్నాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా షూటింగ్‌ టైంలో విష్ణుకు గాయాలయ్యాయి. మలేషియాలో స్టంట్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్నప్పుడు, విష్ణు మంచుకు గాయపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.


బుల్లితెరపై
విష్ణు బుల్లితెరకు కూడా పని చేశాడు. ఒక తెలుగు ఛానల్‌ సిరీస్‌ అయిన ‘హ్యాపీ డేస్‌’ వందవ ఎపిసోడ్‌ని డైరెక్ట్‌ చేశాడు. అన్నీ ఎపిసోడ్లలో ఈ ఎపిసోడ్‌ అత్యధిక టీఆర్పీ రేట్లు సాధించింది. తన నిర్మాణ సంస్థ అయిన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ద్వారా ఈ సీôరీస్‌ని విష్ణు నిర్మించాడు కూడా. లక్ష్మీ టాక్‌ షోని విష్ణూ డైరెక్ట్‌ చేశారు కూడా.

నిర్మాతగా
విష్ణు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా 2014లో ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే హాస్య చిత్రం నిర్మించాడు. విష్ణుకు థింక్‌ స్మార్ట్‌ అనే సంస్థ కూడా ఉంది. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఈ సంస్థ ద్వారా జరుగుతాయి. ‘అతనొక్కడే’ సినిమాకుగానూ ఉత్తమ వీడియో ఎఫెక్ట్స్‌ పురస్కారాన్ని థింక్‌ స్మార్ట్‌ దక్కించుకొంది.విద్యావేత్త
స్పి్రంగ్‌ బోర్డు ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్స్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు విష్ణు. అతను తన తండ్రి ఏర్పాటు చేసిన శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లో చేరినప్పుడు, అది అప్పటికే బాగా స్థిరపడిన విద్యా సంస్థగా పేరుగాంచింది. విష్ణు ఈ సంస్థ బాధ్యతలు స్వీకరించి, విద్యార్థులకు విలువ ఆధారిత విద్యను అందించే మోడల్‌ సంస్థలుగా నిర్మించాడు. అతను దానిని స్పి్రంగ్‌ బోర్డ్‌ అకాడమీగా విస్తరించారు. న్యూయార్క్‌ అకాడమీలో వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ అయ్యాడు.

విద్యావిరాళాలు
విష్ణు తన తండ్రి స్థాపించిన శ్రీ విద్యాకేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ను నడుపుతున్నాడు. ఈ ట్రస్ట్‌ శ్రీ విద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, శ్రీ విద్యానికేతన్‌ డిగ్రీ కళాశాల, శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, శ్రీ విద్యానికేతన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, శ్రీ విద్యానికేతన్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, శ్రీ విద్యానికేతన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్, శ్రీ విద్యానికేతన్‌ కాలేజ్‌ ఫర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్టడీస్‌ నడుపుతుంది.

ఆర్మీ గ్రీన్‌
పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడానికి విష్ణు ఆర్మీ గ్రీన్‌ అనే సామాజిక విభాగాన్ని ప్రారంభించాడు. ఇది శ్రీ విద్యానికేతన్‌ సంస్థల సమీపంలో చిన్న స్థావరాలను అడాప్ట్‌ చేసుకొంది.

విష్ణు మంచు ఆర్ట్‌ ఫౌండేషన్‌
విష్ణు తిరుపతిలో విష్ణు మంచు ఆర్ట్‌ ఫౌండేషన్‌ అనే ఆర్ట్‌ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేశాడు. ఔత్సాహిక, ప్రతిభావంతులైన కళాకారులకు సహాయం అందించడం ఈ ఫౌండేషన్‌ ముఖ్య లక్ష్యం.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌   


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.