ఓ చిరుత

బాక్సాఫీస్‌ బొనాంజా... మెగా పవర్‌ స్టార్డం... తెరముందు నటుడిగానే కాదు... తెరవెనుక భారీ నిర్మాత. తండ్రికి ఎవ్వరు ఇవ్వని రీతిలో కనివిని ఎరుగని అనుపమాన చిత్ర బహుమానం అందించిన గారాల తనయుడు. ఉహ తెలిసిందగ్గర నుంచీ చుట్టూ ఉన్న సినీ వాతావరణంలో పెరిగి పెద్దయి... మెగా ఫాన్స్‌ మెచ్చే మాట్నీ ఐకాన్‌గా ఎదిగిన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగుండే తత్త్వం ఆయనది. ఆయన మరెవరో కాదు...టాలీవుడ్‌లో స్వయం కృషితో కొత్త చరిత్ర లిఖించిన మెగాస్టార్‌ చిరంజీవి సినీ వారసుడు... మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ. తండ్రి చిరంజీవి, బాబాయ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జనం, సినీ జనం మెచ్చిన వెండితెర తారలైతే...మరో బాబాయ్‌ నాగబాబు కూడా నిర్మాతగా, నటుడిగా, టీవీ సీరియల్స్, షోలతో ప్రేక్షకుల ఆదరణ పొందినవారే. ఇక, తల్లి సురేఖ తరఫున కూడా ఆకాశమంత విశాలమైన కాన్వాస్‌పై కళాకారుడు... తాత అల్లు రామలింగయ్య. ఆయన టాలీవుడ్లో కొన్ని దశబ్దాలపాటు హాస్య నటుడిగా సుమారు వెయ్యికి పైగా సినిమాలు చేసి అభిమానుల గుండెల్లో కొలువుండిన వ్యక్తి. మామయ్య అల్లు అరవింద్‌ బడా నిర్మాత. గీతా ఆర్ట్స్‌ అధినేత. ఆయన తనయుడు అల్లు అర్జున్‌ కూడా స్టైలిష్‌ స్టార్‌గా విఖ్యాతి గాంచినవాడు. ఇలా ...రెండు కుటుంబాల సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బిజీ హీరో. రామ్‌ చరణ్‌ తేజ పుట్టిన రోజు...మార్చి 27. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని ఆసక్తికర విషయాలు.


చెన్నైలో జననం

చిరంజీవి, సురేఖ దంపతులకు రామ్‌ చరణ్‌ తేజ 1985 మార్చి 27న జన్మించాడు. రామ్‌ చరణ్‌కి ఇద్దరు సోదరీమణులు సుస్మిత, శ్రీజ ఉన్నారు. 2012 జూన్‌ 12న అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని రామ్‌ చరణ్‌ వివాహం చేసుకున్నాడు.

సినీ ప్రస్థానం

ఏ కళాకారుడికి అయినా వారసత్వం తెర పరిచయం వరకూ పనికి వస్తుంది. ప్రతిభ ఉన్నవారు పదికాలాలు రాణిస్తే... లేనివారు వన్‌ ఫిలిం వండర్‌గా మిగిలిపోతారు. ఇదే విషయాన్ని ఓసారి ప్రస్తావిస్తూ రామ్‌ చరణ్‌ సినీ వారసులపై ఒత్తిడి అధికంగా ఉంటుందన్నాడు. కారణం... అంతకు ముందు సినీ సీమలో ప్రగాఢ ముద్ర వేసిన తాత, తండ్రులతో పోల్చి మరీ యువనటుడికి వీక్షకుల నుంచి పరీక్ష ఎదురవుతుందన్నాడు. ఏ సినీ వారసత్వం లేకుండా చిత్రసీమలోకి వచ్చి ప్రూవ్‌ చేసుకున్నవాళ్ళు నిజానికి అదృష్టవంతులన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. తాను సైతం నటుడిగా సొంత శైలి ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికీ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నానని ఆయన చెప్పాడు. అదే సమయంలో కధల ఎంపికలో కూడా జాగ్రత్త వహిస్తున్నానన్నాడు. అయినప్పటికీ ఒక్కోసారి తమ నిర్ణయం దారుణంగా విఫలమవుతుందన్నాడు.

‘చిరుత’గా ఎంట్రీ

రామ్‌ చరణ్‌ 2007లో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘చిరుత’ సినిమా ద్వారా చిత్రసీమలోకి ప్రవేశించాడు. ‘చిరుత’... అంటే చిరు తనయుడు అనే అర్ధంలో కూడా ఆ సినిమాకి ఆ టైటిలే పెట్టారని తెలుస్తోంది. మొట్టమొదటి సినిమాయే విజయాన్ని సాధించింది. నేరుగా 178 కేంద్రాల్లో 50 రోజులపాటు మరో 15 కేంద్రాల్లో షిఫ్టుల వారీగా ప్రదర్శనకు నోచుకుంది. 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నటన, డాన్స్, ఫైట్స్‌లో రామ్‌ చరణ్‌కి మంచి మార్కులే పడ్డాయి. టాలీవుడ్‌కి దక్కిన మరో పవర్‌ స్టార్‌ ...అనే ప్రశంసలు వచ్చాయి. ‘చిరుత’లో నటనకుగాను నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. బెస్ట్‌ డెబ్యూ ఆర్టిస్గ్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డు కూడా ఆయనకు దక్కింది. 2009లో రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రం కూడా రామ్‌ చరణ్‌ కెరీర్‌ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో లీడింగ్‌ స్టార్‌గా రామ్‌ చరణ్‌ పేరు స్థిరపడింది. ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు పోషించాడు. రెండు జన్మల కధా నేపథ్యంలో మహారాణిని ఆకట్టుకున్న సైనికుడి పాత్రలో రాణించి... మరో పాత్రలో సమకాలీనతని అద్దిన పాత్రలో ప్రతిభావంతంగా రామ్‌ చరణ్‌ నటించాడు. తండ్రి చిరంజీవిని అడుగడుగునా గుర్తు చేస్తూ పరిణతి గల నటుడిగా రెండో సినిమాతోనే మారారని అభినందనలు ఆయనకు అందాయి. 2009లోనే ఓ శీతల పానీయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు.

