నవ ‘మన్మధుడు’.... నాగార్జున
 నాగార్జున తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో 1959 ఆగస్టు 29న సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. ప్రాథమిక, కళాశాల విద్య హైదరాబాద్‌లో చదివిన నాగార్జున, మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను పూర్తిచేశారు. 1984లో నాగార్జున ప్రముఖ నటుడు వెంకటేష్‌ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 1992లో నాగార్జున ‘శివ’ సినిమాలో తనతో కలిసి నటించిన ప్రముఖ నటి అమలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాగచైతన్య (నటుడు), అఖిల్‌ (నటుడు).

article image
నాగార్జున 1986లో విడుదలైన ‘విక్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తండ్రి బాటలోనే నడుసూ.. భగ్నప్రేమికుడిగా ‘మజ్ను’లో విషాద పాత్రలో నటించి మెప్పించారు. ఇక తండ్రితో కలిసి చేసిన మొదటి సినిమా ‘కలెక్టరుగారి అబ్బాయి’. నాగార్జునకు తొలి విజయం ‘ఆఖరి పోరాటం’తో దక్కింది. నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’, రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘శివ’ చిత్రాలు టాలీవుడ్‌లో ఒక సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఓవైపు లవర్‌బాయ్‌గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేస్తూనే ‘ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం’, ‘హలో బ్రదర్‌’, ‘అల్లరి అల్లుడు’, ఘరానా బుల్లోడు’, ‘రాముడొచ్చాడు’, ‘గోవిందా గోవిందా’ సినిమాలతో మాస్‌హీరోగానూ నిరూపించుకున్నాడు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి భక్తి చిత్రాలతో ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నాగార్జున. కథనంలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉంటాడు నాగార్జున. ఆయన చేసిన ‘ఆకాశవీధిలో’, ‘గగనం’, ‘ఆజాద్‌’, ‘ఊపిరి’, ‘రాజన్న’, ‘ఢమరుకం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘సంతోషం’, ‘మన్మధుడు’, ‘నేనున్నాను’, ‘శివమణి’, ‘సూపర్‌’, ‘మాస్‌’, ‘డాన్‌’, ‘కింగ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలు నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన తండ్రితో కలిసి నటించిన చివరి చిత్రం ‘మనం’ అక్కినేని కుటుంబానికి ఎన్నటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఓవైపు నటుడిగా, మరోవైపు నిర్మాతగా చక్కటి ప్రయాణం సాగిస్తున్న నాగార్జున ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుపోతున్నారు. నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్‌ వర్మ చిత్రంలో నటిస్తున్నారు.
సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.