ప్రభాస్‌
article imageఆరడుగుల ఎత్తు, ఆకట్టుకునే అందం, అదరగొట్టే అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. ఇటీవల కాలంలో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ప్రేక్షకుల మదిలో యంగ్‌ రెబల్‌స్టార్‌గా, డార్లింగ్‌గా పేరొందిన ప్రభాస్‌ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్‌ రాజు. 1979 అక్టోబరు 23న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించాడు. తండ్రి సూర్యనారాయణ రాజు (ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుడు), తల్లి శివకుమారి. తన పెదనాన్న కృష్ణంరాజు వారసత్వంతో వెండితెరపైకి రంగప్రవేశం చేసిన ప్రభాస్‌.. చక్కటి నటనతో కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2001లో ‘ఈశ్వర్‌’తో హీరోగా తెరంగేట్రం చేసిన ప్రభాస్‌.. తొలి చిత్రంతోనే చక్కటి విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత 2003లో వచ్చిన ‘రాఘవేంద్ర’ ప్రభాస్‌కు తొలి పరాజయాన్ని రుచిచూపించింది. ప్రభాస్‌ కెరీర్‌లో మైలురాయిలా నిలచిన చిత్రం 2004లో వచ్చిన ‘వర్షం’. ఓ సరికొత్త ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమాలో త్రిష, ప్రభాస్‌ల జోడీల నటన యువతరాన్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంతో అప్పటివరకు మాస్‌హీరోగా ఉన్న ప్రభాస్‌ లవర్‌ బాయ్‌గానూ చక్కటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘అడవి రాముడు’, ‘చక్రం’ సినిమాలు నిరాశపర్చాయి. అయితే ‘చక్రం’లో ప్రభాస్‌ నటనకు మంచి గుర్తింపు లభించింది. 2005లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ ప్రభాస్‌ను తెలుగు పరిశ్రమలో ఒక ప్రముఖ కథానాయకుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘బుజ్జిగాడు’, ‘బిల్లా’, ‘ఏక్‌ నిరంజన్‌’, ‘యోగి’లు ఓ మోస్తారుగా ఆడాయి.

ప్రభాస్‌ను తొలిసారి ఓ క్లాస్‌రోల్‌లో చూపించిన సినిమా ‘డార్లింగ్‌’. ఎ.కరుణాకరణ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, ప్రభాస్‌ జోడీగా నటించారు. ఇది భారీ విజయాన్నందుకుంది. కాజల్‌తో చేసిన రెండవ సినిమా.. 2011లో దశరథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’. తాప్సీ మరో కథానాయిక. మంచి కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డార్లింగ్‌ కంటే పెద్ద విజయాన్నందుకుంది. ఆ తర్వాత ‘రెబల్‌’ పరాజయం పాలైనా.. కొరటాల శివ తీసిన ‘మిర్చి’తో మంచి హిట్టందుకున్నాడు ప్రభాస్‌.

ఇక ప్రభాస్‌ రెండవసారి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రానా, అనుష్కలతో కలిసి నటించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు ప్రభాస్‌. ‘బాహుబలి’ రెండు భాగాలుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సిరీస్‌లో వచ్చిన తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారత చలన చిత్ర రంగంలోనే కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించి దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమలను ఆశ్చర్యపరిచింది. ఇక రెండవ భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదటి భాగం రికార్డులన్నింటిని తలదన్నేలా వసూళ్లు సాధించి అఖండ విజయాన్నందుకుంది. భారత సినీ చరిత్రలో తొలిసారి వెయ్యికోట్ల మార్కును అందుకున్న చిత్రంగా నిలవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌కు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డును నెలకొల్పింది. దీంతో ప్రభాస్‌ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయి నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రన్‌ రాజా రన్‌’ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’లో నటిస్తున్నాడు. ఈ సినిమా 2018లో విడుదల కానుంది. ప్రభాస్‌ ఇప్పటివరకు ఐదు ఫిల్మ్‌ ఫెయిర్‌ అవార్డులు, ఒక సినీ ‘మా’ పురస్కారం అందుకున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.