పవన్‌ కల్యాణ్
article imageమెగాస్టార్‌ చిరంజీవి సోదరుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టినా.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకోని ప్రేక్షకుల గుండెల్లో పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్‌ కల్యాణ్‌. ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ 1971 సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట రావు, తల్లి అంజనా దేవి. పవన్‌ ఇప్పటివరకు మూడు వివాహాలు చేసుకున్నారు. 1997లో నందితను వివాహం చేసుకున్న పవన్‌ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణూ దేశాయిని పెళ్లిచేసుకున్నారు. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. తర్వాత ఆమె నుంచి విడిపోయి. 2013లో రష్యా నటి అన్నా లెజ్‌నోవాను మూడవ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

 తన అన్నయ్య చిరంజీవిని చూసి నటనపై ఆసక్తి పెంచుకున్న పవన్‌ కల్యాణ్‌.. తొలుత మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం సంపాదించి కొన్నాళ్లపాటు తన అన్నయ్య సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇది అనుకున్నంతగా ఆడకపోయినా పవన్‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. అనంతరం ‘గోకులంలో సీత’తో తొలి విజయాన్నందుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘సుస్వాగతం’. ఓ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడే యువ ప్రేమికుడిగా అందులో పవన్‌కల్యాణ్‌ చూపిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ సైతం యువతరాన్ని అలరించడంతో ఒక్కసారిగా పవన్‌ కల్యాణ్‌కు యువతలో మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇక ‘తమ్ముడు’లో బాక్సర్‌గా పవన్‌ చేసిన నిజ పోరాటాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన ‘బద్రి’, ‘ఖుషి’ చిత్రాలు వరుసగా భారీ హిట్లందుకోవడంతో ఇండస్ట్రీలో పవన్‌ ఇమేజ్‌ అగ్రస్థాయికి చేరుకుంది. ఇక పవన్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘జానీ’.. అతని కెరీర్‌లోనే పెద్ద పరాజయంగా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’, ‘బంగారం’, ‘అన్నవరం’ కొంత నిరాశపర్చినా పవన్‌ కల్యాణ్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం ఏనాడు తగ్గలేదు. ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’ సినిమాలతో వరుస హిట్లు అందుకోని అభిమానుల మదిలో పవర్‌స్టార్‌గా ఎదిగాడు పవన్‌. ఇవన్నీ పవన్‌ సినీ ప్రయాణంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలు. ఇటీవల కాలంలో నిర్మాతగా మారి పవన్‌ కల్యాణ్‌ క్రియేటీవ్‌ వర్క్‌¬్స బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది పవన్‌ ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. చిత్ర పరిశ్రమలోని మిగతా కథానాయకులకు, పవన్‌ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తి. మంచి సామాజిక సేవకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. 1997 నుంచి ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సమాజ సేవకుడిగా పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి 2017లో ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ ఆయనకు గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం: పవన్‌ కల్యాణ్‌ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. అదే సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోదీ తరపున భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం సాగించారు. ఇక 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తానే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు ఇటీవలే పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఆ దిశగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.