                                     

నిరాశ పరిచిన ‘ఆరెంజ్‌’

బొమ్మరిల్లు భాస్కర్‌గా పేరొంది ప్రేమ సినిమాలు తీయడంలో తన ప్రత్యేకతను చాటుకున్న యువదర్శకుడి చేతిలో రూపొందిన ‘ఆరేంజ్‌’ రామ్‌ చరణ్‌తో పాటు... ఆ సినిమా నిర్మాత అయిన నాగబాబును సైతం తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించాలన్న సంగతి రామ్‌ చరణ్‌కి ఈ చిత్రం గట్టిగా చెప్పినట్లయింది. ఆ తరువాత సంపత్‌ నంది దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’, 2013లో వివి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘నాయక్‌’ రామ్‌ చరణ్‌ ఉనికిని బలంగా చాటాయి. హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌ చరణ్‌ 1973 నాటి ‘జంజీర్‌’కి అచ్చమైన అనువాదం. 2014లో ‘ఎవడు’ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌కి దక్కిన విలక్షణమైన పాత్ర. 2014లో కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడే’, 2015లో ‘బ్రూస్లీ ది ఫైటర్‌’ సినిమా కూడా వైఫల్యాలని మూటగట్టింది. 2016లో ‘ధ్రువ’ చిత్రం ఊరట నిచ్చింది. 2018లో ‘రంగస్థలం’ గ్రామీణ నేపథ్యంలో సాగిన చిత్రంగా రామ్‌ చరణ్‌ కెరీర్‌లోనే కలికి తురాయిగా నిలిచింది. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్‌. 2019లో ‘వినయ విధేయ రామ’ చిత్రం ఆశించిన విజయాన్ని అందివ్వలేదు.

                           

ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్ర రణ రుధిరం)లో..

మగధీర తరువాత రామ్‌ చరణ్‌ తేజ ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిర్మాతగా రామ్‌ చరణ్‌ 2017లో ‘ఖైదీ నంబర్‌ 150’, 2019లో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించాడు. ఈ సినిమాల్లో తన తండ్రి చిరంజీవిని కథానాయకుడిగా పెట్టి మరీ తీశాడు. చిరంజీవి ఇండస్ట్రీ కొచ్చిన తొలి నాళ్ళలో ‘ఖైదీ’ ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. ఆ తరువాత కొన్నాళ్లకు ‘ఖైదీ నంబర్‌ 786’లో కూడా నటించాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తొమ్మిదేళ్ల తరువాత తిరిగి సినిమాల్లోకి వస్తున్న చిరంజీవికి తనయుడిగా ఓ మంచి చిత్రం తీయాలని భావించిన రామ్‌ చరణ్‌ ‘ఖైదీ నంబర్‌ 150’ తీశాడు. 2020లో ‘ఆచార్య’ సినిమా నిర్మాణంలో ఆయన బిజీగా ఉన్నాడు.

అవార్డులు

రామ్‌ చరణ్‌ అనేక అవార్డులు అందుకున్నాడు. మొదటి సినిమా ‘చిరుత’తోనే నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు స్వీకరించిన ఆయన అదే సినిమాకి బెస్ట్‌ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2010లో ఉత్తమ నటుడిగా ‘మగధీర’ సినిమాకిగాను ఫిలిం ఫేర్‌ సౌత్‌ అవార్డు స్వీకరించాడు. 2019లో ‘రంగస్థలం’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు, సంతోషం అవార్డు అందుకున్నాడు. ‘నాయక్‌’, ‘ధ్రువ’ సినిమాలకుగాను టీఎస్సార్‌ టీవీ9 నేషనల్‌ ఫిలిం అవార్డులు అందుకున్నాడు. సినిమా, జీ సినిమా అవార్డులు సైతం ఆయన ఖాతాలో పడ్డాయి.  రామ్‌ చరణ్‌కి గుర్రం స్వారీ అంటే మక్కువ ఎక్కువ. అలాగే...మంచి వ్యాపారవేత్త కూడా. హైదరాబాద్‌లో పోలో రీడింగ్‌ క్లబ్‌ ఆయనకు ఉంది. 2015 జులైలో ట్రూ జెట్‌ అనే సొంత ఎయిర్‌లైన్‌ బిజినెస్‌ కూడా ప్రారంభించాడు. అలాగే, డెవిల్స్‌ సర్క్యూట్‌కి ఓనర్, స్పోక్స్‌ పర్సన్‌గా వ్యహరిస్తున్నాడు.


                           

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.